రాజకీయం, ఆర్థికం, అవకాశవాదం

రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా ‘మీట్ ద ప్రెస్’ సమావేశాలలో వివిధ రాజకీయ పక్షాల నాయకులు తమ అభిప్రాయాలను ప్రకటిస్తున్నారు. ఆ అభిప్రాయాలలో ఎక్కువభాగం ఊకదంపుడు మాటలు, ఎంతమాత్రమూ నమ్మని, ఆచరణలో పెట్టదలచుకోని ఆదర్శాలు, ఆత్మస్తుతి, పరనింద ఉంటాయి గనుక వాటిని పట్టించుకోనవసరం లేదు. కాని ఆ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యదర్శి బి వి రాఘవులు ప్రకటించిన కొన్ని అభిప్రాయాలను రాజకీయార్థిక శాస్త్ర దృక్పథం నుంచి చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఆ రాజకీయార్థిక అభిప్రాయాలు చాల బోలుగా, మార్క్సిస్టు మౌలిక సూత్రాలకు, మార్క్సిస్టు సిద్ధాంత చరిత్రకు చాల దూరంగా ఉన్నాయి. ఆ అభిప్రాయాలు ఆ పార్టీ అనుసరిస్తున్న అవకాశవాదానికి సరిపోతాయేమోగాని నిశితమైన చదువరిగా, మేధావిగా, చతురుడైన వ్యూహకర్తగా పేరుపొందిన రాఘవులుకు సరిపోతాయా అనుమానమే.

ఒక పార్లమెంటరీ రాజకీయపక్షంగా మార్క్సిస్టు పార్టీ ఎన్ని పిల్లిమొగ్గలయినా వేయవచ్చు, ఊసరవెల్లిని తలదన్నేలా ఎన్ని రంగులయినా మార్చవచ్చుగాని, తన అవకాశవాదానికి మద్దతుగా మార్క్సిస్టు రాజకీయార్థిక శాస్త్ర అవగాహనలను ఉంటంకించడానికి, ఇష్టం వచ్చినట్టు వక్రీకరించడానికి వీలులేదు.

యు పి ఎ ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూనే రాజకీయంగా వారికి ఎందుకు మద్దతిస్తున్నారనే ప్రశ్నకు జవాబిస్తూ, “రాజకీయాలను తుపాకీ నిర్దేశించగూడదని, తుపాకీని రాజకీయాలు నిర్దేశించాలని చెపుతారు. అంటే ఆర్థిక విధానాలను సైతం నిర్దేశించేది రాజకీయ అంశాలే. ఆర్థిక విధానాలు, రాజకీయ అంశాలు రెండిటిలో ఏదో ఒకదాన్నే ఎంచుకోవలసి వస్తే మేం రాజకీయ అంశాలవైపే మొగ్గు చూపుతాం” అని రాఘవులు అన్నారు. అలాగే, గతంలో ప్రపంచబ్యాంకు ఏజెంటంటూ బాబుకు దూరమై, కాంగ్రెస్ తో కలిసిన సిపిఎం ఇప్పుడు ఏ ఆర్థికవిధానం ప్రాతిపదికన కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తోందనే ప్రశ్నకు జవాబుగా “చెప్పానుగా, ఆర్థిక విధానాలకంటే రాజకీయ విధానాలకే ప్రాధాన్యమిస్తామని” అని నొక్కి చెప్పారు.
ఆ ఉవాచలలో రెండు సిద్ధాంతపరమైన, చారిత్రకమైన తప్పులున్నాయి.

అవి ఒకటి, ఆర్థిక విధానాలను సైతం నిర్దేశించేది రాజకీయ అంశాలే అని మార్క్సిజం ఎప్పుడూ చెప్పదు, చెప్పలేదు. మనుషుల నిత్యజీవితావసర ఉత్పత్తి – పునరుత్పత్తిలో భాగమైన ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు అనే ఆర్థిక అంశాలు పునాది అనీ, ఆ పునాది మీదనే న్యాయ, రాజకీయ ఉపరినిర్మాణం రూపొందుతుందనీ, అన్ని సామాజిక చైతన్యరూపాలు ఈ ఉపరితలానికి అనుబంధంగా తయారవుతాయనీ మార్క్స్ తన ‘కాంట్రిబ్యూషన్ టు ద క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ’ (1859) అనే సుప్రసిద్ధ గ్రంథంలో రాశాడు. “భౌతిక జీవితపు ఉత్పత్తి విధానమే సాంఘిక, రాజకీయ, చైతన్య రూపాల సాధారణ జీవనక్రమాన్ని నిర్ణయిస్తుంది” అనే ప్రముఖ సూత్రీకరణ ఈ పుస్తకంలోనిదే. ఈ మౌలిక మార్క్సిస్టు అవగాహన మీద చాల చర్చ, వక్రీకరణలు, చేర్పులు జరిగాయి గాని, రాజకీయమే ప్రధానం, ఆర్థికం కాదు అని తమ అవకాశవాద రాజకీయాలకోసం తిరగేసి చెప్పడం సిపిఎం నాయకులకే చెల్లింది.

