జేమ్స్ జాయిస్ నవల ‘యులిసెస్’ లో ఒక పాత్ర ‘చరిత్ర నేను మేల్కొనదలచుకున్న ఒక పీడకల’ అంటుంది. ‘చరిత్రంటే జనం అంగీకరించడానికి ఇష్టపడే మిథ్య’ అన్నాడట నెపోలియన్. ఇవాళ పీడకల అయిన చరిత్రనుంచి మేల్కొనడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ మిథ్య అయిన చరిత్రలోకి ప్రయాణిస్తున్నట్టున్నది.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు ఏ కారణంతో ఈ వివాదం రేకెత్తించారో, ఆ కారణం ఫలిస్తుందో లేదో తెలియదు గాని, చారానా దావత్ కూ బారానా టాంగా అన్నట్టు ఆ పావలా విందుకోసం ముప్పావలా ప్రయాణపు చర్చ జరుగుతున్నది. ఒక అనుచితపు మాటతో తెరాస నాయకులు మళ్లీ తెలంగాణను నలుగురినోళ్లలో నానేట్టు చేశారు. ఒక రాజకీయవాదికి చరిత్ర పరిజ్ఞానం ఉండాలని ఆశించడం అత్యాశ కావచ్చుగాని, ఒక రాజకీయవాది అనాలోచిత ప్రసంగం వల్లనైనా కొత చర్చ జరిగి కొన్ని నిజాలు బయటపడడం మంచిది. అసత్యాలు, అర్ధ సత్యాలు, అతిశయోక్తులు, వక్రీకరణలు, అవతలివాళ్లు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి రెండు మాటలు ఎక్కువ వేయాలనే ఔద్ధత్యాలు జరగవలసిన చర్చను పక్కదారి పట్టిస్తున్నాయి. తోటివాడు తొడ కోసుకుంటే తాను మెడ కోసుకున్నాడట అని చంద్రశేఖర రావు తరచు ఉటంకించే సామెత ఆయన విషయంలోనే నిజమవుతున్నట్టుంది.
ఈ సందర్భంలో చర్చకోసం నాలుగు అంశాలు చెప్పవలసి ఉంది.
ఒకటి, రాజకీయాలు మాట్లాడదలచుకున్నవాళ్ళు, నడపదలచుకున్నవాళ్లు మొట్ట మొదట గుర్తించవలసిన విషయమేమంటే రాజ్యవిధానం గురించిన చర్చలో రాజ్యనిర్వాహకుల వ్యక్తిగత మంచిచెడులకు ఎక్కువ స్థానం ఇవ్వడం సరయినది కాదు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ అనే వ్యక్తి సకల సద్గుణ సంపన్నుడయి ఉన్నప్పటికీ ఆయన అంచనా ఆయన నాయకత్వం వహించిన రాజ్యవిధానాలకూ ఆయన మంచితనానికీ ఉండే సంబంధం చాల తక్కువ. ఎప్పుడైనా రాజ్యవిధానాన్ని ఆ రాజ్యంలోని బలవత్తరమైన సామాజిక ఆర్థిక శక్తులే నిర్ణయిస్తాయి.
రెండు, మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనను సమర్థించడం ముస్లింలను సమర్థించడమో, వ్యతిరేకించడం ముస్లింలను వ్యతిరేకించడమో కాదు. నిజానికి ఆయన పాలనాకాలంలో అనల్ మలిక్ (ముస్లిమైన వాడు ప్రతివాడూ రాజే) అనే నినాదం వచ్చినా, ఆయన పాలనకూ సాధారణ ముస్లిం జీవితానికీ ఏమీ సంబంధం లేదు. ఆయన అటు క్రైస్తవులయిన బ్రిటిష్ వారికి నమ్మిన బంటుగా ఉన్నాడు. ఇటు ప్రధానంగా హిందువులయిన భూస్వాములను నమ్మిన బంట్లుగా పెట్టుకున్నాడు. ఆయన రాజ్యంలో అసంఖ్యాకులైన నిరుపేద ముస్లిముల జీవితాలలో ప్రసరించిన వెలుగేమీ లేదు. అది అన్ని సంపన్నవర్గాల పాలనల లాంటిదే. అది ప్రధానంగా మతరాజ్యం కాదు.
