ఎంత గొప్ప ప్రణాళిక!

పదకొండవ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను జాతీయ అభివృద్ధి మండలి ఎట్టకేలకు బుధవారం నాడు ఆమోదించింది. నూతన ఆర్థిక విధానాల తర్వాత అసలు మన రాజకీయార్థిక పాలనా విధానాలలో ప్రణాళికల పద్ధతే నిర్లక్ష్యానికి గురవుతున్నది గనుక, ప్రణాళికలలో ఏమి రాసినా వాటిని పాటించడం లేదు గనుక ఈ ఆమోదాన్ని ‘ఎట్టకేల’కు అనవలసి వస్తున్నది. అంతేకాదు, ఈ పదకొండవ పంచవర్ష ప్రణాళిక ముసాయిదా మీద కసరత్తు చాల రోజులుగా సాగుతున్నది, ఒక నెల కిందనే కేంద్ర మంత్రివర్గం దీన్ని ఆమోదించింది, ఇప్పుడిక జాతీయ అభివృద్ధి మండలి దీన్ని ఆమోదించడం శుష్కమైన తంతు మాత్రమే. ఈ మొక్కుబడి ఆమోదాన్ని పొందిన ప్రణాళికను కూడ ప్రజల వైపు నుంచి లోతుగా పరిశీలించడం, అది ప్రజలను ఎట్లా మోసం చేయబోతున్నదో వివరించడం అవసరం.

నిజానికి వలసపాలన అనంతరం ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానాన్ని ప్రారంభించినపుడు ఈదేశ పాలకులకు కొన్ని ఆదర్శాలైనా ఉన్నాయి. ప్రజల అవసరాలు తీర్చగల శక్తి ప్రభుత్వానికి ఉంటుందని, ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం దేశంలో ఉన్న వనరులేమిటో, ప్రజల అవసరాలేమిటో అంచనావేసి, ఆ అవసరాలను తీర్చడానికే అన్ని సన్నాహాలు చేయవలసి ఉంటుందని ఆరోజున భావించారు. ఒకరకంగా రాజ్యాంగ లక్ష్యాలయిన సామాజిక న్యాయాన్ని, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వాన్ని సాధించడం ప్రణాళికాబద్ధ ప్రగతి ద్వారా సాధ్యమవుతుందని ఆశించారు. అప్పటికే సోవియట్ యూనియన్ లో అమలవుతున్న పంచవర్ష ప్రణాళికల ద్వారా సాధించిన అద్భుతమైన ప్రగతిని చూసి, అదేరకమైన ప్రగతిని ఇక్కడ కూడ సాధించవచ్చుననుకున్నారు.

అలా 1951లో మొదలయిన పంచవర్షప్రణాళికలు ఆశించిన లక్ష్యాలను సాధించకుండానే ఇప్పటికి పది విడతలుగా సాగిపోయాయి. ఈ మధ్యలో ఏడాదికేడాదికి మార్చిన ప్రణాళికలు, నాలుగో సంవత్సరంలో ప్రభుత్వం మారినందువల్ల ముగిసిపోయిన పంచవర్ష ప్రణాళికలు ప్రణాళికాబద్ధ విధానాన్ని ఒక ప్రహసనంగా మార్చివేశాయి. అందువల్ల ప్రస్తుతం పన్నెండో ప్రణాళిక నడుస్తుండవలసి ఉండగా దాని స్థానంలో పదకొండో ప్రణాళిక మొదలవుతున్నది. అదికూడ 2007-12 పంచవర్ష ప్రణాళిక, 2007-08 ఆర్థిక సంవత్సరం సగం గడిచిపోయిన తర్వాత ఆమోదం పొందిందంటే మన పాలకులకు ఈ ప్రణాళికలపట్ల ఎంత శ్రద్ధ ఉన్నదో అర్థమవుతుంది.

