సురవరం ప్రతాపరెడ్డి సామాజిక జీవితం

సురవరం ప్రతాపరెడ్డి

ప్రతి మనిషికీ సామాజిక జీవితం ఉంటుంది. సామాజిక జీవితం ఎంతమాత్రమూ లేని, ఒంటరి ద్వీపంలాగ బతికే మనిషిని ఊహించడమే అసాధ్యం. మనిషి సంఘజీవి అనేది శుష్కమైన పదబంధం కాదు. సంఘం లేకుండా, తోటి మనుషులు లేకుండా, మానవ సంబంధాలు లేకుండా మనిషి జీవించడమే అసాధ్యం. ఓడ పగిలిపోయి, మహాసముద్రం మధ్య ఒక ద్వీపం మీద ఒంటరిగా మిగిలిన కథానాయకుడు రాబిన్సన్ క్రూసో సంఘంతో సంబంధంలేకుండా తన ఉత్పత్తి తానే చేసుకున్నట్టు రాయదలచిన నవలాకారుడు డేనియల్ డిఫో కూడ చివరికి ఒక్కమనిషి సహాయమైనా క్రూసోకు ఉండడం అవసరమని అర్థమయి, మాన్ ఫ్రైడేను సృష్టించాడు. అలా మామూలు మనిషి జీవితమే సంఘస్పర్శ లేకుండా అసాధ్యమయితే, ఆ సంఘం బాగోగులను గుర్తించి దాన్ని మెరుగుపరచాలనీ, దాని చెడుగులను తొలగించాలనీ ఆలోచించే సామాజిక కార్యకర్తలకు సంఘజీవితం కోరికోరి ఎంచుకున్నదవుతుంది. వారికి వ్యక్తిగతజీవితానికీ సంఘజీవితానికీ మధ్య విభజనరేఖను ఊహించడమే సాధ్యం కాదు. అందులోనూ చుట్టూ ఉన్న సంఘం అనేక దురాచారాల, అవ్యవస్థల మయమయి ఉన్నప్పుడు, ఆ దురాచారాలను పోగొట్టాలనీ, ఆ అవ్యవస్థను ధ్వంసంచేసి ఒక సురుచిర సమాజాన్ని స్థాపించాలనీ కలలుగనే సామాజిక కార్యకర్తలకు సంఘంతో సంబంధం అనివార్యమయినదీ గాఢమయినదీ అవుతుంది. అప్పుడు వారి సంఘజీవితం మిగిలిన మనుషుల సంఘజీవితం కన్న సువిశాలమయినదవుతుంది.

ఇరవయోశతాబ్ది తొలి అర్థభాగంలో తెలంగాణలోని సామాజిక కార్యకర్తల సంఘ జీవితానికి మరింత ప్రత్యేకత ఉంది. ఆనాటి తెలంగాణ సమాజానికి కొన్ని చారిత్రక ప్రత్యేకతలున్నాయి. భూస్వామ్యం, రాచరికం, కుల, మత, భాషా అంతరాలు, వాక్సభాస్వాతంత్ర్యాల మీద ఆంక్షలు, మొత్తంగా సమాజంలోనే నాలుగు శాతంగా ఉండిన అక్షరాస్యత మొదలయిన ఆ ప్రత్యేకతలు ఆ సమాజంలోని బౌద్ధిక జీవితంమీద అనేక పరిమితులు విధించాయి. అటువంటి పరిస్థితులలో ఆ నాటి సామాజిక కార్యకర్తలకు బహుముఖ సాంఘిక జీవితం అనివార్యమయింది. నాటి తొలితరం తెలంగాణ వైతాళికులలో ఎవరిని చూసినా వారు ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదని, అనేక రంగాల అనేక స్థాయిల కార్యక్రమాలు నిర్వహించవలసిన బాధ్యత వారిమీద పడిందనీ, వారు ఆ పనులన్నిటినీ సమర్థంగా నిర్వహించారనీ కనబడుతుంది. అటువంటి తొలితరం తెలంగాణ వైతాళికులలో, బహుముఖ ప్రజ్ఞాశాలులలో అగ్రగణ్యుడు సురవరం ప్రతాపరెడ్డి.

