బియ్యం పథకం ఔదార్యం కాదు, అనివార్యం

రాష్ట్రప్రభుత్వం మళ్లీ ఒకసారి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించింది. ఇరవై ఐదు సంవత్సరాల కింద కొత్తగా రాజకీయాలలోకి ప్రవేశిస్తూ ఎన్ టి రామారావు ప్రారంభించిన ఈ పథకం అప్పటినుంచి ఇప్పటివరకు అనేకమంది ముఖ్యమంత్రుల కింద అనేక రకాలుగా మారుతూ వచ్చి డా. వై ఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో మళ్లీ మొదటికి వచ్చింది. మహా ఆర్భాటంగా, ఎన్నికల ఎత్తుగడగా, ప్రతిపక్షాల విజయావకాశాలను చెదరగొట్టే అస్త్రంగా ఉనికిలోకి వస్తున్న ఈ పథకానికి రెండు వైపుల నుంచీ అతిశయోక్తులతో కూడిన ప్రశంసలూ విమర్శలూ చెలరేగుతున్నాయి. ఎద్దుల కుమ్ములాటలో లేగదూడల కాళ్లు విరిగినట్టు ఈ అతిశయోక్తుల యుద్ధంలో వాస్తవాలు, సరయిన విశ్లేషణలు, పథకపు అవసరం, పథకాన్ని విస్తరించవలసిన అవసరం అంతర్ధానమవుతున్నాయి.

రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రభుత్వపక్షం చెప్పుకుంటున్నట్టు కేవలం ప్రజాసంక్షేమ దృష్టితో, పేదప్రజల ఆహారభద్రత లక్ష్యంతో సాగుతున్న పాలకపక్షపు ఔదార్యపూరిత కార్యక్రమం కాదు. పాలకులెవరయినా, ఏ జెండాలవాళ్లయినా గత ఆరు దశాబ్దాలుగా ప్రజాజీవనం పట్ల సాగిస్తున్న దుర్మార్గానికి, నిర్వాకానికి ప్రాయశ్చిత్తంగా, ప్రజలకు చేసిన నష్టాలకు పరిహారంగా అనివార్యంగా అమలు చేయవలసివస్తున్న పథకం అది.

ఆ పథకం ప్రతిపక్షాలు చెపుతున్నట్టు మరొకరికి అనుకరణో, ఎన్నికల ఎత్తుగడో మాత్రమే కాదు, అది ఈ రాష్ట్రపు పేదప్రజల సహజమైన హక్కు. ప్రజల శ్రమను, సంపదలను, ఉమ్మడి వనరులను దోచుకుని పాలకులు, వారి ఆశ్రితులు పోగుచేసుకున్న వేలరెట్ల, కోట్ల రూపాయల ఆస్తుల గురించి ప్రజలు నిలదీయకుండా ఉండేందుకు ఒక రక్షణకవచంగా, ఉపశమనంగా, ప్రజల హక్కుకు గుర్తింపుగా విదిలిస్తున్న ఒక చిన్నభాగం మాత్రమే.

అది కొంతమంది మేధావులు భావిస్తున్నట్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దిగజార్చే ప్రజాకర్షక (పాపులిస్టు) పథకం కాదు, ప్రజల ఇబ్బందులలో అతి స్వల్ప భాగాన్నయినా సరే తీర్చగలిగే తప్పనిసరి చర్య. అసలు ప్రజలకు అందవలసిన నిధులలో కొద్దిభాగాన్ని ప్రజలకు ఇవ్వడాన్ని పాపులిస్టు చర్యగా అభివర్ణించి వ్యతిరేకించడమే అన్యాయం.

ప్రభుత్వం, పాలకపక్షం తామేదో పేదప్రజల పట్ల అభిమానంతో, ప్రజాసంక్షేమం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ప్రకటిస్తున్నాయి గాని, అసలు ఆ ప్రకటనలోనే గుర్తించదగిన లోపాలున్నాయి. ఈ పథకం కోసం సాలీనా దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు తాను సబ్సిడీగా వెచ్చించవలసివస్తుందని, ఒకకోటీ ఎనభైఎనిమిది లక్షల తెల్లకార్డుల లబ్ధిదారులకు, అంటే ఆరుకోట్లమంది ప్రజలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం ప్రకటిస్తోంది.

