లక్ష్య ప్రకటనలు పెదాలమీదనేనా?

కేంద్ర ఆర్థిక మంత్రి పళనియప్పన్ చిదంబరం స్థానిక వివేకానికి తిరువళ్లువార్ నూ, దేశభక్తికి సుబ్రహ్మణ్య భారతినీ ఉటంకిస్తూ బడ్జెట్ ఉపన్యాసం చదువుతారని గతవారం నేను చేసిన ఊహాగానంలో సగమే నిజమయింది. ఆయన తిరువళ్లువార్ ను ఉటంకించారు గాని ఆ రెండువేలసంవత్సరాల కిందటి మహాకవి నుంచి సుపరిపాలన నిర్వచనాన్ని అరువు తెచ్చుకున్నారు. సుబ్రహ్మణ్య భారతిని అసలే ఉటంకించలేదుగాని బడ్జెట్ ఉపన్యాస ప్రారంభంలో ఇందిరా ప్రియదర్శినిని, చివరిలో జవహర్లాల్ నెహ్రూనూ ఉటంకించి ఆద్యంతాలలో నెహ్రూ కుటుంబమే ఉన్నదని, ఉంటుందని ఎన్నికల సంవత్సరపు బడ్జెట్ లో మరొకసారి మనకు గుర్తు చేశారు.

అసలు బడ్జెట్ గురించి మాట్లాడబోయేముందు ఈ మూడు ఉటంకింపులగురించీ మాట్లాడాలి. ‘సుపరిపాలన అంటే ఉదారమైన దానాలు, కరుణ, ధార్మిక పాలన, అట్టడుగు మనిషికి ఆదరణ ఇవ్వడమే’ అని తిరువళ్లువార్ అన్నారని చిదంబరం అంటున్నారు. పెద్దలకు, సంపన్నులకు ఉదారమైన దానాలు, వారిపట్ల కరుణ, అట్టడుగు అభాగ్యులకు మాత్రం మాటల్లో ఆదరణ అని తిరువళ్లువార్ కు చిదంబరం కొత్త భాష్యం చెప్పదలచుకున్నట్టున్నారు. ఎన్నికల బడ్జెట్ గా, వరాలవానగా చాలమంది అభివర్ణిస్తున్న 2008-09 బడ్జెట్ లో పేదలకు, దళితులకు, ఆదివాసులకు, వెనుకబడిన వర్గాలకు, మైనారిటీలకు ప్రకటించిన రాయితీలన్నీ వాస్తవంగా అట్టడుగుకు వచ్చేసరికి హళ్లికి హళ్లి సున్నకు సున్నగా మారిపోతాయి. భారీగా కనబడిన కేటాయింపులు కూడా కిందిదాకా చేరవు. కాని సంపన్నులకు, బహుళజాతి సంస్థలకు ప్రకటించిన రాయితీలు, మినహాయింపులు మాత్రం మొత్తానికి మొత్తం అందడం మాత్రమే గాక, బడ్జెట్ బయట మరికొన్ని తాయిలాలు కూడ అందుతాయి.

ప్రభుత్వంలో ఉన్నవారు చేసేపని ప్రతి రోజూ, ప్రతిగంటా పూర్తి ఉద్యోగ కల్పన, దారిద్ర్య నిర్మూలన, అసమానత రద్దు అనే లక్ష్యాలను చేరే మార్గాన్ని అన్వేషించడమే అంటూ ఆ లక్ష్యాలను చేరడానికి మొట్టమొదట సంపదను తయారు చేయడమే ఏకైక కర్తవ్యమనీ, సంపద లేకుండా సమానత్వం ఎట్లా వస్తుందనీ నెహ్రూ 1955లో మార్గనిర్దేశనం చేశారని చిదంబరం అంటున్నారు. ప్రభుత్వం అంతగా ప్రతిరోజూ ప్రతిగంటా ఆ పనే చేస్తూ ఉంటే ఆ లక్ష్యాలు సాధించడం ఇకా ఎందుకు దూరం జరుగుతున్నదో అన్వేషించడానికి చిదంబరం ప్రయత్నిస్తే బాగుండును. ఏ పని అయినా ఎంత ఎక్కువగా చేస్తే, ఎంత ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తే అంతగా సామర్థ్యం పెరుగుతుంది అని ఇందిరాగాంధీ చెప్పిన ఆణిముత్యాన్ని కూడ చిదంబరం తన బడ్జెట్ ఉపన్యాసంలో ప్రస్తావించారు. అవును నిజమే, బహుళ జాతిసంస్థలకు, దేశదేశాల సంపన్నులకు సేవ చేయడానికి ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తుంటే ఆ పనిలో అంతగా సామర్థ్యం పెరుగుతుంది, ప్రజల బాగు పేరుమీద, పేదలకు వరాలు పేరుమీద పెద్దలకు దోచిపెట్టడం కుదురుతుంది.