ఈలోగా ప్రణాళికా బద్ధ ఆర్థిక విధానమన్నా, ప్రభుత్వ రంగం అన్నా సోషలిజం అవశేషాలనీ, వాటిని వదుల్చుకోవాలని ప్రైవేటురంగ ప్రముఖులు, పెట్టుబడిదారీ అర్థశాస్త్రవేత్తలు పాలకులకు సలహాలు ఇస్తూ వచ్చారు. సోవియట్ యూనియన్ పతనమై, బహుళజాతిసంస్థల నాయకత్వాన ప్రపంచీకరణ కొత్త దశ మొదలయిన తర్వాత ఆ సలహాల ఉధృతి మరింత పెరిగి ప్రణాళికాబద్ధ ఆర్థికవిధానం ఒక అవమానకరమైన మాట అయిపోయింది. అందువల్లనే ఎనిమిదోప్రణాళిక (1990-95) కాలం నుంచీ కూడ పేరుకు ప్రణాళికా రచన జరగడం, సమాజం ముందర కొన్ని లక్ష్యాలు నిర్ధారించడం, చివరికి ఆ లక్ష్యాలలో సంపన్నులకు ఉపయోగపడేవాటిని మాత్రం సాధించడం, ప్రజలకు ఉపయోగపడే, ప్రజాజీవనాన్ని మెరుగుపరిచే లక్ష్యాలను నిర్లక్ష్యం చేయడం జరుగుతూనే ఉంది.

ఇక పదకొండో ప్రణాళికా కాలానికి వచ్చేసరికి, అసలు ప్రణాళిక అనేమాటే గిట్టని, సమానత్వం పొడే సహించని, అన్నిటినీ మార్కెట్ శక్తులే శాసించాలని కోరుకునే ప్రపంచబ్యాంకు సేవకుడు మోంటెక్ సింగ్ అహ్లువాలియా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడయ్యాడు.

అందుకే ‘త్వరితమైన, సమ్మిళితమైన అభివృద్ధి దిశగా’ అనే పేరుతో వెలువడిన పదకొండో ప్రణాళిక ప్రతిపాదనాపత్రం చాల గంభీరమైన ప్రవచనాలు చేసినప్పటికీ, సంపన్నులకోసం త్వరితమైన అభివృద్ధిని సాధించాలని, ఇప్పటివరకూ అభివృద్ధి ఫలాలు అందని అన్ని వర్గాలనూ సమ్మిళితం చేస్తాననే ఆశ చూపుతూ, అన్ని వర్గాల సమ్మతిని కూడగట్టే ప్రయత్నం చేయాలని ప్రయత్నిస్తోంది. ఆ ప్రాతిపదిక పత్రంలోని ఉదాత్త లక్ష్యాలు, ప్రజానుకూలమనిపించే లక్ష్యాలు అన్నీ గాలికిపోయి, ఇప్పుడు జాతీయ అభివృద్ధి మండలి ద్వారా బయటపడిన ప్రణాళికలో అంకెల గారడీలు, బహుళజాతిసంస్థలకు ఇబ్బడిముబ్బడిగా లాభాలు సమకూర్చిపెట్టే పథకాలు, ఈ దేశ సంపన్నుల అవసరాలు తీర్చే మార్గాలు మాత్రం కనబడుతున్నాయి.

ఈ ప్రణాళిక జాతీయోత్పత్తిలో ఎనిమిది శాతం అభివృద్ధిని సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నదని చెపుతున్నారు. అయితే సమస్య జాతీయోత్పత్తి అభివృద్ధి ఎనిమిది శాతమా పది శాతమా అని కాదు, పెరుగుతున్న జాతీయోత్పత్తి సమానంగా పంపిణీ అవుతున్నదా లేదా, దేశ ప్రజలందరికీ కనీస అవసరాలు తీరుస్తున్నదా లేదా అని. ఆ ప్రశ్నలే వేసుకోకుండా అంతకంతకూ ఎక్కువ అభివృద్ధి సాధించాలని, అలా అభివృద్ధి సాధిస్తూ పోతే అది ఎప్పటికో ఒకప్పటికి కిందికి బొట్లుబొట్లుగా జారి పేదప్రజలకు అందుతుందని అరవై సంవత్సరాలుగా స్వతంత్రభారత పాలకులు చెపుతూనే ఉన్నారు. ఆ బొట్లు కిందికి జారిందీ లేదు, ప్రజలకు అందిందీ లేదు. పది ప్రణాళికలు విజయవంతమైన తర్వాత ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇంకా దేశంలో మూడో వంతు జనాభా పేదరికంలో ఉన్నారు. పనిచేయగల జనాభాలో సగం నిరుద్యోగంలోనో, అల్పోద్యోగంలోనో ఉన్నారు. ప్రణాళికలు పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తగ్గించే ప్రత్యేక చర్యల గురించి చేసిందేమీలేదు. ఈ పదకొండో ప్రణాళికా అంతే.

