ఎవరికోసమీ చిన్నకారు?

టాటా మోటర్స్ లక్ష రూపాయల చిన్నకారు నానో ను విడుదల చేయడం ఒక చరిత్రాత్మక, విప్లవాత్మక పరిణామంగా ప్రచార సాధనాలన్నీ హోరెత్తుతున్నాయి. అభిప్రాయాలు వ్యక్తీకరించగలవాళ్లందరూ, సాధారణంగా కార్ల వినియోగదారులే గనుక ఈ చిన్నకారుతో దేశం ఒక మలుపు తిరగబోతున్నదని, ఇక ఒక్క అంగవేస్తే అమెరికాతో సమానమైపోయినట్టేనని సుభాషితాలు ప్రకటిస్తున్నారు. మాట్లాడలేనివాళ్లు ఈ దేశంలో కోట్లాది మంది గనుక వాళ్లు ఈ కార్ల వరద గురించి ఏమనుకుంటున్నారో తెలియదు. లక్ష అంటే అక్షరాలా లక్ష కాదని, నానో రహదారి మీదికి వచ్చేసరికి పన్నులు వగైరాలన్నీ కలిపి దాని వెల లక్షన్నర అవుతుందని అంకెలు ప్రకటిస్తున్న వారున్నారు. ఇంత పెద్దఎత్తున కొత్త కార్ల ప్రవేశంవల్ల కాలుష్యం పెరుగుతుందని విమర్శిస్తున్న వారూ ఉన్నారు.

ఈ నేపథ్యంలో అసలు ఈ చిన్నకార్ల వల్ల నిజంగా మధ్య తరగతికి లాభమేనా, ఎవరి అవసరాలకొరకు, ఎవరికి మేలు చేకూర్చడానికి వ్యక్తిగత వాహనాలు ఇంతగా ఇబ్బడిముబ్బడిగా మన రహదారులమీదికి వస్తున్నాయి, ఈ కార్లు ప్రకటిత లక్ష్యాలనైనా నెరవేర్చగలవా, అసలు భారత ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యతలలో కార్ల స్థానం ఏమిటి వంటి విషయాలు ఆలోచించవలసి ఉంది.

నూతన ఆర్థిక విధానాల తర్వాత, విదేశీ కార్ల కంపెనీలను దేశంలోకి ఏ ఆంక్షలు లేకుండా ఆహ్వానించడం, కొత్త కొత్త రకాల కార్లు మన మార్కెట్లలోకి ప్రవేశించడం, కార్లు కొనుక్కోవడానికి విపరీతంగా రుణాలు ఇచ్చే దేశీ విదేశీ ద్రవ్య సంస్థలు మారుమూల పట్టణాలలో కూడ దుకాణాలు తెరిచి కాస్త డబ్బున్నవాళ్లందరినీ ఆకర్షించడం, కార్ల ధరల మీద రాయితీలు, తగ్గింపులు, తక్కువ వడ్డీలకు రుణాలు వంటి సౌకర్యాలు కల్పించడం వంటి అనేక కార్యక్రమాల వల్ల దేశంలో కార్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. నిజానికి 1992 నుంచి 2005 మధ్య దేశంలో జాతీయోత్పత్తి పెరుగుదల సాలీనా సగటున ఎనిమిది శాతం దాటకపోగా అదేకాలంలో కార్ల ఉత్పత్తి అంతకు మూడురెట్ల కన్న ఎక్కువ పెరుగుదలను, దాదాపు 30 శాతం పెరుగుదలను చూపింది. అంటే సంపద పెరుగుదలలో అతి ఎక్కువ వాటాను కార్ల తయారీ పరిశ్రమ తన కైవసం చేసుకున్నదన్నమాట.

ఈ కార్ల ఉత్పత్తి ఎంత ఎక్కువగా ఉన్నదంటే 2001-02 ఆర్థికసంవత్సరంలో 6,69,719 కార్లు తయారు కాగా, ఐదుసంవత్సరాలు తిరగకుండానే 2005-06 ఆర్థికసంవత్సరంలో 13,08,913 కార్లు తయారయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో మొత్తంగా గాని, మధ్య తరగతి ఆదాయంలో గాని ఈ ఐదు సంవత్సరాలలో పెరుగుదల రెట్టింపు కాలేదు. కాని కార్ల ఉత్పత్తి రెట్టింపు జరిగిందంటే, మరొక రంగానికి వెళ్లవలసిన నిధులు ఈ రంగంలోకి ప్రవహించాయని అర్థం. ఈ కార్లతయారీ రంగంలో వ్యాపారం ఎంత పెద్ద ఎత్తున జరిగిందంటే 2002-03లో అరవై వేల కోట్ల రూపాయల కన్న తక్కువగా ఉండిన వ్యాపారం మరుసటి సంవత్సరం లక్ష కోట్ల రూపాయలు దాటింది. ఈ రంగంలో ఉన్న లాభాల రేటును బట్టి చూస్తే కార్ల ఉత్పత్తిదార్లకు, పంపిణీదార్లకు, దుకాణదార్లకు కలిసి కనీసం ముప్పై వేల కోట్ల రూపాయల మిగులు చేకూరిందనుకోవాలి.

