భావప్రకటనాస్వేచ్ఛా? సామాజిక న్యాయమా?

చిరకాల మిత్రుడు, పాత్రికేయవృత్తిలో సహాధ్యాయి, తెలంగాణ చరిత్ర గురించీ, భాష గురించీ, సంస్కృతి గురించీ గణనీయమైన కృషి చేసిన పరిశోధకుడు, సాహిత్య విమర్శకుడు, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్ జైలుపాలు కావడం తీవ్రంగా ఆందోళనపరుస్తున్నది. అదికూడ షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని దూషించాడనే, అగౌరవపరిచాడనే తప్పుడు ఆరోపణపై నిర్బంధానికి గురికావడం మరింత విచారకరంగా ఉన్నది. ముప్పైఏళ్లుగా వివిధ సాహిత్య, సామాజిక ప్రజా ఉద్యమాలలో భాగస్వామిగా నాకు తెలిసిన శ్రీనివాస్ దళితులపట్ల, పీడితులపట్ల అగౌరవం ప్రకటించాడనడం కన్న దారుణమైన అవాస్తవం మరొకటి ఉండదు. మరి కె. శ్రీనివాస్ మీద ఆ ఆరోపణ చేసిన మందకృష్ణ మాదిగ మన సమాజంలో ఒక ముఖ్యమైన దళిత వర్గానికి ప్రతినిధి. ఆ వర్గానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఎంతోకాలంగా పోరాడుతున్న గౌరవనీయమైన నాయకుడు. ఈ ఇద్దరూ ఎదురుబొదురుగా నిలవవలసి రావడమే ఒక విషాదం.

మందకృష్ణ మాదిగ తనమీద వచ్చిన నిరాధారమైన ఆరోపణలకైనా హుందాగా జవాబు చెప్పవలసి ఉండింది. కాని ఆ వార్త వచ్చిన పత్రికా కార్యాలయం పైన భౌతిక దాడి చేయించాలనుకున్నారు. ఆ దాడి పట్ల తమ ఆందోళన ప్రకటించిన పాత్రికేయులపై నేరారోపణ చేయదలచుకున్నారు. మన సమాజంలో ప్రతిఒక్క ఉద్యమబృందమూ ప్రతిరోజూ ప్రదర్శిస్తున్న ఒక పోరాటరూపాన్ని, తమ ఉద్యమంకూడ వాడుకుంటున్న పోరాటరూపాన్ని సాకుగా చూపి తప్పుడు నేరారోపణ చేయదలచుకున్నారు. ఈ పరిణామాలు ఆశ్చర్యం కలిగించడం లేదుగాని, బాధ కలిగిస్తున్నాయి.

చాల ఘనమైన పోరాట చరిత్ర, పురోగామి దృష్టి కలిగిన తెలుగు సమాజం ఇంత దురదృష్టకరంగా భావప్రకటనాస్వేచ్ఛకూ సామాజిక న్యాయానికీ పోటీ ఏర్పడిన ఒక దుస్థితికి చేరుకుంది. ఆ పోటీ కూడ హింసాత్మకంగా, దౌర్జన్యపూరితంగా, కుట్రమయంగా మారుతున్నది. ఈ అనవసరమైన, నివార్యమైన ఘర్షణను వాడుకుని పబ్బం గడుపుకుంటున్న పాలకులు సామాజిక న్యాయం భుజాల మీద తుపాకి పెట్టి భావప్రకటనా స్వేచ్ఛమీద కాల్పులు జరుపుతున్నారు.

