ప్రజా ప్రయోజనాలా? స్వార్థమా?

అణుఒప్పందం వ్యవహారం చిలికి చిలికి గాలివాన అయి లోక్ సభలో అవిశ్వాస తీర్మానం దగ్గరికి వచ్చింది. ఈ రసవత్తర నాటకంలో గుర్తించవలసిన, ఆలోచించవలసిన అంశాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ప్రభుత్వపక్షాల వైఖరి దగ్గరి నుంచి అన్ని పార్లమెంటరీ రాజకీయ పక్షాల వరకూ, పార్లమెంటు సభ్యుల వ్యక్తిగత ప్రవర్తన వరకూ ఎన్నో అంశాలు వివరంగా చర్చించవలసి ఉన్నాయి.

నిజానికి పార్లమెంటులో “ప్రజాప్రతినిధుల” విశ్వాసంతోనూ అవిశ్వాసంతోనూ ఏమీ సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా ఒప్పందాలను కుదుర్చుకోవడానికి, దేశాన్ని తెగనమ్మడానికి, దేశ ప్రజల ప్రయోజనాలకు పూర్తిగా భంగకరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సకల అవకాశాలూ ఉన్నాయి. ఈ అరవై సంవత్సరాలుగా కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ అధికారం చలాయించిన అన్ని రాజకీయ పక్షాలకూ అటువంటి చరిత్ర ఉంది. తన పదమూడురోజుల పదవీ కాలంలోనూ, పదమూడు నెలల పదవీకాలంలోనూ ఎటువంటి ప్రజావ్యతిరేక విధానాల నిర్ణయ పత్రాల మీద సంతకాలు పెట్టారో భారతీయ జనతాపార్టీ అధినాయకులు అటల్ బిహారీ వాజపాయి కి తెలుసు. పి వి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మైనారిటీ ప్రభుత్వంగా ఉండి కూడ ఎటువంటి దీర్ఘకాలిక ప్రభావం వేయగల, దేశప్రయోజనాలను బలిపెట్టగల నిర్ణయాలు తీసుకున్నారో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. పార్లమెంటులో అత్యధిక సభ్యుల విశ్వాసం లేకుండానే అధికారపక్షాలు ఎన్నో కీలకమైన, లోతయిన, దీర్ఘకాలికమైన నిర్ణయాలు తీసుకున్న చరిత్ర ఉంది.

కనుక అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల ప్రజాప్రతినిధులనబడేవారిలో విశ్వాసం ఉన్నదా అవిశ్వాసం ఉన్నదా అనేది చర్చ కానేకాదు. ప్రభుత్వాలు తమకు ఐదు సవత్సరాల కొరకో, అంతకన్న తక్కువ కాలానికో అందిన అధికారాలను, ప్రజలు తమకు ఇచ్చిన అధికారాలను ఎట్లా వాడుకుంటున్నాయనేది, ఆ వాడుకోవడంలో వ్యక్తిగత ప్రయోజనాలున్నాయా, ఆ రాజకీయ పక్ష ప్రయోజనాలున్నాయా, దేశ ప్రయోజనాలున్నాయా అనేది చర్చ కావాలి. దేశ ప్రయోజనాలు అనే మాటను కూడ ఎవరికి తోచినట్టు వారు, ఎవరి సంకుచిత అవసరాలకు తగినట్టు వారు నిర్వచించడం కాకుండా నిర్దిష్టమైన, వస్తుగతమైన, సర్వజనామోదమైన నిర్వచనాలు కావాలి.

