నిజాం పాలన రాజకీయార్థిక కోణాలు

నిజాం పాలన గురించి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కె చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్య, ఆ తరువాత ఆయన, ఆయన సహచరులు దాన్ని సమర్థించుకుంటున్న తీరు, వివిధ రాజకీయ పక్షాల స్పందన మన రాజకీయ రంగంలోని దివాళాకోరుతనానికి అద్దం పడుతున్నాయి. హైదరాబాదు రాజ్య చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ వర్ధంతి సందర్భంగా ఒక రాజకీయ మర్యాదగా హాజరు కావడం, మిగిలిన గతకాలపు పాలకులందరినీ గౌరవించినట్టే గౌరవించడం ఒక ఎత్తు. కాని ఆ పాలకుడికి సంబంధించిన చరిత్ర లోని దుర్మార్గాలు స్పష్టంగా కనబడుతుండగా వాటిని విస్మరించి చచ్చినవాడి కళ్లు చారెడేసి అని స్తోత్రపాఠాలు చదవడం, ఆ పాలకుడిపై ప్రజలు సాగించిన మహోజ్వలపోరాటాన్ని తక్కువచేసి మాట్లాడడం ఒక అనవసరపు, దురదృష్టపు వ్యవహారం.

అసలు ఒక పాలన గురించి మాట్లాడేటప్పుడు ఆ పాలకుడి మంచిచెడులు, ఇష్టాయిష్టాలు, అభిరుచులు ప్రధానంగా చర్చ జరిగితే ఇంత దురదృష్టకరంగానే ఉండకతప్పదు. ఎందుకంటే ప్రతిపాలకుడిలోనూ మంచీచెడూ ఉంటాయి. మంచిపనుల ఉదాహరణలు ఎన్ని ఇవ్వవచ్చునో చెడ్డపనుల ఉదాహరణలు అంతకు కొన్ని రెట్లు చూపించవచ్చు. కోట్లాది మందిని చంపిన అడాల్ఫ్ హిట్లర్ కు కూడ ఇవా ను ప్రేమించిన ఆర్ద్ర హృదయం ఉండిందనీ చూపవచ్చు, కొన్నివేలమందిని రెండు సంవత్సరాలపాటు చీకటికొట్లలో విచారణలేకుండా నిర్బంధించిన ఇందిరాగాంధీ తన కొడుకు ఒక్కరోజు నిర్బంధానికి గురయితేనే కంటతడి పెట్టిందనీ చూపవచ్చు. అందువల్ల సమస్య ఆ వ్యక్తులదీ వారి మంచిచెడులదీ వారి సున్నితత్వాలదీ కాదు.

ఒక పాలన గురించి చర్చించేటప్పుడు ఆ పాలన ప్రజల పట్ల ఎట్లా ఉన్నదో చర్చించాలి. అది ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపించిందా, కొత్త సమస్యలు సృష్టించిందా చూడాలి. ప్రజల శ్రమ సృష్టించిన సంపదలోనుంచి పాలన ఇస్తాననే పేరుతో ఎంత వాటాను తీసుకుంది, అది న్యాయమైన వాటానేనా, లేక దొంగలదోపిడీనా చర్చించాలి. రాజ్యంలో ఉత్పత్తి అయిన సంపదను ఏయే వర్గాలమధ్య ఏ విధంగా పంపిణీ చేసిందీ విశ్లేషించాలి. అంటే ఒక పాలన గురించి జరిగే చర్చ రాజకీయార్థిక చర్చగా జరగాలి. కాని దురదృష్టవశాత్తూ మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలన గురించి ఒక రాజకీయార్థిక చర్చగా జరగవలసినదల్లా శుష్క రాజకీయవివాదంగా, అదికూడ భావోద్వేగాలు రెచ్చగొట్టేదిగానో, ఎన్నికలలో నాలుగు వోట్లు ఎక్కువ సంపాదించుకునే ఎత్తుగడగానో జరుగుతోంది.

మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలన (1911-50) లో, ఆ మాటకొస్తే ఆయన తండ్రి మహబూబ్ అలీఖాన్ పాలన (1869-1911) లో హైదరాబాదు రాజ్యంలో చాల ఆధునిక సౌకర్యాలు వచ్చిన మాట నిజమే. ఆధునిక ఆస్పత్రి, ఆధునిక తంతి తపాలా సౌకర్యాలు, రైల్వేలతో సహా ఆధునిక రవాణా సౌకర్యాలు, దేశీయభాషలో ఉన్నత విద్యను కూడ బోధించిన ఆధునిక విశ్వ విద్యాలయం వంటివన్నీ చివరి ఇద్దరి నిజాముల పాలనలో వచ్చాయి. కాని ఇవేవీ ఆ పాలకులు తమ ప్రజలపట్ల చేసిన మెహర్బానీ కాదు. అవి చేయడం వాళ్ల గొప్పతనమేమీ కాదు. నిజానికి అటువంటి సౌకర్యాలు కల్పించడం, ప్రజాజీవితాన్ని మెరుగుపరచడం పాలకుల బాధ్యత. ‘రహదారులు వేయించెను, రహదారులపక్కన చెట్లునాటించెను, సత్రములు కట్టించెను’ అని అశోకుడి కాలంనుంచీ రాజుల బాధ్యతగా చెప్పుకుంటున్న పనులనే ఆధునిక కాలంలోకి అనువర్తింపజేస్తే కల్పించవలసిన సౌకర్యాలనే నిజాం ప్రభువులు కల్పించారు గాని అదనంగా తమ జేబుల్లోంచి ఏమీ తీసిపెట్టలేదు. కనుక ఆ సౌకర్యాలను చూపి నిజాం ప్రభువులను కీర్తించనక్కరలేదు. ఇటువంటి పనులనే ప్రపంచంలో నియంతలుగా పేరు తెచ్చుకున్న ప్రభువులు, ఆ పేరు లేకపోయినా నియంతృత్వమే చలాయించిన ప్రభువులు అందరూ చేశారు.

అట్లాగే భగవంతుడిచ్చిన తాగునీటిపై పన్ను ఏమిటని ప్రశ్నించడం గాని, ఉరిశిక్షల అమలుపై సంతకం పెట్టకపోవడంగాని, మత సామరస్యాన్ని పరిరక్షించడం గాని అన్నీ వ్యక్తిగతంగా ఉస్మాన్ అలీఖాన్ మంచితనానికి చిహ్నాలే కావచ్చు. కాని అసలు వ్యక్తిగత మంచిచెడులు చర్చనీయాంశమేకాదు. అట్లాగే యాభై సంవత్సరాల పాలనలో చివరి రెండు సంవత్సరాలు మాత్రమే రజాకార్ల దుర్మార్గాలో, రైతాంగ సాయుధ పోరాటం మీద నిర్బంధమో సాగిందనడం కూడ కాలవ్యవధి ద్వారా దుర్మార్గాల ప్రభావం తగ్గుతుందనుకునే అమాయకత్వమే అవుతుంది. ప్రపంచచరిత్రలో నరహంతకులని పేరుపడ్డవాళ్లందరూ తమ జీవితకాలం మొత్తంలో హింసాదౌర్జన్యాలకు పాల్పడిన కాలం అతితక్కువే కావచ్చు.