వ్యవసాయం, ఆరోగ్యం, నీటిపారుదల రంగాలపై పెట్టుబడులు పెరగాలని, గ్రామీణ – పట్టణ ప్రాంతాల మధ్య అంతరాల్ని తగ్గించాలని, పేదరికాన్ని తగ్గించాలని, నాణ్యమైన విద్యను అందించాలని, వలసలను తగ్గించాలని ప్రణాళికా పత్రం గంభీరమైన, భారీ జనాకర్షక వాగ్దానాలు చాలా చేసింది. ఇవన్నీ వినడానికి చాల బాగుంటాయి. ఇవి వినగానే ప్రభుత్వం ప్రజలకు ఏదో ఒరగబెడుతోందని అనిపిస్తుంది. కాని నిజంగా ఈ మాటలను విశ్లేషించి చూస్తే వాటి అసలు రంగు తెలుస్తుంది. మొత్తం ప్రణాళికా వ్యయం రు. 36,44,718 కోట్లు. దానిలో విద్యారంగానికి 20 శాతం అంటే రు. 7,28,943 కోట్లు కేటాయించినట్టు ప్రకటిస్తున్నారు. అంటే సాలీనా రు 1,65,788 కోట్లు అన్నమాట. దీన్ని రాష్ట్రాలకు విభజిస్తే సగటున ఒక్కొక్క రాష్ట్రానికి రు. 6,000 కోట్ల కన్న ఎక్కువ రావు. దీన్ని విద్యార్థుల సంఖ్యతో విభజిస్తే ప్రతివిద్యార్థి చేతికి అందేది కొన్ని వేలకు మించదు. వాటితో ఎంత నాణ్యమైన విద్య అందుతుందో చెప్పనక్కరలేదు. ఆ నిధులు సక్రమంగా వచ్చినా అవి ఉన్న వసతులను నిర్వహించడానికే సరిపోతాయి గాని కొత్త వసతులు కల్పించడానికి పనికిరావు. అంటే వెరసి అంత గొప్పగా కనబడుతున్న అంకెలు వాస్తవరూపం ధరించేసరికి హళ్లికి హళ్లి సున్నకు సున్న అవుతాయన్నమాట. వ్యవసాయం, నీటిపారుదల, వైద్యం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల కేటాయింపుల కథా ఇంతే.

మరొక పక్క దేశ విద్యుత్తు అవసరాలు తీర్చడానికి అణుశక్తి అత్యవసరమని, అందువల్ల భారత – అమెరికన్ అణు ఒప్పందం అనివార్యమని ఈ ప్రణాళికా పత్రమే పేర్కొంటున్నది. సబ్సిడీలు ఇవ్వనక్కరలేదని ఈ ప్రణాళిక విడుదల సందర్భంగా ప్రధానమంత్రి అన్నారు. ప్రజాపంపిణీ విధానం, చౌకధరల దుకాణాలు తలకు మించిన భారం అయిపోయాయని ఆర్థిక మంత్రి అన్నారు. అంటే పైన చెప్పిన ఆదర్శాలన్నీ అబద్ధం. ఈ మాటలే నిజం.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in ParamarthaSatyam, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s