అణు ఒప్పందం అసలు సమస్యలు

అణుఒప్పందం వ్యవహారంలో అమెరికా షరతులను అంగీకరిస్తూ ముందుకుసాగడానికి ప్రభుత్వం నిర్ణయించుకోవడం, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యుపిఎ భాగస్వామ్యపక్షాలయిన వామపక్షాలు కూటమికి మద్దతును ఉపసంహరించుకోవడం ఇవాళ్టి వార్త. ఇది ప్రధానంగా రాజకీయ సంక్షోభంగానో, భారత సార్వభౌమాధికార సమస్యగానో కనబడుతున్నది. ఇంకా కొంచెం ముందుకు వెళితే అది అణువిద్యుత్తు కు సంబంధించిన సాంకేతిక అంశంగా కూడ చూపి ఆ సాంకేతిక నిపుణులు తప్ప మరెవరూ ఆ విషయంలో నోరెత్తడానికి వీలులేదన్న వ్యాఖ్యలూ వినబడుతున్నాయి.

ఇందులో రాజకీయ, సార్వభౌమాధికార, సాంకేతిక అంశాలు ఉన్నమాట నిజమేగాని, వాటితో సమానంగానో, ఇంకా ఎక్కువ ప్రాధాన్యతతోనో రాజకీయార్థిక అంశాలు ఉన్నాయి. ఆ రాజకీయార్థిక అంశాలు అసలు మొత్తం సమస్యకు మూలాధారంగా కూడ ఉన్నాయి. అణుఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామంటున్న ప్రతిపక్షాలు కూడ ఆ రాజకీయార్థిక మూలాలను ప్రశ్నించకపోవడం వల్ల, కొంతవరకు ఆ రాజకీయార్థిక మూలాలను సమర్థించే వాదనలు కూడ చేస్తున్నందువల్ల సమస్య మరింత జటిలం అవుతున్నది. వామపక్షాలు చేస్తున్న వాదనలలో సార్వభౌమాధికార అంశం ఉన్నంతగా అణువిద్యుత్తు గురించిన మౌలిక ప్రశ్నలు లేవు. నిజానికి భారత ప్రభుత్వం నిజమైన సార్వభౌమాధికారాన్ని అనుభవించిన సందర్భాలు ఈ అరవై సంవత్సరాలలో అతి తక్కువ గనుక సార్వభౌమాధికార చర్చకు అర్థం లేదు. అలాగే ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా అనుకూలత గురించో, జార్జి బుష్ కు ఆయన దాసోహమంటున్న తీరు గురించో వామపక్షాలు చాల తీవ్రమైన అభ్యంతరాలు తెలుపుతున్నాయి గాని, భారత రాజకీయాలలోకి ప్రవేశించిన నాటినుంచీ ప్రపంచబ్యాంకు మాజీ ఉద్యోగిగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు అదే. ప్రధానమంత్రిగా ఉంటూ కూడ రెండు సంవత్సరాలకింద ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ ఉపన్యాసంలో ఆయన బ్రిటిష్ వలసవాద పాలనను సమర్థించాడు. కనుక ఆయన విదేశీ గులాంగిరీ ఇవాళే కొత్తగా తెలిసినట్టు నటించడం ఆత్మవంచనో, పరవంచనో కావాలి.

