అవకాశవాదమే రాజకీయాలుగా…

రాష్ట్రంలో శాసనసభకు సాధారణ ఎన్నికలు లెక్కప్రకారం ఏప్రిల్ 2009లో వస్తాయో, ఇంకా అంతకన్న ముందేవస్తాయో తెలియదుగాని ఎన్నికల జ్వరం అప్పుడే ప్రారంభమయింది. చంకలో ఉల్లిగడ్డ పెట్టుకుంటే శరీర ఉష్ణోగ్రత పెరిగినట్టు చిరంజీవి రంగప్రవేశంతో ఈ జ్వరం వేడి ఇంకా తీవ్రమవుతున్నట్టు కనబడుతోంది. వివిధ రాజకీయ పక్షాలు ఎన్నికలకోసం తమ తమ కార్యక్రమాలు ప్రకటించడం, ప్రజలకు భారీ వాగ్దానాలు చేయడం, ఏయే రాజకీయ పక్షాలతో తమకు ఎన్నికల పొత్తులు ఉండబోతున్నాయో సూచించడం, తమ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయో కొంత కొంతగా బయట పెట్టడం జరుగుతున్నాయి. మహారాజకీయసర్కస్ లో తొలి అంకంలోని పిల్లి మొగ్గలు, రంగులు మార్చడాలు, ఒక ఊయలమీదినుంచి మరో ఊయలమీదికి గెంతడాలు, ఒకరిమీద మరొకరు ఉత్తుత్తి కత్తులు దూయడాలు యథావిథిగా జరిగిపోతున్నాయి.

ఇదంతా రాజకీయక్రీడ అనడానికేమీలేదు. అసలిందులో రాజకీయాలు, ప్రజలకు మేలు చేసే రాజకీయాలు ఉన్నాయా అనేది అనుమానమే. ఆయా వ్యవహారాలు నడుపుతున్న పార్టీలకు రాజకీయ పార్టీలుగా పేరుంది గనుక, ఆయా వ్యక్తులకు రాజకీయ నేతలుగా పేరుంది గనుక ఈ సర్కస్ ఫీట్లను రాజకీయాలు అనుకోవలసిందేగాని నిజంగా సూత్రబద్ధంగా, నిజాయితీగా, క్రమబద్ధంగా ఉండవలసిన రాజకీయాలకూ, ఇవాళ తెలుగు రాజకీయ నాయకులు ఆడుతున్న చదరంగానికీ ఏమీ సంబంధంలేదు.

ఎన్నో దశాబ్దాలుగా పనిచేస్తున్న, లేదా ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చిన మహా ఘనత వహించిన రాజకీయ పక్షాలను అరాజకీయ పక్షాలని అనడం వారిని కించపరచడానికి ఎంతమాత్రమూ కాదు. కనీసం గత రెండు వారాలుగా తెలుగుసీమలోని అన్ని “రాజకీయ” పక్షాలూ అంటున్న మాటలూ చేస్తున్న చేతలూ చూస్తే అవి అవకాశవాద పక్షాలుగానే తప్ప రాజకీయ పక్షాలుగా కనబడడంలేదు.

నూరేళ్లు ఎప్పుడో నిండిపోయినా ఇంకా అధికారం నెరపగలుగుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అన్ని అక్రమాలకూ కన్నతల్లి. అవకాశవాదమే రాజకీయంగా, కళగా అభివృద్ధిచేసిన పార్టీ అది. అన్నిరకాల గొంతులకూ స్థానం ఇచ్చి, ఎవరు ఏమి మాట్లాడినా ఆమోదించి, లోపల ఉన్నవారే ఒకరిమీద ఒకరు ముఠాలు కట్టినా, కత్తులు దూసుకున్నా, పరస్పర భిన్నమైన అభిప్రాయాలు ప్రకటించినా, పరస్పర వ్యతిరేకమైన పనులు చేసినా అన్నిటినీ ఒకే హోల్డాల్ లో కట్టి బిగించగల మహా అవకాశవాద పక్షం కాంగ్రెస్. కనుక దాని అవకాశవాదం గురించి పెద్దగాచెప్పుకోవడానికి ఏమీలేదు. దాని నిర్వచనమే అవకాశవాదం.

దేశంలో చాలమంది ఆలోచనాపరులు అటు కొసన భారతీయ జనతాపార్టీనీ, ఇటుకొసన వామపక్షాలనూ సూత్రబద్ధ రాజకీయ వైఖరులు కలిగిన పార్టీలుగా భావిస్తుంటారు. మనరాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ కి ఎవరో ఇద్దరు ముగ్గురు నాయకుల అవకాశవాద, స్వప్రయోజన వైఖరులు తప్ప స్థిరమైన రాజకీయ వైఖరులు లేవనేది ఆ పార్టీ అభిప్రాయాల, ఆచరణల చరిత్ర చూస్తే సులభంగానే అర్థమవుతుంది.

