కాగ్ నివేదికల ప్రయోజనమేమిటి?

ఈ సంవత్సరం కూడ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదికలు రాష్ట్రప్రభుత్వ ఆర్థిక నిర్వహణను తప్పుపట్టాయి. ఒకరకంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విపరీతంగా పెరిగిపోయిన అవినీతి గురించి చాలమంది చాలరోజులుగా మాట్లాడుతున్న విషయాలనే కాగ్ నివేదికలు మరొకసారి నిర్ధారించాయన్నమాట. అధికారపక్షాన్ని విమర్శించడానికి ఏ ఆధారం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు అయాచితంగా ఒక అవకాశం దొరికింది. రెండురోజులుగా ప్రచార సాధనాలనిండా కాగ్ నివేదికల మీద దుమారమే రేగుతోంది.

అయితే మొట్టమొదట గుర్తించవలసిన విషయం కాగ్ నివేదికలు రాష్ట్రప్రభుత్వ ఆర్థికవ్యవహారాల నిర్వహణను తప్పుపట్టడం ఇదే మొదటిసారి కాదు, బహుశా చివరిసారీ కాబోదు. ఇందులో ప్రతిపక్షాలు ఎగిరిగంతువేయవలసిందేమీ లేదు. గతంలో కూడ కాగ్ నివేదికలు కేంద్ర ప్రభుత్వాన్నీ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలనూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇంతగానో ఇంతకన్న తీవ్రంగానో తప్పుపట్టి ఉన్నాయి. కాని గద్దెనెక్కి కూచుని మహాభయంకరమైన ఆర్థిక నేరాలకూ కుంభకోణాలకూ పాల్పడినవారెవరికీ ఆ నివేదికలవల్ల పూచికపుల్లంత ప్రమాదం కూడ జరగలేదు. కనుక ఆ నివేదికలలో ఎంతటి మహాద్భుత సత్యాలు ఉన్నా వాటికి ఫలితమూ పర్యవసానమూ ఏమీ ఉండబోదు. కాగ్ నివేదిక అంతిమ నిర్ధారణ కాదని, కాగ్ నివేదిక ఎత్తిచూపిన ఆర్థిక, గణాంక, నిర్వహణా లోపాల గురించి అంతిమతీర్పు న్యాయస్థానపు విచారణలో తేలవలసిందేనని స్వయంగా ‘కాగ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్’ చెపుతాయి. అంటే కాగ్ నివేదిక ఎక్కువలో ఎక్కువగా పత్రికలలో దుమారానికి తప్ప మరెందుకూ పనికి రాదన్నమాట.

ప్రజాధనాన్ని వ్యయం చేసేటప్పుడు ఉండవలసిన జవాబుదారీతనాన్ని ఎత్తిపట్టడానికే ఈ సంస్థ ఏర్పడింది. ఐదు దశాబ్దాల నిర్విరామమైన, నిశితమైన కృషి తర్వాత కూడ కాగ్ వంటి రాజ్యాంగ సంస్థ, తప్పుడులెక్కలూ అక్రమాలూ అవినీతీ నిండిన ప్రభుత్వాలలో భయాన్నీ బెదురునూ ఎందుకు కలిగించలేకపోతున్నదంటూ మాజీ డిప్యూటీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా డా. బి పి మాథుర్ రాసిన ‘గవర్నమెంట్ అకౌంటబులిటీ అండ్ పబ్లిక్ ఆడిట్’ అనే పుస్తకంలో కాగ్ కు ఉన్న అధికారాలు ఎంత నామమాత్రమైనవో చూపారు.

ఇవాళ కాగ్ గా మనం పిలుస్తున్న సంస్థకు మూలాలు 1858లో బ్రిటిష్ పాలకులు రూపొందించిన ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్ మెంట్ లో ఉన్నాయి. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు ఆడిటర్ జనరల్ కార్యాలయం తయారయింది. తర్వాత 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలద్వారా ఆ పదవిని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి స్థానానికి పెంచడం జరిగింది.

