తిలాపాపం తలాపిడికెడు

సెజ్ పేరిట దేశదేశాల సంపన్నుల ప్రయోజనాలకోసం తమ భూములనూ జీవనోపాధినీ జీవనాన్నీ కోల్పోయిన పోలేపల్లి గ్రామ ప్రజలు తెలిసో తెలియకో మన రాజకీయ పక్షాల, నాయకుల రంగులు బయటపెడుతున్నారు. ఒక అమాయక, బాధిత గ్రామంలో ఒక ముఖ్యమైన రాజకీయ నిర్ధారణ ఈ విధంగా వెల్లువెత్తడం ఆశ్చర్యమేమీ కాదు. ఇదివరకు అనేక గ్రామాలు, అనేక పరిణామాలు ఈ విషయాన్ని రుజువుచేశాయి. కాని ఇది మరొకసారి మనపక్కనే, హైదరాబాదుకు కూతవేటు దూరంలో నిరూపించబడుతున్నది.

తమకు అన్యాయం జరుగుతున్నదనే విషయం కనీసం ఐదు సంవత్సరాలుగా ఆ ఊరి ప్రజలకు తెలిసినప్పటికీ, వాళ్లు ఎక్కే గడప దిగే గడపగా గగ్గోలు పెడుతున్నప్పటికీ, ఒక ప్రధాన దినపత్రిక ఆ విషాద కథనానికి మొదటిపేజీ అచ్చు యోగ్యత ఉన్నదని గుర్తించిన తర్వాతనే మన మధ్యతరగతి మనసులలోని నిర్లక్ష్య రథ చక్రాలు కదలడం మొదలయింది. ఇక్కడ వోట్లు ఉన్నాయనీ, పాలకపక్షాన్ని ఇరుకున పెట్టగల మహదవకాశం ఉన్నదనీ గుర్తింపు కలగగానే అన్ని ప్రతిపక్ష రాజకీయపార్టీలకూ పోలేపల్లి దారి కనబడడం మొదలయింది. గత ఆరు నెలలలో బహుశా పోలేపల్లిని సందర్శించని, పోలేపల్లి మీద మాట్లాడని ప్రతిపక్ష రాజకీయ నాయకులు లేరు. తాజాగా రాజకీయ పార్టీ పెట్టిన దేవేందర్ గౌడ్, రేపో ఎల్లుండో రాజకీయ పార్టీ పెట్టనున్న నాగబాబు కూడ పోలేపల్లిలో అన్యాయం గురించి మాట్లాడారు. ఆ దినపత్రిక కథనాలనుంచి నాగబాబు విమర్శలదాకా సాగిన రసవత్తరమైన నాటకాలను చూస్తుంటే గొప్ప వినోదం కలుగుతున్నది.

ఎందుకంటే ఇవాళ్టి వోట్ల వేటలో ఈ వ్యాఖ్యాతలూ ఈ రాజకీయ నాయకులూ పోలేపల్లి విషాదం గురించి ప్రత్యక్షంగా మాత్రమే కాదు, మొత్తంగా ప్రత్యేక ఆర్థిక మండలాల గురించీ, నూతన ఆర్థిక విధానాల గురించీ కూడ పరోక్షంగానైనా ప్రస్తావిస్తున్నారు. ఈ వ్యాఖ్యాతలందరూ ఈ విషయాల గురించి ఇన్నాళ్లూ మౌనం వహించారని గుర్తుంచుకోవాలి. వాళ్లలో చాలమంది ఆ రాజకీయార్థిక పరిణామాలను ఈ దేశంలోకి ప్రవేశపెట్టడంలో భాగస్వాములని కూడ గుర్తుంచుకోవాలి. వాళ్లలో ఏ ఒక్కరయినా ఇవాళ పోలేపల్లి విషాదం గురించి మాట్లాడేసమయంలో నిన్నటిదాకా ఆ విషాద కార్యక్రమాన్ని అమలు చేయడంలో తమ వంతు పాత్ర కూడ ఉన్నందుకు ఒక రవ్వ పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తారేమో, ఒక్క మాట క్షమాపణ చెపుతారేమో అని ఎదురుచూసిన వారికి నిరాశే మిగులుతున్నది. ముఖ్యంగా ప్రత్యేక ఆర్థిక మండలాల విధానాన్ని మొట్టమొదట తయారుచేసిన భారతీయ జనతాపార్టీ ఇవాళ పోలేపల్లి మీద కన్నీళ్లు కారుస్తున్నది. ప్రత్యేకించి పోలేపల్లిలో భూఅక్రమణలు జరిగినప్పుడు ఆనాటి ప్రభుత్వంలో నంబర్ టూ గా ఉండిన దేవేందర్ గౌడ్ ఆనాడు తమ ప్రభుత్వం చేసిన తప్పిదం గురించి, ఆ తప్పిదంలో మంత్రివర్గ సభ్యుడుగా తన పాత్ర గురించీ పల్లెత్తు ఆత్మవిమర్శ కూడ ప్రకటించడంలేదు. తెలుగుదేశం హయాంలో ప్రారంభమై, కాంగ్రెస్ పాలనలో విచ్చలవిడిగా సాగుతున్న భూసంతర్పణ కార్యక్రమాల గురించి ఆయనే గంభీరమైన విమర్శలు చేయడం హాస్యాస్పదం. 1996లో శ్వేతపత్రాలు ప్రకటించి రాష్ట్రంలో ప్రపంచబ్యాంకు పాలన ప్రారంభమైనప్పటినుంచీ ఆ పాలనను సమర్థించడానికి, దానికి సంజాయిషీలు సమకూర్చడానికి సర్వశక్తులూ ఒడ్డిన ‘ఈనాడు’ కు ఇవాళ హఠాత్తుగా ఆ రాజకీయార్థిక విధానాల దుష్ఫలితాలు, అదీ పోలేపల్లిలోనో, ఇతర ప్రత్యేక ఆర్థిక మండలాలలోనో గుర్తుకురావడం మరింత హాస్యాస్పదం.

