అవకాశవాదమే రాజకీయం

ఈ శీర్షిక మీరు చదువుతున్న సమయానికి లోక్ సభలో విశ్వాస తీర్మానం మీద వోటింగ్ వ్యవహారం ముగిసిపోయి కాయో పండో తేలి ఉంటుంది. డా. మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమి ప్రభుత్వం ఇంకొక ఎనిమిదినెలలో, ఎన్నికలదాకానో కొనసాగవచ్చునా లేదా, ఇప్పుడే కూలిపోవాలా తేలిపోయి ఉంటుంది. ఆ విషయం మీద ఒకటి రెండురోజులముందు వ్యాఖ్యానించడం సాధ్యమూకాదు, సముచితమూ కాదు గాని, ఈ సమయాన మన రాజకీయ పక్షాలు పడుతున్న మల్లగుల్లాలు చూస్తుంటే ఇవి రాజకీయపక్షాలేనా, వీళ్లు సిద్ధాంత భూమికమీద రాజకీయ పక్షాలను నడుపుతున్న రాజకీయ నాయకులేనా, వేలాదిమందినో, లక్షలాది మందినో ఆకర్షించగలుగుతున్న, వారి ప్రతినిధులుగా చెప్పుకోగలుగుతున్న నాయకులేనా అని సందేహం కలుగుతున్నది. ఇంత దగాకోరులను, దళారీలను, అవకాశవాదులను, ఊసరవెల్లులను, ఆషాఢభూతులను, నమ్మకద్రోహులను మనం ఎందుకు అందలాలు ఎక్కిస్తున్నాము అని విచారం కలుగుతున్నది.
రాజకీయాలంటే సమాజపు సమస్యలకు సృజనాత్మకమైన, ఆచరణ సాధ్యమైన పరిష్కారాలు వెతికే ప్రక్రియ అంటారు. మిగిలిన అన్ని ప్రజాజీవనరంగాలలో ఉండేవారికన్న రాజకీయవాదులకు ఎక్కువ గౌరవం ఎందుకు దక్కుతుందంటే వాళ్లు తమ రాజకీయావగాహనలో భాగంగా సామాజిక సమస్యలకు తమవైన పరిష్కారాలు కనిపెడతారని. ఆ పరిష్కారాలను విస్తృత ప్రజానీకం దృష్టికి తెచ్చేందుకు రాజకీయ నాయకులకు ఎక్కువ అవకాశాలూ వనరులు ఉంటాయని. ఆ పరిష్కారాలను సూచిస్తూ, వివరిస్తూ, మద్దతు కూడగడుతూ ప్రజలను సంఘటితం చేస్తారని. ఆ ప్రజలకు నాయకత్వం వహించి ఉద్యమాలు, ఆందోళనలు సృష్టించగలరని. చివరికి తమకు చట్టబద్ధ పాలనాధికారం అందితే ఆ పరిష్కారాలను అమలు చేయడానికి ప్రయత్నించగలరని.

కాని మన సమాజంలో ఆ అర్థం చెదిరిపోయి ప్రజలకు కొత్త సమస్యలు సృష్టించిపెట్టే ప్రక్రియను రాజకీయాలు అని పిలుస్తున్నట్టున్నారు. అసలు సామాజిక సమస్యలు పట్టనే పట్టని రాజకీయాలు వచ్చాయి. ఒకవేళ సామాజిక సమస్యలలో వేటినైనా లేవనెత్తినా అది కేవలం తమ ప్రాబల్యం పెంచుకోవడానికి తప్ప మరెందుకూ కాని స్థితి వచ్చింది. రాజకీయ పక్షాలకు, నాయకులకు పత్రికలూ టెలివిజన్ ఛానెళ్లూ మాత్రమే ఏకైక గమ్యంగా ఉన్నాయి. ప్రజలలోకి వెళ్లడం, ప్రజలను సంఘటిత పరచడం, ప్రజాందోళనల ద్వారా తమ రాజకీయాలను ప్రచారం చేయడం వంటి పద్ధతులే మృగ్యమైపోయాయి. తమ పార్టీ కార్యకర్తలకు కాంట్రాక్టులు, అధికారాలు, తమ పార్టీ నాయకుల భోగ భాగ్యాలు మాత్రమే ఒక పార్టీ మనుగడకు సంకేతంగా మారాయి. ఒక పార్టీ ఏ ప్రజాసమస్యలు లేవనెత్తుతున్నది, ఆ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలను ఎంతవరకు కదిలిస్తున్నది, ఆ సమస్యల పరిష్కారాలు పాలనా విధానాలలో భాగమయ్యేట్టుగా ఎంతవరకు చూస్తున్నది అనే ప్రశ్నలే కరువైపోయాయి. ఒక పార్టీ నాయకుడు ఎన్నిసార్లు పత్రికలలో, టీవీలలో కనబడ్డాడు అనేదే గీటురాయి అయిపోయింది.

