పందికొక్కుల ప్రేలాపనలు

భారతీయులు ఎక్కువ తింటూ ఉండడం వల్లనే ప్రపంచ వ్యాప్తంగా ఆహారపదార్థాల ధరల పెరుగుదల సంక్షోభం వచ్చిందని అమెరికన్ పాలకవర్గ ప్రతినిధులు కొత్తపాట ఎత్తుకున్నారు.

నిజానికి ప్రపంచ జనాభాలో ఐదు శాతం కన్న తక్కువ ఉన్న అమెరికన్లు ప్రపంచవనరులలో 25 శాతం పైగా వాడుకుంటూ ఉండడంవల్ల, అమెరికన్లు తినగామిగిలి పారవేసే, తినడానికి పనికివచ్చే ఆహారపదార్థాలే రోజుకు రెండు లక్షల టన్నులు ఉండడం వల్ల, ఆహారపంటలకు వ్యతిరేకంగా అన్ని మూడో ప్రపంచదేశాలమీద రుద్దిన ప్రపంచీకరణ విధానాలవల్ల ఇవాళ్టి ఆహారకరువు ఏర్పడుతున్నదనే అసలు వాస్తవాన్ని దాచడానికి ఇతరులమీద ఇటువంటి దురహంకారపు నిందలు మోపడం అమెరికన్ పాలకవర్గాలకు అలవాటే.
భారతదేశంలో మధ్యతరగతి విపరీతంగా పెరిగిపోయిందని, ప్రస్తుతం 35 కోట్లుగా ఉన్న భారతీయ మధ్యతరగతి అమెరికా జనాభాకన్న ఎక్కువని, ఆ మధ్య తరగతి ఎక్కువ తిండి తింటున్నందువల్లనే అంతర్జాతీయ ఆహారధాన్యాల ధరలు పెరిగిపోతున్నాయని అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ మే 2 న మిస్సోరిలో ఒక సమావేశంలో అన్నాడు. ప్రతి సంవత్సరం అమెరికన్ ఆర్థిక వ్యవస్థ ముప్పైకోట్ల టన్నుల ఆహారపదార్థాలను వాడుతున్నది. దానిలో కనీసం పదికోట్ల టన్నుల ఆహారపదార్థాలతో ఇంధనం తయారు చేస్తున్నారని, అది ఆహార సంక్షోభానికి, ఆహారపదార్థాల ధరల పెరుగుదలకు దారి తీస్తున్నదని వచ్చిన విమర్శలను ఖండించడం బుష్ ఉద్దేశ్యం. ఆ వాదనలను ఖండిస్తూ అది ఒక కారణం మాత్రమేనని, వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఇంధనవ్యయం వగైరా కారణాలు కూడ ఉన్నాయని బుష్ అన్నాడు. కాని ఎన్నికారణాలను ప్రస్తావించినా, తమ రాజకీయార్థిక విధానాల కారణాలను తక్కువచేసి చూపి, భారతీయులవైపు, చైనీయులవైపు వేలెత్తి చూపడం బుష్ కోరిక.
రెండురోజుల ముందే వాషింగ్టన్ లో ఒక సమావేశంలో అమెరికా ఆంతరంగిక వ్యవహారాల శాఖ కార్యదర్శి కాండోలీజా రైస్ కూడ భారతీయులు, చైనీయులు ఎక్కువ తిండి తింటున్నందువల్లనే ధరలు పెరుగుతున్నాయని అంది. ఎక్కువతిండి తింటూ భారత్, చైనాలు ఎగుమతులమీద ఆంక్షలు విధించి, ఆహారాన్ని తమ దేశాలలోపలే ఉంచుకుంటున్నందువల్లనే ధరలు పెరుగుతున్నాయని ఆమె అంది. మాటవరసకు ఇతర కారణాలను చెప్పినప్పటికీ ఆమె భారతీయుల ఆహారపుటలవాట్లను ప్రముఖంగా ప్రస్తావించింది.

