కొత్త నిజాములది ఎవడబ్బ సొమ్ము?!

రెండు మూడు రోజుల కింద పత్రికల్లో ఒక చిన్న వార్త వచ్చింది. లోపలిపేజీల్లో అప్రధానంగా వచ్చిన ఆ వార్త పెద్దగా ఎవరి దృష్టినీ ఆకర్షించి ఉండకపోవచ్చు. రాష్ట్రంలో పనిచేసిన ఒక మాజీ అత్యున్నతాధికారి రాజధానీ నగరంలోని ఒక ఐదు నక్షత్రాల హోటల్ లో తన చేతిగడియారం పోగొట్టుకున్నారట. ఆ చోరీలో అసాధారణమేమీ లేదుగాని ఆ గడియారం ఖరీదు చదివితే కళ్లు బైర్లు కమ్మాయి. దాని ఖరీదు అక్షరాలా రెండులక్షల రూపాయలట. చోరీని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు మాత్రం దాని ఖరీదు ఎనభైవేల రూపాయలు మాత్రమే అన్నారట. ఈ రెండు మాటల్లో ఏ మాట నిజమయినా అది ఈ రాష్ట్రంలో లక్షలాది మంది సంవత్సరాదాయం కన్న ఎక్కువనే మాట మాత్రం నిజం.

ఆ వార్త మరొక పాత వార్తను కూడ గుర్తుకు తెచ్చింది. నాలుగైదు సంవత్సరాల కింద రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు ఒక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు ఆయనతో పాటు తీసుకుపోతున్న సూట్ కేసుల బరువుకే ఆ హెలికాప్టర్ కూలిపోయిందనే మాటల్లో నిజం ఉందో లేదో తెలియదుగాని, ఆ గౌరవనీయ నాయకుడి పార్థివదేహం మీద ఉన్న ఉంగరాలు, గొలుసులు, ఇతర ఆభరణాల విలువ రెండుకోట్ల రూపాయల పైచిలుకేనని పత్రికలు రాశాయి.

వేలాది, లక్షలాది రూపాయలు విలువచేసే ఆభరణాలు, పెన్నులు, కళ్లజోళ్లు, దుస్తులు, పాదరక్షలు, గడియారాలు, వాహనాలు, యవ్వన ఔషధాలు, గృహోపకరణాలు, గృహాలంకరణ సామగ్రి, తినుబండారాలు, ఆటవస్తువులు, కోట్లాది రూపాయల విలువచేసే ఇళ్లు, స్థలాలు, పొలాలు వంటివాటి గురించి, ఈ విలాస, సంపన్న వస్తువులు పెరిగిపోవడం గురించి వార్తలు విరివిగా వస్తూనే ఉన్నాయి. జూబిలీ హిల్స్ వైపో, ప్రశాసన నగర్ వైపో, మాదాపూర్ వైపో, లేదా నగరానికి నాలుగువైపులా పెరిగిపోతున్న ఫార్మ్ హౌజ్ ల వైపో చూస్తే కోట్లాది రూపాయల విలువ చేసే ఇళ్లు, లక్షల రూపాయల విలువ చేసే అలంకరణ సామగ్రి కనబడతూనే ఉన్నాయి. ఇక ఇటీవలి విందులలో అలంకరణకు, ఆడంబరాలకు పెడుతున్న విపరీతమైన ఖర్చు అలా ఉంచి, పారవేస్తున్న మిగిలిపోయిన ఆహారపదార్థాలు చూసినా కొన్ని వందలమందికి సరిపోయేలా ఉంటున్నాయి.
గతంలోకూడ సంపన్నులు ఉండేవారు గాని ఇప్పటిలా వారు తమ సంపదను ఇంత బహిరంగంగా, ఆడంబరంగా, అసహ్యకరంగా ప్రదర్శించిన ఉదాహరణలు తక్కువ. కొంతమంది ఇతరులకన్న ఎక్కువ భోగాలు అనుభవించేవారే గాని అలా అనుభవించడంలోనే తమ ఆభిజాత్యం ఉందన్నట్టుగా ప్రవర్తించేవారు కాదు. అద్దాలమేడల్లో అందరికీ కనబడేలా కూచుని అందరికీ లేని ఎన్ని విలాసాలు తాము అనుభవిస్తున్నామో చూడమన్నట్టు ఉండేవారు కాదు. ప్రపంచంలోకెల్లా రెండవ అత్యంత ధనికుడుగా పేరు తెచ్చుకున్న హైదరాబాదు ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కూడ తన పాతకోటునే కొన్ని ఏళ్లపాటు ధరించాడనీ, కొత్త కోటును ఎక్కువధరకు కొన్నందుకు సేవకులను శిక్షించాడనీ కథలు ఇప్పటికీ వింటూనే ఉంటాం.

మరి ఈ నయాసంపన్నుల జీవనశైలి ఎక్కడినుంచి వచ్చింది? అందులోనూ నిరాడంబరత్వమే అనుసరణీయమనే విలువలు ఉన్నచోట, అత్యధిక సంఖ్యాకులకు అనివార్యమైనచోట ఈ ప్రదర్శనాకాంక్ష చివరికి ఎక్కడికి దారితీస్తుంది? ఈ అంతరం చివరికి ఎట్లా విస్ఫోటనమవుతుంది?