ప్రజల నుంచి, ప్రజాసమస్యలనుంచి, ప్రజాసమస్యల పరిష్కారాల నుంచి ఇలా దూరమయిపోయిన తర్వాత ఇక మిగిలేది సొంత, స్వార్థ ప్రయోజనాలేతప్ప అంతకు మించిన సమష్టి, సామాజిక ప్రయోజనాలు కాదు. అసలు రాజకీయ వ్యక్తిత్వానికే అర్థం మారిపోయిన తర్వాత, రాజకీయ నాయకుడి అస్తిత్వం దాని మౌలిక పునాది నుంచి విడివడినతర్వాత ఇక ఉపరినిర్మాణమే మిగులుతుంది. అంటే ఆ నాయకుడి లేదా కార్యకర్త వ్యక్తిగత, కుటుంబ అవసరాలు మాత్రమే ప్రధాన స్థానం ఆక్రమించి తాము ఒక సమష్టిలో భాగమనే, తమమీద ఒక సామాజికబాధ్యత ఉందనే అవగాహనే మాయమవుతుంది.
ఈ విషయాన్ని ఇవాళ్టి రగడలో స్పష్టంగా చూడవచ్చు. అణుఒప్పందం మీద చర్చలో బలి అయినది సత్యమా, అసత్యమా, యుపిఎ ప్రభుత్వమా, ప్రతిపక్షాల వైఖరా అని తర్కించుకుంటే, వీటన్నిటికన్న ఎక్కువగా ఈ దేశంలో రాజకీయ నిర్వచనం, రాజకీయ అస్తిత్వం బలి అయిపోయాయనిపిస్తుంది. రాజకీయాలంటే కొనడం, అమ్ముడుపోవడం అని ఈ ఉదంతం రుజువుచేసింది. అది కేవలం డబ్బులకు అమ్ముడుపోవడం మాత్రమే కానక్కరలేదు, తమ విలువలను, అవగాహనలను, ఆదర్శాలను వదులుకోవడం కూడ కావచ్చు. అరవై సంవత్సరాలుగా భారత రాజకీయాలలో జరుగుతున్నదదే గాని గత అనుభవాలన్నిటికన్న ఎక్కువగా ఈ సారి ఆ విషయం మరింత నగ్నంగా రుజువవుతున్నది.

పాలకపక్షం గెలవడానికి ఏ గడ్డికరిచినా తప్పులేదనుకుంటుంది. ఒకసారి మైనారిటీ ప్రభుత్వానికి వోటు వేయడం కోసం లంచం పుచ్చుకున్నాడని ఆరోపణలు ఉన్న రాజకీయ నాయకుడు తనకు మంత్రిపదవి ఇస్తే పాలకపక్షానికి అనుకూలంగా వోటు వేస్తానంటాడు. కొడుకుకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం కోసం అతి జుగుప్సాకరంగా ప్రవర్తించిన పెద్దమనిషి తగుదునమ్మా అని మధ్యవర్తిత్వ బాధ్యత భుజాన వేసుకుంటాడు. నిన్న ఒక కూటమి కట్టడానికి ప్రయత్నించి శృంగభంగమైన మహానాయకుడు నిన్న తనను అవమానించిన వాళ్లతోనే భేటీకి కూచుంటాడు. తన జాతి అకాంక్షలను ఎత్తిపట్టడమే తన రాజకీయమనే మనిషి ఆ ఆకాంక్షలకు ప్రధాన శత్రువుగా నిన్న తానే అభివర్ణించిన మనిషితో దోస్తీకడతాడు. ఒక సిద్ధాంతాన్ని ప్రవచిస్తూ కూడ ఆ సిద్ధాంతానికి బద్ధవ్యతిరేకులయిన వారితో అధికారం కోసం పొత్తుపెట్టుకుంటే తప్పులేదని కొత్త భాష్యం చెపుతున్న మహానాయకురాలు ఇప్పుడు మరొక పొత్తుకు సిద్ధపడుతుంది. తమది మొక్కవోని సిద్ధాంత అవగాహన అని గప్పాలు కొట్టుకునేవాళ్లు వచ్చే ఎన్నికల సీట్ల బేరానికి ఈ ఎత్తు ఎంత పనికొస్తుందా అని లెక్కలు కడతారు…

ఈ కప్పలతక్కెడను నమ్ముకున్న ఈ దేశం ఎటుపోతున్నది?

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Prativadam, Telugu and tagged , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s