ఆంధ్రజ్యోతి ప్రచురించిన మొదటి కథనం (బాడుగనేతలు) లో వాస్తవాలున్నాయా, అవాస్తవాలున్నాయా అనే చర్చలో ఇప్పుడు ఎవరికీ ఆసక్తి ఉన్నట్టులేదు. నిజానికి ఆ వార్తా కథనంలో చాల అంశాలు గతంలో పత్రికల్లో వచ్చినవే. ఆ కథనం బడుగువర్గాల ప్రజల మీద గాని, బడుగువర్గాల సంస్థలమీద గాని ఎక్కుపెట్టలేదు. ప్రజలపేరు, సంస్థలపేరు చెప్పుకుని వారిని కూడ మోసం చేస్తూ స్వార్థపరులవుతున్నారని కొందరు నాయకులను తప్పుపట్టింది. అలా తప్పుపట్టే అర్హత ఆ పత్రికు ఉన్నదా అని ఎవరయినా అడగవచ్చు. ఆ కథనం ప్రస్తుతం వెలువడిన రీతిలో ఉద్దేశ్యాలు లేవా అని అడగవచ్చు. ఆ కథనాన్ని వెలువరించిన పద్ధతిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉండవచ్చు. బడుగునేతల అవినీతిపైనయితే ఇంత పెద్ద ఎత్తున కథనం రాశారుగాని అగ్రవర్ణనేతల అవినీతిపై రాస్తారా అని కూడ ప్రశ్నించవచ్చు. రాయి విసిరినవాడు పవిత్రుడేనా అని జీసస్ నాటినుంచీ ఉన్న ప్రశ్నా వేయవచ్చు.

ఈ ప్రశ్నలన్నీ సరయినవేననుకున్నా ఆ వార్తాకథనానికి ప్రతిస్పందన భౌతికదాడి రూపంలో ఉండగూడదు. రచన మీద, అక్షరం మీద, భావప్రకటన మీద ఉన్న ఎంత తీవ్రమైన అభ్యంతరమైనా మళ్లీ అక్షరం రూపంలోనే, భావాలతోనే ఎదుర్కోవడం ప్రజాస్వామికమైన పద్ధతి. మానవసమాజ పురోగతి ప్రశ్నించినవారి గొంతు నొక్కడం అనాగరికమని తేల్చింది. వంద ఆలోచనలు సంఘర్షించాలనీ, ప్రశ్నే ప్రగతి అనీ చెప్పింది. ప్రజాస్వామ్యపు అభివృద్ధిలో అది ఒక గుణాత్మకమైన ముందడుగు. ‘నీ అభిప్రాయాలతో నాకు ఏకీభావం లేకపోవచ్చు. కాని నీకు ఆ భావాలు ప్రకటించే హక్కు ఉంది. ఆ హక్కును కాపాడడానికి నా ప్రాణాలయినా బలి ఇస్తాను’ అన్న ఫ్రెంచి తత్వవేత్త వోల్టేర్ మాట ఆ ప్రజాస్వామిక సంప్రదాయానికి గీటురాయి. భావప్రకటనాస్వేచ్ఛకు అది పునాది.

