ధరలు పైపైకి ఎక్కడికి వెళతాయి?

ఎన్నికల సంవత్సరం మొదలయింది గనుక రాజకీయ పక్షాలన్నిటికీ ప్రజల మీద ఎక్కడలేని ప్రేమ పుట్టుకువస్తోంది. ప్రజాసమస్యల మీద ఆందోళనలకు దిగడమూ, ఆ సమస్యల పరిష్కారానికి చిట్కాలు తమదగ్గర మాత్రమే ఉన్నాయనీ, అవతలిపక్షం ఆ సమస్యలను పరిష్కరించజాలదనీ అనడమూ రోజురోజుకూ ధరల లాగ, పాపంలాగ పెరిగిపోతున్నాయి. లోక్ సభకూ, అనేక రాష్ట్రాల శాసనసభలకూ పద్ధతి ప్రకారం జరిగినా సార్వత్రిక ఎన్నికలు సరిగ్గా పన్నెండు నెలల్లోకి వచ్చేశాయి. మరికాస్త ముందుకు జరుగుతాయని కూడ అంటే ఏడెనిమిది నెలల లోపే జరగవచ్చుననీ వదంతులు ఉన్నాయి.

సరిగ్గా ఈ సమయంలో అధికధరల మీద, నిత్యావసరవస్తువుల ధరలు నానాటికీ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడం మీద చర్చ మొదలయింది. ధరల పెరుగుదల అనేది ప్రతిమనిషినీ కలవరపరుస్తున్న సమస్యే. ఏది కొనబోయినా ధరలు చుక్కలనెక్కి కూచున్నాయని ప్రతిఒక్కరూ గుర్తిస్తూనే ఉన్నారు. అయితే అందరికీ తెలిసిన ఈ మామూలు సమస్య చుట్టూ అర్థశాస్త్రం పెద్ద మాయపొర కప్పింది. ధరల పెరుగుదలను ప్రభుత్వ, ఆర్థికశాస్త్ర పరిభాషలో ద్రవ్యోల్బణం అంటారు. ఆ మాటకు నిజమయిన అర్థమూ, అది గణించే పద్ధతీ ఎక్కువమందికి తెలియకపోయినా ఆ మాట పత్రికాపాఠకులందరికీ తెలుసు.

ద్రవ్యోల్బణం అంటే ద్రవ్యం విలువ తగ్గిపోవడం. మరో మాటల్లో ద్రవ్యరూపంలో సరుకుల విలువలు పెరిగిపోవడం. ద్రవ్యోల్బణం రేటు గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంత తగ్గింది, లేదా ఎంత పెరిగింది అని ప్రభుత్వం ప్రతివారం ప్రకటిస్తుంటుంది. మార్చ్ 2008లో 7.4 శాతం ద్రవ్యోల్బణం నమోదయిందని, 2004 నవంబర్ తర్వాత ఇది అతి హెచ్చు స్థాయి అనీ ప్రభుత్వం ప్రకటించింది. ఆహారపదార్థాల ధరలు, లోహాల ధరలు, చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఇంతగా పెరిగిందని అంటున్నారు. ఈ పెరుగుదలను అరికట్టడానికి తక్షణ చర్యలుగా ప్రభుత్వం కొన్ని సరుకుల ఎగుమతులపై తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించింది. కొన్ని సరుకుల దిగుమతులపై సుంకాలను తగ్గించింది. ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు ఐదు శాతాన్ని మించడం మంచిది కాదని రిజర్వ్ బ్యాంక్ భావిస్తుంది. కాని దాదాపు రెండు సంవత్సరాలుగా ద్రవ్యోల్బణం రేటు ఆరు శాతం దాటి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చి ప్రస్తుతం ప్రకటిస్తున్న 7.4 శాతానికి చేరింది.