ప్రధానంగా ఆయన సాహిత్యకారుడు – అందులోనూ ఏదో ఒక ప్రక్రియలో మాత్రమే కాదు, కవిత్వం, కథ, నవల, నాటకం, వ్యాసం, సాహిత్య విమర్శ, అనువాదం, పత్రికా రచన అన్నిటిలోనూ ప్రవేశం మాత్రమే కాదు, ప్రావీణ్యం ప్రదర్శించాడు. యాభై ఏడు సంవత్సరాల జీవితంలో ముప్పై సంవత్సరాలకు పైగా ఉపన్యాసకుడుగా హైదరాబాదు రాజ్యమంతా తిరిగాడు. సంస్కృతం, ఉర్దూ, ఫార్సీ, ఇంగ్లిషు, హిందీ, కన్నడ భాషలలో ప్రావీణ్యం ఉన్నా భాషాసేవకుడుగా తెలుగుకు సేవచేశాడు. ఈ భాషా, సాహిత్య కృషి కన్న మించినది ఆయన సామాజిక కృషి.

సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాల మధ్య భేదం ఉండడానికి వీలులేని, ఒకదానిలో ఒకటి అవిభాజ్యంగా కలిసిపోయిన కాలం అది. ఆ కాలం బుద్ధిజీవిని బహుముఖ ప్రజ్ఞాశాలి కమ్మని ఆదేశించింది. ఆ కాలం బుద్ధిజీవినుంచి అనేక రంగాల అనేక స్థాయిల కార్యాచరణను ఆశించింది. తెలంగాణ వైతాళికులుగా ఇవాళ మనం పిలుచుకుంటున్న వాళ్లందరూ కాలం విసిరిన ఆ సవాలును అందుకున్నారు. ఆనాటికన్న ఎక్కువ అవకాశాలు, వనరులు ఉన్న ఇవాళ్టి సమాజంలో ఏదో ఒక చిన్న రంగంలో, ఏమాత్రమో కృషి చేసి అదే చాల ఎక్కువ అనుకుంటున్న నేపథ్యంతో పోల్చి చూసినప్పుడు ఆ నాటి వైతాళికుల బహుముఖ కృషి గురించి లోతుగా ఆలోచించవలసి ఉంది. బహుశా ఆ నాటి కాలం ఆనాటి మేధావులమీద ఎక్కువ బాధ్యతలు పెట్టింది. అన్నీ ఒకరే కావలసిన అవసరాన్ని పెట్టింది.

సామాజిక నాయకులుగా మారగలిగిన అవకాశం కొద్దిమందికే దక్కినప్పుడు ఆ కొద్దిమందినుంచి సమాజం చాల ఎక్కువ పనులను ఆశించింది.వారికి విస్తృతమైన సామాజిక జీవితం ఇచ్చింది. వారి పరిధిని సువిశాలం చేసింది. ఈ వైశాల్యం పనుల బహుముఖత్వంలో మాత్రమే కాదు, ఆ పనులలో ఒక్కొక్క పనీ ఎంత లోతుగా, ఎంత నిర్మాణాత్మకంగా, ఎంత విస్తృతంగా చేయాలనేది కూడ సమాజం వారిమీద ఇవాళ్టికన్న ఎక్కువ బాధ్యతలు పెట్టినట్టు కనబడుతుంది. చరిత్ర విధించిన ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి వారు తమ శాయశక్తులా కృషిచేశారు. అందువల్లనే ఆ నాటి సామాజిక కార్యకర్తలలో ఎవరి కార్యాచరణను చూసినా అది బహుముఖాలుగా విస్తరించి ఉండడం కనబడుతుంది. ప్రచారకుడుగా, పరిశోధకుడిగా, విద్యార్థి వసతిగృహ నిర్వాహకుడుగా, న్యాయవాదిగా, పత్రికారచయితగా, పుస్తక ప్రచారకుడిగా, ఉపాధ్యాయుడిగా, అంధ్ర మహాసభ నాయకుడిగా, గ్రంథాలయోద్యమ సారథిగా, అనేక ప్రజా ఉద్యమాల, సంఘాల ప్రోత్సాహకుడిగా ప్రతాపరెడ్డి పరిణమించిన చరిత్ర చూస్తే ఆయన కాలం విసిరిన సవాలును ఎలా అందుకున్నారో తెలుస్తుంది.

