చెరకు రైతుల బతుకు చేదు

వరి మద్దతుధర గురించి ఆందోళనలకు పరిష్కారం దొరకకముందే చెరకు ధర గురించి రైతుల ఆందోళన మొదలు కాబోతున్నది. ఇప్పటికే జహీరాబాద్ ప్రాంతానికి చెందిన చెరకు రైతు దశరథ్ గత సంవత్సరం కర్మాగారానికి తోలిన చెరకుకు ఇప్పటికీ చెల్లింపులు జరగక ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యేకించి చెరకు రైతుల సమస్యల గురించి, మొత్తంగా రైతాంగ సమస్యల గురించి పాలకుల దృష్టికి తేవడం కోసం డి వసంత్ కుమార్ జహీరాబాద్ నుంచి ఢిల్లీ దాకా పాదయత్ర జరిపి అక్కడ అన్ని రాజకీయ పక్ష నేతల కళ్లూ చెవులూ తెరిపించడానికి విఫలప్రయత్నం చేసి తిరిగివచ్చాడు.

ఆహారధాన్యాలు పండించే రైతులకన్న వాణిజ్యపంటల రైతుల పరిస్థితి కొంత మెరుగు అని ఒక భ్ర్రమ గతంలో చాలమంది పరిశీలకులకు ఉండేది గాని ఇప్పుడు ఆ స్థితి కూడ మారుతున్నట్టున్నది. పాలకవిధానాలు మొత్తంగానే వ్యవసాయ రంగాన్ని చిన్నచూపు చూస్తుండడంవల్ల, అన్ని పంటలపట్ల, అసలు మొత్తంగా గ్రామీణుల పట్ల, రైతుల పట్ల ఒకేరకమైన నిర్లక్ష్యం కనబడుతున్నట్టున్నది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడిక చెరకు రైతుల ఆత్మహత్యలకు కూడ రంగం సిద్ధమవుతున్నట్టుంది.

ఇప్పటికీ డెబ్బై శాతం మందికి జీవనోపాధిని కల్పిస్తున్న, ఈ దేశ జీవన విధానంగా ఉన్న వ్యవసాయ రంగంలో, ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం అమలవుతున్న విధానాలను స్థూలంగా పరిశీలించినా అసలు ఈ దేశ పాలకులు ప్రజలకు ఎంత దూరంగా ఉన్నారో, కొనసాగుతున్న రాజకీయార్థిక విధానాలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో అర్థమవుతుంది.
వ్యవసాయం గిట్టుబాటు కావడం కొరకు, సమాజ మనుగడకు అత్యవసరమైన వ్యవసాయరంగంనుంచి రైతులు బయటికి రాకుండా చూడడం కొరకు ప్రభుత్వాలు చాల కాలంగా కనీస మద్దతు ధర నిర్ణయించడం అనే పద్ధతిని అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం 26 వ్యవసాయోత్పత్తులకు ఈ కనీస మద్దతు ధర ప్రకటన ఉంది. మొత్తం పంట విస్తీర్ణం, దిగుబడి, గిరాకీ, ఉత్పాదకాల ధరలు, మొత్తంగా ఉత్పత్తివ్యయం, ద్రవ్యోల్బణం వంటి అనేక ప్రాతిపదికల మీద ఆధారపడి ఈ కనీస మద్దతు ధర ఏ ఏడాదికి ఆ ఏడాది నిర్ణయమవుతుంది. మార్కెట్ ధరలు ఈ కనీస మద్దతు ధరకు అటూ ఇటూగా ఉంటాయి.

ఈ కనీస మద్దతుధర నిర్ణయం వరకూ మొక్కుబడిగా ఇప్పటికీ అమలవుతున్నది గాని, ప్రపంచీకరణ క్రమం మొదలయినప్పటి నుంచీ ఇటువంటి ప్రభుత్వ జోక్యం వద్దనీ, అన్నిటినీ మార్కెట్ శక్తులకు వదిలేయాలని ఆధిపత్య భావజాలం చెపుతున్నది.

