బానిసలు కానిదెన్నడు?

కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం అమెరికాకు బానిసలా ప్రవర్తిస్తున్నదని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య అక్షర సత్యమే గాని ఆయన నోట రావడమే కొంచెం ఎబ్బెట్టుగానూ ఆశ్చర్యంగానూ ఉన్నది. రాష్ట్రప్రభుత్వ రాజకీయార్థిక విధానాలు ఎట్లా నడవాలో ప్రపంచబ్యాంకు రాసి ఇచ్చిన పత్రాన్ని తు.చ. తప్పకుండా అమలు చేసిన చరిత్ర ఆయనది.

ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికన్ ఏజెంటులాగ వ్యవహరిస్తున్నారని అణు ఒప్పందం వ్యవహారం మొదలయినప్పటినుంచీ వామపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు కూడ అటువంటివే. ఆయనను ప్రధానిగా అంగీకరించి మద్దతు ఇస్తూవచ్చినప్పుడూ, అసలు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని అనుకున్నప్పుడూ ఆ సంగతి తెలియనట్టూ, ఇప్పుడే అది గుర్తించినట్టూ వామపక్షాలు మాట్లాడడం ఆశ్చర్యమేమీ కాదు గాని అవకాశవాదానికి అద్దంపడుతున్నది.

మూడువందల సంవత్సరాల వలస ప్రభావాన్ని, అందులో దాదాపు వంద సంవత్సరాల ప్రత్యక్ష పరాయిపాలనను అనుభవించిన భారత ప్రజలు మరే పరాయి దేశానికీ, ప్రభుత్వానికీ బానిసలుగా ఉండదలచుకోలేదని దృఢంగానే నిర్ణయించుకున్నారు. పోరాడారు. ఆ పోరాట ఆదర్శాలను స్పష్టంగానే ప్రకటించుకున్నారు. అందువల్లనే భారతప్రజలు తమకు తాము రాసి ఇచ్చుకున్న రాజ్యాంగంలో ‘సర్వసత్తాక’ అనే మాట మిగిలిన మాటలకన్న ముందు వచ్చింది. కాని గడిచిన ఈ అరవై సంవత్సరాలలో అమెరికా ప్రభుత్వానికో, సోవియట్ యూనియన్ ప్రభుత్వానికో, బహుళజాతిసంస్థల ప్రయోజనాలకో ‘జో హుకుం, జీ హుజూర్’ అనకుండా భారత ప్రభుత్వానికి ఒక్కరోజయినా తెల్లవారిందా పరిశోధించి చూడవలసిందే, కంచుకాగడాలు పెట్టి వెతకవలసిందే. భారత ప్రజానీకం ఆకాంక్షలు ఏమయినా కానీ, ఎంత ఉదాత్తమైనవయినా కానీ, వారిచేత ఎన్నికయిన భారత ప్రభుత్వం అనబడేది ఎన్నడైనా రాజ్యాంగంలో రాసుకున్నట్టుగా సర్వసత్తాక గణతంత్రంగా పనిచేసిందా?

సార్వభౌమాధికారం అనేది ప్రజల నైసర్గికమైన, సహజమైన హక్కు. తమ తరఫున, తమ పేరు మీద రాజ్యం నడిపే ప్రభుత్వానికి ప్రజలు ఆ హక్కును దఖలు పరచారు. ప్రపంచదేశాల మధ్య, అంతర్జాతీయ రాజకీయాలలో, ఆర్థిక వ్యవహారాలలో ఆ సార్వభౌమాధికారాన్ని చూపమనీ, తల ఎత్తుకుని నిలబడమనీ ఆదేశించారు. సార్వభౌమాధికారమంటే ఇతర దేశాలతో ఆదాన ప్రదానాలు వద్దని కాదు, ఆ ఆదాన ప్రదానాలలో భారతదేశపు ఆత్మగౌరవం కోల్పోగూడదని మాత్రమే. ఎగుమతి దిగుమతులు వద్దని కాదు, ఆ ఎగుమతి దిగుమతులలో భారత ప్రజల అవసరాలు, భారతదేశపు వనరులు ప్రధాన భూమిక నిర్వహించాలి తప్ప ఇది అమ్మేవాడి అంగడి అయిపోయి, మనకు అంగవస్త్రాల నుంచి అణ్వస్త్రాల దాకా అమ్మదలచుకున్న బహుళజతిసంస్థల ప్రయోజనాలకొరకు మన విధానాలు తయారు కాగూడదని.