ప్రస్తుత బడ్జెట్ నే తీసుకుంటే, మిగిలిన విషయాలన్నీ పక్కనపెట్టి పూర్తి ఉద్యోగకల్పన, దారిద్ర్య నిర్మూలన, అసమానత రద్దు అనే మూడు ప్రకటిత లక్ష్యాలవైపు ఒక్క అడుగన్నా వేయడానికి ప్రయత్నించిందా ఆలోచించవలసి ఉంది.
పూర్తి ఉద్యోగకల్పన కావాలంటే దేశ జనాభాలో పనిచేయగల వయసులో ఉన్నవాళ్లందరికీ, పనిచేయగల శక్తి సామర్థ్యాలున్న వాళ్లందరికీ అర్థవంతమైన, గౌరవప్రదమైన, సరైన శ్రమఫలితం ఇవ్వగల పని కల్పించడం జరగాలి. అసలు ప్రస్తుతం దేశంలో శ్రామిక జనాభా ఎంత అనే విషయంలోనే ప్రభుత్వ గణాంకాలు చాల గందరగోళంగా ఉన్నాయి. శ్రమ అంటే ఏమిటని నిర్వచించడంలోని అపసవ్యతలవల్ల దేశజనాభాలో సగానికి తక్కువ మాత్రమే ఇవాళ శ్రామికులుగా గుర్తింపు పొందుతున్నారు. అందువల్ల నిరుద్యోగ జనాభా కూడ తప్పుగానే నమోదవుతున్నది.

అధికారిక గణాంకాల ప్రకారం నిరుద్యోగ జనాభా ఒక కోటి నుంచి నాలుగుకోట్ల మధ్య మాత్రమే ఉంది. కాని దొరుకుతున్న తాజా సమాచారాన్ని బట్టి 2004 మార్చ్ నాటికి మొత్తం శ్రమ చేయగల వయసులోని జనసంఖ్య 66 కోట్లు కాగా, ఏదో ఒకరకమైన ఉద్యోగాలలో ఉన్నవారి సంఖ్య 35 కోట్లు మాత్రమే. అంటే 31 కోట్ల మంది నిరుద్యోగంలోనో, అల్పోద్యోగంలోనో ఉన్నారన్నమాట. సాలీనా ఒక కోటీ ఎనభై లక్షలమంది ఆ వయోపరిధిలోకి వస్తుండగా, లభిస్తున్న ఉద్యోగాల సంఖ్య నలభై లక్షలు దాటడం లేదు. అంటే ప్రతి ఏటా ఒకకోటీ నలభై లక్షల మంది నిరుద్యోగ సైన్యంలో చేరుతున్నారన్న మాట.

