ఇక రవాణా ధనయజ్ఞం !

‘బస్సుచక్రం ప్రజాప్రగతికి చిహ్నం’ అనే మాట చూడని వారెవరూ మన రాష్ట్రంలో ఉండరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడిపే బస్సులమీద ఉండే ఆ సంస్థ చిహ్నంలో ఈమాట ఉంటుంది. ఈ సంస్థ 1950 రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ఆక్ట్ ప్రకారం 1958 జనవరి 11 న పుట్టింది. ఇంకొక రెండువారాల్లో యాభయవ పడిలో పడబోతున్న ఈ సంస్థ తాను ఎందుకు పుట్టానో మరిచిపోతున్నట్టుంది. దాని పుట్టుకకు కారణమైన చట్టం ప్రయాణికుల రవాణా బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని పేర్కొనగా, ప్రస్తుతం ఆర్టీసీ మాత్రం ఆ బాధ్యతను ఎట్లా వదిలించుకుందామా అని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ లక్ష్యాల తారుమారు ఆర్టీసీ దగ్గర మాత్రమే మొదలు కాలేదు. కేంద్రస్థాయిలోనే 1980లలో బస్సుల నిర్మాణకంపెనీలు రవాణాను ప్రభుత్వ రంగం నుంచి తప్పించాలని ఒత్తిడి మొదలుపెట్టి 1988లో మోటారువాహనాల చట్టానికి సవరణ తెచ్చేలా చూశాయి. ప్రైవేటు వాహనాలకు అన్ని మార్గాలలోనూ అనుమతి ఇవ్వాలని, ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల పోటీలోనే ప్రజలకు మేలయిన రవాణాసేవలు అందుతాయని కొత్త భాష్యాలు మొదలయ్యాయి. ఈలోగా 1990లలో మన రాజకీయార్థిక విధానాలను ప్రపంచబ్యాంకు నేరుగా శాసించడం మొదలయింది. ఆ క్రమంలోనే వాదనలు ముందుకుసాగి మొదట లాభాలు వచ్చే రూట్లన్నీ ప్రైవేటు రంగానికి, నష్టాలు వచ్చే రూట్లన్నీ ప్రభుత్వ రంగానికి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత నష్టాలు వచ్చే రూట్లలో, అంటే ప్రధానంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల రూట్లలో, బస్సులు నడపడం దండగ అనీ, అందువల్ల ఆ బస్సులు రద్దుచేసి, అక్కడి డిపోలను కూడ రద్దు చేయాలని, ఆ తర్వాత ఉద్యోగులను తొలగించడమో, ఖాళీ అయిన స్థానాలను నింపకపోవడమో చేయాలని ఒకదాని తర్వాత ఒకటి ఆదేశాలు, చర్యలు జరుగుతూ వచ్చాయి.

అందువల్లనే అధికారిక చిహ్నంలో ఏమి రాసుకున్నప్పటికీ, గత రెండు దశాబ్దాలుగా పాలకుల దృష్టిలోనూ, ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలోనూ ప్రజా ప్రగతి అంటే నిర్వచనం మారిపోయింది. ప్రస్తుతం వారి దృష్టిలో ప్రజలు అంటే ప్రైవేటు బస్సు యజమానులు. వారికి లాభాలు చేకూర్చి, వారి ప్రగతి సాధించడమే ఆర్టీసీపని. ఆ పనిలో తమ బస్సు చక్రాల గాలి తామే తీసుకునే దివాళాకోరువిధానాలకు పాలకులు, ఆర్టీసీ యాజమాన్యం సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ యాజమాన్యం కొత్తగా 1500 బస్సులు అద్దెకు తీసుకోవాలని నిర్ణయించి, టెండర్లు పిలవడం, ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆందోళనకు దిగడం ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి.
పది సంవత్సరాల కింద ప్రపంచబ్యాంకు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ – ఎజెండా ఫర్ ఎకనమిక్ రిఫార్మ్స్ పత్రంలోనూ, ఆ తర్వాత కుదిరిన ఒప్పందాలలోనూ ఆర్టీసీని ప్రైవేటీకరించాలని బహిరంగంగానే ఆదేశించారు. కాకపోతే ఆర్టీసీని ప్రైవేటీకరించడం అంటే రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా కార్మికుల కుటుంబాలను వీథులపాలు చేయడం అవుతుంది గనుక, రాజకీయంగా సున్నితమైన చర్య గనుక ఆపని జాగ్రత్తగా చేయాలని ప్రపంచబ్యాంకు సన్నాయినొక్కు నొక్కింది. తత్ఫలితంగానే గత పది సంవత్సరాలుగా ఆర్టీసీలో అనేక ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధపడుతున్న తక్షణ కారణమైన అద్దె బస్సుల ప్రవేశం ఆ పనుల్లో ఒకటే.

