ఎవరి జేబులోంచి ఈ సబ్సిడీలు?

గత గురువారం న్యూఢిల్లీలో పదకొండవ పంచవర్ష ప్రణాళికను ఆమోదించడానికి ఏర్పాటయిన సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ దేశంలో ఆహారానికి, ఎరువులకు, పెట్రోలియం ఉత్పత్తులకు ఇస్తున్న సబ్సిడీల భారం పెరిగిపోతున్నదన్నారు. ఈ సంవత్సరం అది లక్షకోట్ల రూపాయలకు చేరిందని వాపోయారు. ఈ సబ్సిడీలను తగ్గించే విషయమై మంత్రివర్గ సహచరులు, ప్రణాళికాసంఘం సభ్యులు ఆలోచించాలని ఉద్బోధించారు. ఈ సబ్సిడీల భారాన్ని భరించడమంటే అర్థం తక్కువ పాఠశాలలు, తక్కువ ఆస్పత్రులు, తక్కువ స్కాలర్ షిప్పులు, తక్కువ వ్యవసాయ మౌలికసౌకర్యాలు అని ఆయన బెదరగొట్టారు. 

మన్మోహన్ సింగ్ మామూలు మనిషి కాదు. ప్రపంచప్రఖ్యాత మహామేధావి. కేంబ్రిడ్జి, ఆక్స్ ఫర్డ్, ఢిల్లీ విశ్వవిద్యాలయాల్లో అర్థశాస్త్రం చదువుకున్న, చదువుచెప్పిన ఆచార్యుడు. ఐక్యరాజ్యసమితి, సౌత్ కమిషన్, అంతర్జాతీయ ద్రవ్యనిధిసంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలలో బాధ్యతాయుత స్థానాలలో పనిచేసినవాడు. భారత ప్రభుత్వంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, విదేశాంగమంత్రి, ఆర్థికమంత్రి నుంచి ప్రధానమంత్రి దాకా ఎన్నోపదవులను అధిష్టించినవాడు. ఆయన ఏదయినా మాట అంటే, అందులోనూ ఆర్థిక వ్యవహారాల గురించి మాట్లాడితే ‘ఆయనకన్నా మనకు ఎక్కువ తెలుసా’ అని సామాన్యులు భయపడే అవకాశం ఉంది.

కాని ఇక్కడ సమస్య తెలియడం, తెలియకపోవడం కాదు. ఆ మాటలు ఏ ప్రయోజనాలకొరకు, ఎవరి అవసరాల కొరకు, ఎవరి పొట్ట కొట్టడం కొరకు వెలువడుతున్నాయనేది ముఖ్యం. ప్రయోజనాలది పైచేయి అయినప్పుడు మహాజ్ఞానులు కూడ పచ్చి అబద్ధాలు చెప్పగలరు, పామరులు కూడ చేదు నిజాలు చెప్పగలరు.

‘చదవేస్తే ఉన్న మతి పోయింది’ అని సామెత చెప్పినట్టు ఇప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడ తన దేవతా వస్త్రాలను చూపిస్తూ భారత ఆర్థిక వ్యవస్థలోని సబ్సిడీలమీద అలవోకగా పచ్చి అబద్ధాలు ప్రకటించారు. ఆయన ప్రకటన ఎట్లా అనుచితమో, అబద్ధమో, మోసపూరితమో కనీసం డజను కోణాలనుంచి వివరించవచ్చు. అసలు ఆయనే సౌత్ కమిషన్ ప్రధాన కార్యదర్శి గా 1990లో ప్రచురించిన ‘చాలెంజెస్ టు ది సౌత్’ నివేదికలో సబ్సిడీల గురించి, పేదదేశాల మీద సంపన్నరాజ్యాల దాష్టీకం గురించి ఏమన్నారో చెపితే ఇవాళ్టి ప్రకటన ఎంత అబద్ధమో తెలుస్తుంది. రెండు సంవత్సరాల కింద ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “భారతదేశంలో వ్యవసాయ సబ్సిడీలు వాటికవిగా పెద్ద సమస్య కాదు” అని ఆయనే అన్నారని చూస్తే ఇవాళ్టి ప్రకటన ఎంత అబద్ధమో తెలుస్తుంది.

మొట్టమొదట సబ్సిడీలు అనబడేవి ఏదో మన పాలకులు తమ జేబులలోంచి దయతో ప్రజలకు అందజేస్తున్నవి కాదు. ఆరు దశాబ్దాల ప్రణాళికాబద్ధ అభివృద్ధి మార్గంలో ప్రయాణం చేసినతర్వాత కూడ కొన్ని వర్గాల ప్రజల కొనుగోలు శక్తి పెరగలేదు గనుక వారి కొనుగోలుశక్తికీ, ఆయా సరుకుల ఉత్పత్తి ధరలకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూడ్చడానికి సబ్సిడీలు అవసరమవుతున్నాయి. అంటే సబ్సిడీగా ఇస్తున్న ప్రతి రూపాయి కూడా ఈదేశ పాలకులు తమ అసమర్థ నిర్వహణకు చెల్లిస్తున్న మూల్యమే.