సాలీనా ఈవిధంగా కైంకర్యం చేసున్న ముప్పైవేల కోట్ల పైన లాభాలలో సింహభాగం ఉత్పత్తిదార్లదే. వాళ్లు టాటా మోటర్స్, మారుతీ ఉద్యోగ్, జనరల్ మోటర్స్ ఇండియా, ఫోర్డ్ ఇండియా, ఐషర్ మోటర్స్, బజాజ్ ఆటో, హిందుస్తాన్ మోటర్స్, సుజుకి, వోక్స్ వాగెన్, స్కోడా ఆటో, బిఎండబ్ల్యు, మెర్సిడిస్, నిస్సాన్, హ్యుండాయి, టొయొటా, మహీంద్రా, రెనాల్ట్, షెవర్లె, మిట్సుబిషి, ఫియట్ మొదలయిన బహుళజాతి సంస్థలు, లేదా స్వదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న విదేశీ సంస్థలు. అంటే మన మధ్య తరగతి తమ ప్రయాణ సౌకర్యం కోసం అని భ్రమపడుతూ కొనుక్కుంటున్న కార్ల వల్ల వాళ్లకు ఎంత సౌఖ్యం చేకూరుతున్నదో తెలియదుగాని ఈ స్వదేశీ, విదేశీ పెట్టుబడిదార్ల బొక్కసాలు మాత్రం పొంగిపొర్లుతున్నాయన్నమాట.
కార్ల పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే దానికి మంచి రహదారులు, పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలు, సర్వీసింగ్ స్టేషన్లు, నిపుణులైన మెకానిక్కులు, రహదారుల పక్కన హోటళ్లు, మోటెళ్లు వంటి ఎన్నో వసతులు ఏర్పడవలసి ఉంటుంది. ఈ వసతులు కల్పించడానికి మరెన్నో నిధులు అవసరమవుతాయి, చాల ప్రజాధనం వెచ్చించవలసి వస్తుంది. ఈ వసతుల కల్పనలో కూడ విదేశీ ఇంధన కంపెనీలు, బహుళజాతిసంస్థలు, కన్సల్టెంట్ల దగ్గరినుంచి కాంట్రాక్టర్ల దాకా ఆ ప్రజాధనాన్ని తమ బొక్కసాలలో నింపుకుంటారు. మొత్తం మీద చెప్పాలంటే కార్లు విపరీతంగా ప్రవేశించడం వల్ల అవి ఎవరికి ప్రయాణసౌకర్యం కల్పించడంకోసం అనే ప్రకటితలక్ష్యంతో వస్తున్నాయో అది కనుమరుగయిపోయి, లేదా పలచబడిపోయి, ఎక్కువ ప్రజాధనం అనవసర రంగాల మీద వినియోగం, ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు లాభాలు సమకూర్చిపెట్టడం అనే లక్ష్యం మాత్రం మిగులుతుంది.

ఇక మరొకవైపు నుంచి చూస్తే, ఒకవేళ కొనగలిగిన వాళ్లందరికీ కార్లు ఇవ్వాలనే ఆలోచన ఉన్నా, ప్రస్తుతం కార్ల ఉత్పత్తి సంఖ్యను బట్టి చూస్తే, ఇంకొక పది సంవత్సరాలు గడిచినా దేశ జనాభాలో పది శాతం మందికి మించి కార్లు అందుబాటులోకి వస్తాయా అనేది సందేహాస్పదమే. అంటే వందకోట్లకు మించిన జనాభాలో కేవలం పది శాతం మంది అవసరాలను తీర్చడానికి మాత్రమే ఈ కార్ల ఉత్పత్తి విధానం ఉద్దేశించిందన్నమాట. అనేక మార్కెట్ సర్వేలు అంచనావేస్తున్నట్టు ఈదేశంలో కొనుగోలు శక్తి ఉన్న మధ్య తరగతి దాదాపు ఇరవైకోట్ల మంది (నాలుగుకోట్ల కుటుంబాలు) ఉన్నారని అనుకున్నా, వాళ్లందరూ తలా ఒక కారు కొనుక్కున్నా అది మొత్తం దారిద్ర్య మహా సముద్రంలో అక్కడక్కడ ఒంటరి ద్వీపాలను సృష్టించడమే అవుతుంది తప్ప నిజంగా సామాజిక అభివృద్ధికి చిహ్నం కాదు.