రచన అనే ఒకానొక రంగంలో ఆయన విస్తృతినీ, లోతునూ ప్రస్తావించి ఆయన బహుముఖ ప్రజ్ఞ గురించి వివరించడానికి ప్రయత్నిస్తాను. ఆయన రచనల సమగ్ర సంపుటాలు ఇంతవరకూ వెలువడలేదు. ఆయన ఏడువందల వ్యాసాలు రాసి ఉంటారని ఒక అంచనా ఉంది గాని, గోల్కొండ పత్రిక, పినాకిని, కళ, రెడ్డిరాణి, విభూతి మొదలయిన అనేక పత్రికలలో చెల్లాచెదరుగా ఉన్న ఆ వ్యాసాలన్నిటినీ పుస్తకరూపంలో ఒక్కచోటికి చేర్చే పని ఇంకా జరగలేదు. సంపాదకీయాలయినా, వ్యాసాలయినా ఇప్పటికి పుస్తకరూపంలో వచ్చినవి వందకు మించవు. సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి కృషివల్ల ఆయన పుస్తకాలలో అత్యధికభాగం ప్రచురణ జరిగింది గాని ఆ పుస్తకాలు కూడ ప్రస్తుతం దొరకడం లేదు.

మొత్తం మీద ఇప్పటికి అచ్చయి పుస్తకరూపంలో వచ్చిన ప్రతాపరెడ్డి రచనలు – హిందువుల పండుగలు, రామాయణ విశేషములు, హైందవ ధర్మవీరులు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, సురవరం ప్రతాపరెడ్డి కథలు, సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు రెండు భాగాలు, గోల్కొండ పత్రిక సంపాదకీయాలు రెండు భాగాలు. ఇవికాక ప్రజాధికారములు (మొదట దేశోద్ధారక గ్రంథమాల ప్రచురణగా వచ్చినప్పుడు ప్రాథమిక స్వత్వములు) 1953 తర్వాత మళ్లీ ప్రచురణ కాలేదు. అలాగే ఆయన రాసిన చిన్నపుస్తకాలు కూడ మళ్లీ అచ్చు కాలేదు.

హిందువుల పండుగలు వంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక అంశాల నుంచి ఆంధ్రుల సాంఘిక చరిత్ర వంటి అపూర్వ చారిత్రక పరిశోధన వరకు, రామాయణ విశేషములు వంటి కావ్య పరిశీలన నుంచి హైందవ ధర్మవీరులు వంటి చారిత్రక వ్యాసాల వరకు, ప్రజాధికారములు వంటి ఆధునిక ప్రజాస్వామిక సూత్రాల నుంచి ఒక రాచరిక పాలనలో నడిచిన పత్రికలో ఆధునిక జీవనం గురించీ, చైతన్య వికాసం గురించీ వ్యాఖ్యానించిన సంపాదకీయాలు, వ్యాసాల వరకు ఆయన రచనా విస్తృతి అసాధారణమైనది. అలాగే పద్యాలు, కథలు, నాటకాలు, నవలలు, అనువాదాలు వంటివన్నీ కూడ ఆయన విస్తృతికి అద్దం పడతాయి.

