పాలస్తీనా దుఃఖగానం మహమూద్‌ దర్వీష్‌

Darwish

Darwish

కవిగా, పత్రికా రచయితగా, సామాజిక కార్యకర్తగా, కమ్యూనిస్టుగా, జాతి విమోచనోద్యమ నేతగా, ఇజ్రాయిల్‌ పాలనలో ఖైదీగా.. ఆరు దశాబ్దాల సంక్షుభిత జీవితంలో దర్వీష్‌ ఒక దేశం నుంచి మరొకదేశానికి, ప్రవాసం వెళ్తూ, తన జన్మభూమిలో గడిపిన కాలం నాలుగో వంతుకన్న తక్కువ. అందుకే ఆయన కవిత్వంలో ప్రేమ, ఆవేదన, దు:ఖం, పోరాటం కలగలసి ఉంటాయి.

మహమూద్‌ దర్వీష్‌ చనిపోయాడని చదివినప్పుడు అత్యంత ఆత్మీయుడైన తెలుగు కవి చనిపోయినట్టే అనిపించింది. జీవితమంతా మాతృభూమిలో దుర్మార్గ పరాయి పాలనను అనుభవిస్తూనో, రచనలోనూ ఆచరణలోనూ ఆ పాలకులను ధిక్కరిస్తూ ప్రవాసంలోనో గడిపిన పాలస్తీనియన్‌ మహాకవి మహమూద్‌ దర్వీష్‌ పాడిన పాటలన్నీ మన ఆవేదనకు అక్షర రూపాలేననిపిస్తాయి. ఆ వేలమైళ్ల అవతలి భావుకుడు మనలోలోపలి ఆందోళనలకే కవితారూపమిస్తున్నాడా అనిపిస్తుంది.

ఎప్పుడో 1980ల తొలిరోజుల్లో సిరిసిల్ల నుంచి మిత్రులు నిజాం వెంకటేశం, జూకంటి జగన్నాథం తెస్తుండిన ‘దిక్సూచి’లో అనువాదం చేసినప్పటినుంచీ దాదాపు మూడు దశాబ్దాలుగా దర్వీష్‌ కవిత్వం చదివినప్పుడల్లా ఆయన పాలస్తీనా దు:ఖాన్ని గానం చేస్తున్నాడా, ఇజ్రాయిల్‌-అమెరికా దౌర్జన్యాన్ని నిరసిస్తున్నాడా, పశ్చిమాసియా వేదనను పలుకుతున్నాడా, పాలస్తీనాతో పోల్చగలిగిన తెలంగాణ గురించో, తమ భూమికి తాము పరాయిలయిన భారత రైతుకూలీల జీవనం గురించో, ఇక్కడి దొరల దౌర్జన్యం గురించో గానం చేస్తున్నాడా అనిపించేది.

కవిగా, పత్రికా రచయితగా, సామాజిక కార్యకర్తగా, కమ్యూనిస్టుగా, జాతి విమోచనోద్యమ నేతగా, ఇజ్రాయిల్‌ పాలనలో ఖైదీగా, ప్రవాసంలో తన జన్మభూమి మీద పరిశోధనకేంద్రం నడిపిన సంచాలకుడిగా, పాలస్తీనా ప్రయోజనాలకోసం తన నాయకుడు యాసర్‌ అరాఫత్‌ను కూడ ధిక్కరించిన స్వతంత్ర జీవిగా, పునర్నిర్మాణమవుతున్న సాయుధ పోరాటాన్ని ఆసక్తిగా గమనించిన వ్యాఖ్యాతగా అరవై ఏడు సంవత్సరాల జీవితంలో దర్వీష్‌ అసాధారణమైన సృజననూ ఆచరణనూ మిగిల్చిపోయాడు. నిరంతర సంక్షోభాలలో ఎల్లవేళలా తన హృదయంలో ప్రజలనే, ప్రజా ఆకాంక్షలనే నిలుపుకున్న కవి దర్వీష్‌ బహుశా ఆ హృదయవేదనవల్లనే హృద్రోగానికి గురయ్యాడు.

