ఔనా, వ్యత్యాసం లేదా?!

మూడు దశాబ్దాలుగా తెలుగు సినిమా తెరమీద విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాలను చూరగొన్న నటుడు చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేయనున్నాడనే వార్త గత నాలుగైదు సంవత్సరాలుగా వినబడుతూనే ఉంది. ఏడాదిగా ఆ వదంతి హోరు మరింతగా పెరిగింది కూడ. చిట్టచివరికి నిన్న ఆదివారం నాడు స్వయంగా ఆయన నోటినుంచే తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాననే మాట వెలువడింది. ప్రధానమైన విషయాలను పది రోజుల తర్వాత పెట్టబోయే తిరుపతి బహిరంగసభకు వాయిదా వేస్తూనే ఆయన కొన్ని ముఖ్యమైన సూచనలు వదిలారు. ఆయన అభిమానులో, ఆయన పుట్టిన సామాజికవర్గానికి చెందినవారో, ఇంకెక్కడా అవకాశాలు దొరకక కొత్తొక వింతగా ఈ పార్టీని చూస్తున్నవారో, నిజంగానే ఆయన వల్ల రాజకీయాల్లో ఏదో మార్పు వస్తుందని ఆశిస్తున్నవారో ఆయన సూచనలను నిరభ్యంతరంగా అంగీకరించవచ్చు. ఎగిరిగంతులువేసి బాణసంచా కాల్చి సందోహం సృష్టించవచ్చు. కాని ఆ సూచనలలో కొన్నిటిని గురించి కాస్త తీవ్రంగా ఆలోచించవలసి ఉంది. లోతుగా పరిశీలిస్తే ఆ సూచనలు ఎటువంటి అవకాశవాద, ప్రమాదకర రాజకీయాలకు దారితీయగలవో గుర్తించవలసి ఉంది.

విధివిధానాల ప్రకటన, పార్టీ రాజకీయ ప్రణాళిక, పార్టీ కార్యక్రమం వంటి అంశాలన్నీ పూర్తిగా బయటపడేవరకూ వ్యాఖ్యానించడం సముచితం కాదుగాని, ఆగస్టు 17 నాటి పత్రికా సమావేశంలో చిరంజీవి చేసిన ప్రకటనలలో మూడు అంశాలు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయి. అవి ఒకటి, తనది లెఫ్టిజమా, రైటిజమా అన్నప్రశ్నకు జవాబుగా రెండూ కాదు హ్యూమనిజం అన్నమాట. రెండు, రాష్ట్రాన్ని కుదిపేస్తున మౌలిక సమస్యలపట్ల ఇదమిద్ధంగా ఏదీ తేల్చిచెప్పని ధోరణి. మూడు, తనది ఇతరులుచేసే పనికన్న వ్యత్యాసమైన పని కాదని, ఆ పనులనే తాను వ్యత్యాసంగా చేస్తానని అన్నమాట.

అసలు ఒక రాజకీయ నాయకునిది, లేదా రాజకీయ పార్టీది లెఫ్టిజమా, రైటిజమా అన్నప్రశ్నే సరయినది కాదనే చర్చను కాసేపు పక్కన పెడదాం. నిజానికి లెఫ్టిజం, రైటిజం అన్నవేమీ లేవు. మౌలిక సామాజిక సమస్యల పరిష్కారాలలో తీవ్రమైన వైఖరి తీసుకునే వాళ్లు ఫ్రెంచి పార్లమెంటులో అఢ్యక్షుడికి ఎడమవైపున కూచునే వాళ్లు కాబట్టి వామపక్షం అనే మాట వచ్చింది. అలాగే అధికార పక్షానికి చెందినవాళ్లు కుడిపక్కన కూచునే వాళ్లు, యథాస్థితి కొనసాగాలని కోరుకునేవాళ్లు. అన్ని దేశాల శాసనసభలలో అధికార, ప్రతిపక్షాలు ఇలాగే కూచునే సంప్రదాయాన్ని పాటిస్తూనే ఉన్నాయి. ఇవాళ ఎక్కడా కూడ నిజమైన ప్రజాసమస్యలమీద మౌలిక పరిష్కారాలు సూచించే వాళ్లు శాసనసభలలో ఉండడమే లేదు. అధికారాన్ని ప్రస్తుతం అనుభవిస్తున్నవాళ్లు ఒకపక్కనా, నిన్న అనుభవించినవాళ్లో, రేపు అనుభవించబోయేవాళ్లో మరొకపక్కనా కూచుంటున్నారు. ప్రజాపాలన విషయంలో, ప్రజాసమస్యల పరిష్కారం విషయంలో ఎటునుంచి ఎటు వచ్చినా మార్పేమీ ఉండడం లేదు. లెఫ్టిజం, రైటిజం తేడానే లేదు.

చిరంజీవి అనుసరించబోయే రాజకీయాలేమిటనే ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ప్రాస కుదిరిందికదా అని ‘లెఫ్టిజమూ కాదు, రైటిజమూ కాదు, హ్యూమనిజం’ అన్నారు. అంటే ఆ రెండు పక్షాలలోనూ హ్యూమనిజం లేదనే అర్థం వస్తుంది. అది నిజమే కూడ కావచ్చు గాని పార్లమెంటరీ రాజకీయాలు ఎంచుకోవలసి వస్తే ఆ రెండూ తప్ప మరొక గత్యంతరం లేదు. ఇట్లాగే ప్రాస కోసం ప్రయత్నించి ‘ఇప్పుడే ఇజమూ లేదు, టూరిజం తప్ప’ అన్న చంద్రబాబు నాయుడుకు ఏమి జరిగిందో మనకు తెలుసు.

