పతంజలి గారూ, ఈ తగువు ఇంకెవరికి చెప్పేది?

[అరుణతార కొరకు]

పతంజలిగారూ,

మీరు అత్యద్భుత ఐంద్రజాలిక కాల్పనిక కళా దృష్టితో ఊహించిన అలమండ తగువు నిజంగానే మొదలయింది.

అలమండ పెదరామకోవెలలో అటువంటి తగువును మీరు నిజంగా చూశారో లేదో! అందులో గోపాత్రుడూ ఫకీర్రాజూ రొంగలి అమ్మన్నా విరుపుల అప్పన్నా రంగరాజు మాష్టారూ ఉప్పలపాటి చినబాబూ గాజుల పాపయ్యా తెలకలి గురయ్యా బొబ్బిలీ పోలీసులూ మెజస్ట్రీటూ వగైరా వగైరా నిర్వహించిన పాత్రలను మీరు స్వయంగా చూశారో లేదో! కాని ఇప్పుడు ఆ పాత్రలన్నిటినీ, ఆ పాత్రల సమానులందరినీ, వారి వ్యాఖ్యానాలన్నిటినీ మేం కళ్లారా చూస్తున్నాం.

ఈ సారి ఆ తగువు భూమి గుండ్రంగా ఉందా, బల్లపరుపుగా ఉందా అని కాదు. అది ‘అలమండ పుట్టిన కాడ్నించి ఈయాల్టి పొద్దున్న వరకూ చూడనంత మూర్ఖపు గాడిదకొడుకు’ గోపాత్రుడు తెచ్చిన తగువు కాదు. ‘సాక్షాత్తూ భూదేవతే వచ్చి నాను గుండ్రంగా పంపర పనాసకాయ లాగున్నాన్రా తండ్రీ అని చెప్పినా నేను నమ్మను’ అనే మొండి తర్కం గురించీ కాదీ తగువు. ‘కలబడి కొట్టీసుకుంటే తేలిపోతాది. గెలిచినవాడి విశ్వాసాన్ని ఓడిపోయినవాడి నెత్తిన రుద్దీవచ్చన్నమాట’ అని తగువులు తెగిపోయే సులభ మార్గం చెప్పిన తగువూ కాదు. మన అభిప్రాయాలు ఏర్పడుతున్న తీరు మీదా, ఆ అభిప్రాయాల పట్ల మన నిబద్ధత మీదా, ఏలినవారి అభిప్రాయాలమీదా, మరీ ముఖ్యంగా పోలీసులకూ న్యాయవ్యవస్థకూ ఉన్న అభిప్రాయాల మీదా మీ విశ్లేషణను ఏకకాలంలో కత్తివాదరతోనూ, వెన్నలో ముంచిన కలంతోనూ దరహాసరేఖలతో చిత్రించిన తగువు కాదిది. 

ఈసారి తగువు పతంజలి అనే అక్షరమాంత్రికుడిని ఎలా గుర్తించాలి అని. ఆయన మావాడా మీవాడా అని. ఆయన అక్షరాల వెనుక రాజకీయాలూ, సామాజిక దృష్టీ ఉన్నాయా లేవా అని. ఆయన రచనల్లో నాకు నచ్చినదే బల్లపరుపూ మిగిలిందంతా గుండుసున్నా అని. ఆయన రాసిపారేసిన కాగితాలు కాదు, తాగిపారేసిన సీసాలే ముఖ్యం అని. నాకు నచ్చని రాజకీయాలంటే ఆయనకు కూడ ఒళ్లుమంట అని. నా శత్రువులందరూ ఆయనకు కూడ శత్రువులే అని. నా అభిప్రాయాలే ఆయనవీనూ, పాపం అమాయకుడు అని.

వీటిలో ఏవి నిజమో ఏవి కాదో, ఏ అభిప్రాయాలవల్ల భూమి బల్లపరుపుగా ఉందని నమ్మక తప్పదో మీరే చెప్పాలి. గోపాత్రుడు తన వాదనను వదులుకోవడానికి ఎనిమిదేళ్లకింద కాలంచేసిన తన తండ్రిని తీసుకురమ్మన్నట్టు, ఈ వాదనలన్నీ నిజమో అబద్ధమో తేల్చడానికి మీరే రావాలి.
 
అలా మీరు ప్రారంభించిన, ఊహించిన మౌలికమైన సంవాదం మీ మరణానంతరం మీగురించే మొదలు కావడం చాల కవితాన్యాయంగా కనిపిస్తోంది గదూ.