ఆంధ్రజ్యోతి కథనంలో నూటికి నూరుపాళ్లు అవాస్తవాలే ఉండినా, అది దురుద్దేశ్యంతోనే అచ్చయినా ఆ కథనాన్ని తిరిగి అక్షరాల రూపంలోనే ఖండించి ఉంటే బడుగునేతలే ఎక్కువ సానుభూతి సంపాదించుకుని ఉండేవారు. కాని సామాజికన్యాయం అనే కరవాలాన్ని తమ ఇష్టం వచ్చినట్టుగా వాడి భావప్రకటన అనే మౌలికస్వేచ్ఛను ఖండించాలని వారనుకున్నారు. భావప్రకటనా స్వేచ్ఛకు భారత సమాజం వంటి అంతరాల సమాజంలో పరిమితులు ఉంటాయనే మాట కూడ నిజమే. కాని ఆ పరిమితులను అధిగమించడానికి కూడ భావాలను వాడుకోవలసిందే. అవతలివారి భావప్రకటన మీద దాడి చేయడం ద్వారా, బెదిరించడం ద్వారా, నిషేధించడం ద్వారా భావాలను అడ్డుకోగలమని అనుకోవడం అమాయకత్వమైనా కావాలి, అహంకారమైనా కావాలి. ఒక న్యాయమైన సామాజిక ఉద్యమానికి ఆ అమాయకత్వమూ పనికిరాదు, ఆ అహంకారమూ పనికిరాదు. పాలకులు అహంకారంతో ఆ పని ఎప్పుడూ చేస్తుంటారు, అలా చేయడానికి వారికి సకల అవకాశాలూ ఉన్నాయి. ఇవాళ సామాజిక న్యాయ భావనలు కూడ పాలకులకు మరొక అవకాశం ఇవ్వడం విచారకరం. నిజానికి భావప్రకటనా స్వేచ్ఛ సమాజంలో అతి మౌలికమైనది, బేషరతుగా అమలు కావలసినది. దాన్ని ఇంకా ఎక్కువగా విస్తరించుకోవడం ద్వారానే సమాజం ముందుకు పోతుంది. నిజానికి భావప్రకటనా స్వేచ్ఛ లేకపోతే ఎక్కువ నష్టపోయేది పీడితులూ, బడుగువర్గాలూ, ఇంతకాలమూ నిరాదరణకు గురయిన వర్గాలూ మాత్రమే. ఎందువల్లనంటే ఇప్పటివరకూ ఉన్న భావప్రకటనా సాధనాలూ హక్కులూ అవకాశాలూ అన్నీ పీడకవర్గాలకూ పాలకవర్గాలకూ, అగ్రవర్ణాలకూ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సామాజిక చరిత్ర అంతటా భావప్రకటనా స్వేచ్ఛకోసం జరిగిన పోరాటాలన్నీ దళిత, పీడిత, పాలిత వర్గాలకు ఆ స్వేచ్ఛను సాధించిపెట్టడానికి జరిగినవే.
సమకాలీన తెలుగు సమాజంలో ఈ చరిత్ర అంతా అంతర్ధానమైపోయి సామాజిక న్యాయభావన భావప్రకటనాస్వేచ్ఛ మీద కత్తిదూసింది. ఆ దాడికి ప్రతిస్పందనగా పాత్రికేయలోకం ఒక ఊరేగింపు జరిపితే ఆ ఊరేగింపులో పాల్గొన్న వారిమీద బెదిరింపు నేరారోపణలకు పాల్పడడం దౌర్జన్యం తప్ప మరొకటికాదు. ఊరేగింపులు ఎట్లా జరుగుతాయో, ఉద్రిక్త యువకులు పాల్గొనే ఊరేగింపుల్లో అప్పటికప్పుడు ఎటువంటి తీవ్రమైన నినాదాలు పుట్టుకొస్తాయో, ఆ సామూహిక ఆవేశం ఒక్కొక్కసారి ఎటువంటి అరాచకానికి దారితీస్తుందో అందరికీ తెలుసు. ‘హాయ్ హాయ్ క్యా హువా’ అని ప్రత్యర్థి పేరు చెప్పి ‘మర్ గయా’ అనే నినాదం ఇవ్వని విద్యార్థి ఎవరూ ఉండరు. అది నిజంగా ప్రత్యర్థి మరణాన్ని కోరుకుని ఇచ్చిన నినాదం అంటే చెప్పేదేమీ ఉండదు. అలాగే, అది ఎంత తప్పుడు సంస్కృతిలోనుంచి రూపొందినా, ప్రత్యర్థుల దిష్టిబొమ్మలు తగులబెట్టడం అనే నిరసనరూపం అన్ని ఉద్యమాల్లో అతి సాధారణమైపోయింది. తనకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారనీ, తన దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి తగులబెట్టారనీ మందకృష్ణ మాదిగ చేసిన ఆరోపణలకు సాధికారత ఉందనుకుంటే బహుశా రాష్ట్రంలో అటువంటి అవమానాల, దూషణల కేసులు ప్రతిరోజూ కొన్ని వందలో వేలో నమోదు కావలసి ఉంటుంది. ఆ నేరారోపణలమీద ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్షచర్యకు దిగుతామనే బెదిరింపుతో ప్రభుత్వాన్ని లొంగదీసుకుని ఆంధ్రజ్యోతి సంపాదకుడినీ, ఇద్దరు విలేకరులనూ జైలుకు పంపించగలిగామని ఎవరయినా సంతోషపడుతూ ఉండవచ్చు. కాని ఇది సామాజికన్యాయ భావనకూ భావప్రకటనాస్వేచ్ఛకూ మధ్య ఒక అనవసరమైన శత్రుత్వానికి, అగాథానికి తప్ప మరొకందుకు ఉపయోగపడదు. అటు సామాజిక న్యాయభావననూ, ఇటు భావప్రకటనాస్వేచ్ఛనూ ఉత్తరించదలచుకున్న పాలకుల సంబరానికి తప్ప మరొకందుకు ఇది ఉపయోగపడదు. మననేలమీద ఇటీవలి గొప్ప ప్రజా ఉద్యమం ఇలా ఒక ప్రజాస్వామిక భావనకు ఎదురునిలవడం, తెలిసిగాని తెలియకగాని ఏలికల చేతికి అందిరావడం విషాదకరం.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu. Bookmark the permalink.