రాష్ట్రంలో తెల్లకార్డుల సంఖ్య ఎంత? తెల్లకార్డుల సంఖ్యకూ, మొత్తం కుటుంబాల సంఖ్యకూ, రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం తెల్లకార్డు పొందడానికి అర్హత ఉన్న కుటుంబాల సంఖ్యకూ ఏమన్నా పొంతన ఉన్నదా?

రాష్ట్ర జనాభా ఎనిమిది కోట్ల ఇరవైరెండు లక్షలు అని, అందులో 85 శాతం ఈ పథకం వల్ల లబ్ధి పొందుతారని, 1.88 కోట్ల తెల్లకార్డుల కుటుంబాలు లబ్ధి పొందుతాయని ముఖ్యమంత్రి అన్నారు. ఈ మూడు అంకెలమధ్య పొంతన లేదు. జనాభా సంఖ్యను గనుక ప్రమాణంగా తీసుకుంటే ఆరు కోట్ల మంది అంటే 70 శాతం అవుతారు. 85 శాతం లబ్ధిదారులంటే ఏడుకోట్లమంది కావాలి!

ఈ అంకెలగారడీ అసలు వాస్తవమేమంటే, రాష్ట్రంలో 2001 జనగణన ప్రకారం జనాభా ఏడుకోట్ల అరవై లక్షలు కాగా, మొత్తం కుటుంబాల సంఖ్య 1,68,49,857. సాధారణంగా జనగణనలో హౌజ్ హోల్డ్ అనే ప్రమాణమే ఉంటుంది. అది స్థూలంగా ఇల్లు అని చెప్పుకోవచ్చు, సరిగ్గా కుటుంబం కాకపోవచ్చు. ఒక్కో ఇంటిలో ఒకటికన్న ఎక్కువ కుటుంబాలు ఉండవచ్చు. కాని 2001 జనగణన హౌజ్ హోల్డ్స్ కు సంబంధించి చాల వివరాలు సేకరించింది. దానిలో హౌజ్ హోల్డ్స్ సంఖ్యతో పాటు ఆ ఇళ్లలో ఉన్న వివాహిత జంటల సంఖ్యను కూడ లెక్కపెట్టింది. దానిప్రకారం రాష్ట్రంలో మొత్తం 1,77,42,719 వివాహిత జంటలున్నాయి. అప్పటినుంచి గడిచిన ఆరు సంవత్సరాలలో మొత్తం జనాభాలో పది శాతం పెరుగుదల ఉంది గనుక కుటుంబాల సంఖ్యలో కూడ అంతే పెరుగుదల ఉందనుకుంటే మొత్తం కుటుంబాల సంఖ్య రెండు కోట్లకు దాటడానికి వీలులేదు. మరొకవైపు నుంచి చూసినా మన రాష్ట్రంలో సగటు కుటుంబ పరిమాణం 5 కన్న తక్కువే గనుక 8.22 కోట్ల జనాభాకు 1.64 కోట్ల కుటుంబాలకన్న ఎక్కువ ఉండడానికి వీలు లేదు. మొత్తంమీద ఎటునుంచి ఎటు చూసినా కుటుంబాల సంఖ్య 1.60 కోట్ల నుంచి 2 కోట్ల మధ్య మాత్రమే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 30 శాతం మాత్రమే దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు గనుక తెల్లకార్డులు 55 లక్షల నుంచి 66 లక్షల కన్న ఎక్కువ ఉండడానికి వీలులేదు. మరి కేవలం తెల్లకార్డుల సంఖ్యే మొత్తం కుటుంబాల సంఖ్య కన్న ఎక్కువ ఉంది.

నిజానికి ఈ జనాభాకూ తెల్లకార్డుల సంఖ్యకూ మధ్య ఉన్న అంతరం గురించి 1992లోనే గుర్తించిన కె ఆర్ వేణుగోపాల్ రాష్ట్రంలో మొత్తం కుటుంబాల సంఖ్య కన్న తెల్ల, గులాబీ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని ప్రకటించారు. ‘ఇండియాస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం – ఎ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్’ అని 1997లో ప్రపంచబ్యాంకు కోసం చేసిన అధ్యయనంలో ఆర్ రాధాకృష్ణ, కె సుబ్బారావు కూడ ఈ అంకెలగారడీని, బోగస్ కార్డుల సమస్యను ప్రస్తావించారు.

