సోషలిజం అనివార్యం, అవసరం, సుసాధ్యం

జనవరి 11, 2008 గత శనివారం నాడు భారత కమ్యూనిస్టు  పార్టీ (మార్క్సిస్టు) కురువృద్ధుడు జ్యోతి బసు ప్రస్తుత సమయంలో సోషలిజం సాధించడం సాధ్యం కాదని విస్పష్టంగా ప్రకటించారు. అంతకు రెండు రోజులముందే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తమ రాష్ట్రాన్ని పారిశ్రామికీకరించడానికి పెట్టుబడిదారీవిధానమే ఏకైక మార్గమని ప్రకటించారు. ఈ రెండు వ్యాఖ్యలద్వారా తమ నాయకులు సోషలిజాన్ని వదులుకున్నట్టు కాదని, పత్రికలవారు అజ్ఞానంతో అలా చిత్రించారని, తమ నాయకులు కేవలం ప్రస్తుత పరిస్థితుల పరిమితులను మాత్రమే ప్రస్తావించారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ ఒక వివరణ కూడ ఇచ్చారు.  ఈ వ్యాఖ్యలన్నీ ఈ దేశంలో అమలు కావలసిన సామాజిక, రాజకీయార్థిక విధానం గురించి జరగవలసిన ఒక ముఖ్యమైన చర్చకు తెర తీస్తున్నాయి. స్వయంగా మార్క్సిస్టుపార్టీ నాయకులే నిజం గుర్తించి, సోషలిజం అవసరంలేదని అంటున్నారని పెట్టుబడిదారీమార్గ సమర్థకులు ఒకవైపున చంకలు గుద్దుకుంటున్నారు. పేరులోనే మార్క్సిజం తప్ప అది ఒక పాలకవర్గ పార్టీయేనని తాము ఎంతోకాలంగా చెపుతున్న విషయం నిజమయిందని విమర్శకులు నిర్ధారిస్తున్నారు.ఈ రాజకీయ వివాదాన్ని పక్కనపెట్టి, సోషలిజం ఒక రాజకీయార్థిక సిద్ధాంతంగా ఈ దేశంలో అనుసరణీయమా కాదా చర్చించవలసి ఉంది. సోషలిజాన్ని అనుసరించడం ప్రస్తుత పరిస్థితులలో సాధ్యం కాదని పావుశతాబ్దిపాటు పనిచేసిన ముఖ్యమంత్రి, ఆధునిక పారిశ్రామిక వైతాళికుడిగా చెప్పుకుంటున్న మరొక ముఖ్యమంత్రి, అందులోనూ ఇద్దరూ మార్క్సిస్టు నాయకులుగా చలామణీ అవుతున్నవారు, అంటున్నారంటే వాళ్ల మాటల అర్థమేమిటో ఆలోచించవలసి ఉంది.  నిజానికి సోషలిజం — సామ్యవాదం — ఒక సమానత్వ సిద్ధాంతంగా మరే సమాజం కన్న ఎక్కువగా భారత సమాజానికి అత్యంత అవసరమైన, అనివార్యమైన సిద్ధాంతం. ఇతర సమాజాలలో మనుషులమధ్య అసమానతలకు నైసర్గిక పరిస్థితులో, మతమో, ఆర్థికస్థితో కారణం కాగా, భారత సమాజంలో అసమానతలకు ప్రధాన కారణం కులం. నైసర్గిక వనరులనో, మతాన్నో, ఆర్థికస్థితినో మార్చుకోవచ్చు గాని, కులాన్ని మార్చుకోవడానికి వీలు లేదు. పైగా పురుషసూక్తం నుంచి మనుస్మృతి, భగవద్గీతల దాకా కులం దైవిక ఆమోదాన్ని కూడ పొందింది. మనుషులను అసమానంగా సృష్టించానని స్వయంగా భగవానువాచ ఉన్నచోట ఆ అసమానతకు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పునాది ఉండడం సహజం. సామాజిక పునర్నిర్మాణం జరగాలని కోరుకునే వారెవరయినా తప్పనిసరిగా తమ కార్యక్రమాలకు ఆ అసమానతను తొలగించే, సమానతను స్థాపించే సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా పెట్టుకోక తప్పదు. సామ్యవాద సిద్ధాంతానికి మినహా మరే సిద్ధాంతానికి కూడ సామాజిక అసమానతలను తొలగించే కార్యక్రమం లేదు. మరీ ముఖ్యంగా పెట్టుబడిదారీ విధానానికి అయితే ఆ కార్యక్రమం ఉండే అవకాశమే లేదు సరిగదా, అసమానతను పెంచి పోషించి సంపదను పిడికెడుమంది చేతిలో కేంద్రీకరించడమే దాని లక్ష్యం. మరి తమను తాము మార్క్సిస్టు నాయకులుగా, అసలు ఈ దేశంలో నిజమైన, ఏకైక మార్క్సిస్టుపార్టీగా భావించుకునే పార్టీ నాయకులుగా భావించుకునే వారు సోషలిజం అవసరం లేదని, పెట్టుబడిదారీ విధానమే శరణ్యమని ప్రకటించడం ఎందువల్ల? నిజానికి భారత సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించడానికి మాత్రమే కాదు, సామాజిక అసమానతలను తొలగించడానికి సోషలిజం వంటి సిద్ధాంతాన్ని చిత్తశుద్ధితో, సమగ్రంగా అమలు చేయడం అవసరం, అనివార్యం. