నాలుగేళ్లలో సాధించిందేమిటి?

రాష్ట్రంలో డా. వై ఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 2004 మే 14 న అధికారం చేపట్టిన ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పాలనను పూర్తిచేసుకున్నది. ఈ నాలుగు సంవత్సరాలలో చాల లోతయిన రాజకీయ, సామాజిక పరిణామాలే జరిగాయి. రాజకీయంగా ఐక్యసంఘటన ప్రభుత్వంగా, మిశ్రమ మంత్రివర్గంగా మొదలయినదల్లా రెండుసంవత్సరాలు తిరగకుండానే ఏకపార్టీ పాలనగామారిపోయింది. పార్టీలోపలా బయటా ప్రత్యర్థులందరినీ బలహీనపరచడం ఏకైక కార్యక్రమంగా సాగింది. ఎన్నికల పొత్తులూ స్నేహాలూ సహజీవనాలూ అన్నీ మారిపోయాయి. సామాజికంగా కులాల ప్రస్తావన, అగ్రకుల ఆధిపత్యం పెరిగిపోయాయి. సామాజికవర్గాల మధ్య అంతరాలు, ఘర్షణలు పెరిగిపోయాయి.

అయితే ఈ రాజకీయ, సామాజిక పరిణామాల కన్న ఎన్నోరెట్లు మిన్నగా ఆర్థిక రంగ పరిణామాలు జరిగాయి గాని సహజంగానే మన ఆలోచనాపరులలో రాజకీయాలమీద ఉన్న ఆసక్తి రాజకీయార్థిక పరిణామాల మీద ఉండదుగనుక అవి పెద్దగా చర్చకు రాలేదు. కాని ప్రస్తుతం మాత్రం ఇది ఉపఎన్నికలవేళ గనుక హఠాత్తుగా అన్ని రాజకీయ పక్షాలూ ప్రజాజీవితం గురించీ, రాజకీయార్థిక పరిణామాల గురించీ తమకు అనుకూలమైన అంశాలు మాత్రం మాట్లాడడం మొదలుపెట్టాయి. తెలుగుదేశం పార్టీ ఏకంగా వందతప్పుల అభియోగపత్రాన్ని విడుదల చేసింది. అవినీతి, రైతుల ఆత్మహత్యలు, హాస్టల్ సౌకర్యాలు కొరవడడం వల్ల విద్యార్థుల మృతి, ప్రభుత్వరంగసంస్థల ఉద్యోగులను తొలగించడం, నిత్యావసర వస్తువుల ధరలు, జలయజ్ఞం, భూముల అమ్మకం వంటి రాజకీయార్థిక ఆరోపణలనెన్నిటినో తెలుగుదేశం పార్టీ చేసింది. ఇతరపార్టీలు అవినీతి గురించి మాట్లాడుతున్నాయి. లోక్ సత్తా నాయకులు జయప్రకాశ్ నారాయణ కూడ కాంగ్రెస్ పాలనలో రోజుకు వందకోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నదనీ, రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారనీ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పాలనను విమర్శిస్తున్న ఈ రాజకీయ పక్షాలలో ఏ ఒక్కదానికయినా ఆ అర్హత ఉన్నదా అనే ప్రశ్న ప్రజలవైపు నుంచి ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో దీర్ఘకాలం పాలన సాగించిన తెలుగుదేశం చరిత్ర గాని, ఇతర రాష్ట్రాలలో పాలన సాగిస్తున్న ఇతర రాజకీయ పక్షాల చరిత్ర గాని ఇప్పుడు లేవనెత్తుతున్న ఏ ఒక్క అభియోగం విషయంలోనయినా నిష్కళంకమైనదేమీ కాదు. ఈ ఆరోపణలలో చాలా భాగం ఇవాళ వేలెత్తి చూపుతున్నవారందరికీ వర్తించేవే.

అయితే విమర్శకులకు సాధికారత లేనంత మాత్రాన విమర్శలకు సాధికారత లేకుండాపోదు. నిజంగానే ఈ నాలుగు సంవత్సరాల కాంగ్రెస్ పాలన రాష్ట్రాన్ని రాజకీయార్థిక రంగంలో అతి దారుణమైన పరిణామాలెన్నిటికో గురిచేసింది. ఈదేశంలో పాలనకు సంబంధించిన సకల అక్రమాలకు కన్నతల్లి కాంగ్రెసే గనుక దాని నుంచి సత్పరిపాలనను ఆశించడం అత్యాశే గాని, డా. వై ఎస్ రాజశేఖరరెడ్డి 1995 నుంచి 2004 వరకు నిర్వహించిన ప్రతిపక్ష పాత్ర వల్ల కొందరయినా అలా ఆశించారు. చంద్రబాబు నాయుడును ప్రపంచబ్యాంకు పాలేరుగా అభివర్ణించి, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా మాట్లాడినందువల్ల, పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను అర్థం చేసుకున్నట్టు కనబడి, వ్యవసాయ రంగాన్ని మళ్లీ ఒకసారి కేంద్రస్థానానికి తీసుకువచ్చినందువల్ల, తెలంగాణ రాష్ట్రసమితితో పొత్తు పెట్టుకుని తెలంగాణకు జరిగిన అన్యాయాలను గుర్తించినట్టే కనబడినందువల్ల, రాజశేఖరరెడ్డి పాలన సగటు కాంగ్రెస్ పాలనలా ఉండకపోవచ్చునని కొందరయినా భ్రమ పడ్డారు.