అది అలా ఉంచినా కనీసమద్దతుధర విషయంలో రెండు సమస్యలున్నాయి. ఒకటి, ప్రభుత్వం ఈ కనీసమద్దతుధరలను నిర్ణయించేటప్పుడు హేతుబద్ధమైన పద్ధతి పాటించడంలేదు. ఉత్పాదకాల వ్యయాన్ని, ద్రవ్యోల్బణాన్ని సరిగా అంచనా కట్టడం లేదు. అందువల్ల ఉత్పాదకాల వ్యయం విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరలో అందుకు సమానమైన పెరుగుదల ఉండడం లేదు. రెండు, అసలు దేశవ్యాప్తంగా గాని, ఒకే రాష్ట్రంలో గాని ఒకే రకమైన మద్దతు ధర ప్రకటించడమనేది, అన్ని ప్రాంతాలనూ సమానంగా చూడడమనేది న్యాయబద్ధమైన చర్యకాదు. మన రాష్ట్రం విషయానికే వస్తే, ప్రజాధనాన్ని ఉపయోగించి ప్రభుత్వమే నీటిపారుదల సౌకర్యాలు కల్పించిన కోస్తా ప్రాంతానికీ, స్వయంగా రైతులు తామే నీటిపారుదల సౌకర్యం కలిగించుకోవలసిన తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకూ మధ్య ఉత్పత్తి వ్యయంలో విపరీతమైన తేడా ఉంటుంది. ఆ తేడాను పరిగణనలోకి తీసుకోకుండా మద్దతుధరను ఒకే రకంగా నిర్ణయిస్తే అది ఒకప్రాంత రైతులకు గిట్టుబాటుగా ఉంటే మరొక ప్రాంత రైతులకు నష్టదాయకంగా ఉంటుంది.

చెరకు విషయానికి వచ్చేసరికి కేంద్రప్రభుత్వం కనీసమద్దతుధర నిర్ణయించేటప్పుడు వినియోగదారులను దృష్టిలో పెట్టుకోవాలి అనే ఒక కొత్త వాదన ముందుకుతెస్తోంది. నిజంగా వినియోగదారు మీద ఎక్కువభారం పడకుండా చూడడం ప్రభుత్వ బాధ్యతే కాని అందుకొరకు రైతు కడుపుమీద కొట్టనక్కరలేదు. అసలు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి చెరకు నుంచి చక్కెర దిగుబడిని పెంచగలిగినా, మధ్య దళారీల పాత్ర తగ్గించగలిగినా, చక్కెర కర్మాగారాల యజమానుల, చక్కెర వ్యాపారుల లాభార్జనా అత్యాశను తగ్గించగలిగినా వినియోగదారుల ప్రయోజనాలు నెరవేరుతాయి. నిజానికి చెరకు రైతు ప్రయోజనాలకు, చక్కెర వినియోగదారుల ప్రయోజనాలకు మధ్య పూడ్చరాని అఖాతమేమీ లేదు. కాని ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు ఈ రెండు సమూహాలను ఒకదానికి ఎదురుగా మరొకదాన్ని నిలిపి పబ్బం గడుపుకుంటున్నాయి.

చెరకు మద్దతు ధరలో ప్రభుత్వం గతసంవత్సరం క్వింటాలుకు 75 పైసలు, ఈ సంవత్సరం 90 పైసలు పెంచిందంటే, క్వింటాలు చెరకు నుంచి సగటున పదికిలోలు చక్కెర వస్తుందనుకుంటే, కిలో చక్కెర మీద రైతు ఆదాయంలో పెరుగుదల పది పైసల లోపే అనుకోవాలి. మరి చక్కెర ధరలో రూపాయలకొద్దీ పెరుగుదల ఉండగా పెరిగిపోతున్న చక్కెరధర ఎక్కడికిపోతున్నట్టు? రైతుల ప్రయోజనాలను బలిపెట్టి సాధించిన వినియోగదారుల ప్రయోజనాలు ఏమయినట్టు?

