రైతులకు రుణమాఫీ, రుణాల చెల్లింపులో రాయితీల పద్దు కింద ఈ ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ లో అరవైవేల కోట్ల రూపాయల సహాయం అందించబోతున్నామని, ఇంతటి మహత్కార్యానికి దేశమంతా నీరాజనాలు పలకవలసి ఉందని బడ్జెట్ ఉపన్యాసంలో కేంద్ర ఆర్థికమంత్రి పి చిదంబరం అన్నారు. పైపైన చూస్తే, అరవైవేలకోట్ల రూపాయలు అనే పెద్దఅంకెచూస్తే అదేదో రైతులకు, దేశ వ్యవసాయరంగానికి చేస్తున్న గొప్ప మేలు లాగనే కనబడుతుంది. కాని తీగలాగి డొంక కదిలిస్తే ఈ ప్రకటన బండారం బయటపడుతుంది. ఈ భారీ రుణమాఫీ పథకపు అసలుగుట్టును అర్థం చేసుకోవాలంటే రైతుల రుణ అవసరాల గురించి, రుణాలు తీసుకుంటున్న రైతుల గురించి, రుణాలు ఇచ్చే సంస్థల, సంస్థేతర వనరుల గురించి, ప్రభుత్వమే స్వయంగా మూలనపడేసిన రైతు సహాయ కార్యక్రమాల గురించి, ఇప్పుడు మాఫీ చేస్తామని ప్రకటించిన మొత్తానికి సమానమైన, అంతకన్న ఎక్కువ మొత్తాలు సంగ్రహిస్తున్న ఇతరపద్దుల గురించి చర్చించవలసి ఉంటుంది.
వ్యవసాయరంగపు రుణభారం గురించి అధ్యయనం చేసి, పరిష్కారాలను సూచించవలసిందిగా కేంద్రప్రభుత్వం 2006 ఆగస్టులో ఆంధ్రవిశ్వవిద్యాలయ మాజీ వైస్ చాన్సలర్, ముంబైలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్ మెంట్ రిసర్చ్ డైరెక్టర్, ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్త ప్రొ. ఆర్ రాధాకృష్ణ నాయకత్వంలో నియమించిన నిపుణుల బృందం 2007 జూలైలో వివరమైన నివేదికను సమర్పించింది. ఆ నివేదిక చేసిన సిఫారసులకన్న ఎక్కువగానే తమ ప్రభుత్వం రైతుల రుణభారాన్ని తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నదని చిదంబరం ప్రకటించారు. డిసెంబర్ 31, 2007 నాటికి చిన్న, సన్నకారు రైతులు వాణిజ్య బ్యాంకులకు, గ్రామీణ బ్యాంకులకు, సహకార రుణసంస్థలకు బకాయి పడిన రుణాలను మొత్తంగా మాఫీ చేస్తామని, ఇతర రైతుల బాకీలు ఒకేసారి చెల్లిస్తే 25 శాతం మినహాయింపు ఇస్తామని ఆర్థిక మంత్రి అన్నారు. ఈ రుణమాఫీ, రాయితీ పథకం వల్ల మూడుకోట్ల మంది చిన్న, సన్నకారు రైతులు, ఒకకోటి మంది ఇతర రైతులు లబ్ధి పొందుతారని, రుణ మాఫీ పథకం కింద యాభైవేల కోట్ల రూపాయలు, ఒకేసారి చెల్లింపుకు రాయితీ పథకం కింద పదివేలకోట్ల రూపాయలు, మొత్తం అరవైవేల కోట్ల రూపాయలు ఇందుకు కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి అన్నారు.
ఈ అంకెలగారడీతో మైమరచిపోకుండా, అసలు మొట్టమొదట మన రైతాంగం రుణ అవసరాలు ఏమిటో, అవి ఎందుకు పెరుగుతున్నాయో చూడాలి. రైతుల రుణాలలో అత్యధికభాగం ఉత్పాదక అవసరాలకోసమేననీ, ఇంటి అవసరాలకోసం అప్పులు చేస్తున్నారనే అభిప్రాయం సరయినది కాదనీ స్వయంగా ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం చేసిన అధ్యయనం ప్రకారం తేలింది. అంటే ఇటీవలి కాలంలో వ్యవసాయం ఖరీదు పెరిగిపోయిందన్నమాట. ప్రపంచబ్యాంకు, ప్రపంచవాణిజ్యసంస్థ ఆదేశాలమేరకు, ప్రపంచీకరణ క్రమంలో బహుళజాతిసంస్థల కుతంత్రాలముందు కనీస రక్షణలు కూడ లేకుండా రైతులను వదిలినందువల్ల వచ్చిన ఫలితమిది. మార్కెట్ కోసం పంటలను ప్రోత్సహిస్తూ, ఆ మార్కెట్లను అంతర్జాతీయ బేహారుల ఇష్టారాజ్యానికి వదిలిన ఫలితమిది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, వ్యవసాయ పరికరాలు, ప్రాసెసింగ్, మార్కెట్లు మొదలయిన అన్ని రంగాలలోనూ ప్రవేశపెట్టిన కొత్త విధానాలవల్ల, రద్దుచేసిన రైతు అనుకూల విధానాల వల్ల రైతులకు అప్పులు చేయకుండా పంటలు పండించలేని స్థితి ఏర్పడింది. ఇక వ్యవసాయేతర అవసరాల కోసం కూడ రైతులు అప్పులు చేసి ఉండవచ్చు గాని అవి కూడ మన సాంస్కృతిక జీవనంలోకి, విలువల చట్రంలోకి వినియోగదారీ తత్వాన్ని, భోగలాలసను, అనవసరమైన సరుకులను ప్రవేశపెట్టిన ప్రపంచీకరణ శక్తుల ఘనకార్యాలే. కనుక ఏ పాలకవర్గాలయితే గత రెండు దశాబ్దాలుగా మన రైతులు అప్పులపాలు కావడానికి కారణమయ్యాయో అవే పాలకవర్గాలు ఇవాళ ఆ అప్పులను మాఫీ చేసే చిట్కా తమ దగ్గర ఉందని ప్రగల్భాలు పలకడం నూటికి నూరుపాళ్లు మోసం తప్ప మరొకటి కాదు.
