ఇంతకీ ఎవరిదీ ప్రభుత్వం?

ప్రతి ముఖ్యమైన, అవసరమైన సామాజిక అంశం మీదా లోతుగా జరగవలసిన చర్చను తప్పుదారి పట్టించడం, అసలు ప్రశ్నలను చర్చించకుండా చిల్లర వాదవివాదాలలో అమూల్యమైన శక్తినీ సమయాన్నీ వెచ్చించడం తెలుగు జాతికి సహజమైన జాడ్యంలా మారిపోతున్నట్టుంది. గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న ఏ చర్చను తీసుకుని పరిశీలించినా ఇది తేటతెల్లమవుతుంది. మన రాజకీయ నాయకులకు, అటు అధికారపక్షంలోని వారికైనా, ఇటు ప్రతిపక్షాలలోని వారికైనా ఇలా చర్చలను పక్కదారి పట్టించడం గొప్ప కళగా అలవాటయిపోయింది. మనమేధావులలో విశ్లేషకులలో కొందరికి ఈ వక్రీకరణ వ్యవహారం తెలుసునేమోగాని వారికి సొంత గొంతు వినిపించే వేదికలే తగ్గిపోయాయి. మరీముఖ్యంగా ఇరవైనాలుగుగంటల టివి ఛానెళ్లు వచ్చి చర్చలేచర్చలు చర్చోపచర్చలు జరుగుతున్న సందర్భంలో పందులపెంపకం నుంచి ప్రపంచబ్యాంకు దాకా ఏమైనా అలవోకగా మాట్లాడగల మేధావులు కావాలిగనుక తామరతంపరగా పుట్టుకొచ్చిన మేధావులకు ఏకైక అర్హత ఏమీతెలియకపోవడమే. ఆ టీవీ చర్చలు ఠీవిగా జరుగుతాయిగనుక వాటిని అనుకరించడమే సమాజానికి మిగిలిన మార్గమైపోయింది. దానితో మన చర్చాసరళి ఇవాళ ఉన్న స్థితికి చేరి ఇంక ఇంతకన్న దిగజారగలదా అనిపిస్తున్నది.

ఇప్పుడు జరుగుతున్న తాజా చర్చ గురించే చూద్దాం. రవాణా కమిషనర్ కార్యాలయంలో ఒక మంత్రి సోదరుడు, ఒక రవాణాకంపెనీ యజమాని చేసిన రభస మీద సామాజికకోణంలో చాలా చర్చ జరిగింది. అది జరగవలసిందే. కాని అంతకన్న ఎక్కువగా ఈ ఉదంతంతో మన సామాజిక వ్యవస్థ గురించీ, పాలన గురించీ, ప్రభుత్వ కార్యాలయాల గురించీ, అవినీతి గురించీ ఎన్నో కీలకమైన అంశాలను చర్చకు తేవలసి ఉండింది.

పాలనావిధానాలవల్ల, చర్యలవల్ల బాధితులయిన వాళ్లు, నష్టపోయినవాళ్లు మామూలు వ్యక్తులయితే తమ గోడు వెళ్లబోసుకోవడానికి ఒక ప్రభుత్వ కార్యాలయ సింహద్వారం దగ్గరికి చేరడమే మహా కష్టం. ఎందరో చిన్నదొరలను దాటి పెద్దదొర గది ముందరికి చేరడం అసాధ్యం. అధవా చేరినా అక్కడి బిళ్ల బంట్రోతు చెయ్యి తడిపితేగాని లోపలికి ప్రవేశం దొరకదు. ఆ లోపలికి వెళ్లాక మనమేమీ మాట్లాడడానికి వీలులేదు. బైట ఏ అయ్యనో బతిమిలాడుకుని రాయించుకున్న విజ్ఞాపన పత్రాన్ని మనవైపు కన్నెత్తి కూడ చూడని పెద్దదొర బల్లమీద భయం భయంగా పెట్టి ఒక్క క్షణంలో గిరుక్కున వెనక్కి తిరగవలసిందే. మన ప్రభుత్వ కార్యాలయాల్లో నూటికి తొంబై కార్యాలయాల సంగతి ఇంతే. ప్రజలపట్ల మన ఉద్యోగుల, అధికారుల ప్రవర్తన ఇంతే. ప్రభుత్వోద్యోగులను ప్రజాసేవకులు అని పిలిచే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పటికీ ఉన్నతాధికారులను దొరలు అనిపిలిచే సంప్రదాయమే కొనసాగుతున్నది. దొరల గడీలలోకి మామూలు మనుషులకు ప్రవేశం లేదు.