ఈ రసవత్తరమైన బుకాయింపులు, రసహీనమైన వ్యాఖ్యానాలు, మీ అక్షరాల వెనుక తమ అభిప్రాయాలు చదువుకోవడాలు, తమ మాటలు మీ పెదాలకు అతికించడాలు, మీ అసాధారణ అద్భుత వ్యంగ్య వైభవానికి తమ వెకిలి పరిహాసాన్ని సమానం చెయ్యడాలు, మీ భుజం మీద తమ తుపాకి పెట్టి తమ శత్రువులనూ కొండొకచో మీ మిత్రులనూ గురిచూడడానికి ప్రయత్నించడాలు చూస్తూ, వింటూ నవ్వుకుంటున్నారా గురువుగారూ? శ్రీశ్రీ గురించి చలం అన్నట్టు మిమ్మల్ని పొగుడుతున్నట్టు కనబడుతూనే చిరునవ్వుతో మా కళ్లలో కారంకొట్టజూస్తున్న, పొగడ్తలతో మానోట్లో విషం కక్కిపోతున్న ఈ మీ ‘సన్నిహిత ప్రియమిత్రులను’ చూస్తుంటే మీకేమనిపిస్తోందో చెప్పరూ? సత్యాన్ని ఊహించి కనిపెడుతున్న, గంభీరంగా ప్రకటిస్తున్న ఈ వ్యాఖ్యాతలను వింటుంటే, ‘మన అజ్ఞానం వల్లనే మనకు ఎలాంటి నష్టమూ లేనప్పుడు ఎదటివాడి అజ్ఞానం వల్ల మనకొచ్చే నష్టం ఏముంది’ అని నిర్లిప్తంగా నవ్వుకుంటున్నారు గదూ.

ఇవాళ మీ ‘పతంజలి భాష్యం’ అనే అతిసాధారణ జర్నలిస్టు రచనకు పేరు వస్తున్నదట గాని అది అసలు మీ ప్రాతినిధ్య రచనే కాదట. అది మీ రచనలలో అల్పమైన రచన అట. మిమ్మల్ని మీరు కొన్ని నవలల్లోనే వ్యక్తం చేసుకున్నారట. అయినా అది కూడ మీ పూర్తి వ్యక్తిత్వం కాదట. మీకు కూడ తెలియని, మీ జీవితంలోనూ రచనలలోనూ వ్యక్తం కాని మీ వ్యక్తిత్వమేదో వారికే తెలుసునట!

సాహిత్యంలో సమాజం కనబడగూడదనీ, సమాజం ఉంటే అది కళ కానేకాదనీ అనుకునే వాళ్లకు అలా కాక ఇంకెలా అర్థమవుతుంది? స్పష్టమైన రాజకీయ, సామాజిక వైఖరి ప్రకటించడం అసాహిత్యమనుకునే అచారిత్రక అసామాజిక అసందర్భపు వ్యాఖ్య అది. కళను గౌరవిస్తున్నామనే పేరుమీద సమాజం నుంచి దూరంగా సుదూరంగా పారిపోవాలనుకునే హక్కు వారికి ఉంది కాని మిమ్మల్ని ప్రశంసించే పేరుతో ఆ పని చేయడమే సాహసం. మీ రచనను వారి ప్రాధాన్యాలనుంచీ, వారి అభిప్రాయ దురభిప్రాయాలనుంచీ వెలకట్టడం, మిమ్మల్ని ప్రశంసిస్తున్నట్టు కనిపిస్తూనే మీమీద బురద జల్లడం – మన గురజాడ అన్నట్టు ‘ఏమి బేహద్బీ’!

కళాత్మకత లేకుండా రాజకీయ, సామాజిక వైఖరి దానికదిగా రచన అవుతుందనే అమాయకులూ మూర్ఖులూ ఎవరూ లేరు. కాని మీ ‘పతంజలి భాష్యం’ ఒక అద్భుతమైన కళాసృజన. ఏకకాలంలో లోతయిన సామాజిక ఆగ్రహాన్నీ కళాత్మక వ్యక్తీకరణనూ ఎలా సాధించడమో మీరా రచనలో చూపారు. అది ఒక తక్కువస్థాయి రచన అవుతుందా?

గుర్తుందా మీకు, ఒక సందర్భంలో ‘పతంజలి భాష్యం’ గురించి మీరే ఏమన్నారో?  
 