కాని ఈ నాలుగు సంవత్సరాల అనుభవం చూస్తే, ప్రత్యేకించి రాజకీయార్థిక విధానాలలో తెలుగుదేశం అనుసరించిన విధానాలనే కాంగ్రెస్ తు.చ. తప్పకుండా అమలు చేస్తూ వచ్చింది. బహుశా కొన్ని రంగాలలో తెలుగుదేశం కన్న రెండాకులు ఎక్కువే చదివాననిపించుకుంటున్నది.
వ్యవసాయరంగానికి అధికప్రాధాన్యం ఇవ్వడం, వ్యవసాయరంగానికి మేలుకల్పించేలా కొత్త నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం, అందుకోసం ప్రత్యేకంగా జలయజ్ఞం కార్యక్రమాన్నే చేపట్టడం వంటి సదుద్దేశ్యంతో ప్రారంభమైన విధానాలలో కూడ అవినీతి, ఆశ్రిత పక్షపాతం వెల్లువెత్తుతున్నాయి. నీటికోసం, వ్యవసాయ అవసరాల కోసం ప్రాజెక్టులు కాకుండా కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు నిర్మించడం, వేలాది కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం జరుగుతోంది. మూడుసంవత్సరాలలో పూర్తవుతాయని వాగ్దానం చేసిన ప్రాజెక్టులేవీ నాలుగు సంవత్సరాలయినా పూర్తి కాలేదు. ఇంకా దీర్ఘకాలిక వ్యవధి పెట్టిన ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో, అప్పటికి ఈ ప్రభుత్వముంటుందోలేదో, పూర్తయినా వాటికి తగిన నీరు ఉంటుందోలేదో తెలియదు. నిజంగా కొత్త ఆయకట్టు కల్పించగల, దుర్భిక్ష ప్రాంతాల ప్రాజెక్టులు నత్తనడకలు నడుస్తుండగా, కృష్ణాజిల్లాకు మూడో పంటకు నీరందించే పులిచింతల, కాకినాడ – విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్ లో బహుళజాతిసంస్థల నీటి అవసరాలు తీర్చే పోలవరం మాత్రం శరవేగంతో సాగుతున్నాయి.

మరొకవైపు వ్యవసాయరంగ సంక్షోభంవల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు ఉపశమనం కలిగించడం, ఆత్మాహత్యలను ఆపడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం మాటల్లో జరిగినంతగా చేతల్లో జరగలేదు. ఈ నాలుగేళ్లలో కూడ రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ వచ్చాయి.
అలా ఒకవైపు చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోగా, కొనసాగుతున్న దుస్థితిని మార్చకపోగా, ఈ ప్రభుత్వం రైతాంగం మీదికి, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులమీదికి కొత్త మహమ్మరిని కూడ తీసుకువచ్చింది. ప్రత్యేక ఆర్థికమండలాల రూపంలో వచ్చిన ఈ మహమ్మారి రైతులను తమ పంటభూములనుంచి వెళ్లగొట్టి దేశదేశాల సంపన్నులకు ఆ భూములను కారుచౌకగా కట్టబెట్టే పథకం రచించింది. మిగిలిన రాష్ట్రాలకన్న ఎక్కువ ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పరచడానికి, అంటే మిగిలిన రాష్ట్రాలలో కన్న ఎక్కువమంది రైతులను నిరాశ్రయులను చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది.

పట్టణభూముల అమ్మకాల కార్యక్రమాన్ని మొదలుపెట్టి బహుళజాతిసంస్థలకు, సంపన్నులకు, ఆశ్రితులకు కారుచౌకగా భూములు కట్టబెట్టే పనిని చంద్రబాబు నాయుడు ప్రారంభించగా ఈ నాలుగు సంవత్సరాల పాలన ఆ పనిని మరెన్నో రెట్లు ఎక్కువగా సాగిస్తోంది. ఆదివాసులభూములలో ఖనిజ నిలువలు ఉన్న పాపానికి వారిని వారి ఆవాసాలనుంచి వెళ్లగొట్టి, ఆ ఖనిజాలను బహుళజాతిసంస్థలకు దోచిపెట్టే ఆలోచనలు గత ప్రభుత్వం ప్రారంభించగా ఈ ప్రభుత్వం పెద్దఎత్తున ఆచరణలో పెట్టింది. ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకు ప్రభుత్వరంగసంస్థలను మూసివేయడానికి, అమ్మివేయడానికి తెలుగుదేశం మొదలుపెట్టిన ప్రయత్నాలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తోంది.

తెలుగుదేశం పాలనపట్ల ప్రజలు విసిగిపోయిన కారణాలలో వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం ఒకటి కాగా, ప్రపంచబ్యాంకు పాలనకిందికి రాష్ట్రాన్ని తీసుకుపోయి, ఆంధ్రప్రదేశ్ రుణభారం పెంచడం ప్రధానమయినది. ప్రతిపక్షనాయకుడి హోదాలో ఈ పరిణామాన్ని అతి తీవ్రంగా విమర్శించిన రాజశేఖరరెడ్డి తాను అధికారంలోకి రాగానే ఆ ప్రపంచబ్యాంకు అప్పులను, షరతులను కనీసం సమీక్షించలేదు సరిగదా, కొత్త అప్పులు చేయడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రుణభారం తెలుగుదేశం పాలనాంతంలో ఉన్నదానికన్న ఈ నాలుగు సంవత్సరాలలో రెట్టింపు అయిపోయింది. ఒక్కమాటలో చెప్పలంటే ప్రస్తుతం సాగుతున్నది రెండో చంద్రబాబు పాలనే తప్ప మరొకటి కాదు.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, ParamarthaSatyam, Telangana, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s