అమెరికాలో టెక్సాస్‌లో హూస్టన్‌లోని మెమోరియల్‌ హెర్మన్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స తర్వాత గత శనివారం (ఆగస్టు 9న) చివరిశ్వాస విడిచాడు. పాలస్తీనియన్లు తమ ఆస్థానకవిగా చూసుకునే దర్వీష్‌ సంస్మరణార్థం మూడురోజులపాటు గాజాలోనూ వెస్ట్‌బ్యాంక్‌లోనూ సంతాపదినాలుగా ప్రకటించారు. యాసర్‌ అరాఫత్‌ తర్వాత మరే అరబ్‌ నాయకునికీ జరగని రీతిలో జరిగిన అంత్యక్రియలలో లక్షలాది మంది అరబ్బులు పాల్గొన్నారు. పుట్టుకతో పాలస్తీనీయుడై, పాలస్తీనా దు:ఖాన్నే ఎక్కువగా గానం చేసినప్పటికీ, ఒక్క పాలస్తీనియన్లు మాత్రమే కాదు, మొత్తం అరబ్‌ ప్రపంచమే దర్వీష్‌ను తమ ఆత్మీయమిత్రుడిగా భావిస్తుంది.

‘దర్వీష్‌ చాల అరుదుగా తన కవిత్వం చదువుతుంటాడు. కాని ఆ సందర్భం వచ్చిందంటే చాలు అన్ని సామాజిక వర్గాలనుంచీ, అన్ని జీవన రంగాల నుంచీ వేలాది అరబ్‌ ప్రజలు ఆయన కవిత్వం వినడానికి హాజరవుతారు. ప్రతి అరబ్బుకూ దర్వీష్‌ సొంత మనిషి అయిపోయినట్టనిపిస్తుంది. ఆయన జాతీయ ఆస్తి అయినట్టనిస్తుంది. ఆయన పట్ల అరబ్బుల ప్రేమకు వయసు, చదువు, నేపథ్యం, దేశీయత, మతం ఏవీ అడ్డురావు. చాల ఎక్కువగా అనువాదం కూడ అయి ఉన్నాడు గనుక బహుశా సకల ప్రపంచమూ ఆయనను తనవాడిగానే భావిస్తుంది’ అంటుంది జోర్డానియన్‌ కవి సెరిని హులేలీ.

అలా అరబ్బులందరికీ, బహుశా దోపిడీ పీడనలను ఎదుర్కొంటున్న ప్రపంచ ప్రజలందరికీ ప్రియమిత్రుడు కావడానికి దర్వీష్‌ అనుభవించిన బాధామయ జీవితం అపారమైంది. పాలస్తీనాలోని బర్వే అనే గ్రామం లో ఒక సున్నీ రైతు కుటుంబంలో 1941 మార్చ్‌ 13న పుట్టాడు దర్వీష్‌. ఆయన ఏడో ఏట ఇజ్రాయిల్‌ ఏర్పడి పాలస్తీనీయులందరినీ వాళ్ల జన్మభూమినుంచి తరిమేసినప్పుడు దర్వీష్‌ కుటుంబం కూడ ఇల్లూ వాకిలీ వదిలిపెట్టి లెబనాన్‌కు పారిపోయింది. ఇజ్రాయిల్‌ దురాక్రమణలో బర్వే ఒక్కటే కాదు. నాలుగువందల గ్రామాలు నేలమట్టమయిపోయాయి.

అప్పటినుంచి ఆ తర్వాత అరవై సంవత్సరాలు దర్వీష్‌ అనుభవించింది తన జన్మభూమి మీద పరాయి దౌర్జన్యమే. ఆయన సర్వశక్తులా సమర్థించినదీ పాల్గొన్నదీ ఆ దౌర్జన్యాన్ని ధ్వంసించే పోరాటంలోనే. ఏడాది తిరగకుండానే దర్వీష్‌ కుటుంబం దొంగతనంగా సరిహద్దుదాటి ఇజ్రాయిల్‌ ఆక్రమిత పాలస్తీనాలోకి ప్రవేశించి దయర్‌ అల్‌ అసద్‌ అనే గ్రామంలో స్థిరపడింది. కాని ఇప్పుడు తమ నేలమీదనే పరాయి పాలనలో కాందిశీకులుగా, రెండో తరగతి పౌరులుగా వాళ్లు జీవించవలసి వచ్చింది. అలా తన జాతి అనుభవించిన ఆవేదనలనూ ఆకాంక్షలనూ పాఠశాల రోజుల నుంచే కవిత్వంలో చెప్పడం మొదలు పెట్టిన దర్వీష్‌కు ఉన్నతవిద్య కొనసాగించే అవకాశం కూడ దక్కలేదు. పాఠశాల విద్య అయిపోగానే కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయిన దర్వీష్‌ పాలస్తీనియన్‌ వామపక్ష పత్రికలలో కవిత్వం ప్రచురిస్తూ వచ్చాడు. ఇత్తిహాద్‌ అనే వామపక్ష పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు.