ఆ సబ్సిడీలకు అందుతున్న నిధులు ఈ దేశప్రజలు తమ నెత్తుటిని చెమటగా మార్చి రూపొందిస్తున్న సంపదలో అతి కొద్దిభాగం మాత్రమే. సబ్సిడీల పేరు మీద కేటాయించబడుతున్న నిధులలో గణనీయమైన భాగం నిజంగా అవసరమైన ప్రజలకు దక్కడం లేదు. దాన్నీ సంపన్నవర్గాలే కొట్టుకుపోతున్నాయి. నిజానికి ఈ సబ్సిడీల లెక్కను ప్రభుత్వం చెప్పినట్టు యథాతథంగా అంగీకరించినా అది మన పాలకులు తమ రక్షణకోసం, విలాసాల కోసం కేటాయించుకుంటున్నదానికన్న తక్కువే. ప్రధాని చెప్పిన లక్షకోట్ల రూపాయల అంకెను అంగీకరించినా, ప్రత్యేకఆర్థికమండలాల పన్ను రాయితీల ద్వారా, మినహాయింపులద్వారా సాలీనా లక్షకోట్ల రూపాయల ఆదాయానికి గండిపడుతుందని ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పిన అంకెతోపోల్చి చూస్తే, ఐదువందల చిల్లర ప్రత్యేకఆర్థికమండలాలకు ఎంత అందుతున్నదో, కనీసం ఎనభై కోట్ల ప్రజానీకానికి అంతే అందుతున్నదనుకోవాలి.

ఇంతకూ మొత్తం జాతీయాదాయంలో సబ్సిడీలు పన్నెండు శాతానికి మించవని ఒక అంచనా. ప్రధాని ఆ మాటలు చెప్పిన సమావేశంలోనే ఆమోదించిన పంచవర్షప్రణాళిక 36,44,000 కోట్ల రూపాయలుగా ఉంది. ఆ లెక్కన చూస్తే వార్షిక ప్రణాళికావ్యయం ఏడులక్షల కోట్లు అన్నమాట. ఏడులక్షల కోట్ల ప్రణాళికా వ్యయంలో లక్షకోట్ల సబ్సిడీలు భారమవుతాయా?

ఇంతకన్న దారుణమైన విషయం సబ్సిడీల గురించి ఇంతగా గొంతు చించుకుంటున్న పాలకులు తాము సంపన్నులకు ఇవ్వదలచిన కానుకలకు మాత్రం ప్రోత్సాహకాలు అని ముద్దుపేరుపెట్టి, విదేశీ పెట్టుబడులు సాధిస్తాయని, ఎగుమతులు పెంచుతాయని, మౌలిక సౌకర్యాలు కల్పిస్తాయని, సాంకేతిక పరిజ్ఞానం తెస్తాయని అబద్ధాలు నమ్మబలుకుతున్నారు. ఆ ప్రోత్సాహకాలన్నీ నర్మగర్భంగా, ఊహించలేని రూపాలలో ఉంటాయి గనుక వాటిని లెక్కవెయ్యడం కూడ కష్టమే గాని, అవన్నీ లెక్కవేస్తే పేద, మధ్య తరగతి వర్గాలకు అందే సబ్సిడీలకన్న, ధనిక, వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు అందే ప్రోత్సాహకాలు చాల ఎక్కువని తేలుతుంది.
ఇవాళ దేశంలో ఉన్న సబ్సిడీల విధానం లోపభూయిష్టంగా ఉన్నదని, కొన్ని వర్గాలకు అవసరంలేకపోయినా సబ్సిడీ అందుతున్నదని, అవసరమైన వర్గాలకు అందడంలేదని అనేమాట నిజమే. తప్పకుండా సబ్సిడీలను సమీక్షించి మెరుగుపరచవలసిందే. కాని కోత విధించడం, మూకుమ్మడిగా రద్దుచేయాలని వాదించడం అర్థరహితం. ఈ మాటల ద్వారా సాధించదలచింది పేద, మధ్యతరగతి వర్గాలకు అందే సబ్సిడీలపైన కోత మాత్రమే.

ఇంతకూ ఈదేశంలో వ్యవసాయ రంగానికి అందుతున్న సబ్సిడీల మీద కోత విధించి, ఇక్కడి రైతు నడ్డి విరవమని, దేశీయ ఎరువుల పరిశ్రమను మూసివేయమని, మధ్యతరగతిని వీథులపాలు చేయమని మన పాలకులకు ఆదేశాలిస్తున్నవి ప్రపంచవాణిజ్యసంస్థ, ప్రపంచబ్యాంకు వంటి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు. ఒకపక్క అమెరికా వంటి దేశాలలో బిలియన్ డాలర్ల సబ్సిడీలు అందజేస్తుంటే, అక్కడి వ్యవసాయోత్పత్తుల ఉత్పత్తివ్యయం అంతా ప్రభుత్వమే భరించి, ఆ రైతులు విదేశాలకు ఎగుమతిచేసి పేద దేశాల రైతుల పొట్టకొట్టడానికి సిద్ధమవుతుంటే పెదవి విప్పని ప్రపంచవాణిజ్యసంస్థ మన సబ్సిడీలను మాత్రం తగ్గించమని అడుగుతోంది. ఆ ఆదేశాన్ని ఆ సంస్థల మాజీ ఉద్యోగి మన్మోహన్ సింగ్ ‘జీ హుజూర్ జో హుకుం’ అని మనమీద రుద్దుతున్నారు. ఆ వినయప్రకటనలో ఎంత జ్ఞాని అయినా నేలమీద పాకవలసిందే.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in News Archives, ParamarthaSatyam, Surya, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s