ప్రత్యేక ఆర్థిక మండలాల నష్టాలు

ప్రభుత్వాలు తీసుకునే రాజకీయార్థిక విధానాలు, నిర్ణయాలు దేశప్రజలందరి జీవితాలమీద తీవ్రమైన ప్రభావాన్ని వేస్తాయి. కొందరికి మేలు కలిగిస్తాయి, కొందరికి కీడుకలిగిస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరును మార్చివేస్తాయి. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో అప్పటివరకూ ఉన్న స్థితిని మంచివైపుకో, చెడువైపుకో తోస్తాయి. అవి ఇంత ప్రభావశీలమైనవి అయినప్పటికీ వాటి గురించి జరగవలసినంత పెద్ద ఎత్తున చర్చ జరగదు. చాల సందర్భాలలో ఆ రాజకీయార్థిక విధానాలు ఆర్థిక శాస్త్ర పరిభాషతో వస్తాయి గనుక వాటి గురించి మాట్లాడే పరిజ్ఞానం, నైపుణ్యం తమకు లేదని చాలమంది వాటిని పక్కనపెడతారు. వాటిని చూసి భయపడతారు. నిజానికి ఆ పరిజ్ఞానం, నైపుణ్యం అనేవి మిథ్య. ఆ చర్యలవల్ల ఎవరి జీవితం ప్రభావితమవుతున్నదో వారికే దానికి సంబంధించిన చర్చలో భాగస్వామ్యం లేకుండా చేసే ఎత్తుగడ ఇది. సమాచారసహిత చర్చ నిర్వహించడం, ఒకవేళ ఆ చర్చకు ప్రత్యేక పరిభాష ఉన్నప్పటికీ దాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం విధానకర్తల, విధాన నిర్వాహకుల బాధ్యత. ఆ బాధ్యతలో పాలకులు పాలుమాలితే ప్రతిపక్షాలు ఆ పనిని స్వీకరించడం ప్రజాస్వామ్యంలో ఆనవాయితీ. ఆ చర్చకు దోహదం చేయడం ప్రచారసాధనాల కర్తవ్యం.
ఆశ్చర్యకరంగా ఇవాళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రత్యేక ఆర్థిక మండలాల (స్పెషల్ ఎకనమిక్ జోన్ – ఎస్ ఇ జెడ్) విషయంలో అటువంటి సమాచారసహిత చర్చ జరగవలసినంతగా జరగడంలేదు. ఆ చర్చకు బాధ్యత వహించవలసిన పక్షాలన్నీ తమ పనిని సక్రమంగా నెరవేర్చడం లేదు. నిజానికి ఈ ప్రత్యేకఆర్థికమండలాల విషయంలో విస్తృతంగా ప్రజాసమూహాలన్నీ చర్చించవలసిన అంశాలెన్నో ఉన్నాయి.