కనుక ఈ పథకం వల్ల ఎంతమందికి లాభం చేకూరుతుంది, ఎన్నికోట్లు ఖర్చు అవుతుంది అనేవన్నీ కాకిలెక్కలేతప్ప, విశ్వసనీయమైన, కచ్చితమైన సమాచారం లేదు. ఆ సంగతి గుర్తిస్తూనే, అసలు ఇటువంటి పథకం వచ్చిన సందర్భాన్ని, ఉండవలసిన అవసరాన్ని కూడ గుర్తించవలసి ఉంది.

విదేశీపాలన రద్దయిందని అనుకున్నతర్వాత నాలుగు దశాబ్దాలకు కూడ జనాభాలో అత్యధికులకు రోజుకు రెండుపూటల ఆహారం చౌకగా అందే పరిస్థితి లేకపోవడం, మరొకవైపు ఆహారధాన్యాల దిగుబడి జనాభా పెరుగుదల కన్న గణనీయంగా ఎక్కువగా ఉన్నప్పటికీ ఆహారభద్రత కల్పించడంలో, న్యాయమైన, సమానమైన పంపిణీని ప్రోత్సహించడంలో పాలకులు విఫలమయ్యారని గుర్తించడం ఫలితంగా 1960ల నుంచీ ఎన్నో రాజకీయార్థిక సంచలనాలు పాలకవిధానాలను ఎదిరిస్తూ వచ్చాయి. అందువల్లనే ఇందిరాగాంధీ రోటీ కపడా ఔర్ మకాన్ అనీ, భూసంస్కరణలు అనీ అనవలసి వచ్చింది. ఆ నినాదాల భ్రమలు కూడ ఒక దశాబ్దం కన్న ఎక్కువ నిలవని స్థితిలో దేశభద్రత, రక్షణ ప్రమాదం, తీవ్రవాదం అనే కొత్తబూచిలను చూపి ప్రజల కళ్లు కప్పడం మొదలయింది. ఆ దశలో రాజకీయాలలోకి ప్రవేశించిన ఎన్ టి రామారావు కొంత నిజంగానూ, కొంత పాలకవర్గ ఎత్తుగడలలో భాగంగానూ రెండురూపాయలకు కిలో బియ్యం పథకాన్ని అమలులోకి తెచ్చారు.

ప్రజా ఆగ్రహాన్ని పక్కదారి పట్టించడానికి ఒక ఎత్తుగడగా ఇది పనికి వచ్చినప్పటికీ, ఇది ప్రజాసంక్షేమ రాజకీయాలకు చిహ్నంగనుక ఇది కొనసాగగూడదని ప్రపంచబ్యాంకు దగ్గరినుంచి స్థానిక సంపన్నుల వరకూ అందరూ ఈ పథకం మీద కత్తి కట్టారు. ఒక దశాబ్దం తర్వాత చంద్రబాబు నాయుడు పాలనాకాలానికి ప్రజలను భ్రమల్లో ముంచడానికి అభివృద్ధి మాయాజాలం వచ్చింది గనుక, రొట్టెలు అడిగేవాళ్లకు సర్కస్ ఇద్దాం అనే పెట్టుబడిదారీ సలహాదార్లు వచ్చారు గనుక ఆకలిగొన్న ప్రజలకు కొంత ఉపశమనంగా ఉండే ఈ పథకం బదులు, ఫ్లై ఓవర్లు, మల్టిప్లెక్సులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జిలుగులు, విదేశీ అనుకరణలు వచ్చాయి. ప్రజల ఆహార అవసరాలలో అతికొద్ది భాగాన్నయినా తీర్చే సంక్షేమపథకం ప్రపంచీకరణ గాలికి కొట్టుకుపోయింది.