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిదారీ పునాదులమీదనే పారిశ్రామికీకరణ జరిగే అవకాశం ఉందని, అందుకు కారణం పెద్దఎత్తున వనరులను సమీకరించే పని రాజ్యం చేయజాలదని, పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన నిధులు ప్రభుత్వం దగ్గర లేవని బుద్ధదేవ్ అన్నారు. ఇవి ఎంత అబద్ధాలో విమర్శకులు ఎవరూ చెప్పనక్కరలేదు. ఇటువంటి మాటలనే గతంలో కాంగ్రెస్ తదితర పాలకపక్షాలు అన్నప్పుడు, ఈ మార్క్సిస్టు పార్టీ నాయకులు, మేధావులే ఆ మాటలను వీరోచితంగా ఎలా ఖండించి, ఏవాదనలు పెట్టారో వారి గతకాలపు సాహిత్యాన్ని చూస్తే చాలు. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న రాజ్యాంగం ప్రకారం గాని, సామాజిక రాజకీయార్థిక పరిస్థితుల ప్రకారం గాని సోషలిజం సాధ్యం కాదన్న మాటలో కూడ వాస్తవం లేదు. ఎందుకంటే రాజ్యాంగమే సోషలిజాన్ని ప్రవేశికలో భాగం చేసుకుంది. భారత జాతీయోద్యమంలో ప్రగతిశీల శక్తులు ఈ దేశంలో వలస పాలన అనంతరం సామ్యవాద వ్యవస్థను ఏర్పరచవలసిన అవసరం ఉందని, సామ్యవాదం ద్వారా మాత్రమే ఈ దేశంలో అసమానతలను తొలగించవచ్చునని అభిప్రాయపడ్డాయి. అందువల్లనే మిశ్రమ ఆర్థికవ్యవస్థ భావన, పంచవర్ష ప్రణాళికల రూపంలో ప్రణాళికాబద్ధ ఆర్థికవిధానం వగైరా వచ్చాయి. ఆదేశిక సూత్రాలలో భాగమైన అధికరణం 38, 39లు సుస్పష్టంగా సోషలిజం మౌలిక సూత్రాలను ప్రతిపాదించాయి. అధికరణం 38 సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం గురించీ, సమానత్వం గురించీ మాట్లాడింది. అధికరణం 39 “సామాజిక భౌతిక వనరులపై యాజమాన్యం, అదుపు ఉమ్మడిప్రయోజనాలకు అనుగుణంగా పంపిణీ జరగాల”ని, “సంపద, ఉత్పత్తి సాధనాలు కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమై ఉమ్మడిప్రయోజనాలు దెబ్బతినకుండా ఆర్థిక వ్యవస్థా నిర్వహణ జరగాల”ని సోషలిజం సూత్రాలను ప్రకటించింది. రాజ్యాంగంలోని ఇటువంటి ఆదర్శాలకు పాలకవర్గాలు తూట్లు పొడిచాయనేది అందరికీ తెలిసిన సత్యమే. ఇవాళ మార్క్సిస్టు పార్టీ కూడ ఈ ఆదర్శాలను వదిలివేస్తానని బహిరంగంగా ప్రకటిస్తున్నదన్నమాట. నిజానికి మార్క్సిస్టు పార్టీ గాని, మరే పార్టీగాని, నిజమైన ప్రజల ప్రత్యామ్నాయంగా మారలేకపోయినా, పార్లమెంటరీ పాలకవర్గాలలోపలే ప్రత్యామ్నాయ విధానాలను ఎంతోకొంతమేరకు అమలు చేయడానికి రాజ్యాంగంలోనే, చట్టాలలోనే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తమ పనులకు అడ్డుపడుతోందనో, తమచేత ఇష్టంలేని పనులు చేయిస్తోందనో ఇన్నాళ్లుగా వామపక్ష నేతలు చెపుతున్న మాటలు కూడ అవాస్తవాలే. ఎందువల్లనంటే, రాష్ట్రప్రభుత్వాలకు అంత చిత్తశుద్ధి ఉంటే కనీసం రాష్ట్రాల జాబితాలోని పనుల పరిధిలోనయినా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చు. కాని వామపక్షాలు ఆ రాష్ట్రాల జాబితా పనులను, తాము చేయగలిగిన పనులను కూడ చేయకుండా ఉండిపోయాయి. సెజ్ ల ఏర్పాటు, నందిగ్రామ్ మారణ కాండ లలో మార్క్సిస్టుపార్టీ వైఖరి అందరికీ తెలిసిందే. పైగా, కేంద్రం ప్రవేశపెట్టిన అనేక తప్పుడు, దుర్మార్గ, ప్రజావ్యతిరేక చట్టాలను ఎటువంటి సందేహంలేకుండా అమలు చేశాయి. చివరికి రాష్ట్ర జాబితాలో ఉన్న శాంతి భద్రతల విషయంలోకూడ ఇన్ని గొప్పలు చెప్పుకునే వామపక్ష రాష్ట్రప్రభుత్వాలు ‘ప్రజా ఉద్యమాలపై పోలీసుల హింసను ప్రయోగించబోము’ అనే అతిచిన్న ప్రజాస్వామిక వైఖరిని కూడ తీసుకోలేదు. ‘సోషలిజాన్ని అమలు చేయడం సాధ్యం కాదు, చేయగలిగింది పెట్టుబడిదారీ అభివృద్ధిలోపలే సాంఘిక సంక్షేమ చర్యలు చేపట్టడం’ అని జ్యోతి బసు ఇప్పుడు అంటున్నారు గాని, మరి ఆయన అధినాయకత్వం వహించిన ప్రభుత్వం మూడు దశాబ్దాలు గడిచిన తర్వాత, ఒక తరం గడిచిపోయిన తర్వాత, బెంగాల్ లో అంతగా పేదరికం, నిరుద్యోగం, అవిద్య తాండవిస్తున్నాయంటే వామపక్ష నామాంకితులు తాము చేయవలసిన, చేయదగిన, చేయడానికి అవకాశం ఉన్న పనులను కనీసంగా కూడ చేయలేదన్నమాట. వారుకూడ ఈ ఆరు దశాబ్దాలుగా అధికారంలో సాగుతున్న పాలకవర్గాలతానులోని ముక్కేనన్నమాట.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in ParamarthaSatyam, Telugu. Bookmark the permalink.