ఇక తన రాజకీయవైఖరులగురించి ఈ సమావేశంలో చెప్పకుండా, తిరుపతి బహిరంగసభకు వాయిదా వేయడానికి ఆయనకు పూర్తి హక్కు ఉంది. కాని ఒకటికి పది సార్లు అవి సున్నిత సమస్యలు అనీ, వాటి మీద కమిటీలు వేసి అధ్యయనం జరిపి, వైఖరి తేల్చవలసి ఉంటుందనీ అనడం సాచివేత వైఖరి తప్ప నిర్ణయాత్మకమైన రాజకీయ వైఖరి కాజాలదు. ఇంకొక తొమ్మిది రోజుల తర్వాత చెపుతాను అన్నా ఫరవాలేదు గాని అధ్యయనం చేయవలసి ఉంది, కమిటీ వేస్తాను అంటే ఆ కమిటీ ఈ తొమ్మిది రోజులలో అధ్యయనం చేసి నిర్ధారిస్తుందని అర్థం చేసుకోవాలా?

ఇక అంతకన్న విచిత్రంగా మీరు ఇప్పటివరకూ పాలించిన వారికన్న వ్యత్యాసంగా ఏమి చేయనున్నారు అని ప్రశ్నిస్తే, అసంకల్పితంగానే చిరంజీవి నిజం వెల్లడించారు. వారికన్న వ్యత్యాసంగా ఏమీ చేయబోను, వారు చేసిన పనులనే వ్యత్యాసంగా చేస్తాను అన్నారు. నిజానికి రాజకీయక్రీడ మౌలిక సూత్రాలు మారవలసి ఉంది. ఇవాళ ఎవరయినా ప్రజలకోసం పనిచేయదలచుకుంటే, ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తే ఇప్పటివరకూ కొనసాగిన సామాజిక, రాజకీయార్థిక ధర్మానికన్న భిన్నమైన, వ్యత్యాసమైన సామాజిక రాజకీయార్థిక ధర్మాన్ని పాటించవలసి ఉన్నది. కొనసాగుతున్న సామాజిక రాజకీయార్థిక ధర్మాన్ని ఏమీ మార్చను, దాన్ని కొత్త పద్ధతిలో అమలు చేస్తాను అనడం మాటల గారడీయే అవుతుంది. అవినీతి మీద నడిచే రాజకీయ వ్యవస్థను మార్చబోను, అవినీతిని తగ్గిస్తాను, దోపిడీ పీడనలమీద నడిచే వ్యవస్థను మార్చబోను, వాటికి అతుకులూ మాట్లూ వేస్తాను, అసమానతలను తొలగించబోను, ఆ అసమానతలను, దుఃఖాన్ని, వేదనను, ఆకలిని మరచిపోవడానికి కొన్ని కలలు మాత్రం అమ్ముతాను లాంటి వాగ్దానాలను గతంలో చాలమంది చేశారు. ఇవే మన కొత్త నాయకుడి రాజకీయాలయితే చిరునామాలు మారవచ్చునేమోగాని వ్యవస్థ మాత్రం మారదు.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Prativadam, Telugu and tagged , , , . Bookmark the permalink.

2 Responses to ఔనా, వ్యత్యాసం లేదా?!

  1. కొత్తగా చేసేదేమీ లేదండీ … రాజకీయాల్లోకి వస్తే పోయేదేమీ లేదు .. అదృష్టం బాగుంటే ముఖ్యమంత్రి కుర్చీ .. లేదంటే సినిమాలు ఎలాగూ ఉన్నాయి కదా (ఫ్లాప్/హిట్టులతో సంబందం లేకుండా ముందుగానే అమ్మి లాభాలు వెనకేసుకునే తెలివితేటలున్న బావమరిది ఉన్నాడు కదా) … ఓడిపోతే తన బలం అభిమానులే అని చెపుతాడు కాబట్టి, హైదరాబాద్ నుంచే sms/email/phone ల ద్వారా జిల్లాలలో ధర్నాలు చేయిస్తాడు … మంచి రాజకీయ విన్యాసమండీ బాబు.

  2. రాజకీయ వ్యవస్థ సమూలంగా మారాలంటే మళ్ళీ రాజ్యాంగాన్ని తిరగరాయాలి. ఉన్న framework లో దాని interpretation సక్రమంగా జరిగి ప్రజలకు మేలు చేసే రాజకీయం కావాలంటే, ఏ జయప్రకాష నారాయణ్ణో పూర్తి మెజారిటీతో గెలిపించి,ఒక ఐదు సంవత్సరాలు అతను చెప్పినట్లు చెయ్యాలి.

    పైరెండూ జరగకపోతే చిరంజీవొచ్చినా, ఆఖరికి ఆ దేవుడే దిగొచ్చినా పెద్ద మార్పేమీ రాదు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s