దేశమంటే మట్టి కాదు గనుక, దేశమంటే మనుషులు గనుక, దేశ ప్రయోజనాలు అంటే దేశంలోని అత్యధిక సంఖ్యాకుల ప్రయోజనాలు అనే అర్థం చెపుకోవలసి ఉంటుంది. ఇప్పతివరకూ దేశంలోని ఒక చిన్న సమూహం ప్రయోజనాలనే దేశ ప్రయోజనాలుగా వ్యాఖ్యానించే పద్ధతి సాగుతోంది. అది మారి, అత్యధిక సంఖ్యాకుల ప్రయోజనాలు అనే అర్థం రావాలి. పిడికెడు మందికి అవసరమైన విలాసాలు తీర్చడమే దేశప్రయోజనాలు అనే అర్థం మారి, కోట్లాది మందికి కనీస అవసరాలయిన కూడూ గూడూ గుడ్డా అందడంలేదనీ, అవి కల్పించడమే మొదటి ప్రాధాన్యత కావాలనీ నిర్వచించుకోవాలి. కాని పాలకపక్షాలు, ఏ మినహాయింపు లేకుండా అన్ని పార్లమెంటరీ రాజకీయ పక్షాలు, ప్రధానంగా సంపన్నవర్గాల, ఎగువ మధ్యతరగతివర్గాల ప్రయోజనాలు తీర్చడమే తమ కర్తవ్యంగా భావిస్తున్నాయి గనుక అసలు ప్రజాప్రయోజనాలు అనే మాటకే తప్పుడునిర్వచనాలు, వ్యాఖ్యానాలు చెలరేగుతున్నాయి.

అందుకే అన్ని రాజకీయ పక్షాలూ కూడ అణువిద్యుత్తు అవసరమేమిటి, అసలు మన విద్యుత్తు అవసరాలు అన్నప్పుడు ప్రజలలో ఏ వర్గపు, ఏ సమూహపు విద్యుత్తు అవసరాలు అనే ప్రశ్నలు వేయకుండా విద్యుత్తు అవసరాలు ఉన్నాయని స్థూలంగా అంగీకరిస్తున్నారు. ఇప్పటికీ విద్యుత్తు అందని వేలాది ఆదివాసి గూడాలున్నాయి. పూర్తి విద్యుదీకరణ జరిగిందని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ గ్రామాలలో దళిత, వెనుకబడిన వర్గాల గృహాలలో పూర్తి విద్యుదీకరణ కాదుగదా సగం విద్యుదీకరణ అయినా జరిగిందా అనేది అనుమానమే. విద్యుత్ అవసరాలను లెక్కవేస్తున్నపుడు పారిశ్రామిక అవసరాలు, అందులోనూ సంపన్నవర్గాల విలాసవస్తువులను తయారుచేసే పరిశ్రమల అవసరాలు, సంపన్నవర్గాలకు సేవలు అందించే పరిశ్రమల, వ్యాపారాల అవసరాలు, సంపన్న గృహాలలో దుబారా వినియోగ అవసరాలు లెక్కలోకి వచ్చినంతగా ప్రజల నిత్య జీవితంలో అవసరమయిన విద్యుత్తు ఎంత, అది తయారవుతున్నదా లేదా, దానికోసం ఏయే ప్రత్యామ్నాయ ఇంధన వనరులున్నాయి అనే చర్చ జరగడం లేదు.

ఒక తప్పుడు ప్రాతిపదికను ఒకసారి అంగీకరించిన తర్వాత దానిపైన ఎంత హేతుబద్ధమైన, తార్కికమైన వాదన చేసినా ఫలితం ఉండదు. అందువల్లనే ఏ సమస్య చర్చ అయినా మౌలిక అంశాల దగ్గరికి వెళ్లవలసి ఉంటుంది. సాధారణంగా మౌలిక అంశాలను చర్చిస్తారని, హేతుబద్ధ, ప్రజానుకూల విశ్వాసాలు కలిగి ఉంటారని చెప్పుకునే పార్లమెంటరీ వామపక్షాలు కూడ మౌలిక అంశాల మీద ప్రశ్నలు వేయడంలేదు. పార్లమెంటరీ వామపక్షాలు కూడ అట్టడుగు ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం మానివేసి సంపన్నవర్గాలకు, ఎగువమధ్యతరగతి వర్గాలకు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నట్టున్నారు గనుక మౌలిక అంశాల మీద చర్చనుంచి వైదొలగుతున్నారు. దేశ సార్వభౌమాధికారం అనే సుదూర సమస్య మీదనే కేంద్రీకరిస్తున్నారు గాని, అసలు అణువిద్యుత్తు అవసరమేమిటి, అది అవసరమే అయితే దాన్ని ఉత్పత్తి చేయడానికి మనకు ఉన్న సామర్థ్యం, నైపుణ్యం ఎంత, దాని నుంచి వచ్చే సమస్యలను పరిష్కరించే శక్తి మనదగ్గర ఉన్నదా, ఆ రంగంలో ఇప్పటికే బలపడిఉన్న బహుళజాతి సంస్థల ప్రయోజనాలకొరకు మాత్రమే ఈ విధాన రూపకల్పన జరుగుతున్నదా వంటి అనేక శాస్త్ర, సాంకేతిక, రాజకీయార్థిక ప్రశ్నలన్నిటినీ విస్మరిస్తూ కేవలం సార్వభౌమాధికారం అనే రాజకీయ ప్రశ్న చుట్టూ తిరుగుతున్నారు.

