ఆదివాసులకేం దక్కింది?

చరిత్ర, రాజనీతి శాస్త్రాల విద్యార్థులు అమాయకంగా పరాయిపాలన దౌర్జన్యాలగురించీ, జాతీయోద్యమంగురించీ, స్వాతంత్ర్యసముపార్జన గురించీ చదువుకుంటారు. ప్రజల సార్వభౌమాధికారాన్నీ, సామాజిక న్యాయాన్నీ, ప్రజాస్వామ్యాన్నీ గుర్తించిన రాజ్యాంగం గురించీ చదువుకుంటారు. ఆ విద్యార్థులు మాత్రమే కాక, ప్రజలందరూ దేశానికి స్వాతంత్ర్యం అందిందనబడే తేదీన మొక్కుబడి ఉత్సవాలు జరగడమూ చూస్తుంటారు. ఆ ఉత్సవాలలో తమ ప్రమేయం తగ్గుతూ అది పూర్తిగా రాజకీయనాయకుల, అధికారుల వ్యవహారంగా మారిపోవడమూ గుర్తిస్తుంటారు.

ఆ తేదీకి అరవైరెండు సంవత్సరాలు నిండిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకున్న తర్వాత ఐదురోజులు తిరగకుండానే ఆ స్వాతంత్ర్యం ఈ దేశంలో అట్టడుగు మనిషికి ఏమి ఇచ్చిందో, ఇవ్వలేదో చూసే అవకాశాన్ని మన రాష్ట్ర పోలీసులు నాకు కలిగించారు. ‘ఈ అర్ధరాత్రివేళ ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు భారతదేశం ఒక కొత్త ఉదయంలోకి మేల్కొంటున్నది’ అని జవహర్ లాల్ నెహ్రూ గంభీరంగా ప్రకటించి అరవై రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడ కొందరి జీవితాలలోకి ఆ ఉదయపు వెలుగులు ఇంకా ప్రసరించలేదని, ప్రసరించబోవని పోలీసులు స్పష్టంగా తమ పనుల ద్వారా చూపారు.

తేదీ ఆగస్టు 20. ఊరు పాడేరు. తూర్పు కనుమలలో విశాఖపట్నం జిల్లా ఉత్తర ప్రాంతాన ఆదివాసుల అభివృద్ధి కోసం ఏలినవారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న ఊరు. అక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరంలోని వాకపల్లి అనే గ్రామంలో సరిగ్గా సంవత్సరం కింద గ్రే హౌండ్స్ పోలీసులు పదకొండు మంది ఖోండు మహిళలమీద అత్యాచారం జరిపారని ఆరోపణలు వచ్చాయి. ఆ సంఘటన జరిగి ఏడాది గడిచినా నిందితుల మీద ఎటువంటి చర్యలూ తీసుకోలేదని నిరసన తెలపడానికి ఆదివాసీ స్వయం ప్రతిపత్తి సాధన సమితి అనే సంస్థ ఒక సభ ఏర్పాటు చేసింది. ఆ సభాకార్యక్రమమంతా బహిరంగమే. ఆదివాసులపై జరిగిన అత్యాచారాన్ని ఖండించడానికే ఆ సభ గనుక నిర్వాహకులు స్థానిక అధికారులను కలిసి తగిన అనుమతులన్నీ తీసుకున్నారు. గిరిజన బాలల హాస్టల్ గా ఉపయోగిస్తున్న ఇన్ డోర్ స్టేడియం లో సభ జరపడానికి అనుమతి పొంది ఏర్పాట్లు చేసుకున్నారు. సభాకార్యక్రమమంతా బహిరంగంగా కరపత్రం అచ్చువేసి పంచారు. సభజరపడానికి తాము అభ్యంతర పెట్టబోమని పోలీసువారి నుంచి కూడ హామీ పొందారు. ఆ సభలో మాట్లాడడానికి పౌరహక్కుల సంఘం, మానవహక్కుల వేదిక, కులనిర్మూలన పోరాటసమితి నాయకులతో పాటు నన్ను కూడ ఆహ్వానించారు. వాకపల్లి అత్యాచారం జరిగిన తర్వాత తెహెల్కా వారపత్రికకు రాయడానికి వాకపల్లికి వెళ్లి బాధిత మహిళలతో, అక్కడి ప్రజలతో మాట్లాడడమే, ఆ విషయం మీద నాలుగైదు వ్యాసాలు రాయడమే నన్ను పిలవడానికి కారణం కావచ్చు.