ఇంతకూ మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనను రాజకీయార్థిక ప్రమాణాలతో అంచనా కట్టినప్పుడు అది నూటికి నూరుపాళ్లు ప్రజావ్యతిరేక పాలన అని తేలుతుంది. ఎందుకంటే ఆయన పాలనాకాలంలో అమలయిన రాజకీయార్థిక విధానాలన్నీ, అవి అమలయిన పద్ధతి అంతా ప్రజల మీద అన్యాయాన్నీ దౌర్జన్యాన్నీ దోపిడీనీ పీడననూ రుద్దాయి. ఆయన పైన వలసవాదానికి, కింద భూస్వామ్యానికీ మధ్య వారధిగా, ఒక నిచ్చెనమెట్ల దోపిడీ వ్యవస్థను కాపాడిన రాజుగా ఉన్నాడేగాని, ప్రజానుకూల రాజుగా లేడు. మిగిలిన రాజలది కూడ అటువంటి పాలనే కాదా అంటే అది వేరే చర్చ, ఇక్కడ అది అప్రస్తుతం. పైన బ్రిటిష్ పాలకులకు “విశ్వాసపాత్రుడయిన మిత్రుడు” గా వలసవ్యతిరేకులమీదికి సైన్యాలను నడిపి, వలసవాదులకు తన భూభాగాన్ని ముక్కలుముక్కలుగా తుంచి ఇచ్చి ఆయన ప్రజాజీవనాన్ని అల్లకల్లోలంచేశాడు. కింద పాయెగాలు, ఉమ్రాలు, సంస్థానాలు, ఎస్టేట్లు, మక్తేదార్లు, జాగీర్దార్లు, దేశముఖ్ లు, దేశ్ పాండ్యాలు లాంటి ఒక నిరంకుశ భూస్వామ్య నిర్మాణం ప్రజలను ఎంతగా పీల్చి పిప్పి చేసినా పట్టించుకోకుండా వారి ఇష్టారాజ్యం నడవనిచ్చాడు. ప్రజలమీద దాదాపు వంద రకాల పన్నులు వసూలు చేసుకునే అధికారాన్ని దొరలకు ఇచ్చాడు. ఆ దొరలనుంచి తనకు క్రమం తప్పకుండా నజరానాలు, కప్పాలు వస్తే చాలునన్నట్టు ప్రవర్తించాడు. మొత్తం రాజ్యంలో ఉన్న భూమిలో పదోవంతు తన సొంత ఖర్చులకోసం గా కెటాయించుకున్నాడు. అలా ప్రపంచంలోకెల్లా రెండో పెద్ద ధనవంతుడిగా పేరుమోశాడు. ప్రజల నెత్తుటితో పోగుపడిన ఆ సంపదలో నుంచి అప్పుడప్పుడు ఏవో కొన్ని మెతుకులు రాల్చినట్టు కొన్ని ప్రజోపయోగకర నిర్మాణాలు చేశాడు. ఆ నిర్మాణాలలో కూడ హైదరాబాదును మినహా మరే ప్రాంతాన్నీ పట్టించుకోలేదు. విశ్వవిద్యాలయాన్ని నిర్మించినప్పటికీ రాజ్యంలో నాలుగుశాతం నిరక్షరాస్యత ఉంటే, ప్రజలు తెలివిమీరి తన దౌర్జన్యపాలనను ఎదిరించకుండా ఉండాలని ప్రాథమికవిద్యావ్యాప్తి మీద ఆంక్షలు విధించాడు. బ్రిటిష్ వారు ఆనకట్టలు కట్టినట్టే ఇక్కడా ఆనకట్టలు కట్టి ఉండవచ్చు గాని, బ్రిటిష్ వారిలాగే ప్రజాచైతన్యవికాసం జరగకుండా కూడ ఆంక్షలు, నిర్బంధాలు, దమనకాండ కొనసాగించాడు. మొత్తం మీద ఆనాటి హైదరాబాదు రాజ్యప్రజలు ఎదుర్కొన్న భూస్వామ్య దోపిడీ పీడనలకు వనరూ పోషకుడూ అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ను ప్రజారంజకుడయిన ప్రభువుగా గుర్తించడం చరిత్రకే అవమానం.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in ParamarthaSatyam, Telangana, Telugu. Bookmark the permalink.

One Response to నిజాం పాలన రాజకీయార్థిక కోణాలు

 1. Balu Dasari says:

  Dear friends,

  Politicians are “OOSARAVELLULU”

  They are dirtiest people in the world. This the time for us to dig into the history and make a white paper so that we all refer. Even his statement provoke me to refer some of the sites to know more about Telangana.

  Friends, We should also a make forum exclusively for “Telangana Political Parties/Leaders” and request them to participate/express genuine thoughts not for the “vote bank” but for the “Social Affection”

  Balu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s