అటువంటి సమయంలో ఒక వ్యక్తి, అదీ చట్టపరమైన అక్రమాలు చేసి ఉండడానికి అవకాశమున్న వ్యక్తి, అటువంటి అక్రమాలు జరిగాయని అధికారులనుంచి చర్యలకు గురయిన వ్యక్తి మందీమార్బలాన్ని వెంటవేసుకుని ఒక ప్రభుత్వ కార్యాలయంలోకి జొరబడి అక్కడ వీరంగంవేశాడు, అధికారులను బూతులు తిట్టాడు. మామూలు ప్రజలపట్ల వాళ్లు నిందితులు కాకపోయినా ఎటువంటి వైఖరిప్రదర్శిస్తున్నాము, నాయకులపట్ల, శాసనసభ్యులపట్ల, సంపన్నులపట్ల వాళ్లు నిందితులు మాత్రమేకాదు, నేరస్తులు కూడ అని తెలిసినా ఎటువంటి వైఖరి ప్రదర్శిస్తున్నాము అని ప్రభుత్వోద్యోగులు, అధికారులు ఇకనైనా ప్రశ్నించుకోవలసి ఉన్నది, చర్చకు తెరతీయవలసి ఉన్నది.

ఈ బలం ఆ వ్యక్తి ఒక కులానికి చెందినవాడయినందువల్లనో, ఒక ప్రాంతానికి చెందిన వాడయినందువల్లనో, ఒక మంత్రికి సోదరుడైనందువల్లనో వచ్చిందనుకుంటే అది పాక్షిక సత్యమే. గుర్తించవలసిన విషయం ఏమంటే ఆయన గత నాలుగు దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో పెరుగుతూ వచ్చి, ప్రస్తుతం బలపడిన, అధికారాన్ని శాసించగలిగిన స్థితికి చేరిన ఒక నయాసంపన్న, అక్రమార్జనా సమూహానికి ప్రతినిధి. ఆ సమూహం వేళ్లు ప్రభుత్వ నిర్మాణాల కంట్రాక్టులలో, సారావ్యాపారంలో, ప్రైవేటు రవాణా వ్యాపారంలో, ఫైనాన్స్ వ్యాపారంలో, హోటళ్లు, రెస్టారెంట్లు, విలాసకేంద్రాలు నడపడంలో, కార్పొరేటు కళాశాలలు, ఆస్పత్రులు నిర్వహించడంలో విపరీతమైన సంపదను పోగుచేసుకుంది. ఆ సంపద సాయంతో అధికారంలోకి ప్రవేశించింది, లేదా అధికారాన్ని తన కనుసన్నలలో నడుపుకుంటున్నది.

ఆ డబ్బు సంపాదన వెనుక ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యంచేసిన, ప్రభుత్వమే ప్రజాధనాన్ని వాళ్లకు కైంకర్యం చేసిన చరిత్ర ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజారవాణారంగాన్ని ఉద్దేశ్యపూర్వకంగా దెబ్బతీసి, డజన్లకొద్దీ ప్రైవేటు రవాణా సంస్థలు పుట్టుకొచ్చేటట్టు చేసిన పాలకవర్గాల కుట్రలో ఉన్నది. ఆ రవాణా సంస్థలు ఇవాళ ప్రభుత్వాన్ని శాసించగల స్థితికి చేరాయి. ఇంతకాలం చట్టబద్ధంగానూ, చట్టవ్యతిరేకంగానూ తమను పెంచిపోషించిన ప్రభుత్వ విధానాలు ఇవాళ హఠాత్తుగా మేల్కొని, లేదా మేల్కొన్నట్టు నటిస్తూ తమ అక్రమాలను బయటపెడుతుంటే, తమపై చర్యలు తీసుకుంటుంటే ఆ రవాణా అధోజగత్ మహానాయకులకు పిచ్చికోపం వస్తున్నది. ఇంతకాలం తమ పెంపుడుకుక్కగా తాము భావించినది హఠాత్తుగా ప్రజలతరఫున కావలికుక్క అవతారం ఎత్తడమేమిటని వాళ్లకు కోపంవస్తున్నది. ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నది మేమే అయినప్పుడు, చట్టమనీ, నిబంధనలనీ, ప్రజలనీ, ప్రజాసేవకులనీ పనికిరాని మాటలు మాట్లాడనేల అని కోపం వస్తున్నది. ఇది కుల అహంకారంగానో, ఆత్మగౌరవానికి అవమానంగానో కనబడవచ్చు, ఆ కోణం కూడ చూడవలసిందే. కాని అంతకన్న ముఖ్యంగా చూడవలసింది ఈ వర్గానికి ఇంతబలం ఎలావచ్చిందని. ఇంతకీ ఈ ప్రభుత్వం ఎవరిదని.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Prativadam, Telugu and tagged , , . Bookmark the permalink.

3 Responses to ఇంతకీ ఎవరిదీ ప్రభుత్వం?

  1. chavakiran says:

    !

  2. Pingback: పొద్దు » Blog Archive » ఆగష్టు నెల బ్లాగ్వీక్షణం

  3. Pingback: ఆగష్టు నెల బ్లాగ్వీక్షణం | Poddu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s