బుద్ధదేవుని భూమిలో…

బుద్ధదేవుని భూమిలో, తమను తాము కమ్యూనిస్టులమనీ, మార్క్సిస్టులమనీ పిలుచుకునేవారి పాలనలో నందిగ్రాంలో మళ్లీ హింస చెలరేగింది. ఈ సంవత్సరం జనవరి, మార్చిలలో జరిగిన పోలీసు కాల్పులలో, అధికార సిపిఎం కు చెందిన సాయుధ బలగం హర్మత్ వాహిని కార్యకర్తలు జరిపిన కాల్పులలో దాదాపు ఇరవై మంది ప్రాణాలు బలి అయిపోగా, ఈసారి హింసాకాండ పూర్తిగా సిపిఎం కార్యకర్తల ఆధ్వర్యంలోనే జరిగింది. కాల్పులు, దాడులు, గృహదహనాలు, స్త్రీలపై అత్యాచారాలు విచ్చలవిడిగా జరిగాయి. గత హింసాకాండ సమయంలో ఆ ప్రాంతం నుంచి బయటికి పారిపోయిన సిపిఎం కార్యకర్తలు ఆ ప్రాంతాన్ని పునరాక్రమించడానికి జరిగిన ప్రయత్నం ఇది. కొద్దిరోజులలో కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు రానున్నాయి గనుక అవి రాకముందే తమ “పని” పూర్తి చేయాలని సిపిఎం నాయకత్వం భావించిన ఫలితం ఇది. పునరాక్రమణ (ఆపరేషన్ రికాప్చర్) అని పరిశీలకులందరూ చెపుతున్న ఈ కార్యక్రమం స్పష్టంగా కొన్ని పనులు సాధించదలచింది: ఏడాదిగా అక్కడ సిపిఎం దాష్టీకాన్ని ఎదిరిస్తున్న వారందరికీ శిక్షలు విధించడం, మలేషియా సలీం కంపెనీకి తాము భూమి అప్పగించదలచినప్పుడు అడ్డుకున్నవారికి బుద్ధిచెప్పడం, రాష్ట్రంలో గ్రామీణప్రాంతాలమీద దౌర్జన్యంద్వారా తాము స్థాపించుకున్న అధికారాన్ని సవాలు చేయడం ద్వారా నందిగ్రామ్ చూపుతున్న మార్గాన్ని మొగ్గలోనే తుంచివేయడం, చౌకధరల దుకాణాలలో సిపిఎం స్థానిక నాయకులు సాగిస్తున్న అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్రంలో రగుల్కొంటున్న ప్రజాఅసంతృప్తిని అడ్డుకోవడం, తమనూ తమ విధానాలనూ వ్యతిరేకించేవారికి ఎటువంటి గతి పడుతుందో ఉదాహరణప్రాయమైన బెదురు కలిగించడం — ఇవీ నందిగ్రామ్ హింసాకాండ ద్వారా సిపిఎం సాధించదలచినవి. పనిలో పనిగా పార్టీలోపల తన పట్ల రాజుకుంటున్న వ్యతిరేకతకు కూడ దీనిలో జవాబు చెప్పడానికి ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ప్రయత్నించారని పరిశీలకులు అంటున్నారు.

అయితే నందిగ్రామ్ గురించి ఆలోచనలకు అనేక ఆటంకాలున్నాయి. మనమన రంగుటద్దాలు, అధికార సిపిఎం పట్లనో, ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ పట్లనో, జమియత్ పట్లనో, మావోయిస్టుల పట్లనో ఉండే రాజకీయ అభిప్రాయాలు, దురభిప్రాయాలు నందిగ్రామ్ గురించి సరయిన వైఖరి తీసుకోకుండా చేస్తున్నాయి. అవన్నీ పక్కనపెట్టి, తమ భూమి నుంచి ఎప్పుడు వెళ్ళగొట్టబడతామో అనే భయంతో జీవిస్తున్న ప్రజలు, ప్రత్యేక ఆర్థికమండలాల ఏర్పాటు కోసం ఎంత మోసానికయినా దిగజారగల పాలకవర్గాలు అనే రెండు అంశాలు ప్రధానంగా నందిగ్రామ్ గురించి ఆలోచించవలసి ఉంది. నందిగ్రామ్ ఇవాళ రాజకీయ రంగులు అద్దుకుని అసలేమిటో కొసరేమిటో అంతుపట్టకుండా తయారయి ఉందిగాని అసలిదంతా ఎక్కడ మొదలయి ఇక్కడిదాకా వచ్చిందో అర్థం చేసుకోవలసి ఉంది.