సభ ప్రారంభం కావలసిన సమయానికి అక్కడికి చేరిన ఆదివాసి యువకులు కొద్దిమంది మాత్రమే. ప్రతిఒక్కరినోటా ఒకేరకమైన మాట – పోలీసులు ఎవరినీ సభకు రానివ్వడం లేదు, ఆపుతున్నారు, బెదిరిస్తున్నారు అని. ‘అన్యాయం చేస్తే చేశారు, అన్యాయం చేసిన వారిపై చర్య తీసుకోకపోతే పోయారు, ఏడాది గడిచినా న్యాయం జరగలేదని ఏడుద్దామన్నా వీలులేదా? ఏడ్వడానికి కూడ ఆటంకాలు పెట్టే సర్కారా ఇది?’ అదీ వాళ్ల ప్రశ్న. ఆరు దశాబ్దాల స్వాతంత్ర్యాన్ని కీర్తించేవారూ, ఉత్కృష్టమైన రాజ్యాంగ ఆదర్శాలను వల్లెవేసేవారూ, చట్టబద్ధపాలన గురించి మాట్లాడేవారూ జవాబు చెప్పవలసిన ప్రశ్న.

ఒక గంట సేపు ఇటువంటి ఫిర్యాదులన్నీ విన్నతర్వాత, నలుమూలలా వందలాదిమంది ఆదివాసులు రాకుండా చేశారని విన్న తర్వాత, ఇక మనమే బయల్దేరి ఆ బాధితులను ఆపిన దగ్గరికి వెళ్దామనీ, అక్కడే వారితో మాట్లాడవచ్చుననీ నిర్వాహకులు అన్నారు. కావలసింది సభలో, ఉపన్యాసాలో కాదనీ అన్యాయానికీ, నిరాదరణకూ, వివక్షకూ గురయిన బాధిత మహిళ్లకు కాస్త సానుభూతి, సాంత్వన అందించడమనీ నిర్వాహకులు అన్నారు. ఇద్దరు వక్తలను పాడేరులోనే ఉంచి ఇద్దరు వక్తలం వాకపల్లి వైపు బయల్దేరాం. మండలకేంద్రం జి. మాడుగుల నుంచి వాకపల్లి వైపు వెళ్లే రోడ్డుకు అడ్డంగా పెద్ద గ్రేహౌండ్స్ పటాలం. పురుగును కూడ అవతలినుంచి ఇవతలికిగాని, ఇవతలినుంచి అవతలికిగాని వెళ్లనీయకుండా అడ్డుగా ఉంది. ఆదివాసులను ఆపడం, వేధించడం, నిర్బంధించడం జరుగుతున్నాయి. మా కారును కూడ ప్రశ్నలు వేసి, ఎందువల్లనో గాని ముందుకు పోవడానికి అనుమతించారు. అక్కడినుంచి ఇరవై కిలోమీటర్లు వెళితే నుర్మతి అనే పెద్దగ్రామం దగ్గర వందలాది ఆదివాసులు పోగయి ఉన్నారు. అత్యాచారానికి గురయిన మహిళలలో ఐదారుగురు అక్కడ ఉన్నారు. అక్కడచేరిన ఆదివాసులు అత్యాచారం జరిగిన నాటినుంచీ ఏమేమి జరిగాయో వివరించారు. అత్యాచారం చేసిన పోలీసులను కాపాడడానికి సర్కారు ఏమేమి చేసిందో చెప్పారు. అత్యాచారానికన్న మిన్నగా ఏడాదిగా సాగుతున్న ఆ చట్టవ్యతిరేక, చట్ట ఉల్లంఘనా కార్యక్రమాలన్నిటికీ స్వయంగా చట్టపరిరక్షకులే ఒడిగడుతూ ఉన్నారని సంఘటన తర్వాత సంఘటన వివరిస్తూ చెప్పారు.

“ఇదే మరొక స్త్రీ ఎవరయినా తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేస్తే సర్కారు ఇంత పట్టనట్టుగా ఉండేదేనా? అన్యాయం చేసినవాళ్లను కాపాడడానికి ఇంతగా ప్రయత్నించేదేనా? మాకు పరపతి లేదనే గదా, మాకు చదువు లేదనే గదా, మేము ఎందుకూ పనికిరాని ఖోండులమనేగదా ఈ అన్యాయం” అని ఆ బాధితమహిళలు నిలదీస్తుంటే ఎవరిదీ స్వాతంత్ర్యం అని మరొకసారి ప్రశ్న తలెత్తింది. ఆ నిరక్షరాస్య ఆదివాసి మహిళల కన్నీళ్లముందు మహాఘనత వహించిన భారతప్రజాస్వామ్యం, చట్టబద్ధపాలన తలదించుకోకతప్పదనిపించింది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Prativadam and tagged , . Bookmark the permalink.

One Response to ఆదివాసులకేం దక్కింది?

  1. ప్రభుత్వం పోలీసుల కొమ్ము కాసి, నేరమే చేస్తోంది. కానీ, ఆ మహిళల పట్ల ప్రతిపక్షాలు చూపించిన నిర్లక్ష్యం దారుణం, నేర సమానం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s