భారత రాజ్యాంగం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవిని చాల ముఖ్యమైనదిగా గుర్తించి 148-151 అధికరణాలలో కాగ్ విధులనూ బాధ్యతలనూ స్పష్టంగా నమోదుచేసింది. ప్రస్తుతం దాదాపు అరవైవేలమంది ఉద్యోగులు ఉన్న ఈ స్వతంత్ర, రాజ్యాంగబద్ధ సంస్థ భారతీయ రైల్వేలు, తంతి తపాలా శాఖలతో సహా అన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వ శాఖల పని తీరును మదింపు చేస్తుంది. దాదాపు 1200 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ వ్యాపార సంస్థల లెక్కలను, 400 వ్యాపారేతర ప్రభుత్వ సంస్థల లెక్కలను, ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందే 4400 సంస్థల లెక్కలను పర్యవేక్షిస్తుంది. ఆ పరిశీలనలద్వారా తయారుచేసిన నివేదికలను కేంద్రస్థాయి సంస్థల విషయంలోనయితే రాష్ట్రపతికి, రాష్ట్రస్థాయి సంస్థల విషయంలోనయితే ఆయా రాష్ట్రాల గవర్నర్లకు సమర్పిస్తుంది. వాళ్లు మళ్లీ పార్లమెంటులో గాని, శాసనసభలలో గాని ఆ నివేదికలను ప్రవేశపెట్టవలసి ఉంటుంది.

సైద్ధాంతికంగా చూస్తే ఆ నివేదికలమీద ప్రజాప్రతినిధులు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలు చర్చించి, నివేదికలు ఎత్తిచూపిన తప్పులను సవరించే ప్రయత్నాలు చేయాలి. కాని మన చట్టసభలకు ఆ నివేదికలను చర్చించే తీరిక గాని ఓపిక గాని ఉండడమే లేదు. సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికలు ఆ ఆర్థిక సంవత్సరం గడిచిపోయాక కనీసం ఆరునెలల తర్వాత వెలువడుతాయి. అంటే అప్పుడిక అది గత జల సేతుబంధనం అయి చేయవలసిందేమీ ఉండదు. ఇకముందు అటువంటి పొరపాట్లు జరగకుంగా చూడవచ్చుననే సమాధానం ఉంటుందిగాని, జరిగిన అక్రమాల మీద శిక్షలు విధించడానికి గాని, ఆ అక్రమాలకు పాల్పడినవారినుంచి కైంకర్యమైన ప్రజాధనాన్ని రాబట్టడానికి గాని అవకాశమేమీ ఉండదు. అంతేకాదు, అసలు కాగ్ తన నివేదికలకొరకు నమూనా సమాచారం రాబట్టడానికి ప్రయత్నించినప్పుడు ప్రభుత్వ శాఖల అధికారులు సహకరించడం లేదని, వారి సహాయనిరాకరణమీద కూడ చర్య తీసుకునే అధికారం తమకు లేదని మాథుర్ రాశారు.

మాథుర్ రాసిన ఒక ఉదాహరణ చెప్పుకోదగినది: ప్రపంచబ్యాంకు ఆదేశాల ప్రకారం టెలికాం రంగంలో సంస్కరణల ఫలితంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయి) అనేసంస్థ ఏర్పడింది. దాని కార్యదర్శి అధికారిక పనిమీద ఫిలిప్పైన్స్ లోని మనిలా లో ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఏర్పాటుచేసిన ఉచిత హోటల్ వసతిని అనుభవించి కూడ, అక్కడ ఉన్నన్ని రోజులూ హోటల్ ఖర్చుల కింద రోజుకు 500 డాలర్ల చొప్పున మన ప్రజాధనం నుంచి రాబట్టాడు. దానిమీద కాగ్ ప్రశ్నించినప్పుడు ట్రాయి స్వతంత్ర సంస్థ అని కనుక దాని పనితీరు గురించి ప్రశ్నించేఅధికారం కాగ్ కు లేదని సవాలు చేశాడు. దానిమీద సంవత్సరాల తరబడి అటూ ఇటూ ఉత్తరాలు నడిచాయి తప్ప జరిగిందేమీ లేదు.