ఒకవైపు ఇంత విస్తారమైన రచనా కృషి కొనసాగిస్తూనే ఆయన ప్రజాజీవితంతో పెట్టుకున్న సంబంధం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. యాభై ఏడు సంవత్సరాల జీవితంలో ఆయన సామాజిక జీవితం ముప్పై ఐదు సంవత్సరాల పైనే ఉంటుంది. మద్రాసులో చదువుకుంటున్నప్పుడే జాతీయోద్యమంలో పాల్గొన్న 1920ల నాటినుంచి, హైదరాబాదు రాష్ట్ర శాసనసభుడిగా మరణించిన 1953 నాటిదాకా ఆయన పాలు పంచుకున్న సంస్థలు, ప్రజా సంఘాలు, ఉద్యమాలు కేవలం జాబితా వేసినా ఒక్క మనిషి ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం సాధ్యమా అని ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం అనేది కూడ ప్రతాపరెడ్డి విషయంలో మొక్కుబడిగా, అందరిలో ఒకడిగా, వెనుకవరుసలో చేయడం కాదు. చాల కార్యక్రమాలకు ఆయనే ప్రారంభకుడు. చాల కార్యక్రమాలలో ఆయన నాయకుడు, ప్రధాన కార్యకర్త. మరెన్నో కార్యక్రమాలకు ఆయన మేధోపరమైన, నైతికమైన సహాయ సహకారాలు అందించారు.

ఆయన పాల్గొన్న సంస్థలు, ప్రజాసంఘాలు, ప్రజా ఉద్యమాలలో ప్రధానమయినవి జాతీయోద్యమం, ఆంధ్ర జన సంఘం, నిజాము రాష్ట్రాంధ్ర మహాసభ, రెడ్డి బాలుర వసతిగృహం, యాదవ సంఘం, ముదిరాజ్ సంఘం, గౌడ సంఘం, వర్తకసంఘాలు, గ్రంథాలయోద్యమం, గ్రంథాలయాల స్థాపన, గ్రంథాలయ మహాసభలు, గ్రంథాలయోద్యమ సంఘం, గోలకొండ పత్రిక, ప్రజావాణి, విజ్ఞానవర్ధినీ పరిషత్తు, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్ర విద్యాలయం, హైదరాబాదు ఆయుర్వేద సంఘం, కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, లక్ష్మణరాయ పరిశోధక మండలి, హైదరాబాదు రాష్ట్ర శాసనసభ నిజానికి ఈ సంస్థలు, ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాలు అన్నీ ఏకముఖమైనవేమీ కావు. ఒకే ఆలోచనాధోరణికి చెందినవీ కావు. ఒకే కార్యక్షేత్రంలో ఆచరణ ఉన్నవీ కావు. కాని ఆ బహుముఖ ఆలోచనలను, ఆచరణలను తనలో ఏకం చేసుకోవడంలో, తన ఆలోచనల ద్వారా, ఆచరణ ద్వారా ఆ కార్యక్రమాలన్నిటికీ ఏకసూత్రత కలిగించి సంపన్నం చేయడంలోనే ప్రతాపరెడ్డి విశిష్టత ఉంది.

ఇటువంటి విశిష్టమైన సామాజిక జీవితం సాధించడానికి అవకాశం ఇచ్చినది ప్రతాపరెడ్డి వ్యక్తిత్వంలోని ఒక ప్రత్యేక స్వభావమని అనిపిస్తుంది. అది ఒక విషయాన్ని సంపూర్ణంగా ఆరాధిస్తున్నప్పుడు కూడ దానిపట్ల విమర్శనాత్మకంగా ఉండగల దృక్పథం, దేన్నీ గుడ్డిగా నమ్మని దృక్పథం. ప్రతిదానిపట్లా నిర్మమకారంగా ఉండగల స్థితప్రజ్ఞత. అటువంటి విమర్శనాత్మక సమర్థన, విమర్శనాత్మక నిబద్ధత, విమర్శనాత్మక నిమగ్నత ఉండడం వల్లనే ఆయన తన కాలపు ప్రజా సంచలనాలన్నిటినీ సమర్థించగలిగారు, నిబద్ధంగా ఉండగలిగారు, నాయకుడిగానో, కార్యకర్తగానో, ప్రోత్సాహకుడిగానో వాటిలో నిమగ్నమయ్యారు. కాని అదేసమయంలో వాటిని విమర్శించడానికి కూడ ఆ సమర్థన, ఆ నిబద్ధత, ఆ నిమగ్నత ఆయనకు అడ్డం రాలేదు.