అసలు నందిగ్రామ్ ఘర్షణకు మూలాలు వామపక్షాలు ప్రత్యేక ఆర్థిక మండలాల మీద తీసుకున్న వైఖరిలో ఉన్నాయి. ఆ వామపక్షాలకు ప్రత్యేకఆర్థికమండలాలను వ్యతిరేకించడంలో చిత్తశుద్ధిలేనందువల్ల, ఎస్ ఇ జెడ్ ల విషయంలో రెండునాలుకల వైఖరి అవలంబిస్తుండడం వల్ల ఇవాళ్టి స్థితి వచ్చింది. ఒకపక్క ప్రజలను మభ్యపెట్టేందుకు ఎస్ ఇ జెడ్ లను వ్యతిరేకిస్తున్నట్టు నటిస్తూ, ఉద్యమాలు కూడ నడుపుతూ, మరొకపక్క తాము అధికారంలో ఉన్నచోట ఏవేవో కుంటిసాకులతో వాటిని నెలకొల్పుతూ రావడం వల్ల ఇవాళ్టి స్థితి తలెత్తింది.

భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని ఎన్ డి ఎ ప్రభుత్వం 2000 ఏప్రిల్ లో తొలిసారిగా ఎస్ ఇ జెడ్ విధానాన్ని ప్రకటించినప్పుడు ఈ వామపక్షాలన్నీ దాన్ని ఖండించాయి. కాని అవే వామపక్షాలు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇతర రాష్ట్రప్రభుత్వాలకన్న ముందుగానే 2003 జూన్ 28 న అసాధారణ గెజిట్ ద్వారా మణికంచన్ ఎస్ ఇ జెడ్ ను ప్రకటించింది. అందులో “విదేశీభూభాగంగా వ్యవహరించడం” అనే మాటతో సహా ఎన్ డి ఎ విధానాన్ని యథాతథంగా ఆమోదించింది. ఆ గెజిట్ నే బిల్లుగా మార్చి 2003 డిసెంబర్ లో రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. అంటే యు పి ఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేంద్రంలో ఎస్ ఇ జెడ్ చట్టం రావడానికి (2005 మే) ఏడాదిన్నర ముందే వామపక్ష ప్రభుత్వమని చెప్పుకుంటున్న ప్రభుత్వమే ఎస్ ఇ జెడ్ లను చట్టబద్ధం చేసింది. ఈలోగా వామపక్షాలు భాగస్వాములైన యుపిఎ కేంద్రంలో అధికారానికి వచ్చి ఎస్ ఇ జెడ్ చట్టం తెచ్చింది. ఆ చట్టంపై పార్లమెంటు చర్చలో వామపక్ష సభ్యులు దాన్ని మొత్తంగా ఖండించలేదు. రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వలేదనే విషయం మాత్రం మాట్లాడారు.

ఆ విధానానికి అనుగుణంగానే నందిగ్రామ్ లో నలభైవేల ఎకరాల పంటభూమిని సలీంగ్రూపుకు కట్టబెట్టడానికి వామపక్ష ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకవైపు లోపాయకారిగా ఆ పనులు కొనసాగిస్తూనే ముఖ్యమంత్రితో సహా అధికారులు, పార్టీ కార్యకర్తలు అసలు ఆ రసాయన పరిశ్రమ అక్కడికి రానే రావడంలేదని అనేక సార్లు ప్రకటించారు. చివరికి అసలు విషయం బయటపడి ప్రజలు తమ భూమిని వదులుకోమంటూ ప్రతిఘటించడం ప్రారంభించాక స్థానిక రాజకీయపక్షాలు ఆ ప్రతిఘటన కార్యక్రమంలో ప్రవేశించాయి. తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, జమియత్ ఎ ఉలేమా ఎ హింద్ లు కలిసి భూమి ఉచ్చేద్ ప్రతిరోధ్ కమిటీని ప్రారంభించాయి. ఆ ఆందోళన తమ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నది గనుక సిపిఎం స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆందోళనకారులమీద హింస, దౌర్జన్యం ప్రారంభించారు.