ఇక ఇంతకన్న హాస్యాస్పదమైన విషయం చిన్న, సన్నకారు రైతుల సంస్థాగత రుణాలు మాఫీ చేస్తామని అనడం. నిజానికి మన రుణసంస్థలు – వాణిజ్యబ్యాంకులు, గ్రామీణబ్యాంకులు, సహకార సంస్థలు – చిన్న, సన్నకారు రైతులకు ఇంతపెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చిన దాఖలాలు ఎక్కడాలేవు. సాధారణంగా పెద్ద, ధనిక రైతులకు ఎక్కువగానూ, మధ్యతరగతి రైతులకు కొద్దిగానూ మాత్రమే మన రుణసంస్థలు అప్పులు ఇస్తాయి. మిగిలిన చిన్న, సన్నకారు రైతులు సంస్థేతర రుణవనరులను, అంటే వడ్డీవ్యాపారులను ఆశ్రయించకతప్పదు. ప్రస్తుత రుణమాఫీ పథకం ఈ సంస్థేతర రుణవనరులకు వర్తించదు.
బ్యాంకుల జాతీయీకరణ సమయంలో వ్యవసాయరంగాన్ని ప్రాధాన్య రుణసహాయ రంగంగా గుర్తించి, బ్యాంకులు ఇచ్చే మొత్తం రుణాలలో కనీసం 18 శాతం వ్యవసాయరంగానికి అందేలా చూడాలని ఒక నియమం ఏర్పాటు చేశారు. నూతన ఆర్థిక విధానాల తర్వాత, బ్యాంకింగ్ రంగ సంస్కరణల తర్వాత ఆ నియమానికి నీళ్లు వదలడం జరిగింది. నిజానికి ఆ నియమాన్ని సక్రమంగా పాటించినా వడ్డీ వ్యాపారుల దగ్గర రైతుల రుణభారం ఇంతగా పెరిగి ఉండేది కాదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే బ్యాంకుల రుణాలలో వ్యవసాయరంగానికి 18 శాతం కన్న తక్కువగా రుణం అందగా ఏర్పడిన లోటు ఒక్క 2005-06 లోనే రు. 22,000 కోట్లు. అంటే ఇప్పుడు రుణమాఫీగా భారీగా ప్రకటిస్తున్న మొత్తం గత మూడు నాలుగు సంవత్సరాలలో వ్యవసాయరంగానికి న్యాయంగా అందవలసిన రుణం కన్న తక్కువేనన్నమాట.
సహకారరంగంలో స్వల్పకాలిక రుణవ్యవస్థను మెరుగు పరచవలసిన అవసరం గురించి ప్రొ. వైద్యనాథన్ కమిటీ ఇచ్చిన సిఫారసుల ప్రకారం 17 రాష్ట్రాలకు నిధులు విడుదల చేయదలచుకున్నామని, మొదటి విడతగా నాలుగు రాష్ట్రాలకు నిధులు విడుదల చేశామని చిదంబరం గంభీరంగా ప్రకటించారు. కాని ఆ వాగాడంబరాన్ని దాటి లోపలికి వెళ్లి చూస్తే మొత్తం 17 రాష్ట్రాలకు కేంద్రం తయారు చేసిన పథకం రు 3,074 కోట్లు, నాలుగు రాష్ట్రాలకు కేటాయించిన నిధులు రు. 1185 కోట్లు మాత్రమే.
అవన్నీ అట్లా ఉంచి, నాలుగుకోట్ల రైతులకు లబ్ధి పథకంగా ఇప్పుడు ప్రకటిస్తున్న మొత్తం రు. అరవైవేలకోట్లు కాగా రక్షణ వ్యయంలో గత మూడు సంవత్సరాల పెరుగుదలతో అది సమానం. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతిదారులకు (వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు) అందిన ప్రోత్సాహకాల విలువ రు. 58,416 కోట్లు. భారత పారిశ్రామిక, వ్యాపారవర్గాలకు పన్నుల రాయితీలుగా, మినహాయింపులుగా, పన్ను సెలవుగా అందిన మొత్తం రు. 58,655 కోట్లు. (వారు రు. 5,56,190 కోట్లు లాభాలు చేసుకుని, పన్ను చెల్లించినది మాత్రం రు. 3,41,606 కోట్లకు మాత్రమే. అంటే రు. 2,14,584 కోట్ల లాభాన్ని వ్యాపారవేత్తలు ఎటువంటి పన్నులు చెల్లించకుండా తమ బొక్కసాల్లో నింపుకున్నారన్నమాట). ఎక్సైజ్ సుంకాలపై రాయితీల రూపంలో భారతప్రభుత్వ ఖజానా పోగొట్టుకున్నది రు. 87,992 కోట్లు.
ఈ ప్రజాస్వామిక, సర్వసత్తాక, గణతంత్ర పాలనలో ఎవరు లాభపడుతున్నారు? ఎవరు నష్టపోతున్నారు? ఎవరి పేరుచెప్పుకుని ఎవరు బతుకుతున్నారు? ప్రగల్భాలు పలుకుతున్నారు?