3 Responses to సోషలిజం అనివార్యం, అవసరం, సుసాధ్యం

 1. అడక్కుండానే సలహా ఇస్తున్నాను. తప్పయితే క్షమించండి:

  మీ శైలిలో కొంచెం ఉపోద్ఘాత ముగింపులకూ పేరాగ్రాఫులకూ సబ్‌హెడింగులకూ సముచిత స్థానం ఇవ్వగలరని ప్రార్థన.

 2. koresh says:

  communism is a utopia, eg. bezavaada communists succeeded in exporting castism, nepotism, money plundering a fashion of communism, they even murdering rss activists at cannuru , kerala.

 3. వేణు గారు

  స్వాతంత్ర్యం వచ్చిన అరవై ఏళ్ళకు కూడా దేశంలో కడు బీదరికం మిగిలిపోయింది. ఆకలి చావులు తప్పట్లేదు. సగం మందికి విద్య అందట్లేదు. ప్రజల్లో మూఢ నమ్మకాలు జాస్తిగా ఉన్నాయి. అయినా సరే, కమ్యూనిస్టులు తమ ఓటమిని అంగీకరించట్లేదు. ఇవన్నీ కాకపోతే, మరింకేంటి సంపూర్ణ వైఫల్యం అంటే ?

  ఒక తప్పుడు సిద్ధాంతాన్ని మరింత తప్పుడుగా ఆచరిస్తూ, లేనిపోని భూతాలపై చేతబడి ప్రయోగాలు చేస్తూ, జనాలని నిరుపేదలుగా మగ్గనిస్తున్నారు ! “ఎందుకు ఈ దేశాన్ని ఇలా పట్టి పీడిస్తున్నారు ఈ మూఢ నమ్మకాలతో ?” అని ఎవ్వడైనా దేశభక్తుడు ప్రశ్నిస్తే వాడొక పెట్టుబడిదారు.

  జాతికి – మతానికి – పెట్టుబడికీ అన్నింటికీ ఒకటే మేజిక్ ఔషదం కమ్యూనిజం ! ఇంతకంటే పిచ్చి ఆలోచన ఇంకేమీ ఉండదు. మార్క్స్ మహాశయుడే జాతినీ (కులాన్నీ), మతాన్నీ, పెట్టుబడినీ ఒకటిగా కలపవద్దని మొక్కుకున్నాడు.

  మీ మైకంలో మీకిదేమీ అర్థం కావట్లేదు. ఒకసారి నా పోస్టుని చదివి సూచనలు వ్రాయండి. ఒక కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తకి పుట్టిన కొడుకుగా అడుగుతున్నా !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s