తమ భూమి పోతుందని భయంతో ఆందోళన చేస్తున్న వారికి, తమ పట్టుపోతుందని దౌర్జన్యంచేయదలచినవారికి మధ్య ఘర్షణ ప్రారంభమయింది. ఆ ఘర్షణ 2007 జనవరిలో, మార్చిలో కాల్పులకు దారి తీసింది. అనేకమంది మరణించారు. స్థానిక ప్రజాఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేసినందువల్ల సిపిఎం కార్యకర్తలు, నాయకులు అక్కడ ఉండలేని స్థితి వచ్చింది. ఆ తర్వాత రసాయనిక పరిశ్రమను అక్కడినుంచి ఉపసంహరిస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. కాని ఆ ముఖ్యమంత్రే ఆ నందిగ్రామ్ విషయంలోనే అనేక అబద్ధాలు చెప్పి ఉండడం, మాటమార్చి ఉండడం చూసి ఉన్నారుగనుక నందిగ్రామ్ ప్రజలు ఆ వాగ్దానాన్ని ఇప్పటికీ నమ్మడంలేదు. బహుశా వారి అపనమ్మకానికి తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు ఆజ్యం పోసి ఉండవచ్చు. ప్రజలు, సిపిఎం కార్యకర్తలు ఎదురుబొదురుగా నిలబడి హింసాత్మక ఘర్షణలకు దిగిన నేపథ్యంలో సిపిఎం నాయకుల మాటలు ప్రజలకు నమ్మశక్యంగా కనిపించకపోవడంలో ఆశ్చర్యంలేదు. అసలు బైటి ప్రాంతాల వారు, సిపిఎం నాయకులు, అధికారులు ఎవరు ఆ ప్రాంతంలోకి వచ్చినా అనుమానంగా చూసే స్థితి అక్కడ ఏర్పడింది. అది దురదృష్టకరమే కావచ్చుగాని, అందుకు పూర్తిగా బాధ్యత వహించవలసింది అప్పటిదాకా ప్రజావ్యతిరేకంగా ప్రవర్తించినవారే.

ఈ పూర్వరంగంలో, 2008 మేలో జరగనున్న పంచాయత్ ఎన్నికల సన్నాహాలలో భాగంగా, అక్కడ కేంద్రబలగాలు ప్రవేశించకముందే తమ కక్ష తీర్చుకునేందుకు సిపిఎం ఆపరేషన్ రికాప్చర్ ప్రారంభించింది. నందిగ్రామ్ గత ఏడాదిన్నరగా తనమాట వినడంలేదని, ఇప్పుడు భయపెట్టి బెదరగొట్టి అయినా తన మాట వినేలా చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. 35 మందిని చంపి, బియుపిసి లో పనిచేసిన వారి ఇళ్లు తగులబెట్టి, వారిని భయభ్రాంతుల్ని చేసి, చాల చోట్ల స్త్రీల మీద అత్యాచారాలు చేసి, స్వతంత్ర పరిశీలకులు చెపుతున్నట్టుగా మినీ గుజరాత్ ను సాధించింది సిపిఎం. ఆ దాడి అటు నందిగ్రామ్ ప్రజలమీద మాత్రమే కాక వారికి మద్దతు గా నిలిచిన మేధాపాట్కర్ మీద, కోల్కత్తాలో నిరసన తెలుపుతున్న సినీరంగ ప్రముఖులమీద కూడ జరిగింది. నిరసన తెలిపిన మృణాళ్ సేన్, గౌతమ్ ఘోష్, అపర్ణాసేన్ వంటి దిగ్గజాలమీద కూడ సిపిఎం దుష్ప్రచారం మొదలుపెట్టింది.

ఈ హింసాకాండకు సిపిఎం చూపుతున్న సాకు అక్కడ తృణమూల్ కాంగ్రెస్, మావోయిస్టులు కలిసి సాగిస్తున్న దురాగతాలను అడ్డుకోవడం అని. వారికి తెలిసిన భాషలోనే వారికి జవాబిచ్చాం అని ముఖ్యమంత్రి అన్నారంటే, తాము చేసినవీ దురాగతాలేనని ఒప్పుకుంటున్నారన్నమాట. కాని బెంగాలీ రచయిత సుచిత్ర భట్టాచార్య అన్నట్టు ఈ మావోయిస్టుల బూచి సరిగ్గా ఇరాక్ మీద దాడి చేయడానికి జనవిధ్వంసక ఆయుధాల సాకు చూపిన జార్జి బుష్ ప్రకటనలాగుంది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu, Vartamaanam. Bookmark the permalink.

One Response to బుద్ధదేవుని భూమిలో…

  1. koresh says:

    anthaa baagundi, communists vargaala kotlaatalo anni bayataku techharu naxalite supporter gaaru. prajalaku upayoga pade pnulu vaadanalu cheyyandi.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s