నాలుగైదు ఉదాహరణలతో ఈ అంశాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను.

ఆయన తొలిరోజుల్లో రాసిన నాటకాలలో ఉచ్ఛల విషాదం ఒకటి. మద్రాసులో ఒక నాటక కంపెనీ ప్రకటించిన పోటీ కొరకు 1921 లో, తన ఇరవై ఐదవ ఏట, రాసిన నాటకమే అయినప్పటికీ ఆ నాటకరచనలో ఆయన స్వభావం వ్యక్తమవుతుంది. అప్పటికే ఆయన సంస్కృత సాహిత్యం, భారతీయ ఆలంకారిక దృక్పథం చదువుకుని ఉన్నారు. వాటిని తన వ్యాసాలలో ఉటంకించి ఉన్నారు. కాని ఆలంకారిక నిబంధనలకు భిన్నంగా రంగస్థలంమీద నాయకుని వధను ప్రత్యక్షంగా చూపడానికి ఆయనకు అలంకార శాస్త్రం మీద ఉన్న గౌరవం అడ్డం రాలేదు.

అలాగే, రామాయణ విశేషములు రాస్తున్నప్పుడు, రాముడి కథలోని భౌగోళిక, చారిత్రక అంశాలను పరిశీలించేటప్పుడు, రామాయణంలోని అంశాలు చారిత్రక, హేతుబద్ధ దృష్టికి నిలుస్తాయా లేదా అని పరీక్షించేటప్పుడు ఆయన ఒక శాస్త్రవేత్తలాగ నిర్మమంగా, తన ఆస్తిక భావనలను, రాముడిపట్ల, వాల్మీకి పట్ల గౌరవాన్ని కూడ పక్కనపెట్టి పరిశీలించారు. అనేక రామాయణాలను తులనాత్మకంగా విశ్లేషించి తన వాదనలు ప్రకటించారు. “వాల్మీకి రచితమైన శ్రీమద్రామాయణములో నాకు తోచిన విషయములు తెలుపుకొనినాను. ఇది చారిత్రిక విమర్శ. ఇట్టి విమర్శ పూర్వాచారాభిమానులకు సరిపడదని నేనెరుగుదును. కొందరికి ఆగ్రహము కూడా కలిగియుండును. కాని ఆగ్రాహానుగ్రహములకు చారిత్రక విమర్శలలో తావులేదు. ఎవరికేది సత్యమని తోచునో వారు దానిని గట్టిగా ప్రకటించుటలో తప్పుండదు…..శ్రీమద్రామాయణముపై నాకు అద్వితీయమైన ప్రేమ, భక్తి కలవని, అందలి కవితను అత్యుత్తమమైనదిగా భావించువాడననియు మరొకమారు మనవిచేసుకునుచు” తన చర్చను ముగించారు.