 

భారతీయుల తిండి గురించి ప్రపంచంలోకెల్లా పెద్ద తిండిపోతులు, ప్రపంచాన్ని కబళిస్తున్న పందికొక్కులు అసూయపడడంలో వింత ఏమీలేదు. ముప్పైకోట్ల జనాభాతో ముప్పైకోట్ల టన్నుల ఆహారధాన్యాలను వాడుతున్న అమెరికన్లు నూటపదికోట్ల జనాభాతో ఇరవైకోట్ల టన్నుల ఆహారధాన్యాలను వాడుతున్న భారతీయులను వేలెత్తి చూపుతున్నారు. అందుకు వాళ్లకు సిగ్గు లేకపోయినా మౌనంగా అంగీకరిస్తున్నామంటే మన ఆత్మగౌరవం ఎలా ఉన్నదనుకోవాలి? పేరుకు అధికార కాంగ్రెస్ కూడ అమెరికా వ్యాఖ్యలను ఖండించినప్పటికీ, ‘బుష్ దొరగారి మాట తప్పు’ అని చెప్పడానికి ప్రపంచప్రఖ్యాత అర్థశాస్త్రవేత్త, మహామేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు మాత్రం నోరు పెగలడంలేదు.

 

బుష్, కాండోలీజా రైస్ ల వాదనలను అమాయకంగా నమ్మేవారెవరయినా ఉండవచ్చుగనుక, ఆ వాదనలను విశ్లేషించుకోవాలి. ఒకటి, భారతీయుల ఆహారపుటలవాట్ల గురించి మాట్లాడేముందు అమెరికన్ల ఆహారపుటలవాట్ల గురించి మాట్లాడాలి. రెండు, ఈ వాదనలకూ వాస్తవ గణాంకాలకూ ఏమన్నా పొంతన ఉన్నదా చూడాలి. మూడు, భారతీయులలో ఒక చిన్న భాగం ఆహారపుటలవాట్లు మారుతున్నమాట నిజమే అయినప్పటికీ దేశంలో అత్యధికసంఖ్యాకులకు రోజుకు రెండుపూటలా తిండి కూడ దొరకడం లేదనీ, అందువల్ల మొత్తం వినియోగం పెరగడం లేదనీ గుర్తించాలి.

 

అమెరికన్లు రోజుకు 81,500 కోట్ల కాలరీల ఆహారం తింటారు. నిజానికి ప్రపంచ సగటు చూసినా, ఒక సగటు మనిషి తినగల పరిమాణం చూసినా అమెరికన్ జనాభాకు 60,000 కోట్ల కాలరీలు చాలు. అంటే అమెరికన్లు అదనంగా తింటున్న ఆహారం ఇరవైవేలకోట్ల కాలరీల పైన. దానితో కనీసం మరొక ఎనిమిది కోట్ల మందికి ఆహారం దొరుకుతుందని ఒక అంచనా. అమెరికన్లు తమ దేశంలో రైతులకు విపరీతమైన సబ్సిడీలు ఇచ్చి పండించే మక్కజొన్నలో 80 శాతం, ఓట్స్ లో 90 శాతం పశువులకు దాణాగా వాడుతున్నారు. గత సంవత్సరం అమెరికన్ ఆహారధాన్యాల వినియోగం 11 శాతం పెరిగింది. ఆ పెరుగుదలే మూడు కోట్ల ముప్పై లక్షల టన్నులు ఉంది. భారత వినియోగంలో పెరుగుదల మూడు శాతానికన్న తక్కువ, అంటే నలభై లక్షల టన్నులు మాత్రమే. ఈ గణాంకాలన్నీ ఐక్యరాజ్యసమితిలో భాగమైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ ఎ ఒ), ప్రపంచబ్యాంకు, స్వయంగా అమెరికన్ ప్రభుత్వం ఇచ్చినవే గాని విమర్శకులు తయారుచేసినవి కావు.

 

నిజానికి భారతీయులు వినియోగిస్తున్న ఆహారపదార్థాల పరిమాణం, ఆహారపదార్థాల మీద పెడుతున్న ఖర్చు రోజురోజుకూ దిగజారుతున్నదని ఎన్నో అధ్యయనాలు, పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఆహారపదార్థాల ధరలు పెరిగిపోవడంతో, ప్రజాపంపిణీవ్యవస్థ, చౌకధరల దుకాణాలు క్షీణించిపోవడంతో జనాభాలో మూడింట రెండువంతుల కుటుంబాలకు చాలినంత ఆహారపదార్థాలు కొనుక్కోవడమే దుర్లభమైపోతోంది. నెలసరి కుటుంబ వ్యయంలో ఆహారం వాటా క్రమంగా తగ్గిపోతున్నదని, లేదా ఖర్చు యథాతథంగా ఉన్నా, ఆ డబ్బుకు వచ్చే ఆహారపదార్థాల పరిమాణం తగ్గుతున్నదని, అందువల్ల స్త్రీలలో, శిశువులలో పోషకాహారలోపం పెరిగిపోతున్నదని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. లక్షలాది ఎకరాల పంటభూములను ఒకవైపు ప్రభుత్వం, మరొకవైపు కార్పొరేట్ సంస్థలు ప్రత్యేక ఆర్థిక మండలాల పేరుమీద రియల్ ఎస్టేట్లు గానో, విదేశీ స్వదేశీ సంపన్నుల విలాస ప్రాంతాలు గానో మారుస్తుండగా దేశంలో ఆహారపదార్థాల, తిండిగింజల ఉత్పత్తి నానాటికీ తగ్గిపోతున్నది. ఇటువంటి కల్లోల పరిస్థితుల్లో లక్షలాది గ్రామీణ కుటుంబాలకు, పొట్టచేత పట్టుకుని పట్టణాలకు చేరుతున్న కుటుంబాలకు కనీస ఆహారభద్రత కొరవడుతోంది. ఈ విధానాలన్నిటికీ మూలవిరాట్టయిన అమెరికా రాజకీయార్థిక విధాన నిర్మాతలే మన పేదలకు, మధ్యతరగతికి దొరుకుతున్న నాలుగు మెతుకుల మీద కూడ అసూయ పడుతున్నారు.