ఇందులో రాష్ట్రప్రభుత్వ జోక్యం కూడా ఉంది. రాష్ట్ర సలహా ధర అనే పద్ధతి ఒకటి ఉందిగాని, ఆ ధర నిర్ణయంలోకూడ ఎంతమాత్రం శాస్త్రీయ, హేతుబద్ధ పద్ధతి లేదు.

ఇక చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు చెరకు రైతాంగం మీద సాగిస్తున్న అక్రమాలకు అంతులేదు. కేన్ డెవలప్ మెంట్ కౌన్సిల్ అనే ప్రజాస్వామిక సంస్థల అధ్వర్యంలోనే కర్మాగారాల పనితీరు నడవాలి గాని ఆ సంస్థలకు ఎన్నికలు లేవు. యాజమాన్యాల, ప్రభుత్వాల, అధికార పార్టీల నామినేటెడ్ ప్రతినిధులతో అవి ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. అందువల్ల యాజమాన్యాల ప్రయోజనాలకు, రైతుల ప్రయోజనాలకు వైరుధ్యం వచ్చినప్పుడల్లా యాజమాన్యాలదే పైచేయి అవుతున్నది.

ఒక్కొక్క చక్కెర కర్మాగారం ఎంత చెరకును క్రష్ చేయగలదు, ఒక కర్మాగారం పరిధిలో ఎంత చెరకును పండించడం సముచితం అనే విషయాలు శాస్త్రీయంగా లెక్కకట్టడానికి వీలు ఉన్నప్పటికీ, ఎక్కువ ప్రాంతంలో పండించమని రైతులను ప్రోత్సహించడానికి, ఒప్పందంలేకుండా పండించిన చెరకును కొనడానికి కర్మాగారాలు ఉత్సాహం చూపుతున్నాయి. చెరకు సాగు, రైతుల సమస్యలు అర్థం కూడా కాని పరిశ్రమల శాఖ పరిధిలోకి వస్తుంది గాని వ్యవసాయ శాఖ కిందికి రాదు. పొగాకు, పత్తి, కాఫీ, సుగంధద్రవ్యాలు మొదలయిన వాణిజ్య పంటలకు ఉన్నట్టుగా చెరకుకు ఒక స్వతంత్ర సంస్థకూడాలేదు.

ఇలా ‘అరయంగా కర్ణుడీల్గెనార్గురిచేతన్..’ అన్నట్టు చెరకు రైతులు అప్పులబారిన పడి ఆత్మహత్యలే పరిష్కారమనుకునే స్థితి ఏర్పడుతోంది. ఇది ఒక్క చెరకు రైతుల సమస్యమాత్రమే కాదు. దేశంలో వ్యవసాయరంగంలో ఉన్నవారందరి సమస్య ఇదే. గత పది సంవత్సరాలలో లక్షన్నర మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే మన నోటిదగ్గరి ముద్దలో మెతుకు మెతుకు మీదా ఎంత నెత్తురు అంటి ఉన్నట్టు? ఆ నెత్తురుమరక తుడిచేయడానికి మనం ఏంచేస్తున్నామని ప్రశ్నించుకోవడం మన బాధ్యత.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in ParamarthaSatyam, Telugu. Bookmark the permalink.

One Response to చెరకు రైతుల బతుకు చేదు

  1. Krishna Kishore says:

    Thanks for a very good post. To ans Ur ques about what we are/were doing, please check out an excellent post on ‘TeluguVadini’ blog :

    రైతుల ఆత్మహత్యలపై నా అంతఃసంఘర్షణ, తదుపరి కార్యాచరణ ప్రణాళిక – ఓ రైతుబిడ్డగా

    We need to start some where with some plan then it’s our responsibility to shape it to the best.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s