“నా కోపం, దుఃఖం పదిమందికి చెప్పడం కోసం నేను పతంజలి భాష్యం రాశాను. నా చుట్టూ జరుగుతున్న వాటి మీద అది నా వ్యక్తిగత నిరసన. అయితే సామాజిక పరిణామాల్లో మంచికో చెడ్డకో బాధ్యులు కాని వారెవ్వరూ ఉండరు. నా చుట్టూ ఉన్న సమాజం ఇంత దుర్మార్గంగా ఉండటానికి కచ్చితంగా నా బాధ్యత ఎంతో కొంత ఉండి తీరుతుంది. అది మార్చడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో కూడ ఎంతో కొంత నా భాగస్వామ్యముంటుంది. ఈ బాధ్యతల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఫలితంగా నా వ్యక్తిగత ప్రకటనే మరొక స్థాయిలో సామూహిక ప్రకటన అవుతుంది. సామూహిక క్రోధమే ఒకొక్కపుడు నా వ్యక్తిగత క్రోధమవుతుంది. సామూహిక శోకం నా కంట్లో ఒక నీటిబొట్టవుతుంది. ఏది సమూహం, ఏది వైయక్తికం? దినపత్రికల్లో పనిచేస్తున్నాం కాబట్టి మిగిలినవారికంటె ఎక్కడేమి జరిగిందీ మాకు ముందే తెలుస్తుంది. ఒక రాజకీయ అవగాహన ఉన్నందువల్ల జరిగిన సంఘటన మీద నా రియాక్షన్ ఆ అవగాహనకు అనుగుణంగా ఉంటుంది. రాజ్యం చేసిన దుర్మార్గం ప్రజల దృష్టికి వచ్చిన తరుణంలోనే దానిమీద నా రియాక్షన్ కూడా వెలువడడం వల్ల అది ఎక్కువమందిని ఆలోచింపజేస్తుంది. కథలు, నవలలు ఈ రకమైన తక్షణ కర్తవ్యాన్ని చేయలేవు” అన్నారు మీరు. 

‘ఖాకీవనం’ నవలను మొరటు రచనగా, తెలిసీ తెలియని సమయంలో రాసిన రచనగా మీరే డిజోన్ చేసుకున్నారని మరొక అభిప్రాయం.

ఏ రచయిత రచనలోనయినా ఒక పరిణామ క్రమం ఉంటుంది. ఒక పరిణత రచయితకు తన తొలినాళ్ల రచనలమీద అసంతృప్తి ఉండే అవకాశం ఉంటుందనీ మీకు చెప్పనక్కరలేదు. ఆరకంగా తొలి నవలగా మీకు ‘ఖాకీవనం’ నిర్మాణం మీద అసంతృప్తులు ఉండవచ్చు, దాన్ని ఇంకా మెరుగ్గా రాసి ఉండవచ్చుననీ అనిపించవచ్చు. ఆ మాట ఎప్పుడైనా మిత్రులతో అని ఉండవచ్చు కూడ. కాని ‘ఖాకీవనం’లో మీరు చెప్పదలచిన విషయాన్ని డిజోన్ చేసుకున్నారా? ఈ దేశంలో పోలీసు వ్యవస్థ ఎంతగా దుర్మార్గంతో నిండిపోయిందీ ‘ఖాకీవనం’లో మీరు చెప్పిన విషయాల్నే మళ్లీ మళ్లీ ‘గోపాత్రుడు’లోనూ, ‘పిలకతిరుగుడుపువ్వు’లోనూ, ‘నువ్వేకాదు’ లోనూ చెప్పారంటే ‘ఖాకీవనా’న్ని డిజోన్ చేసుకున్నట్టా?
 
