సెజ్ ల రద్దులో గోవా దారి

ప్రత్యేక ఆర్థిక మండలాలను రద్దుచేస్తూ, తన పరిధిలో ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయబోనంటూ గోవా రాష్ట్రప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. ఈ విషయంలో గోవా రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ప్రజల ఒత్తిడివల్ల తీసుకోక తప్పని నిర్ణయం, ఒక ఆశావహమైన మార్పుకు సంకేతంగా ఉంది.

గోవా మూవ్ మెంట్ అగెనెస్ట్ సెజ్ (జి ఎం ఎ ఎస్) అనే విభిన్న సంస్థల, రాజకీయ పక్షాల ఐక్య సంఘటన గత కొద్ది కాలంగా చేస్తున్న ఆందోళన ఫలించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఈ ఐక్య సంఘటనలో భారతీయ జనతాపార్టీ, గోవా సురాజ్ పార్టీ వంటి రాజకీయపక్షాలతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి. ఈ ఐక్యసంఘటనతోపాటే చర్చి సంస్థలకు అనుబంధంగా ఉన్న ఆక్షన్ ఫర్ సోషల్ జస్టిస్ అనే సంస్థ, గోవా బచావ్ అభియాన్ అనే సంస్థకూడ గోవా నుంచి ప్రత్యేక ఆర్థిక మండలాలను పూర్తిగా రద్దుచేయాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి.

కొంతకాలంగా సాగుతున్న సెజ్ వ్యతిరేక ఆందోళన డిసెంబర్ చివరి వారంలో తీవ్రరూపం దాల్చింది. భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ పర్యాటకశాఖ మంత్రి మతనీ సల్దానా, జి ఎం ఎ ఎస్ నాయకుడు క్రిస్మస్ తర్వాత తమ ఆందోళనను ఉధృతంచేస్తామని, నూతన సంవత్సర ఉత్సవాలకు గోవాకు వచ్చే పర్యాటకులు వెళ్లిపోకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోక తప్పదని కూడ హెచ్చరించారు. గోవన్లు తమ పిల్లల భవిష్యత్తు కోసమూ, గోవా ప్రత్యేక అస్తిత్వాన్ని కాపాడడం కోసమూ సంవత్సరాది ఉత్సవాలను త్యాగం చేయవలసి ఉంటుందని కూడ ఆయన పిలుపు ఇచ్చారు.

రాష్ట్రంలోని అన్ని ప్రత్యేక ఆర్థిక మండలాలను రద్దుచేయాలని కోరుతూ ఈ ఐక్య సంఘటన డిసెంబర్ 12 న ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ కు ఒక విజ్ఞప్తి చేసింది. అప్పటికే రాష్ట్రంలో మొత్తం ఏడు ప్రత్యేక ఆర్థిక మండలాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వాటిలో రెండిటి విషయంలో ఉత్తర్వులు కూడ వెలువడ్డాయి గాని, ప్రజా ఆందోళనల వల్ల ఆ పనులు ముందుకు సాగలేదు. ఒకవైపు ఈ ఆందోళన సాగుతుండగానే దక్షిణ గోవాలోని సాంకోలె లో మూడో ప్రత్యేక ఆర్థిక మండలాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ లోగా ప్రధాని డా. మన్మోహన్ సింగ్ గోవాలో రెండు రోజుల పర్యటనకోసం రాగా ఆయన పాల్గొన్న సభలలో కూడ నిరసన ప్రదర్శనలు సాగాయి.

ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండలాల విధానాన్ని సమీక్షిస్తుందనీ, ఆ విషయంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తయారుచేసిన శ్వేత ప్రత్రాన్ని నిశితంగా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటుందనీ ముఖ్యమంత్రి అన్నారు.

ఈ వ్యవహారాలన్నీ పరిగణనలోకి తీసుకున్న పాలకపక్షం కాంగ్రెస్ ఒక పరిశీలక బృందాన్ని నియమించింది. ఆ బృందం డిసెంబర్ 29 న ఇచ్చిన తన నివేదికలో గోవాలో ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయడం గోవా ప్రయోజనాలకు గాని, గోవన్ల ప్రయోజనాలకు గాని ఉపయోగకరం కాదని ప్రకటించింది. దక్షిణ గోవా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు సభ్యుడు, గోవా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్కో సర్దిన్హా ఆ బృందం అభిప్రాయాలను పత్రికలకు వెల్లడిస్తూ, సెజ్ ల వల్ల ఇతర రాష్ట్రాల నుంచి విపరీతంగా గోవాలోకి జనం తరలివచ్చే అవకాశం ఉందని, అందువల్ల రాష్ట్ర పర్యాటక రంగం మీద తీవ్రమైన ప్రభావం కలగవచ్చునని చెప్పాడు. ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ జరిగితే గోవాకు ప్రధాన ఆదాయ వనరు అయిన పర్యాటక రంగం దెబ్బతినిపోతుందని అన్నాడు.