ఇక ప్రకటిత లక్ష్యం గురించి ఆలోచిస్తే, నిజంగానే మన మధ్యతరగతి కుటుంబాలకు జీవన ప్రమాణాల పెరుగుదలలో భాగంగా కారు అవసరంలేదా, దాన్ని అడ్డుకోవడం మంచిదేనా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆ ప్రశ్నలో కొంత వాస్తవం కూడ ఉంది. కాని జీవనప్రమాణాల మెరుగుదలకు సూచిక సొంత వాహన వినియోగమేనా? జీవన ప్రమాణాల మెరుగుదల ఎప్పుడయినా వ్యక్తిగతంగా సాధించగలిగినదీ, సాధించవలసినదీ కాదు. ప్రమాణాల మెరుగుదల తప్పనిసరిగా సామూహికంగా ఉన్నప్పుడే అర్థవంతమవుతుంది. వేలాదిమందికి కనీస జీవన ప్రమాణాలు కూడ లేని స్థితిలో, కూడు గూడు గుడ్డ కూడ కరువైన స్థితిలో, ఒక కుటుంబం తనకు సొంత వాహనం కావాలని అనుకోవడం, ఆ కుటుంబానికి ఆ ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ, అసహజమే.

అసలు మొత్తం దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలవైపునుంచి చూసినప్పుడు ప్రజారవాణా వ్యవస్థను ఒకవైపు బలహీన పరుస్తూ, మరొకవైపు సొంత వాహనాల వ్యవస్థను ఈ విధంగా బలపరచడం ప్రజాద్రోహం. నాలుగు కుటుంబాలకు మాత్రం ఉపయోగపడే నాలుగు కార్లు తయారు చేయడానికి ఎన్ని వనరులు అవసరమవుతాయో అన్నే వనరులతో ఒక ప్రజారవాణా బస్సును తయారుచేయడం ద్వారా నాలుగైదు రెట్లు ఎక్కువమంది ప్రయాణ అవసరాలు తీర్చవచ్చు. కార్ల ఉత్పత్తిదారు ఫోర్డ్ సలహామేరకు అమెరికా ప్రభుత్వం అంత విశాల దేశంలో రైలుమార్గాల నిర్మాణాన్ని ఆపివేసి, రహదార్లు నిర్మించి, బకాసుర ఇంధనదాహంలో పడి ఇవాళ ఎక్కడికి చేరిందో చూస్తున్నాం. మనమూ ఆదారిలో నడవవలసిందేనా?

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in ParamarthaSatyam, Telugu. Bookmark the permalink.

6 Responses to ఎవరికోసమీ చిన్నకారు?

 1. మాష్టారు,

  రుణాలిచ్చే సంస్థలు పెరుగుతాయి – ఖచ్చితంగా..కానీ తాహతు లేకుండా అప్పుచేసి గోతిలో పడటం వ్యక్తిగత బాధ్యతారాహిత్యం మాత్రమే.. nothing less nothing more.

  మీరు అమెరికా విషయంలో కార్ల వల్ల ప్రజారవాణా వ్యవస్థ క్షీణించింది అన్నమాట వాస్తవమే..కానీ అది భారతానికి వర్తించదు. అమెరికా జనసాంద్రత చాలా తక్కువ..కాబట్టి పెద్దపెద్ద నగరాల్లో తప్పించి ప్రజారవాణా వ్యవస్థ లాభసాటిగా నడవదు. కానీ భారతదేశంలో ప్రజారవాణ వ్యవస్థల్లోని సరైన యాజమాన్యంతో లాభసాటిగా నడిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అమెరికాలో భారతదేశంతో పోల్చితే పెట్రోలు చాలా చవక. భారత్లో పెట్రోలు ధరలకు ప్రభుత్వం అడ్డపుల్ల వెయ్యటం మానేస్తే చాలు అందరూ తిరిగి బస్సులదారి పడతారు.