 

అయితే భారతీయులందరినీ ఆయన ఏమీ అనలేదని, కేవలం మధ్యతరగతినే అన్నాడని ఇప్పటికీ బుష్ దొరను సమర్థించే బుద్ధిమంతులు కూడ ఉన్నారు. నిజానికి మధ్యతరగతి విషయంలో ఆయన చెప్పిన లెక్క తప్పు. మధ్యతరగతి అంటే ఏమిటనే నిర్వచనం విషయంలో గందరగోళాలు, భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాని, ప్రపంచీకరణ మొదలయినప్పటినుంచీ, అంతర్జాతీయ మార్కెట్ సంస్థలు, బహుళజాతిసంస్థలు అన్నీ ఆ లెక్కలు వేస్తూనే ఉన్నాయి. అపారమైన నిరుపేద జనాభా ఏమయిపోయినా ఫరవాలేదుగాని, తమ సరుకులకూ, అభిప్రాయాలకూ కొనుగోలుదార్లయిన మధ్యతరగతి జనం ఎంత మందనే లెక్కలు వేస్తూనే ఉన్నారు. ఆ లెక్కలు ఇంకా కచ్చితంగా తేలలేదు గాని ఇరవై కోట్లకు మించలేదు. ఇప్పుడు దొరవారు దాన్ని ఏకంగా ముప్పై ఐదుకోట్లు చేసివేశారు.

 

ముప్పై ఐదుకోట్లు కాదుగాని, బహుశా ఒక కోటి మంది, అమెరికన్ల నోటికాడిముద్ద కాదుగాని, ఈదేశంలోని కోట్లాది ప్రజల నోటికాడి ముద్దలాక్కుంటున్న స్వదేశీయులున్నరు. దేశీ విదేశీ సంపన్నులకు ఊడిగం చేయడానికి, ఈ దేశ ప్రజలమీద కుట్రలకూ కుహకాలకూ రంగం సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారు నిజంగానే ఈదేశంలో పందికొక్కులయ్యారు గాని వారు బుష్ దొర దళారీలే గనుక ఆయన మాటలు వారిని ఉద్దేశించి అయి ఉండవు. అశేష భారత ప్రజానీకాన్ని ఇంకా ఎక్కువగా దారిద్ర్యంలోకి, ఆహారకొరతలోకి నెడుతున్న ప్రపంచీకరణకర్తల లోలోపలి భావాలు అవి. మనం తినగూడదని, బతకగూడదని, మన తిండినీ, మన వనరులనూ, మన బతుకులనూ తామే కొల్లగొట్టాలనీ ప్రపంచీకరణ శక్తుల కోరిక ఈ రూపంలో బయటపడింది.

 

మనపట్ల ఇంతటి అవమానకరమైన మాటలు అన్న విదేశీ పాలకులను, వారి అంటకాగుతున్న మన పాలకులను ఏం చేయవలసి ఉంది?

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in ParamarthaSatyam, Telugu. Bookmark the permalink.

One Response to పందికొక్కుల ప్రేలాపనలు

  1. ఒకడు says:

    చాలా ఇన్ఫర్మేటివ్ గా రాశారు. ఇదే విషయమ్మీద మరో బ్లాగులో ‘ఎందుకీ కస్సు బుష్షు’ పేరుతో మరో విధంగా రాశారు చూడండి: http://anilroyal.wordpress.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s