ఈ నయాసంపన్నులు జీవితాన్ని అనుభవిస్తున్న తీరు గురించి ఎవరూ అసూయ చెందనక్కరలేదు. వారి విలాసాలను, భోగాలను చూసి ఈర్ష్యతో వారిమీద ద్వేషం పెంచుకోనక్కరలేదు. కాని ఈ సంపదకు సంబంధించి గుర్తించవలసిన, చర్చించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి.
ఒకవైపేమే ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నదనీ, అనారోగ్యంతో ఉన్నదనీ, విదేశీ రుణాలు తప్ప మరొక మార్గం లేదనీ, మరింత పన్నులు వెయ్యక తప్పదనీ అంటూ ఉండగా ఈ పిడికెడుమంది సంపన్నులదగ్గర ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి సంపద ఎక్కడినుంచి వస్తోంది? సామాజిక ఆర్థిక వ్యవస్థ అనారోగ్యంగా ఉండడానికీ, కొందరి వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థలు ఈరకంగా వికసించడానికీ సంబంధం ఏమిటి? దేశంలో సగం మంది రోజుకు వందరూపాయల కన్న తక్కువ తలసరి ఆదాయంతో జీవిస్తున్నారని ఒకవైపు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ప్రకటిస్తుండగా, దేశంలో ఏడాదికేడాదికీ డాలర్ బిలియనీర్లు (వేలకోట్లరూపాయల అధిపతులు) ఎట్లా పెరుగుతున్నారు? అంతర్జాతీయ ద్రవ్య వ్యవహారాల పత్రిక ఫోర్బ్స్ అంచనా ప్రకారం భారతదేశంలో 2006 లో తొమ్మిది మంది డాలర్ బిలియనీర్లు ఉండగా, 2007 లో 36 మంది అయ్యారు. 2017 నాటికి ప్రపంచంలో అన్నిదేశాలలో కన్న ఎక్కువమంది డాలర్ బిలియనీర్లు భారతదేశంలోనే ఉంటారట. అసలు ఈ సంపన్నులు ఎట్లా సంపన్నులు అయ్యారు? వాళ్ల ఇళ్లలో ఏమయినా డబ్బులు కాసే చెట్లు మొలిచాయా? పాతరోజుల్లో అయితే ఇలాంటి నడమంత్రపు సిరికి ఏవో లంకెల బిందెలు దొరకడమో, లాటరీలో ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు రావడమో, పేకాటలోనో మరోజూదంలోనో గెలుచుకోవడమో, వ్యాపారంలో కలిసి రావడమో ఏదో ఒక కారణం చెపుతుండేవారు.

పై ఉదాహరణల్లో చెప్పిన ఇద్దరూ ఆ సంపదను వ్యాపారాలలో గడించారనడానికి లేదు. వాళ్లేమీ వ్యాపారాలు చేయలేదు. ఆ ఉన్నతాధికారి భార్య పిల్లలను అమ్మే వ్యాపారం చేసేదని ఆరోపణలు వచ్చాయిగాని ఆ ఆరోపణలు నిజం కాదని, తాము ఏవ్యాపారాలు చేయలేదనీ వాళ్లే అన్నారు. వాళ్లకు ప్రభుత్వోద్యోగం తప్ప మరొక ఆదాయమార్గమేమీ ఉన్నట్టుగా ఎప్పుడూ వినలేదు. లాటరీల్లోనో జూదాల్లోనో కలిసిరాలేదు. చనిపోయిన రాజకీయ నాయకుడి సంగతి కూడ అంతే. అంటే వారి ఆదాయమార్గాలు అన్నీ బహిరంగంగా ప్రభుత్వానికి తెలిసిన సక్రమమైన ఆదాయ మార్గాలేనన్నమాట. మరి చనిపోయిన రాజకీయ నాయకుడు ఒక ఉన్నత పదవిలో ఉండినప్పటికీ, దానివల్ల సౌకర్యాలు, అదనపు సహాయకులు, వాహనాలు, ఖర్చులు అందాయనుకున్నప్పటికీ, అంతకుముందరి ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితంలోని సంపాదన అంతటినీ, కుటుంబ ఖర్చులన్నిటినీ లెక్కవేసిన తర్వాత ఒక్క శరీరం మీదనే రెండుకోట్ల రూపాయల ఆస్తి ఉన్నదంటే ఆ సంపద ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించకతప్పదు. ఇక మాజీ ఉన్నతోద్యోగి తాజా కథనంలోనయితే ఆయన మూడు దశాబ్దాల పాటు ఉద్యోగం చేసి పదవీవిరమణ పొందినప్పటికీ, పదవీవిరమణ సదుపాయాలన్నీ కలిపి కొన్ని లక్షలరూపాయలయినా చేతికందినప్పటికీ రెండులక్షల రూపాయల చేతిగడియారం కొనగలగడం కష్టసాధ్యమే.

అంటే ఈ రాజకీయ నాయకులకు, ఉన్నతోద్యోగులకు వారి జీతభత్యాలను మించిన, తెలిసిన ఆదాయ వనరులకు మించిన మరేవో వనరులు ఉండి ఉండాలి. వారిపదవుల వల్ల, వారు ప్రజాధన నిర్వాహకులుగా ఉండడం వల్ల పొందిన అక్రమ సంపాదన అయి ఉంటుందా?

శ్రీ రామచంద్రుడు భగవంతుడనీ, అతనే సర్వస్వమనీ నమ్మిన భక్త రామదాసు కూడ వాస్తవం మాట్లాడవలసి వచ్చినప్పుడు సీతమ్మకు చేయించిన చింతాకు పతకం గురించి మాట్లాడాడు. ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతున్నావు’ అని తన రాముడినే నిలదీశాడు. మరి మనం మన రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు, ఉన్నతాధికారులు ధరిస్తున్న చింతాకు పతకాలకింద ఎంత దేశసంపద వ్యర్థమైపోతున్నదో ప్రశ్నించనక్కరలేదా?

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in ParamarthaSatyam, Telugu. Bookmark the permalink.

One Response to కొత్త నిజాములది ఎవడబ్బ సొమ్ము?!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s