  “మరొక రంగానికి వెళ్లవలసిన నిధులు ఈ రంగంలోకి ప్రవహించాయని అర్థం. ” – ఆ మరో రంగానికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి?? వినియోగదారులు సైకిల్లను కోరుకుంటే సైకిల్లే ఉత్పత్తి చేసేవాళ్ళు. లాభాలొస్తాయనుకున్న దగ్గరే కదా పెట్టుబడి పెట్టాల్సింది. నీళ్ళుపడతాయనుకున్న దగ్గరే కదా బోరు వేసేది. ఇంకో చోట నీళ్ళ అవసరముందని రాళ్ళలో బోరు తవ్వితే ఏమౌతుంది??

  “వేలాదిమందికి కనీస జీవన ప్రమాణాలు కూడ లేని స్థితిలో, కూడు గూడు గుడ్డ కూడ కరువైన స్థితిలో, ఒక కుటుంబం తనకు సొంత వాహనం కావాలని అనుకోవడం, ఆ కుటుంబానికి ఆ ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ, అసహజమే.” – అన్ని సందర్భాలలో ప్రజారవాణా ఉపయోగించటం కుదరకపోవచ్చు. నాకు తాహతుంటే నా కుటుంబము కాస్తైనా సురక్షితంగా ఉండాలని కోరుకోవటంలో అసహజమేముంది??

  చివరగా..లాభం బూతు పదం కాదు.. కంపెనీలు సమాజసేవ చెయ్యటానికి పెట్టరు..దానికి సంఘసేవా సంస్థలుంటాయి.

 2. వేణు గోపాల్ గారికి నమస్కారములు. మీ బ్లాగుకున్న వోల్టెయిర్ మాటల అంతరార్ధము శ్లాఘనీయం! Its a pleasure knowing you. Please do share your thoughts and view for one of my blog entries titled UnnbornCoP: http://cassamino.blogspot.com/2006/06/unborn-cop.html

  Cheers

  Nanda

 3. మీతో ఏకీభవించలేకపోతున్నందుకు అన్యథా భావించవద్దు.

  1. గిరాకీ లేకుండా సరఫరా ఉండదు. ఓ వస్తువుకి గిరాకీ ఉంది అంటే దాని ఖర్చుని భరించగలవాళ్ళు కూడా ఉన్నారనే అర్థం. తగినంత కారణం లేకుండా ఏ కుటుంబమూ ఒక కారు మీద 3 లక్షలు తగలెయ్యదు. ఇప్పుడు లక్ష కారు సంగతైనా అంతే.

  2. మన దేశంలోని కార్ల ఉత్పత్తి అంతా కలిపినా ఇతర కారు-తయారీ దేశాల్లో ఒక్కొక్కదాని ఉత్పత్తిలో ఇరవయ్యో వంతు ఉండదు. కాబట్టి ఆందోళన చెందనక్కఱలేదు.

  3. మన దేశంలో ఉత్పత్తయ్యే కార్లన్నీ మనవాళ్ళ వినియోగం కోసం కాదు. ఒక పెద్ద భాగం ఎగుమతవుతోంది. తద్ద్వారా మనకు విదేశీద్రవ్యం లభిస్తోంది, బయట “ఇండియన్ టెక్నాలజీ” అనే కీర్తికిరీటంతో పాటు !

  4. ఎవడో కూడూ గుడ్డా లేక బాధపడుతున్నాడని చెప్పి ఆ బాధల్లేని జనం కూడా కార్లు కొనకూడదనడం సమంజసం కాదు. ఒకడికి మధుమేహం ఉన్నంతమాత్రాన మిగతావాళ్ళంతా తేనీటిలో పంచదార వేసుకోకూడదనడం లాంటిది అది.

  5. క్యాలిఫోర్నియాలాంటి అమెరికన్ నగరాల్లో సగటున మనిషికి మూడు కార్లు చొప్పున ఉన్నాయి.అది కాలుష్యం కాదు గాని ఇండియాలో 6 కోట్ల మధ్యతరగతి కుటుంబాలు లక్ష కారు కొనుక్కుంటే మాత్రం కాలుష్యం మొఱ్ఱో అని గగ్గోలు పడడం సబబేనా ?

  6. ఇండియావాళ్ళు కార్లు కొనడం మానేస్తే ప్రపంచంలో కాలుష్యం సమస్య అమాంతంగా పరిష్కారమైపోతుందా ?