6 Responses to భావప్రకటనాస్వేచ్ఛా? సామాజిక న్యాయమా?

 1. ఈ సంఘటన మొత్తంలో, లాభపడింది మాత్రం రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వమని చాలా బాగా చెప్పారు. నష్టపోయింది మాత్రం ఇటు భావప్రకటన, అటు సామాజిక ఉద్యమాలు అని ఒప్పుకోక తప్పదు.

 2. అబ్రకదబ్ర says:

  రాజశేఖర రెడ్డి తెలివిగలవాడో, తెలివితక్కువవాడో అర్ధం కాకుండా ఉంది. ఆయనకి తెలిసిందల్లా తనకేసి వేలెత్తి చూపిన వారిని ఉక్రోషంతో ముందూ వెనకా చూడకుండా ఏదేదో చేసేయాలని చూడటమే అన్నట్లుంది. లేకపోతే రెండు పెద్ద పత్రికలతో పేచీ పెట్టుకుని ఏం బావుకుంటాడు? ఈనాడు, ఆంధ్రజ్యోతిలని దాటి ఇప్పుడాయన పాత్రికేయలోకం మొత్తానికీ శత్రువుగా మారిపోయాడు. పత్రికలతో ముదిరి పాకాన పడిన వైరం ఆయన్ని రాజకీయంగా పెద్ద దెబ్బే తీయొచ్చు. ‘సాక్షి’ ఊతంతో ఎన్నికలనెదుర్కునే ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో మరి.

 3. krishna says:

  మన సామ్యూల్ (బంగారమ్మ ప్రెమతొ అలానే పిలుస్తుంది అని చెప్పుకొంటారు లెండి) రెడ్డి, తెలివి తక్కువ వాడు కాదు, తెలివి కల వాడు కాడు. కరడు కట్టిన, ప్యాక్షనిస్ట్, అంతే. వాళ్లకు వుండేవి, రొండే వర్గాలు, అయితే తన వాళ్లు, లెకపొతే పగ వాళ్లు. అంతకు తప్ప, ఇంక పెద్దగా అలోచిస్తారు అని నేను అనుకోను.

  ఇందులో అందరకన్న నష్టపోయింది మాత్రం, మాదిగ (నా మీద కూడ S.C/S.T కేసు పెట్టరు కదా), ఉద్యమమే.

  అమ్ముడు పోయిన(తోలు)మంద క్రిష్ణ మాదిగ నడుపుతున్న, ఉద్యమానికి సామాన్యులు ఎవ్వరు support చేస్తారు. ఎటూ, డబ్బులు ఇచ్చి, చీరాల తదితర ప్రాంతాలనుండి తెప్పించుకొన్న కిరాయి గుండాలు support తో ఉద్యమాన్ని నడుపుకోవాల్సిందే.

 4. ఎందుకన్నా మంచిది…ఇక నుండి బ్లాగుల్లో కామెంటు ద్వారా విమర్శించదలుచుకొంటే, ఆ బ్లాగరి ST/SC వాడేమో కనుక్కొని విమర్శించడం మంచిది. లేదంటే ఏముంది…కామెంటు రాసినోడికి చంచల్‌గూడా జైలు…ఐదేండ్లు జైలు శిక్ష. ఐనా దిష్టిబొమ్మకు కులమేంట్రా బాబోయ్….తల బద్దలైపోతోంది.

 5. @నవీన్, మీరు ఆవేశంలో మీ ఆవేదనని కాస్తా, ఎత్తిపొడుపుగా మార్చేశారు. బ్లాగుల్లో భావస్వేచ్చని అరికట్టో, అదుపులో పెట్టడానికో కొన్ని గొంతులు వినిపించినా అవి ఇంకా కులాలరంగు పులుముకోలేదు. అది ఇప్పటిదాకా మన అదృష్టం.

  ఎక్కడికెళ్ళినా మన తెలుగువారిలో ఉండే కులఝాడ్యం త్వరలో బ్లాగుల్లోకి వచ్చినా పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ, ఉన్నంతలో సమ్యమనం పాటించడానికి అందరు బ్లాగరులూ నిబద్దులుగా ఉన్నారనే ఆశిద్దాం!

 6. ramesshbabu says:

  @ Mahesh Kumar, nijam cheppaaru meeru.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s