ఇలా రోజుకు 500 డాలర్లకు కక్కుర్తి పడిన అధికారుల నుంచి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దొడ్డిదారిన తమ ఖాతాలలోకి మళ్లించుకున్న రాజకీయనాయకుల దాకా మన పాలకులు కొల్లగొడుతున్న ప్రజాధనానికి లెక్కలేదు. వందకోట్ల ప్రజలు తమ నెత్తుటిని చెమటగా మార్చి సృష్టిస్తున్న సంపదను ఇటువంటి కొన్ని వందలమంది దొంగలు తన్నుకుపోతున్నారు. మళ్లీ ఆ జలగలూ గద్దలూ పందికొక్కులూ (నిజానికి ఇలా నోరులేని మూగప్రాణులను అవమానించనక్కరలేదు, నిలువెల్లా విషం ఉన్న మనుషుల పనే ఇది) అధికారపక్షంలో ఉన్నప్పుడు అవేపనులు చేసి ప్రతిపక్షంలోకి రాగానే గగ్గోలు పెడుతున్నాయి.

1994 నుంచి 2004 దాకా కాగ్ నివేదికలమీద రాజశేఖరరెడ్డి ఏమన్నారో 2005 నుంచి ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు అదే అంటున్నారు. కాగ్ నివేదికలలో బయటపడుతున్న కుంభకోణాల వందలకోట్ల రూపాయల నిధులు వాళ్లిద్దరివీ కాదనీ, సంపూర్ణంగా తమవేనని ప్రజలు గుర్తించేదాకా, తామే స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించేదాకా ఎన్ని కాగ్ నివేదికలు వచ్చినా ప్రయోజనం లేదు.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in ParamarthaSatyam, Reports, Telugu. Bookmark the permalink.

2 Responses to కాగ్ నివేదికల ప్రయోజనమేమిటి?

  1. చాలా మంచి వివరణ ఇచ్చారు.
    కాగ్ వంటి సంస్థలుకూ వారి నివేదికలకూ విలువా మఱియూ శక్తీ జనాలే కల్పించాలి. జనులు చైతన్యవంతులై, వ్యవస్థలోని అవినీతిని సమూలంగా నిర్మూలింప దలచిననాడే భ్రష్టాచారాలు నశిస్తాయి.
    ప్రస్తుత పరిస్థితుల్లో కాగ్ లాంటి సంస్థలకు దండించే అధికారమిచ్చినా ప్రయోజనం వుండదు. అలా చేస్తే (జనాలు మేల్కోనంత కాలం) వారిచ్చే నివేదికలే కల్మషం చేసేస్తారు మన నాయకులు.

  2. ప్రజలంటే ఏమిటి? అదొక మహాసముద్రం కదా. కనుక స్పష్టమైన సంస్థాగత గ్యారంటీలు, కాలబద్ధమైన (time bound) క్రమాలు వుండేట్లు సాధించుకోవాలి. అది ఈ వున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధ్యమా కాదా, దానికి వేరే ఎలాంటి వ్యవస్థ కావాలి అనేవన్నీ ఆ క్రమంలోనే ఆవశ్యకతలుగా ముందుకొస్తాయి. ఏ వ్యవస్థలోనైనా సంస్థాగత గ్యారంటీలు అవసరమే. అన్నింటికీ మించి న్యాయవ్యవస్థలో (వున్నదానిలోనే) మౌలిక మార్పులు తేవాలి; న్యాయమూర్తులు – ముఖ్యంగా హైకోర్టు, సుప్రీం కోర్టుల న్యాయమూర్తులు – పైరవీలు లేకుండా పారదర్శకమైన, జనరంజకమైన పద్ధతుల్లో ఎన్నికవడమో లేక ఎంపికవడమో జరగాలి; ఆ వ్యవస్థ సరైన జవాబుదారీ పద్ధతిలో నడుస్తూ, కాలబద్ధమైన విచారణలతో సత్వర న్యాయం అందించడమే కాక అమలు చేయించే సత్తాకూడ పొందేట్లు మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాలి. అప్పుడు యిలాంటి నివేదికలపై కథిన చర్యలు ప్రస్తుత వ్యవస్థలో సైతం మెరుగ్గా తీసుకో వీలవుతుంది. అఫ్‌ కోర్స్‌ యితర రాజ్యశాఖలలో కూడ అనుగుణమైన మార్పులు అవసరం, వాటికోసమూ ఆందోళన చేయాల్సిందే ననుకోండి. అయితే నేను నొక్కి చెప్పేదేమంటే ఎలాంటి ప్రత్యామ్నాయ పద్దతులు, క్రమాలు కావాలి అనేది మనమీ వ్యవస్థలో వుండే ఎత్తిచూపుతూ, అందుకోసం పోరాడుతూ వుండాల్సిందే నని.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s