  7. మనం కార్లు వాడనంతకాలం, మనం మన బైకులనే బ్యాలెన్సు లేని రెండుచక్రాల మృత్యుశకటాలతో తృప్తిచెందుతున్నంతకాలం మన రోడ్లని విశాలంగా శుభ్రంగా ఆధునికంగా మెయింటెయిన్ చేసే బాధ్యతని మన ప్రభుత్వం కాని, ఇళ్ళు విశాలంగా కట్టుకోవాల్సిన బాధ్యతని మన యిళ్ళ యజమానులు గాని అనుభూతి చెందరు. Necessity is the mother of invention. The one-lakh car will force them to take notice and sit up.

  8. రోడ్లపై రద్దీ రెండు చక్రాల బళ్ళతోను, బస్సులతోను కూడా ఏర్పడుతుంది, కార్లవల్లనే కాదు.

  9. మన దేశంలో ప్రజారవాణావ్యవస్థ మర్యాదస్తులకు ఉపయోగపడేది కాదు.

  10. ఒకవేళ మనకు కాలుష్యం లేని కార్లే కావాలంటే-ముందు కార్లు వాడే అలవాటు ప్రజల్లో లేకపోతే ఆ దిశగా పరిశోధనా ప్రయత్నమూ మాత్రం ఎలా మొదలవుతుంది ? ప్రతి సాధనమూ ముందు కొన్ని ఇబ్బందులు కలిగించేదే.వాడగా వాడగా వాటిని అధిగమించే దిశగా మనిషి ప్రయాణిస్తాడు.

  11. మనకు పెట్రోలు తగినంత లేకపోయినా అంచనాల కందనంత గ్యాస్ ఉంది. దాని వెలికితీత ఇప్పుడిప్పుడే మొదలయింది. కాబట్టి CNG తో నడిచే నానో తయారుచెయ్యమని మనం టాటాలను కోరవచ్చు. CNG తరహా ఇంజన్ నిర్మాణానికి కేవలం రు.25 వేలు మాత్రమే అదనంగా అవుతుంది.

 4. వికటకవి says:

  ఉత్పత్తిదారులు, వాళ్ళ లాభాలు ఈనాటిది కాదు కదా. అందులోనూ బలవంతమేముంది. ఇష్టమున్నవాడు కొనుక్కుంటాదు, లేనివాడు లేదు. తగిన వసతులు లేకుండా రోడ్లమీదకి వాహనాలు రావటం తప్పన్నది నిజమే. హీరో హోండా ద్విచక్రవాహనాలు ఏమైనా తక్కువ తిన్నాయా, ఆ మాటకొస్తే, కాలుష్యాల విషయములో? ఎక్కువ మైలేజీ వస్తోంది కాబట్టి ఎవరూ దాని గూర్చి చెడుగా మాట్లాడరు.

  ఇవ్వాల్టికీ మీరన్న ప్రజారవాణా వ్యవస్థ లేదు కదా. ప్రభుత్వాలకి కాలం చాలకనా? ప్రభుత్వాల అసమర్ధతకు, సృజనాత్మకతని అటకెక్కించాల్సిందేనా? అంతెందుకు? ఈ కట్టబోయే మెట్రో కూడా ఇంకా సమస్యని జటిలం చేస్తుంది, ఉన్న ఇరుకు రోడ్ల మధ్యనే కట్టటం వల్ల.

  మౌలిక సదుపాయాలకు చేసే ఖర్చు ప్రాధమికంగా ఏ ఒక్క పరిశ్రమను ఉద్ధేశించి చేసినా, ఉపయోగం ప్రజలందరికీ ఉంటుంది. ఉదా: ఇంత నాగరికత, 21వ శతాబ్దం అనుకుంటున్న మనకి, ఇవ్వాల్టికీ హైదరాబాదు-విజయవాడల మధ్య ఆడవారికి ఓ రక్షిత పరిశుభ్ర మూత్రశాలకి నోచుకోలేకపోయాము. ప్రభుత్వాలు చెయ్యవు, చేసినా రక్షణ, శుభ్రత, జవాబుదారీతనం ఉండవు. ప్రయివేటు వారికిస్తే మండిపడతారు. మరెలా?

 5. palakurthy says:

  Public Transportation system must be provided by Govt. u cannot blame car companies or car holders..
  Blame the Leaders,Blame the polytics,Blame the Rulers…

  roads should be widened by govt, New train routes,new roads,new bridges must be built by responsible departments and leaders.. if they able to do all these where is the traffic problem? if they r strict about old vehicles which generate more pollution, we can enjoy the roads with new cars…

 6. Pingback: పొద్దు » Blog Archive » జనవరి నెల తెలుగు బ్లాగుల కథా కమామిషూ!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s