మూడు, ఉస్మాన్ అలీఖాన్ అందరు పాలకులలాంటి వాడే అయితే ఆయన మీద ప్రత్యేకమైన ద్వేషప్రచారం ఎందుకుజరిగింది అన్నది మరొక ప్రశ్న. ఆ ద్వేషప్రచారాన్ని సమర్థించడం ద్వారా సంఘపరివారానికో, 1956 తర్వాతి పాలకులకో మద్దతు ఇస్తున్నట్టు కాదా అని ముక్తాయింపు. సంఘపరివారం ఆయనను ముస్లిం అయినందుకు వ్యతిరేకిస్తుంది. ప్రజల వైపు నుంచి చూసేవారు ఆయన ముస్లిం అయినందుకుకాదు ప్రజాకంటక ప్రభువు అయినందుకు వ్యతిరేకిస్తారు. నిజానికి సంఘపరివారానికి హైదరాబాదు రాజ్యం గురించీ, ఉస్మాన్ అలీఖాన్ పాలన గురించీ మాట్లాడే అర్హతే లేదు.
ఇక 1956 తర్వాతి పాలకులలో మౌలికంగా ఉస్మాన్ అలీఖాన్ ను వ్యతిరేకించిన వారెవరూ లేరు. కాంగ్రెస్ 1947 నవంబర్ 29 న ఆయనతో యథాతథ ఒడంబడిక చేసుకుంది. పోలీసుచర్య పేరుతో సైనికచర్య జరిపి అటు కమ్యూనిస్టులనూ, ఇటు ముస్లిం ప్రజానీకాన్నీ ఊచకోత కోసిన నెహ్రూ – పటేల్ సైన్యాలు ఉస్మాన్ అలీఖాన్ ను ఏమీ అనలేదు సరిగదా, ప్రజల గోళ్లూడగొట్టి ఆయన సంపాదించిన ఆస్తిని కూడ స్వాధీనం చేసుకోలేదు. స్వాధీనం చేసుకున్న సర్ఫ్ ఎ ఖాస్ కు భారీ నష్టపరిహారం చెల్లించారు. 1956 దాకా ఆయనను రాజప్రముఖ్ గా కొనసాగించారు. చచ్చిపోయేదాకా ఏటేటా భారీగా ప్రజాధనం నుంచి భరణాన్ని చెల్లిస్తూనే వచ్చారు. ఇక తెలుగుదేశానికి చరిత్ర అవసరమే లేదు గనుక ఉస్మాన్ అలీఖాన్ మీద వైఖరే లేదు గాని ఆ పాలనా కాలంలో సరిగ్గా ఉస్మాన్ అలీఖాన్ కాలంలో లాగనే రాష్ట్రాన్ని దోచి హైదరాబాదులో తమ ప్రయోజనాలమీద ఖర్చు పెట్టడం జరిగింది. ఉస్మాన్ అలీఖాన్ ను బ్రిటిష్ పాలకులు సంభావించినట్టుగానే బహుళజాతిసంస్థలు తెలుగుదేశం ఏలికను విశ్వాసపాత్రుడైన స్నేహితుడుగా పిలిచాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఉస్మాన్ అలీఖాన్ పాలన ఇతర రూపాలలో ఇవాళ్టికీ కొనసాగుతున్నది.
నాలుగు, అన్ని పాపాలనూ ఏడవ నిజాం మీదికే తోయడం భావ్యమా అని మరొక ప్రశ్న. ఇంతకీ చరిత్రను ఎట్లా చదవాలి? మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాదు రాజ్య ప్రజలకు మిథ్యనా, పీడకలనా? జనరంజక ప్రభువా? ఏ రాజయినా ప్రజాకంటకుడే అని గుర్తించినందువల్లనే ప్రజలు రాజరికాలను కూలదోశారు. తమ ప్రతినిధులుగా పాలన సాగించడానికి ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఎన్నుకున్నారు. ఆ ప్రజాస్వామిక నేతలు కూడ రాజులకన్న ప్రజాకంటకంగా పాలిస్తున్నప్పుడు పాత రాజుల రోజులు బాగుండెనేమో, అప్పుడు కనీసం భూస్వామ్య సమాజంలోని దాతృత్వమైనా ఉండేదేమో అని అనిపించడం సహజమే. కాని అది కేవలం పోలిక మాత్రమే. ఉస్మాన్ అలీఖాన్ పాలనలో తెలంగాణకు 1956 తర్వాత కన్న ఎక్కువ మేలు జరిగింది అని ఎవరయినా అనుకోవచ్చు, ఆ వాదనను బలపరిచే గణాంకాలు, జీవన స్థితిగతులు కూడ చూపించవచ్చు. కాని ఆ పోలికలో చాల సమస్యలు ఉన్నాయి. వీటిలో ఒకటి రాచరికం, మరొకటి ప్రజాస్వామ్యం అనుకునేవాళ్లు ఆ రెంటినీ పోల్చడానికి వీల్లేదు. ‘గొర్లను తినేటోడు పోయి బర్లను తినేటోడు వచ్చిండు’ అన్నంతవరకే పోలిక. అంటే కనీసం పాతపాలకుడు గొర్లను తినేవాడని అయినా అంగీకరించాలి. కాని ఆ పోలిక స్థాయిని కూడ దాటిపోయి పాత పాలకుడు సాపేక్షికంగానే కాదు, నిరపేక్షంగా కూడ ప్రజారంజకుడు, అభివృద్ధి కాముకుడు అని పరవశంగా కీర్తించడం, ఒక్కసారికాదు వెయ్యిసార్లు కీర్తిస్తానని అనడం, ఊరూరా విగ్రహాలు పెట్టిస్తామని అనడం చరిత్రలో తాము ఎవరి పక్షాన ఉండదలచుకున్నరో చెప్పడమే.