ఇక ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ రచన అయితే ఆయన కొత్త చూపుకు, పాతను గౌరవిస్తూనే ఆ పాతలోని పొరపాటు భావాలపట్ల గుడ్డిగా ఉండకపోవడానికి నిదర్శనంగా నిలుస్తుంది. అప్పటిదాకా చరిత్ర అంటే పురాణమనో, రాజవంశాల చరిత్ర అనో, మహావ్యక్తుల చరిత్ర అనో ఉన్న అభిప్రాయాలను తోసి రాజని, చాల స్పష్టంగా ‘మనమందరమూ చరిత్రకెక్కదగినవారమే’ అని అనగలగడం ఆయన విశిష్టతకు నిదర్శనం. చరిత్ర రచనకు సాంస్కృతిక ఆధారాలను ఉపయోగించుకోవాలనీ, అందులోనూ, భాషా, సాహిత్య ఆధారాలు, ఆటపాటలు, ఆచారవ్యవహారాలు ఎక్కువగా పనికి వస్తాయనీ 1940లలోనే గుర్తించడంలో ఆయన విశిష్టత ఉంది. ఒకవైపు ప్రబంధాలపట్ల గౌరవం ఉంచుకుంటూనే, సాంఘిక చరిత్ర రచనకు అవి ఉపయోగపడవనీ, తక్కువ స్థాయి కావ్యాలుగా పేరుపడిన బసవపురాణము, హంసవింశతి వంటి పుస్తకాలే ఎక్కువ ఉపయోగపడతాయనీ అనడం, వాటిని వినియోగించుకోవడం ఆయనలోని శాస్త్రీయ, హేతుబద్ధ దృష్టికి నిదర్శనం. గుడ్డి విశ్వాసాలను అధిగమించి ఒక నిర్మమ స్థితిలో వస్తుగత పరిశీలన చేసే శాస్త్రవేత్తలా ఆయన ప్రతి విషయాన్నీ దర్శించారు.

ఇక ఆయన 1938 లో ప్రచురించిన ప్రాథమిక స్వత్వములు ఆయన ఆలోచనాధోరణిని అర్థం చేసుకోవడానికి ఒక కీలకమైన ఆధారమని అనిపిస్తుంది. అప్పటికి ఆయన కార్యక్షేత్రంగా ఉన్న హైదరాబాదు రాజ్యం ప్రజలు పౌరులనిగాని, ప్రజలకు అధికారాలు ఉంటాయని గాని ఆలోచన కూడ లేని ఒక భూస్వామ్య, రాచరిక, నిరంకుశ రాజ్యం. తాను నిర్వాహకుడిగా ఉన్న వసతిగృహం గ్రంథాలయంలో ఒక నిషిద్ధ పుస్తకం ఉన్నందువల్ల ఉద్యోగమే పోగొట్టుకోవలసిన అనుభవం కూడ అప్పటికే ఆయనకు ఉంది. అయినా ఆ పరిస్థితులలో ప్రజలకు ఉన్న అధికారాలేమిటో రాయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ పుస్తకానికి సంబంధించి మరొక విశేషం కూడ ఉంది. ఈ పుస్తకానికి భోగరాజు పట్టాభిసీతారామయ్యతో ముందుమాట రాయించాలని ప్రతాపరెడ్డి (లేదా ప్రచురణకర్త వట్టికోట ఆళ్వారుస్వామి) అనుకున్నారు. పట్టాభి సీతారామయ్య చాల గొప్ప ముందుమాట రాశారు. కాని విచిత్రమేమంటే అప్పటికి హైదరాబాదు రాజ్యంలో స్టేట్ కాంగ్రెస్ ను స్థాపించదలచుకున్న మాడపాటి హనుమంతరావు తమకూ బ్రిటిషిండియాలోని భారత జాతీయ కాంగ్రెస్ కూ ఏమీ సంబంధంలేదని లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి తెలిపారు. అంతేకాదు, స్వయంగా గాంధీ అప్పటి హైదరాబాదు ప్రధానమంత్రి సర్ అక్బర్ హైదరీ కి తమ సంస్థకు హైదరాబాదు రాజ్యంలో శాఖను ఏర్పాటు చేసే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ఈ విధంగా ఇటు స్థానిక నాయకులు, అటు దేశ నాయకులు కూడ సంబంధంలేదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో గాంధీకి అత్యంత సన్నిహితుడు, 1939లో గాంధీ తరఫున కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సుభాష్ చంద్ర బోస్ తో పోటీ పడిన పట్టాభిసీతారామయ్యతో ముందుమాట రాయించాలని అనుకోవడం ప్రతాపరెడ్డి, ఆళ్వారుస్వామిల స్వతంత్ర ప్రవృత్తిని, విమర్శనాత్మక ధోరణిని తెలియజేస్తుంది.