అసలు మొత్తంగా అణు ఇంధన వ్యవహారంలోనే సంక్లిష్టత ఉంది. మనమీద అమెరికా పెత్తనం ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే మన అణువిద్యుత్తు కార్యక్రమాన్ని సమర్థించవలసి వస్తుంది. అసలు అణువిద్యుత్తు అవసరమా, అది ఎవరి ప్రయోజనాలకోసం అనే ప్రశ్న వేసుకుంటే ఆ కార్యక్రమాన్ని వ్యతిరేకించవలసి వస్తుంది. భారతదేశానికి అణువిద్యుత్తు అవసరమా, ఇతర విద్యుదుత్పత్తి అవకాశాలన్నీ ప్రయత్నించిన తర్వాతనే మనం అణువిద్యుత్తు వైపు చూస్తున్నామా, అణువిద్యుదుత్పత్తి వల్ల వచ్చే సమస్యలను పరిష్కరించగలమా, అణువిద్యుత్తు వైపు వెళ్లడంలో నిజంగా మన అవసరాల, ప్రాధాన్యతల పాత్ర ఎంత, బహుళజాతి విద్యుత్ కార్పొరేషన్ల పాత్ర ఎంత, వాటికోసం అమెరికా ప్రభుత్వం మనమీద తెస్తున్న ఒత్తిడి ఎంత, ఇంతకూ అణువిద్యుత్తును శాంతియుత ప్రయోజనాలకోసం వినియోగించడం అనేమాటకు అర్థం ఉందా, అలా వినియోగించినా ఎంత విద్యుత్తు తయారు చేయగలం, మిగిలిపోయిన అణువ్యర్థ పదార్థాలు బాంబులు తయారు చేయడానికి తప్ప మరెందుకూ పనికిరానప్పుడు శాంతియుత అణువిద్యుదుత్పత్తి కూడ అంతిమంగా అణ్వస్త్ర దేశంగా మారడానికేనా, అంటే లెక్కాపత్రమూ లేకుండా వేలకోట్లరూపాయల ప్రజాధనాన్ని ఈ రంగానికి బదలాయించి బహుళజాతిసంస్థలకు దోచిపెట్టడమూ, వారి భారతీయ జూనియర్ భాగస్వాములకూ, ఆ రంగంతో సంబంధం ఉండి నిర్ణయాధికారం ఉన్న రాజకీయ వేత్తలకూ వందలకోట్ల రూపాయల ముడుపులు ముట్టడానికేనా వంటి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవలసి ఉన్నది.

నిజానికి అణుఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నట్టు నటిస్తున్న ప్రతిపక్షాలేవీ కూడ ఇటువంటి ప్రశ్నలేమీ వేయడం లేదు. అసలు దేశంలో అణు కార్యక్రమమే చాల అబద్ధాలతో, అతిశయోక్తులతో, అరాచకంగా మొదలయింది. కేవలం ప్రధానమంత్రికి మాత్రమే జవాబుదారీగా ఉండి, మంత్రివర్గానికిగానీ, పార్లమెంటుకుగానీ, ప్రజలకుగానీ ఎటువంటి సమాచారం లేకుండా అణుకార్యక్రమం సాగేలా ఇందిరాగాంధీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2000 నాటికి 10,000 మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పాదక శక్తిని స్థాపిస్తామని 1980లమధ్యలో ప్రకటించినప్పటికీ, ప్రస్తుతానికి భారతదేశం సాధించిన స్థాపిత అణువిద్యుదుత్పత్తి శక్తి నాలుగువేల మెగావాట్ల లోపే. ప్రస్తుతం 2020 నాటికి 20,000 మెగావాట్ల స్థాపిత శక్తిని సాధిస్తామనీ, ప్రస్తుతం దేశ విద్యుత్ అవసరాలలో 2.6 శాతాన్ని మాత్రమే తీరుస్తున్న అణు విద్యుత్తును 2020 నాటికి 25 శాతానికి తీసుకుపోతామనీ, అందుకు అవసరమైన యురేనియం నిలువలు దేశంలో లేనందువల్ల దిగుమతి చేసుకోవలసి వస్తుందనీ, అలా దిగుమతి చేసుకోవాలంటే అమెరికా విధిస్తున్న షరతులకు తల ఒగ్గక తప్పదనీ భారత ప్రభుత్వం వాదిస్తున్నది. కాని ఇదంతా పచ్చి అబద్ధం. కేవలం అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి రానున్న పదహారు సంవత్సరాలలో 40 బిలియన్ డాలర్లు (నాలుగువేల కోట్ల డాలర్లు, ఒకలక్షా అరవై వేల కోట్ల రూపాయలు) ఖర్చు పెడతామని భారత ప్రభుత్వం 2006లో ప్రకటించింది. అణు విద్యుత్ కేంద్రాలను రూపొందించే, నిర్మించే, మరమ్మత్తు చేసే సాంకేతిక పరిజ్ఞానం, యంత్ర సామగ్రి ఐదారు బహుళజాతిసంస్థలకు మాత్రమే ఉన్నది. మనం ఖర్చు పెట్టనున్న లక్షా అరవైవెల కోట్ల రూపాయలు కేవలం నాలుగు బహుళజాతి కంపెనీలకు మాత్రమే చేరుతుంది. అవి అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్, వెస్టింగ్ హౌజ్ అనే కంపెనీలు, ఫ్రాన్స్ కు చెందిన అరెవా ఎస్ ఎ, ఎలెక్ట్రిసిటె డి ఫ్రాన్స్ అనే కంపెనీలు.