‘ప్రాంతీయవాదం అంటేనే ఎన్నెన్నో అస్తిత్వాల సమాహారం. ప్రాంతీయ అస్తిత్వంలో మిళితమైపోయిన ఈ భిన్న అస్తిత్వాలు దేనికది ప్రాంతీయ ఉద్యమం తమ ఒక్కరిదే అనుకుంటాయి. ఆ నినాదాలు తమ ఒక్కరివే అనుకుంటాయి. ఆ ఉద్యమ ఫలితాలు తమ ఒక్కరికే అనుకుంటాయి. ఆ అన్ని కోర్కెలను, తోపులాటలను, ఆక్రమణలను సమన్వయించగలిగిన నాయకత్వం వచ్చినప్పుడే ప్రాంతీయ ఉద్యమం ముందుకుపోతుంది, లేకపోతే ప్రాంతీయ ఉద్యమం అనేది రణగొణధ్వనుల వేదిక అవుతుంది’ అన్నారు అర్థశాస్త్రవేత్త నిర్మల్ సేన్ గుప్తా.
నిజానికి ప్రాంతీయవాదపు బలమూ బలహీనతా అదే. ఈ ప్రాంతంలో పుట్టినవాళ్లందరూ గొప్పవాళ్లే, మంచివాళ్లే అని అది ఒక విశాలత్వాన్ని సాధించడానికి ప్రయత్నిస్తుంది. కాని ఆ విశాలత్వం కృత్రిమమైనది. ప్రజాబాహుళ్యానికి పునాది బాహుళ్యమే. అందువల్ల ప్రాంతీయ అస్తిత్వం ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను గుర్తిస్తూనే, వాటి పరిష్కారానికి పోరాడుతూనే, ఆ అస్తిత్వంలో ఇమిడి ఉన్న బాహుళ్యాన్ని గుర్తించి గౌరవించవలసి ఉంటుంది. ప్రాంతీయ అస్తిత్వం లోపల వర్గ, కుల, మత, స్త్రీ, పురుష, ఆదివాసి అస్తిత్వాలు ఉన్నాయి. నిజాంను గౌరవించాలనే చర్చ ఈ అస్తిత్వాలన్నిటినీ గౌరవించాలనే దగ్గర మొదలయి ఉంటే అది ప్రజల తెలంగాణ వైపు సాగేది.
నిజాంను కీర్తించడం ద్వారా తెలిసో తెలియకో తెరాస నాయకులు తమ ప్రయోజనాలు పాలకుల ప్రయోజనాలతో ముడిబడి ఉన్నాయని ప్రకటించుకున్నారు. అంటే ప్రజల తెలంగాణకూ పాలకుల తెలంగాణకూ పోటీ వస్తే పాలకుల తెలంగాణనే ఎంచుకుంటామని చూపుకున్నారు.
entha sepu addanga KCR ni vimatschinchadame na, positive emi ledha KCR speech lo??!! ayina Karimnagar lo 2+ alsk majority tho gelichaada? ante janalu pichollu antaava? telanagna okka kcr dhi kaadhu… migatha party laki,leaders ki leni responsiblity kcr thisukunnadhukena ii thittlu?? NIMS,Nizam college,Osmania,Assmebly,salarjaung,highcourt…etc bulit by Nizams, wats wrong in praise them… even Indira introduced Emergnecy n jailed many gud leaders n media,still Indira is Goddess…Indira peru tho Pathakaalu…
Nizam vishayam lo okasari history ni clear ga study chesi raasthe baguntundhi.. there r many websites ..pls chek n speak… why KCR said like that, aftrall he is a polytician he can say anything,but people r there to decide,so dont be stupid about separate telangana..