అట్లాగే ఆయన చాల ప్రేమించిన, పోషించిన, తన రక్తమాంసాలు ధారపోసిన మూడు సంస్థలతో ఆయన సంబంధం అర్థాంతరంగా ఆగిపోవలసి వచ్చినప్పుడు ఆయన ఆ స్థితిని నిర్మమంగా అంగీకరించారు. ఆ సంస్థలను అపారంగా ప్రేమించి, వాటిచేతనే నిరాదరణకు గురయి, ఆ స్థితిని స్థితప్రజ్ఞతతో అంగీకరించిన వ్యక్తిత్వం ప్రతాపరెడ్డిది. ప్రతాపరెడ్డిని హైదరాబాదులో ఉంచడంకోసం రాజబహద్దర్ వెంకటరామరెడ్డి ఆయనకు రెడ్డి హాస్టల్ నిర్వాహక బాధ్యతలను అప్పగించారు. ఎన్నో ఏళ్లపాటు జీతభత్యాలు లేకుండానే ఆ హాస్టల్ అభివృద్ధికీ, అక్కడి విద్యార్థుల శారీరక, మానసిక, విద్యా వికాసానికీ తన శక్తియుక్తులన్నీ ఉపయోగించిన ప్రతాపరెడ్డిని ఒక చిన్న కారణంతో తొలగించమని ప్రభుత్వం ఆజ్ఞాపిస్తే, హాస్టల్ యాజమాన్యం ఎదురుచెప్పలేదు. ప్రతాపరెడ్డికి అండగా నిలవలేదు. ఆయన ఆ యాజమాన్య ప్రవర్తనవల్ల ఎంత గాయపడి ఉంటారో తెలియదు గాని ఆ నిరాదరణను మౌనంగా స్వీకరించారు. అలాగే ప్రతాపరెడ్డిని హైదరాబాదులో ఉంచడానికే వెంకటరామరెడ్డి ప్రోద్బలంతో గోలకొండ పత్రిక ప్రారంభమయింది. కారణాంతరాలవల్ల కొన్ని సంవత్సరాలు తనపేరు లేకపోయినా, మరికొన్ని సంవత్సరాలు పేరు ఉన్నా, ప్రతాపరెడ్డి అవిశ్రాంతంగా ఆ పత్రిక అభివృద్ధికీ, మొత్తంగా హైదరాబాదు రాజ్యంలో తెలుగు ప్రజల మనోవికాసానికీ అపారమైన సేవ చేశారు. అటువంటి ప్రతాపరెడ్డిని తొలగించడానికి గోలకొండపత్రిక యాజమాన్యం కుంటిసాకులు వెతుక్కున్నప్పుడు మౌనంగా ఆ నిరాదరణనూ సహించినవాడాయన. 1951లో పౌరస్వత్వములు పుస్తకం ప్రజాధికారములు పేరుతో పునర్ముద్రణ అయినప్పుడు, దాని ముందుమాటలో “అప్పటి నా గోలకొండ పత్రికలో” అని రాసి ఆవెంటనే 1949 నుండి గోలకొండతో నాకు సంబంధము లేదు” అని రాశారంటే ఆ మాటలు ఆయన అనుభవించిన బాధను తెలియజేస్తాయి గాని ఆ బాధను కూడ స్థితప్రజ్ఞతతోనే తీసుకున్నారనిపిస్తుంది.

ఇక ఆంధ్ర జన కేంద్ర సంఘం రోజులనుంచీ నైజాము రాష్ట్ర ఆంధ్రోద్యమంతో సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ, 1931లో జోగిపేటలో మొదటి ఆంధ్ర మహాసభకే అధ్యక్షత వహించినప్పటికీ, అందులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పుడు తానే ఒక ‘అభివృద్ధి పక్షాన్ని’ నెలకొల్పినవాడాయన. తర్వాత, ఆంధ్ర మహాసభ జాతి పురోభివృద్ధికొరకు చేయవలసిన కృషి స్థానంలో రాజకీయ అభినివేశం పెరుగుతున్నదని అనుకున్నప్పుడు అంతే నిర్మమకారంగా ఆ సంస్థనుంచి తొలగిపోయినవాడాయన.