రైతుల భూమి లాక్కోవడం, నష్టపరిహారం విధానంలో లోపాలు, భూమిలేని నిరుపేదల జీవనోపాధి అవకాశాలు రద్దు కావడం వల్ల పెరుగుతున్న నిరాశ్రయుల సమస్య, తత్ఫలితమైన వలసల సమస్య, పంటభూములను ఇలా లాక్కోవడంవల్ల ఆహారభద్రతపై ప్రభావం, ప్రభుత్వ ప్రకటిత లక్ష్యాలన్నీ అనుమానాస్పదంగా తేలిపోవడం, పాత వ్యాపారసంస్థలే కొత్త రాయితీలకోసం ప్రత్యేకఆర్థిక మండలాలుగా బోర్డులు మార్చుకోవడం, అందువల్ల కొత్తగా ఉద్యోగ కల్పనగాని, పెట్టుబడులుగాని, సాంకేతిక పరిజ్ఞానం గాని రాకపోవడం, పన్నుల రాయితీలవల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా రానున్న నష్టం, భారత చట్టాలు చెల్లని విదేశీ భూభాగాలుగా ప్రత్యేకఆర్థికమండలాలను ప్రకటించడంవల్ల కార్మికులకు దుర్భరం కానున్న పని పరిస్థితులు, పడిపోనున్న వేతనాలు, ప్రత్యేక ఆర్థిక మండలాల ఉదాహరణ వల్ల అసలు మొత్తంగా కార్మికులకు జరగనున్న అన్యాయాలు, ఈ ప్రత్యేక ఆర్థిక మండలాలలో కొంత భాగాన్ని మాత్రమే ప్రకటిత లక్ష్యం కొరకు వాడుకుని మిగిలిన భూమిని వ్యాపారవేత్తలు తమ ఇష్టారాజ్యంగా వాడుకునే అవకాశం ఉండడం వల్ల రానున్న అనర్థాలు, ఆ ప్రకటిత లక్ష్యం కూడ కచ్చితంగా పారిశ్రామిక అభివృద్ధి కాక రియల్ ఎస్టేట్, గోల్ఫ్ కోర్సులు, రిసార్టుల పేరుమీద విలాసకేంద్రాలు కావడానికి అవకాశం ఉన్నందువల్ల జరిగే సాంస్కృతిక అనర్థాలు, కొన్ని ప్రత్యేకఆర్థికమండలాలు ఖనిజ వనరులను కొల్లగొట్టుకుపోవడంలో ఆదివాసులకు జరిగే అన్యాయాలు, కొన్ని ప్రత్యేకఆర్థికమండలాలు సముద్రతీరంలో రిసార్టుల రూపంలో రావడం వల్ల మత్స్యకారుల జీవనానికి జరిగే హాని — ఇలా చర్చించవలసిన అంశాలు లెక్కలేనన్ని ఉన్నాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే ప్రత్యేకఆర్థికమండలాలు ఈదేశంలో రైతులమీద, కూలీలమీద, పారిశ్రామిక కార్మికులమీద, ఆదివాసులమీద, మత్స్యకారులమీద, మధ్యతరగతిమీద, మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థమీద ఏ విధమైన ప్రతికూల ప్రభావాన్ని వేస్తాయో చర్చించవలసిఉంది. ఈ అంశాలలో కొన్నిటి పైన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక కోణాలనుంచి ఎంతో కొంత చర్చ జరుగుతున్నది గాని, ఆర్థిక కోణం నుంచి జరగవలసినంతగా చర్చ జరగడం లేదు. ప్రభుత్వం, ముఖ్యంగా వాణిజ్యమంత్రి, పారిశ్రామిక, వ్యాపార వర్గాలు ఆర్థిక పరిభాషలో మాట్లాడుతూ, ప్రత్యేక ఆర్థిక మండలాల వల్ల ఒనగూరనున్న లాభాలను ఇబ్బడిముబ్బడిగా చూపుతూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు గనుక, ఆ ఆర్థికప్రయోజనాల ప్రచారంలో నిజానిజాలేమిటో చర్చించి నిగ్గుతేల్చవలసి ఉంది.

పాలకులు ప్రకటిస్తున్న ఆర్థిక ప్రయోజనాలను — విదేశీ పెట్టుబడి రాక, ఉద్యోగ కల్పన, నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశం, ఏటేటా ఎగుమతులవల్ల వచ్చే ఆదాయం — అనే నాలుగు ప్రధాన భాగాలుగా విభజించి చర్చించవచ్చు. ఆయా అంశాలలో దేశానికి ఒనగూరనున్న లాభాలుగా పాలకులు ప్రకటిస్తున్నవేమిటి, అవి నిజంగా జరగనున్నాయా, వాటి స్థానంలో నిజంగా జరగనున్నవేమిటి అనే చర్చ చేయవలసిఉంది. ఆ ప్రయోజనాలను ఒక్కొక్కదాన్నీ తీసుకుని ప్రభుత్వాలు ప్రకటించే గణాంకాలను, వాస్తవాన్ని పోల్చి చూసి మదింపు వేయవలసి ఉంది.