ప్రభుత్వ గణాంకాలు చూసినా, స్వతంత్ర అంచనాలు చూసినా దేశంలో నిరుద్యోగం ప్రధాన సమస్యేనని అర్థమవుతుంది. దాన్నిపోగొట్టడానికి ప్రతిరోజూ, ప్రతిగంటా పనిచేయాలని యాభైమూడు సంవత్సరాల కింద నాటి ప్రధాని చెప్పినా, అప్పటినుంచి మహాఘనత వహించిన ప్రభుత్వాలన్నీ ఆపనే చేస్తున్నా, దేశ జనాభాలో గణనీయమైన భాగం తగిన ఉద్యోగాలలో లేదనేది వాస్తవం. ఆ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి తక్షణ, స్వల్పకాలిక ఉపాధి వైపు కాక శాశ్వత ఉపాధి సౌకర్యాల కల్పన వైపు చూడవలసిఉంటుంది. వ్యవసాయరంగంలో నిరుద్యోగంలో, అల్పోద్యోగంలో ఉన్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధికల్పన అవకాశాలు చూపడం, గ్రామీణ, వ్యవసాయాధార పరిశ్రమలను ప్రోత్సహించి స్థానిక ఉపాధి అవకాశాలు పెంచడం, పెట్టుబడి-ఆధారిత, యంత్ర-ఆధారిత పారిశ్రామికీకరణ కాకుండా శ్రమ-అధారిత పారిశ్రామికీకరణను ప్రోత్సహిస్తూ అటువంటి పరిశ్రమలనే ప్రభుత్వ రంగంలో నెలకొల్పడం, ప్రైవేటురంగంలో కూడ అటువంటి పరిశ్రమలకే అవకాశాలు ఇవ్వడం చేయవలసిఉంటుంది.

ఇక దారిద్ర్యనిర్మూలన కూడ ప్రభుత్వ ఎజెండాలో అరవై సంవత్సరాలుగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ గణాంకాల ప్రకారమే దేశ జనాభాలో నాలుగోవంతు, స్వతంత్ర అంచనాల ప్రకారం మూడోవంతు నుంచి సగందాకా దారిద్ర్యంలో బతుకుతున్నారు. ఆ దారిద్ర్యం వల్లనే గ్రామీణ ప్రాంతాలనుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకంగాని, ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్న రు. 60,000 కోట్ల రుణ మాఫీ పథకం గాని ఈ దారిద్ర్య నిర్మూలన లక్ష్యాన్ని సాధించలేవు. దేశంలో వ్యవసాయంమీద ఆధారపడిన జనాభా అరవై కోట్లు కాగా, ప్రస్తుత రుణమాఫీ పథకం, సక్రమంగా అమలయితే, కేవలం నాలుగుకోట్ల మంది రైతులకు మాత్రం మేలు చేకూరుస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం పనితీరు తెలిసినవారెవరయినా ఈ అరవైవేలకోట్లరూపాయలు కిందికి చేరేసరికి ఏ సగానికో తగ్గిపోతాయని ఊహించగలరు.

నిజంగా ఈ దేశంలో దారిద్ర్యనిర్మూలన, అసమానతల రద్దు జరగాలంటే భూయాజమాన్యంలో మార్పులు రావాలి. దున్నేవారికే భూమి ప్రాతిపదికపై గ్రామీణ ప్రాంతాలలో నిజంగా భూమిని నమ్ముకుని బతుకుతున్న దళిత, వెనుకబడినకులాల చేతికి భూమి, దాన్ని సాగు చేసుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి.

ఈ బడ్జెట్ నుంచి అటువంటివి ఆశించడం అత్యాశే. ఈ బడ్జెట్ గాని, చిదంబరంనూ, మన్మోహన్ సింగ్ నూ, 1992 తర్వాత అన్ని ప్రభుత్వాలనూ నడిపిస్తున్న ప్రపంచీకరణ ఆలోచనలు గాని నిరుద్యోగాన్నీ, దారిద్ర్యాన్నీ, అసమానతనూ రూపుమాపేవి కావు, మరింతగా పెంచిపోషించేవి. కనుక పడమటికి ప్రయాణిస్తూ తూర్పు ప్రవచనాలు పలకడం ఎన్నికలవేళ అసంఖ్యాక పేద, మధ్యతరగతి వోటర్లను భ్రమల్లో ముంచడానికే, మోసంచేయడానికే.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in ParamarthaSatyam, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s