ఆ రాజకీయ రచనా, ఆచరణ కార్యక్రమాల వల్ల ఇజ్రాయిల్‌ ప్రభుత్వం దర్వీష్‌ను అనేకసార్లు గృహ నిర్బంధంలో పెట్టింది. చెరసాలలోనూ నిర్బంధించింది. ఆ నిర్బంధాల మధ్యనే దర్వీష్‌ తన కవిత్వానికి పదును పెట్టుకుంటూ సంపుటాలు ప్రకటించాడు. 1970లో మాస్కో వెళ్లి ఒక సంవత్సరంపాటు విశ్వవిద్యాలయంలో చదువుకున్న తర్వాత ఇక ఇజ్రాయిల్‌కు తిరిగి వెళ్లగూడదనీ, పాలస్తీనా జాతి విముక్తి పోరాటానికే తన శక్తిని అంకితం చేయాలనీ నిర్ణయించుకుని ఈజిప్ట్‌ వెళ్లి కైరోలో స్థిరపడి అల్‌ అహ్రమ్‌ అనే పత్రికలో జర్నలిస్టుగా చేరాడు. కాని ఏడాది తిరగకుండానే ఉద్యమ అవసరాల కోసం లెబనాన్‌లోని బీరుట్‌కు వెళ్లి అక్కడ పాలస్తీనా విమోచన సంస్థ తరఫున వెలువడుతుండిన షుఉన్‌ ఫిలిస్తినియ్యా అనే మాసపత్రికకు సంపాదకుడిగా చేరాడు.

ఈలోగా మాస్కో వెళ్లినందుకూ, పిఎల్‌ఓ సభ్యుడయినందుకూ ఇజ్రాయిల్‌ ఆయనను దేశానికి తిరిగి రాగూడని నిషిద్ధవ్యక్తిగా ప్రకటించింది. 1975లో పిఎల్‌ఓ బీరుట్‌ లోనే పాలస్తీనా రిసర్చ్‌ సెంటర్‌ అనే పరిశోధన సంస్థను ప్రారంభించి దర్వీష్‌ ను దానికి డైరెక్టర్‌గా నియమించింది. బీరుట్‌ నుంచే పనిచేసిన పాలస్తీనా రచయితల, పాత్రికేయుల సార్వత్రిక సం ఘానికి అధ్యక్షుడిగా కూడ ఆయన పనిచేశాడు. ఆ సంస్థ అధికార పత్రిక అల్‌ కర్మిల్‌ కు సంపాదకుడిగా ఉన్నాడు. 1982లో లెబనాన్‌ మీద దాడిచేసిన ఇజ్రాయిల్‌ బీరుట్‌ను ఆక్రమించుకుని పిఎల్‌ఓ కార్యాలయాన్ని అక్కడినుంచి బహిష్కరించింది. దానితో దర్వీష్‌ గ్రీస్‌లోని సైప్రస్‌కు ప్రవాసం వెళ్లవలసివచ్చింది. 1987లో దర్వీష్‌ కవిగానే కాక పిఎల్‌ఓ నాయకుడిగా కూడ గుర్తింపబడి కార్యవర్గంలోకి ఎన్నికయ్యాడు.

కాని 1993లో ఇజ్రాయిల్‌ ప్రభుత్వంతో యాసర్‌ అరాఫత్‌ చేసుకున్న ఓస్లో ఒప్పందంతో విభేదించిన దర్వీష్‌ పిఎల్‌ఓ కార్యవర్గం నుంచి వైదొలిగాడు. 1996లో పాలస్తీనాలోని రమల్లాకు తిరిగి వచ్చి అప్పటినుంచీ అక్కడే ఉంటున్నాడు. అలా ఆరుదశాబ్దాల సంక్షుభిత జీవితంలో దర్వీష్‌ ఒక దేశం నుంచి మరొకదేశానికి, ప్రవాసం వెళ్తూ, తన జన్మభూమిలో గడిపిన కాలం నాలుగో వంతుకన్న తక్కువ. అందుకే ఆయన కవిత్వంలో ప్రేమ, ఆవేదన, దు:ఖం, పోరాటం కలగలిసి ఉంటాయి. దాదాపు ఐదు దశాబ్దాల సాహిత్య జీవితంలో దర్వీష్‌ కనీసం ఇరవై కవితా సంపుటాలు, పదిహేను ఇతర రచనల సంపుటాలు ప్రచురించాడు.