అసలు ఈ ప్రత్యేక ఆర్థిక మండలాలకన్న ముందు అటువంటి లక్ష్యాలనే నెరవేర్చడానికి ఈ దేశంలో ఎగుమతి ప్రోత్సాహక మండలాలు 1960ల మధ్య నుంచీ అమలులో ఉన్నాయి. దేశం నుంచి ఎగుమతులను ప్రోత్సహించి, విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించడంకోసం ఏర్పాటయి, ఆయా పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు విపరీతమైన రాయితీలు, పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలు, చౌకధరకు మౌలిక సాధన సంపత్తి ప్రభుత్వమే సమకూర్చినా ఈ ఎగుమతి ప్రోత్సాహక మండలాలు సాధించింది అతి స్వల్పం. నాలుగుదశాబ్దాలపాటు వందలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని కైంకర్యంచేసి అవి సాధించిపెట్టిన ఆదాయంకన్న పొందిన రాయితీలు 60 శాతం ఎక్కువని ప్రభుత్వ గణాంకాలే తెలుపుతున్నాయి. ఇది ‘చారానా దావత్ కు బారానా టాంగా’ అనే సామెతను గుర్తుకు తెస్తున్నది. ఆ నలభై సంవత్సరాల అనుభవాన్ని ప్రస్తుత ఎస్ ఇ జెడ్ లు పునరావృతం చేయబోతున్నాయి.

ఆ ఆర్థిక ప్రయోజనాల చర్చ కన్న ముందు అసలు ఈ ఆలోచనకు పునాదిగా ఉన్న రాజకీయ వైఖరిని తెలుసుకోవలసి ఉంది. ఆ రాజకీయ వైఖరికి విదేశీ మారక ద్రవ్యం సంపాదన అనేది తారక మంత్రం. ఆ విదేశీమారక ద్రవ్యం సంపాదించడానికి ఏమయినా చేయవచ్చునని ఆ రాజకీయ వైఖరి భావిస్తుంది. అసలు ఆ విదేశీ మారక ద్రవ్యం ఎందుకొరకు ఉపయోగిస్తున్నారు, పిడికెడు మంది విలాసాల సరుకుల దిగుమతి కోసం అవసరమైన మారకద్రవ్యాన్ని సంపాదించడానికి దేశం మొత్తాన్ని తాకట్టుపెట్టవలసిందేనా అనే ప్రశ్నే వారికి తలెత్తదు. మరికొన్ని రాజకీయపక్షాలు కొంచెం స్వరం మార్చి పారిశ్రామికీకరణ కోసం ఎస్ ఇ జెడ్ లను సమర్థిస్తున్నామంటున్నాయి. అసలు ఈ ప్రత్యేక ఆర్థిక మండలాల ద్వారా పారిశ్రామికీకరణ జరుగుతున్నదా, భారతసమాజం వంటి విస్తారమైన జనసంఖ్యలో శ్రామికులు ఉన్నచోట పారిశ్రామికీకరణ అంటే ఏమిటి అనే మౌలిక ప్రశ్నలు వారికి వినబడడంలేదు.

భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని ఎన్ డి ఎ ప్రభుత్వం ఉన్న రోజులలో 2000 ఏప్రిల్ లో మొదటిసారి ఉనికిలోకి వచ్చిన ప్రత్యేక ఆర్థిక మండలాల విధానాన్ని అప్పటి ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా విమర్శించి ముందుకు సాగకుండా చేశాయి. అక్కడ విమర్శించిన వామపక్షాలు, సిపిఎం నాయకత్వంలోని తమ పశ్చిమబెంగాల్ ప్రభుత్వంలో 2003 లో అదే విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాయి. యుపిఎ పేరిట సంఘటితమైన అప్పటి ప్రతిపక్షాలు 2005లో ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం ప్రవేశపెట్టి ఆ విధానాన్ని కొనసాగిస్తున్నాయి.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in ParamarthaSatyam, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s