ఈ లక్షా అరవైవేల కోట్ల రూపాయలు కేవలం అణు విద్యుత్ కర్మాగారాలకు మాత్రమే. దానికి ముందూ వెనుకా ఖర్చులు మరింతగా ఉంటాయి. ఆ ఖర్చులలో పదో వంతు నిధులు వెచ్చించినా సౌర విద్యుత్తు గాని, తరంగ విద్యుత్తు గాని, వాయు విద్యుత్తు గాని, ఇతర ప్రత్యామ్నాయ ఇంధన వనరులు గాని అతిచౌకగా తయారు చేసుకోగల సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకోవచ్చు. లేదా, మనకు ఇప్పటికే తెలిసి ఉన్న బొగ్గు ఆధారిత థర్మల్ కేంద్రాలను స్థాపించుకున్నా మరింత తక్కువ సమయంలో మన అవసరాలు తీర్చుకోవచ్చు. అసలు ఇంతకూ మన విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను అరికట్టే సామర్థ్యం పెంచుకుంటే, విద్యుత్తు వినియోగంలో దుబారాను అరికడితే మూడో వంతు విద్యుత్తును ఆదా చేయవచ్చు. ఇటువంటి ప్రత్యామ్నాయ మార్గాలేవీ ఆలోచించకుండా అణువిద్యుత్తు వైపు చూడడం వెనుక ప్రయోజనాలు వేరు, అవి ప్రజావసరాలు ఎంత మాత్రం కావు.

అణు ఒప్పందం అనేది అబద్ధపు విద్యుదవసరాల అంచనాలమీద, అబద్ధపు అణువిద్యుత్ సరఫరా మీద ఆధారపడి, బహుళజాతిసంస్థలకు వేలకోట్ల లాభాలు తెచ్చిపెట్టే ప్రక్రియ తప్ప మరేమీ కాదు. దేశాన్ని అనవసరంగా అణ్వస్త్ర ఆయుధపోటీలోకి ఈడ్చి, దేశ రక్షణ వ్యయాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచి, దేశప్రజల కనీసావసరాలు తీర్చడానికి అవసరమైన నిధులు లేకుండా చేసే కుట్ర. దేశం అణ్వస్త్ర దేశంగా మారిందనే కుహనా గర్వాన్ని, జాతి దురహంకారాన్నీ మధ్యతరగతిలో ఎగసనదోసే కుట్ర, నాయకులకు, అధికారులకు ఎంగిలిమెతుకుల ముడుపులు కట్టబెట్టి స్విస్ బ్యాంకు ఖాతాలు సమకూర్చిపెట్టే కుట్ర ఇది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in ParamarthaSatyam, Telugu. Bookmark the permalink.

One Response to అణు ఒప్పందం అసలు సమస్యలు

  1. sandeepchilukuri says:

    Dear mitrama, the share of nuclear power in france 70% of total power is produced. Why are you abusing multinational companies every time in this issue? Have they cheated you or our motherland ? dear communist mitrama, you may also know that china and Russia is encouraging India on nuclear deal with Nuclear Suppliers Group. Please dont abuse multinational companies in supporting of communism( which is worstly failed in all over world).

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s