చర్చ ఈ విధంగా పక్కదారి పట్టినప్పుడు, దేశ ప్రయోజనాలు అనేవి ఇంత అస్పష్టంగా నిర్వచించబడుతున్నప్పుదు సహజంగానే సంబంధిత వ్యక్తులు, పక్షాలు వ్యక్తిగత ప్రయోజనాలనో, పార్టీ ప్రయోజనాలనో ప్రధాన స్థానంలో పెట్టుకుని వాటినే దేశ ప్రయోజనాలుగా చిత్రించడం వీలవుతుంది. ఒక పార్టీ తనకు మంత్రిపదవి ఇస్తే చాలునంటుంది. ఒక ఎంపి తనకు ఇరవై ఐదు కోట్లో, ముప్పై కోట్లో ఇస్తే చాలునంటాడు. మరొక పార్టీ తన రాజకీయ ఎజెండాను పూర్తి చేస్తే చాలునంటుంది. ఇంతకూ అన్ని పార్టీలూ అసలు అణువిద్యుత్ ఒప్పందాన్ని పక్కన పెట్టి ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచడమా కూల్చడమా అనే అనవసర వివాదంలో తలమునకలవుతాయి. ఎట్లాగూ మరొక ఎనిమిది నెలల్లో ముగిసిపోయే పదవీకాలం ఉంటే ఎంత ఊడితే ఎంత, ఒప్పందం మీద మాత్రం సంతకం చేసే తీరుతాం అని అధికారపక్షం అనుకుంటుంది.

ఈ గందరగోళంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) అగ్రనాయకులు జ్యోతి బసు, సోమనాథ్ ఛటర్జీ తీసుకుంటున్న వైఖరులు మన రాజకీయ నేతల, రాజకీయ పక్షాల దివాళాకోరు తనానికి అద్దం పడుతున్నాయి. కె ఎన్ వై పతంజలి నవల రాజుగోరు వీరబెబ్బులిలో ‘బోయినం ముఖ్యవా, విశ్వాసం ముఖ్యవా’ అనే ప్రశ్న వస్తే వీరబెబ్బులి బోయినానికే మొగ్గు చూపినట్టు సామ్రాజ్యవాద ప్రయోజనాలను వ్యతిరేకించడమా, పదవిని కాపాడుకోవడమా అనే ప్రశ్న వచ్చినప్పుడు సోమనాథ్ ఛటర్జీ పదవినే ఎంచుకుంటున్నారు. జ్యోతిబసు ప్రస్తుతం ఏ పదవీ లేకపోయినా ఇరవై ఐదు సంవత్సరాలు పదవి అనుభవించి జీర్ణించుకున్న పాలకవర్గ ప్రయోజనాలనే ఎంచుకుంటున్నారు. అంటే అంత వరిష్ట వామపక్ష నేతలకు కూడ దేశ ప్రయోజనాలకూ వ్యక్తిగత ప్రయోజనాలకూ మధ్య ఘర్షణ వచ్చినప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలనే ఎంచుకునే లక్షణం ఉందన్నమాట. నిజంగా చర్చ జరగవలసినది మన రాజకీయ నేతలు తీసుకుంటున్న ఇటువంటి వైఖరులమీద.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in ParamarthaSatyam, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s