ఇక వామపక్షాలలో తానే అతి పెద్ద పార్టీననీ, ఒకటికి రెండుసార్లు ప్రధానమంత్రి పదవిని కూడ త్యాగం చేశాననీ, ఎప్పటికైనా ప్రధానమంత్రిగా తమ పార్టీ నాయకులొకరు ఎన్నికవుతారనీ అనుకుంటున్న సిపిఎం వైఖరి అవకాశవాదానికి నిర్వచనంగా మారిపోతున్నది. మొన్నటికిమొన్న ఆ పార్టీ కేంద్ర నాయకులు ఇద్దరు రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా వారిని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి కలిశారు. అది ఎంత మర్యాదపూర్వకమైన కలయిక అనుకున్నప్పటికీ, ప్రస్తుత స్థితి దృష్ట్యా పరిశీలకులు దానిలో ఎన్నికల పొత్తు అవకాశాన్ని చూశారు. ఆ ఊహలను చెదరగొట్టడానికి సిపిఎం నాయకులు ‘ప్రజారాజ్యంతో కలిసే ప్రసక్తే లేదు, వారి ఆర్థిక విధానాలు ఏమిటో ఇంకా స్పష్టతలేదు’ అని ప్రకటించారు. చాలా బాగుంది. ఒక మార్క్సిస్టు పార్టీ తీసుకోవలసిన వైఖరే. కాని కొన్ని గంటలలోనే ఆ అగ్ర నాయకులిద్దరూ తెలుగుదేశం అధినేత ఇంటికి తామే తరలివెళ్లారు. ఆ అగ్రనేతతో కలిసి ఆ వాకిట్లో ప్రచారసాధనాలవారితో మాట్లాడారు. ఇది పొత్తుకు సూచనా అని వచ్చిన ప్రశ్నకు ఒక నాయకుడు ‘ఇప్పుడు మనం ఎక్కడున్నాం’ అని ఎదురు ప్రశ్న వేశారట. తమను చేరవచ్చిన కొత్తపార్టీ విషయంలోనేమో వారి ఆర్థికవిధానాలు తెలియకుండా ఏమి చెపుతాం అనే దాటవేసే ధోరణి. ఇరవై ఐదేళ్లుగా, కనీసం పదిహేనేళ్లుగా నిర్దిష్టమైన ఆర్థిక విధానాలు అవలంబిస్తున్న, రాష్ట్రంలో ప్రపంచబ్యాంకు పాలనను నెలకొల్పిన పార్టీ నాయకుడినేమో తామే కలవబోవడం, పొత్తుకు సంకేతాలు ఇవ్వడం – అవకాశవాదానికి ఇంతకన్న నిదర్శనం కావాలా?

ఇక సిపిఐ, తెరాస ల అవకాశవాద వైఖరి గురించి ఇంత వివరంగా కూడ చెప్పుకోనక్కరలేదు.

కొత్తగాపుట్టిన ప్రజారాజ్యంపార్టీ కూడ తాను పాత తానులోని ముక్కనే అని చూపుకోవడానికి ఉబలాటపడుతున్నది. ఒకవైపు కాంగ్రెస్ కు తానే నిజమైన, ఏకైక ప్రత్యామ్నాయాన్ననీ, అవినీతి నిర్మూలనే తన లక్ష్యమనీ ప్రకటించుకుంటున్న ప్రజారాజ్యం పార్టీ దేశ రాజకీయాలలో డబ్బు ద్వారా ఏదయినా సాధించవచ్చుననీ, ఎవరినైనా కొనవచ్చుననీ చూపుతున్న, మొన్నటికి మొన్న కాంగ్రెస్ కోసం బేరసారాలు జరిపి విశ్వాసపరీక్షలో గట్టెక్కించిన సమాజ్ వాదీ పార్టీ నాయకులతో కలిసి యుగళగీతాలు పాడడానికి ఏమీ అభ్యంతర పడడం లేదు.

ఎంత దిగజారినా, మన పార్లమెంటరీ రాజకీయాలు ఇంతదిగజారాయా? ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరిచేంత నవనవోన్మేషంగా అవకాశవాదాన్ని అలంకరించుకుంటున్నాయా?

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Prativadam, Telugu and tagged , , , , , , , , , . Bookmark the permalink.

2 Responses to అవకాశవాదమే రాజకీయాలుగా…

  1. కూడలిలో మీ పోస్టు సరిగ్గ కనపడట్లేదు. ఎక్కడ తప్పుందో తెలుసుకోవాలంటే క్రింది లంకె మీకు సహాయపడగలదు:
    http://feedvalidator.org/check.cgi?url=http%3A%2F%2Fkadalitaraga.wordpress.com%2F2008%2F09%2F13%2Favakasavadame_rajakeeyaluga%2F

  2. davuluri hanumantharao says:

    bagundi mee vislesana

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s