నిజానికి మనదేశంలో ద్రవ్యోల్బణాన్ని గణించే పద్ధతే చాల లోపభూయిష్టమైనది. ద్రవ్యోల్బణాన్ని అమెరికా, గ్రేట్ బ్రిటన్, చైనా, జపాన్, ఫ్రాన్స్, కెనడా, సింగపూర్ వంటి దేశాలలో వినియోగదారుల ధరల సూచి (కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ – సిపిఐ) ఆధారంగా గణిస్తూ ఉండగా, మనదేశంలో మాత్రం టోకు ధరలసూచి (హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ – డబ్ల్యుపిఐ) ఆధారంగా గణిస్తున్నారు. ఎప్పుడైనా ధరలు వినియోగదారులమీద, ప్రజలమీద ఎటువంటి భారంవేస్తాయో చూడాలి గనుక ధరల పెరుగుదలను అట్టడుగు స్థాయిలోని వినియోగదారులు వాడే సరుకుల ధరల సూచిలో మార్పుల ఆధారంగానే లెక్కించాలి. మనదేశంలో వినియోగదారుల ధరల సూచిని నాలుగు స్థాయిలలో – పారిశ్రామిక కార్మికులు, పట్టణ శారీరకేతర శ్రామికులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ శ్రామికులు – గణించడమైతే ఉంది గాని ఆ సూచిని మాత్రం ద్రవ్యోల్బణాన్ని లెక్కపెట్టే వనరుగా తీసుకోరు. అంతేకాదు, ఈ వినియోగదారుల ధరలసూచిని నెలకొకసారి గణిస్తారు. ఎప్పుడో రెండుసంవత్సరాల తర్వాత ప్రకటిస్తారు.
ఇక టోకుధరల సూచి అనేది మనదేశంలో ఎప్పుడో 1902 లో లెక్కపెట్టడం మొదలుపెట్టారు. ప్రస్తుతం మొత్తం 430 పైచిలుకు సరుకుల టోకుధరల ఆధారంగా ఈ సూచి తయారవుతుంది. ఈ వందలాది సరుకులలో వాడకంలో ఉన్నవీ ఉన్నాయి, ఎప్పుడో కనుమరుగయినవీ ఉన్నాయి. ప్రధానంగా ఈ సూచి వ్యాపారవేత్తలకు తమ ఉత్పత్తుల ముడిసరుకుల ధరల విషయంలో ఉపయోగపడేదే తప్ప వినియోగదారులకు ఉపయోగపడేది కాదు. ఈ సూచిని మాత్రం ప్రతివారం లెక్కించి దాని ఆధారంగానే ద్రవ్యోల్బణాన్ని అంచనా కట్టడం జరుగుతోంది.

అంతకన్న పెద్ద అర్థశాస్త్ర పాఠం అక్కరలేదుగాని, ‘ధరలు పెరుగుతున్నాయి, ప్రజాజీవనం దుర్భరంగా మారుతోంది’ అని మామూలు మాటల్లో చెప్పవలసినదాన్ని ద్రవ్యోల్బణం అనే తిలకాష్టమహిషబంధనంగా తయారు చేసి, అందులోనూ అపసవ్యపు గణాంకాలను జోడించి ప్రజలను మాయ చేయడం జరుగుతోందని మాత్రం గుర్తించవలసి ఉంది.

ఇలా దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్నదని వార్తలు రాగానే విభిన్న రాజకీయ పక్షాల స్పందన ఆశ్చర్యకరంగా ఉంది. ప్రజాజీవనంలో భాగంగా ఉండి తామే మొదట గుర్తించి ఆందోళన జరపవలసిన రాజకీయపక్షాలు రిజర్వ్ బ్యాంకో, ఆర్థికమంత్రిత్వశాఖో ప్రకటించినతర్వాతనే ఆ సమస్య తమకు అప్పుడే తెలిసినట్టుగా ఇల్లెక్కి అరవడం మొదలుపెట్టాయి. ఈ ద్రవ్యోల్బణం కొత్త ఏమీ కాదని, ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నదేనని, చైనాలోనయితే గత పన్నెండుసంవత్సరాలలో ఎన్నడూ లేనంత హెచ్చు స్థాయిలో ద్రవ్యోల్బణం ఉన్నదని కాంగ్రెస్ పార్టీ తేల్చేసింది. ఫలానా తేదీలోగా ధరలు తగ్గించకపోతే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని వామపక్షాలు అంటున్నాయి. ధరల పెరుగుదలను ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోయిందో వివరిస్తూ శ్వేతపత్రం ప్రకటించాలని భారతీయ జనతాపార్టీ కోరుతోంది. బహుళజాతిసంస్థలకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతు వల్లనే ధరలు పెరుగుతున్నాయని తెలుగుదేశం ప్రకటించింది.