మొత్తం మీద, సురవరం ప్రతాపరెడ్డి సామాజిక జీవితాన్ని అధ్యయనం చేసినప్పుడు, విస్తారమైన, బహుముఖమైన ఆలోచనా, ఆచరణా కృషి, అకుంఠితమైన ప్రజాజీవన మగ్నత, ప్రజా సంచలనాలపట్ల విమర్శనాత్మక నిబద్ధత, తన అభిప్రాయాల కొరకు రాజీలేకుండా నిలబడేతత్వం, తాను పెంచి పోషించిన సంస్థలే తనపట్ల నిరాదరణ వహించినా నిర్మమకారంగా ఉండగలగడం వంటి విశిష్ట లక్షణాలెన్నో కనబడతాయి. ఇవాళ సామాజిక జీవితంలో ఉన్నవారెవరయినా ప్రతాపరెడ్డి వ్యక్తిత్వం నుంచి గ్రహించవలసిన ఆదర్శాలివి.

సంప్రదించిన పుస్తకాలు:

 • రావి భారతి (1989) – సురవరం ప్రతాపరెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు
 • ముద్దసాని రామిరెడ్డి (1974) – సురవరం ప్రతాపరెడ్డి జీవితము – రచనలు, ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు
 • సురవరం ప్రతాపరెడ్డి (1951) – ప్రజాధికారములు, ఆదర్శ సాహిత్యమాల, హైదరాబాదు
 • సురవరం ప్రతాపరెడ్డి (1987) – రామాయణ విశేషములు, సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి, ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు
 • సురవరం ప్రతాపరెడ్డి (1987) – గోలకొండ పత్రిక సంపాదకీయాలు – మొదటి సంపుటం 1926 – 36, సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి, ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు
 • సురవరం ప్రతాపరెడ్డి (1989) – గోలకొండ పత్రిక సంపాదకీయాలు – రెండో సంపుటం 1936 – 45, సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి, ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు
 • సురవరం ప్రతాపరెడ్డి (1988) – సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు – మొదటి భాగం, సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి, ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు
 • సురవరం ప్రతాపరెడ్డి (1988) – సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు – రెండో భాగం, సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి, ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు
 • సురవరం ప్రతాపరెడ్డి (సం.) (2002) – గోలకొండ కవుల సంచిక (మొదటి ముద్రణ 1934), విజ్ఞాన సరోవర ప్రచురణలు, హైదరాబాదు
 • కె. జితేంద్రబాబు (2007) – తెలంగాణలో చైతన్యం రగిలించిన నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు – రెండవభాగం, సాహితీసదన్ ప్రచురణలు, మునగాల

  S. Laxmana Murthy (2000) – Suravaram Pratapa Reddy, Sahitya Akademi, New Delhi

 • (ఆంధ్రవిద్యాలయ కళాశాల తెలుగు శాఖ, తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో 2009 మార్చి 6,7 తేదీల్లో, హైదరాబాదులో జరిగిన ‘బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి’ జాతీయసదస్సులో సమర్పించిన పత్రం)
Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telangana, Telugu and tagged , . Bookmark the permalink.

3 Responses to సురవరం ప్రతాపరెడ్డి సామాజిక జీవితం

 1. malathi says:

  మంచి వ్యాసం. ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాసారనే కానీ మిగతా విషయాలేమీ నాకు తెలీవు. ధన్యవాదాలు.

 2. Narayanan says:

  Please read my blog on the issue at http://www.chapter18.wordpress.com

  I am as concerned like all of you but my views are different.

 3. sudarsan says:

  Dear Comred Venu Gopal garu,

  mee vyasam baavundi. nenu na patrikalo vaadukovacha…mee perutone..
  -sudarsan
  Rajahmundry

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s