నిజానికి పోలేపల్లి విషాదం ఒకానొక ఘటన కాదు, అది నూతన ఆర్థిక విధానాల క్రమంలో ఒక సందర్భం మాత్రమే. ప్రపంచీకరణ అనే ఒక సుదీర్ఘ క్రమంలో అది ఒకానొక బిందువు మాత్రమే. ఆ క్రమాన్ని ప్రారంభించినవాళ్లు, కొనసాగించినవాళ్లు, సమర్థించినవాళ్లు ఇవాళ హఠాత్తుగా ఆ బిందువు గురించి పెడబొబ్బలు పెట్టడం హాస్యరసావిష్కరణలో పరాకాష్ట.

మిగిలిన నూతన ఆర్థిక విధానాల క్రమం గురించి కాసేపటికోసం పక్కన పెట్టినా, ప్రత్యేక ఆర్థిక మండలాల విధానంలో మన రాజకీయపక్షాలన్నిటికీ భాగం ఉంది. కాషాయం నుంచి ముదురు ఎరుపుదాకా పార్లమెంటరీ రాజకీయపక్షాలన్నిటికీ ఆ తిలాపాపంలో తలాపిడికెడు భాగస్వామ్యం ఉంది. భారతీయజనతాపార్టీ నాయకత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో మంత్రిగా మురసోలి మారన్ 2000 మేలో ప్రత్యేక ఆర్థిక మండలాల విధానాన్ని మొదటిసారి ప్రకటించారు. ప్రతిపక్షాల నిరసనలతో, ఇతర రాజకీయ కారణాలతో అది వెనక్కి పోయింది. అదేవిధానాన్ని పశ్చిమ బెంగాల్ లోని వామపక్ష ప్రభుత్వం 2003 లోనే చట్టబద్ధం చేసింది. మొదట తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్, వామపక్షాలు భాగస్వాములుగా ఉన్న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటినుంచీ ఆ విధానాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించింది. అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకుండానే ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం తెచ్చారు. అతి భయంకరమైన, అవమానకరమైన, అప్రజాస్వామికమైన ఆ చట్టాన్ని పార్లమెంటు ఉభయ సభలూ ఏమాత్రం చర్చ లేకుండా కొన్ని గంటల వ్యవధిలో ఆమోదించాయి. ఆ ఆమోదంలో వామపక్షాలతో సహా అన్ని రాజకీయపక్షాలకూ భాగస్వామ్యం ఉంది. ఇవాళకూడ ప్రతి రాజకీయ పక్షమూ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆ విధానాన్ని అమలు జరుపుతూ, ప్రజల మీద కాల్పులు జరిపి అయినా సరే, ప్రజా నిరసనను అణచివేసి అయినా సరే ప్రత్యేక ఆర్థిక మండలాలను నెలకొలపాలనుకుంటున్నాయి. కనుక ఆ ప్రజావ్యతిరేక విధానం దారిలో పోలేపల్లి మొదటిదీ కాదు, చివరిదీ కాదు. ఇక్కడ మాత్రం బుడిబుడి ఏడుపులు ఏడ్వడం, ఈ మొసలి కన్నీళ్లలో నిన్నామొన్నా తాము చేసిన పాపాలు, మళ్లీ రేపూ ఎల్లుండీ చేయబోయే పాపాలు కొట్టుకుపోతాయని ఆశించడం ప్రజా వివేకం మీద చిన్నచూపే. ప్రజల వివేకం మేల్కొనడానికి ఆలస్యం జరగవచ్చు గాని, అది మేల్కొనకుండా ఎవరూ ఆపలేరు.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Prativadam, Telugu and tagged , , , , , , , , , , , , . Bookmark the permalink.

4 Responses to తిలాపాపం తలాపిడికెడు

 1. Pingback: తిలాపాపం తలాపిడికెడు « Fighting Injustice in Polepally (Jadcherla) SEZ

 2. krishna rao jallipalli says:

  ఫై టపా కూడలిలో ఒక విచిత్రమైన వింత అయిన లిపి లో నాకు దర్శనం ఇచ్చింది. కారణాలు నాకు తెలియవు. ఇలా వింత లిపి లో దర్శనమిస్తే.. ఏమి ఉపయోగం?? ఎవరకి ఉపయోగం?? ఇదే కాదు.. చాలా టపాలు ఇలాగె దర్శనమిస్తున్నై. ఎవరికైన కారణాలు తెలిస్తే విడమర్చి చెప్పగలరా?

 3. The fonts may appear gibberish if you’re using Mozilla Firefox, please make a note that Telugu Unicode is best visible in Internet Explorer 5.0 or above

 4. Krishna Rao garu,

  A recent email from Veeven told me that these junk characters appear in Koodali when the blog author uses long tags in Telugu.

  Please see this link for more details:

  http://veeven.wordpress.com/2008/02/10/junk-characters-in-koodali/

  Konatham Dileep

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s