ఈ వ్యాఖ్యానాలలో కొంత నిజమూ ఉంది, కొంత అబద్ధమూ ఉంది. ధరల పెరుగుదల గురించి గత ఐదారు నెలలుగా ప్రపంచదేశాలన్నీ గగ్గోలు ఎత్తుతున్న మాటనిజమే. దాదాపు ప్రతిదేశం లోనూ ఈ సమస్య గురించి చర్చ జరుగుతోంది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆకలిదాడులు, లూటీలు, అశాంతి, రాజకీయ కల్లోలాలు జరుగుతాయని ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధిసంస్థ, ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు వంటి ద్రవ్యసంస్థలు, అంతర్జాతీయ పత్రికలు హెచ్చరిస్తున్నాయి. జింబాబ్వేలో అత్యధిక స్థాయిలో ద్రవ్యోల్బణం పెరుగుదల 10,000 శాతంగా ఉందని పత్రికలు రాస్తున్నాయి. హైతీలో ధరల పెరుగుదల ఎంత విపరీతంగా ఉండిందంటే బియ్యం ధరలు డిసెంబర్ 2007కూ మార్చ్ 2008కీ మధ్య మూడు నెలల్లో రెట్టింపు అయ్యాయి. ఆ ధరల పెరుగుదల వల్ల హైతీలో దేశవ్యాప్తంగానూ, ప్రత్యేకించి రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్ లోనూ ఘర్షణలు, లూటీలు, గృహదహనాలు జరిగి చివరికి ప్రధానమంత్రి పదవినుంచి దిగిపోవలసివచ్చింది.

ఈ ధరలపెరుగుదలకు నైసర్గిక కారణాలకన్న ఎక్కువగా రాజకీయార్థిక విధానాల దుష్పరిణామాల కారణాలే ఉన్నాయి. ప్రపంచీకరణ విధానాలవల్ల అంతర్జాతీయ మార్కెట్ ప్రయోజనాలకోసం అవసరమైన పంటలే పండిస్తూ ఆహారధాన్యాల దిగుబడి తగ్గించడం, ఎగుమతి-దిగుమతుల విధానాలను సడలించడం, సంక్షేమరాజ్య భావనలకు తిలోదకాలు వదిలి ప్రజల ఆహారభద్రతకు గండి కొట్టడం,నిత్యావసర సరుకులలో ప్రజాపంపిణీ వ్యవస్థలను ధ్వంసం చేయడం, చిల్లర వ్యాపారంలోకి విదేశీ బహుళజాతి సంస్థలను ఆహ్వానించి నిత్యావసర వస్తువుల ధరలపై నియంత్రణలను సడలించడం, ధరలస్థిరీకరణ విధానాలను వదిలివెయ్యడం వంటి అనేక కారణాలవల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.

ధరలు అలా పెరిగిపెరిగి చివరికి ఏమి జరుగుతుందో హైతీ సాంఘిక, రాజకీయ పరిణామాలు చూపుతున్నాయి. దేశదేశాల సంపన్నులకు, బహుళజాతిసంస్థలకు, ప్రపంచీకరణ శక్తులకు ఊడిగం చేస్తూ ఆ క్రమంలో తమ బొక్కసాలు నింపుకోవడంలో మైమరిచిపోతున్న భారత పాలకులు తమ గద్దెలు కూలిపోయే పరిణామాలనైనా గుర్తిస్తారా?

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in ParamarthaSatyam, Telugu. Bookmark the permalink.

2 Responses to ధరలు పైపైకి ఎక్కడికి వెళతాయి?

 1. అవును. ఎకనామిస్టులు “ద్రవ్యోల్బణం” లాంటి తిరకాసు పదాలతో గోల్ మాల్ చేస్తున్నారు. అసలు కారణాలు రాజకీయార్థిక విధానాలు.

  ప్రజలని ఎంత అమాయకంగా మభ్యపెడుతున్నారండి ! సూపర్.