కాని గత అరవై సంవత్సరాలుగా జరుగుతూ వచ్చినదదే. వలసపాలన దుర్మార్గం గురించి సంపూర్ణంగా తెలిసి ఉండి కూడ స్వతంత్ర భారత ప్రభుత్వం వలససామ్రాజ్యంతో తెగదెంపులు చేసుకోలేదు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కూలిపోయినా, రవి అస్తమించని బహుళజాతిసంస్థల సామ్రాజ్యం కొనసాగించడానికీ పేదదేశాల మెడలు వంచడానికీ ఏర్పడిన అంతర్జాతీయ ద్రవ్యసంస్థల ఆటలు భారతదేశంలో మొదటినుంచీ సాగుతూనే ఉన్నాయి. భారత రాజకీయార్థిక విధానాలను ప్రపంచబ్యాంకో, అమెరికా ప్రభుత్వమో, బహుళజాతిసంస్థలో ప్రభావితం చేయడం 1949 నుంచీ కనబడుతుంది. గాంధీకి సన్నిహితుడు, గ్రామీణ భారత ఆర్థిక నిపుణుడు జె సి కుమారప్ప 1952లోనే ‘భారతదేశం మీద అమెరికా డేగ నీడ’ గురించి హెచ్చరించారు. ‘తాకట్టులో భారతదేశం’ ఎట్లా పరాధీనమయిందో తరిమెల నాగిరెడ్డి 1969లోనే విశ్లేషించారు. సరిగ్గా ఆ సమయంలోనే అమెరికా నుంచి దూరం జరుగుతూ, అలీన ఉద్యమం పేరుతో సోవియట్ యూనియన్ అడుగులకు మడుగులొత్తడానికి భారత ప్రభుత్వం సిద్ధపడింది. రెండు అగ్రరాజ్యాలలో ఎవరికి బానిసత్వం వహిస్తే ఎక్కువ ప్రయోజనకరమో లెక్కలు వేసుకోవడంలో తర్వాతి దశాబ్దం గడిచింది. మళ్లీ 1981 అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అప్పు, వ్యవస్థాగత సర్దుబాట్ల రుణంతో అమెరికా ప్రాబల్యానికీ, బహుళజాతిసంస్థల ప్రయోజనాలు నెరవేర్చడానికీ భారత ప్రభుత్వం కంకణం కట్టుకుంది.

మరొక దశాబ్దం గడిచేసరికి నూతన ఆర్థిక విధానాలు, నూతన పారిశ్రామిక, వాణిజ్య విధానాలు, డంకెల్ డ్రాఫ్టును అంగీకరించి వ్యవసాయరంగంలో తెచ్చిన మార్పులు, అనేక ప్రగతిశీల, వలసవాద వ్యతిరేక చట్టాలను రద్దుచేయడం, సవరించడం, ప్రపంచ వాణిజ్య సంస్థ షరతులకు లోబడడం, రాజ్యాంగ నిబంధనలను కూడ తుంగలో తొక్కుతూ అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు నేరుగా రాష్ట్రప్రభుత్వాలతో వ్యవహరించడం, ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం, అమెరికాతో సంయుక్త సైనిక విన్యాసాలు, అణు ఒప్పందం – అదంతా ఒక సుదీర్ఘ విషాద చరిత్ర. ఆ భయానక చరిత్రలో 1991 నుంచి 2008 వరకూ పాలించిన అన్ని కూటములూ, కాషాయం నుంచి ముదురు ఎరుపు వరకు అన్ని రాజకీయ పక్షాలూ భారత సార్వభౌమాధికారాన్ని పణంగా పెట్టి తెల్లదొరలముందర, వాళ్ల దళారీల ముందర సాగిలపడ్డాయి. భారత ప్రజానీకానికి, భారత ప్రచార సాధనాలకు, చివరికి భారత పార్లమెంటుకు కూడ తెలియకుండా భారత ప్రజలమీద అనేక రాజకీయార్థిక విధానాలను రుద్దుతూ వచ్చాయి. అనేక అవమానకరమైన, నష్టదాయకమైన, దేశద్రోహకరమైన ఒప్పందాలమీద నిర్లజ్జగా సంతకాలు చేశాయి. దేశ సంపదను కొల్లగొట్టుకుపోయే అవకాశాలను దేశదేశాల సంపన్నులకు బంగారు పళ్లెరాలలో పెట్టి అందించాయి.
ఆ కార్యక్రమంలో సంపూర్ణంగా భాగస్వాములూ వ్యవహర్తలూ నిర్వాహకులూ లబ్ధిదారులూ అయిన మన రాజకీయనేతలకు ఇవాళ హఠాత్తుగా బానిసత్వం గురించీ, సార్వభౌమాధికారం గురించీ జ్ఞానోదయం కలగడం ఎంత విచిత్రం! ఎంత విషాదం!!

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Prativadam, Telugu. Bookmark the permalink.

One Response to బానిసలు కానిదెన్నడు?

  1. సమస్య జటిలమే..స్వయంప్రతిపత్తిలేని సార్వభౌమత్వం ప్రమాదకరమే. కానీ ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా మనకు పెద్ద చాయిస్ లేదన్నదికూడా కాదనలేని సత్యం. ఇలాంటి పరిస్థితిని ముందుగా గుర్తించి దేశాన్నీ, దేశ ప్రజల్నీ ఈ ప్రభుత్వాలు ఎప్పుడూ తయారుచెయ్యలేదు. ఇక మనవారి colonial mindset గురించి సర్వత్రాతెలిసిన కథలే.
    సామాజికంగా, వ్యవసాయపరంగా,అర్ధికంగా,రాజకీయంగా అన్ని రకాలుగా మనం ఆధారపడే పరిస్థితున్నప్పుడు దాస్యమో లేక రాజీపడటమో తప్ప వేరే దారి ఉందంటారా?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s