రెండు, అవకాశవాద పాలకవర్గ రాజకీయ చదరంగంలో ఎవరితోక పట్టుకుని పోతామనే అంశాన్ని సమర్థించుకోవడానికి ఆయన అనవసరంగా తుపాకీ ప్రస్తావన తెచ్చారు. నక్సల్బరీ నుంచి నందిగ్రామ్ దాకా అమాయకులను బలిగొన్న సందర్భంలో తప్ప, ఇతరంగా ఎప్పుడో మరిచిపోయిన ఆ తుపాకీ అనే మాట ఎత్తడం ఆశ్చర్యం కాని, ఆ ఉటంకింపుకు ఏమాత్రం సందర్భశుద్ధిలేదు. “మా సూత్రం ఏమంటే తుపాకీని పార్టీ శాసించాలి కాని ఎప్పుడూ పార్టీని తుపాకీ శాసించగూడదు” అనే ప్రసిద్ధ వాక్యాన్ని మావో 1938 లో ‘ప్రాబ్లమ్స్ ఆఫ్ వార్ అండ్ స్ట్రాటెజీ’ అనే వ్యాసంలో రాశాడు. అది విప్లవ, సాయుధ పోరాట సమయం. ఆ తర్వాత సాంస్కృతిక విప్లవ సందర్భంలో 1966లో పెట్టుబడిదారీ మార్గావలంబకులమీద పోరాటంలో ‘రాజకీయాల ఆధిపత్యం’ గురించి కూడ మాట్లాడాడు. ఆ రెండు సందర్భాలకూ ప్రస్తుతం సిపిఎం రాజకీయ ఎత్తుగడల సందర్భానికీ ఏమీ సంబంధం లేదు.
ఇంతకీ ప్రస్తుతం సిపిఎం చేస్తున్నది సాయుధ విప్లవపోరాటమూ కాదు, సాంస్కృతిక విప్లవమూ కాదు. ఇక్కడ రాజకీయాలు, ఆర్థిక విధానాలు అనేంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడానికి ఏమీలేదు. 1951లో వర్గపోరాట రాజకీయాలను, సాయుధపోరాటాన్ని వదిలిపెట్టినప్పటినుంచీ భారతకమ్యూనిస్టుపార్టీ, పుట్టినప్పటినుంచీ మార్క్సిస్టుపార్టీ పాలకవర్గాలలో “ప్రగతిశీల ముఠా”ను వెతుకుతూ వారితో అంటకాగడం ద్వారా ఒకసీటో, అరసీటో ఎక్కువవస్తే చాలుననే ఏకైక వ్యూహంతో పనిచేస్తున్నాయి. ఆ అవకాశవాద విద్యలో సిపిఎం ఒక ఆకు ఎక్కువే చదివింది. అందువల్ల ఇందులో ప్రజారాజకీయాలూ లేవు, ప్రజానుకూల ఆర్థిక విధానాలూ లేవు. ఎవరి పంచనచేరితే ఎన్ని సీట్లు ఎక్కువ వస్తాయి, ఎవరితో పొత్తుపెట్టుకుంటామని బెదిరించి ఎవరితో బేరాలాడొచ్చు అనే లెక్కలేతప్ప ఇందులో సైద్ధాంతిక అంశాలేమీ లేవు. కనుక ఆమాట స్పష్టంగా చెపితే బాగుంటుంది. అనవసరంగా రాజకీయార్థిక అవగాహనల వక్రీకరణ అవసరం లేదు.

తెలుగుదేశం తన ఆర్థికవిధానాలను స్పష్టపరిస్తే వారితో పొత్తు విషయం ఆలోచిస్తామని కొంతకాలం కింద సిపిఎం ప్రకటించింది. తెలుగుదేశం ఆర్థికవిధానాలేమిటో, వాటిని ఇప్పుడు మళ్లీ స్పష్టం చేయవలసిన అవసరమేమిటో అలా ఉంచి అసలు సిపిఎం ఆర్థికవిధానాలేమిటో స్పష్టత ఉందా? ఇప్పుడు సిపిఎం ఆ మాటకూడ వదిలి ఉపఎన్నికలలో పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీ ఎన్నికల ఎత్తుగడలు ఆ పార్టీ ఇష్టం. కాని అసలు ఆ పార్టీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు భిన్నమైనవి అయితేగదా ఈ చర్చ అంతా. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలతోనూ బేరసారాలు ఆడడంలో ఒక పావుగా అప్పుడప్పుడు కొన్ని రాజకీయ, ఆర్థిక అంశాల కొత్తిమీర, కరివేపాకు చల్లడం మినహా ఆ ఇద్దరు వంటగాళ్లకన్న ఈ వంటగాడి వంట భిన్నంగా ఉంటే గదా. అసలు గత పదహారు సంవత్సరాల ప్రపంచీకరణ క్రమంలో నూతన ఆర్థిక విధానాలను అమలు పరచని పార్లమెంటరీ రాజకీయపక్షం ఒక్కటయినా ఉందా?

పశ్చిమబెంగాల్ లో ముప్పైఏళ్లుగా ఎన్నికల రాజకీయాలు నడుపుతున్న తీరు, నూతన ఆర్థిక విధానాల మీద విమర్శను పుస్తకాలు అమ్ముకోవడానికి మాత్రం పరిమితం చేసుకుంటూ అవే రాజకీయార్థిక విధానాలను అమలు పరుస్తున్నతీరు, ప్రత్యేక ఆర్థికమండలాల విధానాన్ని అందరికంటే ఎక్కువగా అమలు జరుపుతూ చివరికి మనుషులను కాల్చిచంపి పారిశ్రామికీకరణ పేరుతో ప్రత్యేక ఆర్థిక మండలాలను నెలకొల్పుతున్న తీరు – ఏ రాజకీయార్థిక విధానాలు భిన్నంగా ఉన్నాయని సిపిఎం రాజకీయాల గురించీ, ఆర్థిక అంశాల గురించీ మాట్లాడుతున్నట్టు? ఏ ఆర్థిక అంశాలకు, ఏ రాజకీయాలకు పోటీ వచ్చి ఏ ఆర్థిక అంశాలమీద ఏ రాజకీయాంశాలను ఎంచుకుంటున్నట్టు?

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in ParamarthaSatyam, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s