  > చిల్లర వ్యాపారంలోకి విదేశీ బహుళజాతి సంస్థలను ఆహ్వానించి నిత్యావసర వస్తువుల ధరలపై నియంత్రణలను సడలించడం

  వాల్ మార్ట్ లాంటీ సంస్థలు వస్తే చిల్లర దుకాణాలలో వస్తువుల ధరలు తగ్గుతాయే కానీ పెరగవు. వీటిని వ్యతిరేకించడం వెనక అసలు కారణం మన బుడుగు చిల్లర వ్యాపారుల వ్యాపారాలు నాశనం అవుతాయని. మంచిదే. కానీ, ధరల పెరుగుదలకి వీటికి ఏ సంబంధం లేదు.

  > నైసర్గిక కారణాలకన్న ఎక్కువగా రాజకీయార్థిక విధానాల దుష్పరిణామాల కారణాలే ఉన్నాయి

  చైనాలో ప్రజలు సంపన్నులు అవడం వలన మాంసాహారం ఎక్కువ తింటున్నారు. పశువులకి సోయా లాంటి మొక్కలు ఆహారం సాగు చెయ్యడం కోసం మునుపటికంటే 7 రెట్లు నీరు ఎక్కువ అవసరం అవుతోంది. ప్రపంచంలో నీరు లేక భూములు ఎండిపోతున్నాయి. ఆస్ట్రేలియా గోధుమలని ఎగుమతి చెయ్యడం ఆపేసింది. మన దేశం, థాయిలేండు వరిని ఎగుమతి చెయ్యడం ఆపేసాయి. అంతర్జాతీయంగా, ఆహార ధరలు పెరగడానికి కారణం నీటి కొరత.

  దీనికి తోడు వస్తువులను రవాణా చెయ్యడానికి అవసరమయ్యే పెట్రోలు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కారణం మళ్ళీ, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా, ఇండియా ల పెట్రోలు దాహమే.

  ఈ పరిస్థితులు ఇప్పట్లో మారవు. వస్తువుల ధరలు పెరగకుండా ఆపాలంటే ఒక ఖచ్చితమైన ప్లాను అవసరం. నీటి కొరత, ఇంధన కొరతని ఎంత బాగా ఎందురుకొంటామో అది నిశ్చయిస్తుంది మన భవష్యత్తుని.

  వీటన్నింటినీ వదిలేసి, తప్పంతా మార్కెట్ దే. ప్రపంచీకరణదే అంటూ ఈ పిడివాదం ఎంత కాలం పట్టుకుని వాయిస్తారు ?

 2. Dil says:

  కిరణ్ గారూ,

  హైదరాబాద్ లో మాల్స్ వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు పైకి వెళ్లాయో కిందికి వచ్చాయో గణాంకాలు (మాల్స్ కి వచ్చే కస్టమర్ల అభిప్రాయాలు కాదు) గమనించండి ఒకసారి. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల్లో కమాడిటీ ట్రేడింగ్, ఫ్యూచర్స్ ట్రేడింగ్ అంటూ వ్యాపార జూదం మొదలుపెట్టాక ధరలు ఎలా పెరిగాయో చూడండి. టైం ఉంటే ఉత్పత్తి ఎక్కువ ఉండి, డిమాండ్ తక్కువ ఉన్న సరుకుల ధరలు కూడా ఎందుకు పెరుగుతున్నాయో అలోచించండి…

  తప్పంతా భారత దేశానిదీ, చైనాదీ అన్న కండొలిజా రైస్ మాటలకూ, మీ మాటలకూ పెద్దగా తేడా కనపడట్లేదు నాకు.

  నీటి కొరత గురించి మీ వ్యాసం చాలా వివరణాత్మకంగా ఉంది. కానీ నీటి గురించి ఈనాడు జరిగే ప్రతి చర్చలోనూ నీటి ప్రైవేటీకరణ గురించి ప్రస్తావన తప్పక ఉంటుంది. కానీ మీ పోస్టులో దాని గురించి ఒక్క మాటా రాయలేదు. గ్లోబల్ వార్మింగు, నీటి కొరత గురించి రాసినవారు ఆ రెండింటికీ “మార్కెట్” కీ ఉన్న సంబంధం కూడా రాస్తే బాగుంటుంది కదా.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s