ఈ పూర్వరంగంలో గోవన్ల భూమిని పెద్ద ఎత్తున గోవనేతరులకు అమ్మడం, అన్యాక్రాంతం కావడం జరుగుతున్నదని, దాన్ని ఆపివేయాలని గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోరింది. ప్రజా అవసరాల కొరకు మినహా ఈ విధంగా పారిశ్రామిక వేత్తల, పెట్టుబడిదారుల అవసరాల కొరకు ప్రభుత్వం భూసేకరణ జరపగూడదని కూడ ప్రదేశ్ కాంగ్రెస్ కోరింది.

చివరికి స్వయంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్న టాస్క్ ఫోర్స్ ప్రత్యేక ఆర్థిక మండలాలను రద్దు చేయాలని డిసెంబర్ 30న నిర్ణయం తీసుకున్నది. పారిశ్రామికీకరణ ఫలాలను రాష్ట్రానికి అందించాలనే, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యాలతోనే రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయాలనుకుంటే ఆ రెండు పనులూ ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయకుండా కూడ సాధించవచ్చునని టాస్క్ ఫోర్స్ అభిప్రాయపడింది. అంతేకాక, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల మినహాయింపులు, రాయితీల వల్ల కూడ గోవా రాష్ట్రప్రభుత్వం సాధించబోయే ఆదాయం కూడ ఏమీ ఉండబోదని టాస్క్ ఫోర్స్ ప్రకటించింది. ఆదాయం ఏమీ లేకపోగా, ప్రత్యేక ఆర్థిక మండలాలకు అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పించడంకోసం రాష్ట్రప్రభుత్వం అదనపు ఖర్చు కూడ పెట్టవలసి ఉంటుంది, నీరు, విద్యుత్తు కల్పించవలసి ఉంటుంది అని టాస్క్ ఫోర్స్ వ్యాఖ్యానించింది. వేలాది ఎకరాలను సెజ్ లకోసం కేటాయించడం వల్ల నిజంగా పరిశ్రమలు ఏర్పాటు చేయదలచుకున్న వారికి గాని, సాధారణ ప్రజల నివాస అవసరాలకు గాని భూమి దొరకదని కూడ టాస్క్ ఫోర్స్ అంది.

గోవాలో ఒక పాలకపక్ష పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలలోని పాలకపక్షాలన్నిటి కళ్లు తెరిపించాలి. నిజానికి మన దేశంలోని రాజకీయ పక్షాలన్నీ ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు అంటున్న మాటలే ఇవి. ప్రత్యేక ఆర్థిక మండలాలవల్ల స్థానిక ప్రజల ప్రయోజనాలేవీ తీరవని, అవి కేవలం దేశదేశాల సంపన్నులకు మన సంపదలు దోచిపెట్టే సాధనాలు మాత్రమేనని రాజకీయ పక్షాలన్నిటికీ కూడ తెలుసు. కాని అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు సంపాదించడం కోసమో, తమ ఆశ్రితులకో, కుటుంబ సభ్యులకో వేలాది ఎకరాల భూములు కట్టబెట్టడం కోసమో ప్రత్యేక ఆర్థిక మండలాల విధానాన్ని తలకెత్తుకుంటున్నాయి. ఇవాళ మొదటిసారి గోవా ప్రభుత్వం అధికార పక్షంగా ఉండి కూడ ప్రజల ఒత్తిడి మేరకు నిజాలు అంగీకరించి, ప్రత్యేక ఆర్థిక మండలాల విధానాన్ని వెనక్కి తీసుకున్నది.

ఈ విధంగా ప్రత్యేక ఆర్థిక మండలాల విధానాన్ని ఉపసంహరించే పని ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ అయినా చేసింది గాని మిగిలిన పార్టీలేవీ తాము పాలిస్తున్న రాష్ట్రాలలో చేయలేకపోయాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర లలో తప్ప దేశమంతా ప్రత్యేక ఆర్థిక మండలాల విధానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వామ పక్షాలు, ప్రత్యేక ఆర్థిక మండలాల కొరకు తమ భూమి లాక్కోవద్దన్న రైతుల ప్రాణాలు బలిగొన్న వామపక్షాలు గోవా ప్రభుత్వం నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది.

ప్రత్యేక ఆర్థిక మండలాల వెనుక బహుళజాతిసంస్థలు, దేశదేశాల సంపన్నులు ఉన్నప్పటికీ బలమైన ప్రజాఉద్యమాన్ని నిర్మించగలిగితే ప్రభుత్వం మెడలు వంచి ఉపసంహరించేలా చేయవచ్చునని చూపిన గోవా ప్రజా ఉద్యమం అన్ని రాష్ట్రాలలో సెజ్ లకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు ఆదర్శం కావాలి.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in ParamarthaSatyam, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s