ముప్పైకి పైగా ప్రపంచభాషలలోకి అనువాదమయ్యాడు. ఇంగ్లీషులో వెలువడిన కవితా సంపుటాలలో ప్రధానమైనవి వింగ్‌ లెస్‌ బర్డ్స్‌ (1960), ఆలివ్‌ లీవ్స్‌ (1964), ఎ లవర్‌ ఫ్రమ్‌ పాలస్తీనా (1966), ది ఎండ్‌ ఆఫ్‌ ది నైట్‌ (1967), డైరీ ఆఫ్‌ ఎ పాలస్తీనియన్‌ ఊండ్‌ (1969), మై బిలవెడ్‌ అవేకెన్స్‌ (1969), రైటింగ్‌ ఇన్‌ ది లైట్‌ ఆఫ్‌ ది గన్‌ (1970), ఐ లవ్‌ యు, ఐ లవ్‌ యు నాట్‌ (1972), ఎ సోల్జర్‌ డ్రీమింగ్‌ ఆఫ్‌ వైట్‌ లిలీస్‌ (1973), ఓడ్‌ టు బీరుట్‌ (1982), ట్రాజెడీ ఆఫ్‌ డఫోడిల్స్‌, కామెడీ ఆఫ్‌ సిల్వర్‌ (1989), వై డిడ్‌ యు లీవ్‌ ద హార్స్‌ అలోన్‌ (1994), స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌ (2002), డోంట్‌ అపాలజైజ్‌ ఫర్‌ వాటు యు డిడ్‌ (2003). ఆఫ్రో ఏషియన్‌ రచయితల సమాఖ్య ఇచ్చే లోటస్‌ ప్రైజ్‌ (1969), సోవియట్‌ యూనియన్‌ ఇచ్చే లెనిన్‌ శాంతి బహుమతి (1983), ఫ్రాన్స్‌ ఇచ్చే నైట్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ లెటర్స్‌ (1993), లాన్నన్‌ ఫౌండేషన్‌ ప్రైజ్‌ ఫర్‌ కల్చరల్‌ ఫ్రీడం (2001) వంటి పురస్కారాలు దర్వీష్‌కు ఇవ్వడం ఆ పురస్కారాలకే గౌరవం.

చివరి దశలో రమల్లాలో ఉంటూ విస్తరిస్తున్న పాలస్తీనా ఇంతిఫాదా వల్ల వికసించిన ఆశలతో మళ్లీ తొలిరోజుల కవిత్వంలాంటి శక్తివంతమైన అభివ్యక్తిని సంతరించుకున్నాడు దర్వీష్‌. హమాస్‌, ఫతాల మధ్య తలెత్తిన ఘర్షణలను ‘బహిరంగ ఆత్మహత్యా ప్రయత్నం’గా నిరసించి తన సమర్థన సంపూర్ణం కాదనీ అది విమర్శనాత్మకమైనదనీ చూపాడు. 2001-02లలో రాసిన మొహమ్మద్‌, త్యాగం, దిగ్బంధ స్థితి అనే మూడు కవితలూ కొత్త అభివ్యక్తికి అద్దం పడతాయని విమర్శకులు అంటున్నారు.

దిగ్బంధ స్థితి కవితలో కొన్ని పంక్తులు:

నా దుస్తులు నా చిన్నారి కూన నెత్తుటిలో తడిసి ముద్దయ్యాయి
నువు వాడిని చుట్టుకుని రక్షణ ఇవ్వవా
అని ఒక తల్లి మేఘాన్ని అడిగింది
నా బిడ్డా, నువ్వు వర్షానివి కాలేకపోతే
చెట్టయిపో
నిండుగర్భిణివై వందల చెట్లుగా మారు

నా కన్నా! నువ్వు చెట్లుగా మారలేకపోతే
రాయిగానైనా మారు
తడినిండిన రాయిగా మారు

నా బంగారూ, నువ్వు రాయిగానూ మారలేకపోతే
చందమామలా మారు
నెచ్చెలి స్వప్నంలో చందమామగా మారు
అని ఒక తల్లి ఒరిగిపోయిన కొడుకును అడిగింది

(Courtesy : AndhraJyothy Vividha 18th August 2008)

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu and tagged , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s