ఆ పథకం ఇప్పుడు ఎన్నికల అవసరం కోసమయినా మళ్లీ పునరుత్థానమయినందుకు సంతోషించాలి. దీన్ని మరింత విస్తరించాలనీ, కుటుంబానికి అవసరమైనంత బియ్యం ఇచ్చేలా సవరించాలనీ, నిజంగా అవసరమయిన పేదలకే అందేలా చూడాలనీ, మంత్రుల, శాసనసభ్యుల, అధికారుల అవినీతి, రక్షణ సౌకర్యాల, విలాసాల ఖర్చుల ముందు రెండువేలకోట్ల సబ్సిడీ ఒక లెక్కకాదనీ, ఈ సబ్సిడీ ఇంకా పెరిగినా ఫరవాలేదనీ అవగాహన పెంచవలసి ఉంది. ప్రజాపంపిణీ వ్యవస్థను, చౌకధరల దుకాణాల విధానాన్ని బలోపేతం చేయడానికి ఒక తొలిమెట్టుగా ఈ బియ్యం పథకాన్ని వినియోగించుకోవలసి ఉంది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in ParamarthaSatyam, Telugu. Bookmark the permalink.

4 Responses to బియ్యం పథకం ఔదార్యం కాదు, అనివార్యం

 1. “…మంత్రుల, శాసనసభ్యుల, అధికారుల అవినీతి, రక్షణ సౌకర్యాల, విలాసాల ఖర్చుల ముందు రెండువేలకోట్ల సబ్సిడీ ఒక లెక్కకాదనీ …”

  ..ఉడతాభక్తిగా కొంత బియ్యం డీలర్లు, తెల్ల కార్డు దొంగలు కూడా ప్రజల సొమ్ముని అవినీతి చెయ్యాలని..

  ప్రచారం చేద్దాం.

  ఆహారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ? ప్రపంచంలో పెట్రోలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ? సాగుభూములన్నింటికీ నీరు అందుతోందా ? మునుముందు ప్రజలని వీటినుండి ఎలా రక్షించాలి ? ఉన్నడబ్బుని ఎంతజాగ్రత్తగా ఖర్చుపెట్టొచ్చు ?

  ఇవన్నీ మనకెందుకు !! ఖజానాని బార్లాతెరిచి ప్రస్తుతం ఎన్నికల్లో గెలుపొందితే చాలు. ప్రస్తుతంలో/భవిష్యత్తులో ఎంతమంది చచ్చినా తెల్ల చొక్కాలకు, పసుపు చొక్కాలకు, ఎరుపు చొక్కాలకు పట్టింపు లేదు.

 2. telugugreetings says:

  అన్నానికి ఆక్రోశించే బీదలకు అన్నంపెడితే తప్పు లేదు. కాని అది చేరవలసినచోటుకి చేరుతుందన్న నమ్మకంలేదు. “కార్యకర్తలకు” ఏలినవారి బహుమతిగా మారుతుందని పాత అనుభవాలు చెప్తున్నాయి. ఇది బ్రస్టు పట్టిన ప్రజా పంపినీ వ్యవస్తతో ఆడుతున్న ఆట.

  దూర్వాసుల పద్మనాభం

 3. gsnaveen says:

  ప్రజలను బియ్యం దాని ధరకే కొనే పరిస్థితికి తేవాలి, అదీ అభివృద్ది అంటే.

 4. అబ్రకదబ్ర says:

  బియ్యం కొనుక్కొని తినగలిగే స్థితికి పేదల్ని తేగలగలగాని కానీ ఉచితంగా ఇస్తూ పోవటమేంటి? దీనివల్ల ఎవరికి ఉపయోగం? రెండ్రూపాయలకే కిలో బియ్యం ఇవ్వటం వల్ల ఓపెన్ మార్కెట్ లో బియ్యం రేటు ఇంకా పెరిగి మిగతా జనాభా మీద మరింత భారం పడదా? రెండ్రూపాయలకీ, రూపాయికీ ఇవ్వటం వల్ల పేదల్లో బద్ధకం పెరుగుతుందే కానీ వాళ్లకేమీ ఒరగదు. పాతికేళ్ల నాడు మొదలెట్టిన ప్రహసనం పడుతూ లేస్తూ ఇంకా కొనసాగుతూనే ఉందంటేనే దానివల్ల ఆ పేదలకేమీ ఉపయోగం చేకూరలేదని అర్ధం. ఇలాంటివన్నీ ఓటు బేరాలే కానీ పేదలపై ఉన్నట్లుండి పుట్టిన ప్రేమకి తార్కాణాలు కాదు.

  http://anilroyal.wordpress.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s