ఆర్టీసీ సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు ప్రైవేటు బస్సు యజమానులనుంచి బస్సులను అద్దెకు తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించడం ఇరవై ఏళ్లకింద మొదలయింది. నిజానికి మెరుగైన సేవలకోసం ఎక్కువ బస్సులు కావాలంటే ఆర్టీసేయే కొత్త బస్సులు కొనుక్కోవచ్చు, లేదా ప్రభుత్వం రాయితీలు ఇచ్చి, రుణం ఇచ్చి బస్సులు కొనిపించవచ్చు. కాని ప్రైవేటు బస్సు యజమానులకు, బస్సుల తయారీదారులకు, వాహనాల ఫైనాన్సింగ్ సంస్థలకు లాభాలు సమకూర్చడం కోసం పాలకులు ఈ విధానం మొదలుపెట్టారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించడం అనే ప్రకటితలక్ష్యం పైకి చూడడానికి చాల ఉదాత్తంగా కనబడుతుంది గాని, దాని వెనుక ఉన్న కారణాలు చూడాలి. రాష్ట్రంలో ప్రైవేటు రవాణాసంస్థలను ఏర్పాటు చేసుకున్న కోస్తాంధ్ర భూస్వాములకు, రాయలసీమ ముఠానేతలకు లాభాలు చేకూర్చి పెట్టడం ఈ విధానపు అసలు లక్ష్యం. ఈ రవాణా ధనయజ్ఞం 1980లలో మొదలై 1990లతర్వాత ప్రపంచబ్యాంకు ఆదేశాలతో మరింత వేగం పుంజుకుంది. ఈ రవాణా ధనయజ్ఞ లబ్ధిదారులకు రాజకీయ పార్టీల పట్టింపులు కూడ ఏమీలేవు, వీరిలో రెండు ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన వారూ ఉన్నారు. అలా 1990-91లో కేవలం 244 (మొత్తంలో 2 శాతం) ఉన్న అద్దె బస్సులు 2001-02 నాటికి 1557 (మొత్తంలో 8 శాతం) కు చేరాయి, ప్రస్తుతం అవి 2,300 (12 శాతం) అని, ఇప్పుడు టెండర్లు పిలిచిన 1500 కూడ వస్తే అవి ఇరవై శాతం దాటిపోతాయని ఒక అంచనా.

ప్రస్తుతం ఆర్టీసీ దగ్గర దాదాపు పందొమ్మిదివేల బస్సులు ఉన్నాయి. కాని వాటిలో కనీసం ఆరేడువేల బస్సులు మరమ్మత్తుల అవసరం తోనో, పాతబడిపోయో పనికిరాకుండా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు పాతవాటి స్థానంలో కొత్త బస్సులు ఆరువేలు కొనవలసి ఉంటుందని చెప్పవచ్చు. కాగా పెరుగుతున్న జనాభా రవాణా అవసరాల కోసం ప్రతిఏటా ఆర్టీసీ కొత్త బస్సులు కొనవలసి ఉంటుంది. కొత్త బస్సులు కొనడం అంటే ఆ మేరకు డిపోల సంఖ్యను, గారేజీల సంఖ్యను, షెడ్ల, వర్క్ షాపుల సంఖ్యను పెంచవలసి ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రవాణా సంస్థలలో ఉన్న నిష్పత్తి ప్రకారం చూసినా ప్రతి బస్సుకు ఏడుగురు ఉద్యోగులను (డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్లు, మెకానిక్ లు) కొత్తగా పనిలోకి తీసుకోవలసి ఉంటుంది. అవన్నీ ప్రభుత్వోద్యోగాలు కాబట్టి అందులో తప్పనిసరిగా దళితులకు, ఆదివాసులకు, వెనుకబడిన కులాలకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించవలసి ఉంటుంది. అంటే ప్రస్తుతం ప్రభుత్వం కొత్తగా అద్దెకు తీసుకోదలచిన బస్సుల సంఖ్యనే చూసినా కనీసం పదివేల కొత్త ఉద్యోగకల్పన జరగవలసి ఉంటుంది, అందులో కనీసం ఐదువేల ఉద్యోగాలు వెనుకబడిన వర్గాలకు ఇవ్వవలసి ఉంటుంది. ఆర్టీసీలో కార్మిక సంఘాల ప్రాబల్యం హెచ్చుగానే ఉంది గనుక అమేరకు కార్మిక ఉద్యమం కూడ పెరుగుతుంది. ఈ అన్ని ‘బెడదల’నుంచి తప్పించుకునేందుకు, ఆర్టీసీ యాజమాన్యం, పాలకులు, తమకు ఏ బాదరబందీ లేకుండా ఎవరో బయటివాళ్లు బస్సును అప్పజెపితే సరిపోతుందని, వారికి ప్రతిఫలం చెల్లిస్తామని తలపోశారు. అయితే వారికి చెల్లించబోయే ప్రతిఫలం ప్రజాధనం నుంచి దోచిపెట్టడమే. బస్సు కొని, అదికూడ చేతిలోంచి డబ్బు పెట్టకుండా ఫైనాన్స్ మీద కొని, ఒక కండక్టర్ ను మాత్రం నియమించినందుకు ఇవ్వవలసినదానికన్న చాల ఎక్కువ ఇస్తారన్నమాట. కొంతకాలంతర్వాత ఆ ప్రైవేటు బస్సు యజమానులు మరింతగా బలపడి ఆర్టీసీని కూడ తమకు అమ్మమని అడిగే స్థితికి వస్తారు.

అలా ప్రైవేటు బస్సు యజమానుల ప్రయోజనాలు, బస్సుల నిర్మాణ సంస్థల ప్రయోజనాలు, పాలకుల ప్రయోజనాలు, ప్రపంచబ్యాంకు ఆదేశాలు కలగలిసిపోయి, మన రాష్ట్రంలో అద్దె బస్సుల విస్తరణ పెరుగుతోంది. ఆ క్రమంలో ప్రజాసేవ లక్ష్యాలు శిథిలమవుతున్నాయి. ప్రజాధనం దోపిడీ అవుతోంది. ఈ పరిణామాన్ని ప్రస్తుతం కార్మికులు వ్యతిరేకిస్తున్నారంటే అదేదో వారి సమస్య మాత్రమే కాదు, నిజానికి వారికన్న ఎక్కువగా సమస్య మనందరిదీ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థదీ, ఆంధ్రప్రదేశ్ సమాజానిదీ. అది గుర్తించి అద్దెబస్సులను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ కార్మికులు జనవరి 3 నుంచి చేపట్టనున్న ఆందోళనకు విస్తృత ప్రజా సహకారం అందించవలసి ఉంది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in ParamarthaSatyam, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s