‘ఇజాల, సైద్ధాంతిక వాదోపవాదాల చీలికలు నిలిపేందుకు వట్టి వాక్యాల పోగులు పోసే వాజమ్మ వాగుడు లాటి రచనలను చీరిపారేసే రచనలు పతంజలివి’ అని మరొక వ్యాఖ్య. మీమీద అభిమానమూ, మీ మరణానంతరం మిమ్మల్ని పొగడాలనుకోవడమూ చాల సంతోషం. ఆ వ్యాఖ్య చేసినవారు మీకు అత్యంత సన్నిహితులనేది కూడ నిర్వివాదం. కాని మీ భుజం మీద తుపాకి పెట్టి మరెవరినో గురి చూడడం ఎందుకు? ఆ వాక్యానికి ఒక్కొక్క పదానికీ అర్థం చెప్పుకుంటూ పోతే చివరికి అన్వయం కుదరదనే సంగతి వదిలేయండి గాని, మీరెన్నడయినా ‘ఇజాల, సైద్ధాంతిక వాదోపవాదాల….రచనలను చీరిపారేసే రచనలు’ చేశారా? నాకు తెలిసినంతవరకూ వ్యక్తిగత సంభాషణల్లో, మీకు నచ్చని అటువంటి రచనల గురించి విమర్శించారేమోగాని, అది కూడ ఆ రచనల్లో కళాత్మకత లోపించినందుకు విమర్శించారేమోగాని ఇజాలూ సిద్ధాంతాలూలేని శుద్ధ జీవితం ఉంటుందనీ, దాన్ని చిత్రించే సాహిత్యం ఉంటుందనీ మీరెన్నడన్నా నమ్మారా? మీ కథల్లోనూ, నవలల్లోనూ, ఎక్కడన్నా ఇజాలూ సిద్ధాంతాలూ లేని మనుషులున్నారా? ఆ ఇజాలూ సిద్ధాంతాలూ ఏర్పడుతున్న పద్ధతి సరిగాలేదని మీరు విమర్శించారు. ఇజాలూ సిద్ధాంతాలూ జీవితానికి దూరం కాగూడదనీ, మనుషులను మొరటు మనుషులుగా, మూర్ఖులుగా మార్చగూడదనీ చెప్పడానికి మీరు ప్రయత్నించారు. ఇజాన్నీ సిద్ధాంతాన్నీ చిలకపలుకుల్లాగ వల్లెవేయడం మంచిది కాదనీ, అవి జీవితంలో, వ్యక్తీకరణలో సహజమైన, అవిభాజ్యమైన భాగాలుగా మారాలనీ చెప్పడానికి మీరు ప్రయత్నించారనుకుంటాను. క్రోధమైనా, దుఃఖమైనా వైయక్తికమా, సామూహికమా అని మీరు అడిగినప్పుడు ఇజాన్నీ సిద్ధాంతాన్నీ – స్పష్టంగా చెప్పాలంటే మార్క్సిజాన్ని – మీరు మీలో జీర్ణం చేసుకుని పలికించారనే అనుకుంటున్నాను.      

ఇక అన్నిటికన్న విచిత్రం మిమ్మల్ని తెలుగునాట ప్రగతిశీల శిబిరం నుంచి వేరు చేయాలనే ప్రయత్నం. బతికి ఉన్నంతకాలం మిమ్మల్ని పట్టించుకోని విప్లవరచయితలు ఇప్పుడు మిమ్మల్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారట. విరసం రచయితల రచనలలో కళాత్మకత లేదని మీరు వాటిని ఈసడించుకున్నారట. ఒకరకంగా మీరు విరసం వ్యతిరేకులట.

మీరు ఏ సంఘంలోనూ, నిర్మాణంలోనూ భాగం కాలేదనే మాట నిజమే గాని తెలుగు ప్రగతిశీల సాహిత్య శిబిరానికి మీరు అందించిన కానుకలు చాల విలువైనవి. అంతకు ముందరి కథలను వదిలేసినా ‘ఖాకీవనం’ నాటినుంచీ మీ ప్రతి రచననూ తనలోకి తీసుకున్నది ప్రగతిశీల సాహిత్య శిబిరమే. విప్లవ సాహిత్య శిబిరమే. మీ రచనల విశిష్టతను వివరించడానికి ప్రయత్నించినవారు ప్రగతిశీల సాహిత్యకారులే. మీ మీద వ్యక్తిగతంగానూ, సాహిత్యరంగంలోనూ దాడులు సాగినప్పుడు మీకు తన శక్తి మేరకు అండగా నిలిచినది ప్రగతిశీల సాహిత్య శిబిరమే.

పతంజలిగారూ, మరి మీకూ విరసంకూ లేని విభేదాన్ని ఇవాళ కనిపెడుతున్న దురుద్దేశ్యపూర్వకమైన ఈ అబద్ధాలను ఎవరు సవరించాలి? 

విరసం మీద, విరసం రచనల మీద మీకు విమర్శ లేదని కాదు. ఉంది. అది అనేక సంభాషణల్లో మిత్రుల దగ్గర చెప్పారు. ఒకసారో రెండుసార్లో రచనల్లో వ్యక్తం చేశారు. విరసం ఇరవై ఐదేళ్ల మహాసభల సందర్భంలో మీరు అప్పుడు పని చేస్తుండిన మహానగర్ పత్రికలో మీ పేరు లేకుండా ఒక పెద్ద వ్యాసమే రాశారు. ‘ఆదర్శాలు మార్చుకోవద్దుగాని, ఫార్ములా మార్చరాదా?’ అనే ఆ వ్యాస శీర్షికే మీ అంతరంగానికి అద్దం పడుతుంది. ఆ వ్యాసంలో విరసం కృషి మీద ప్రశంసా ఉంది, విమర్శా ఉంది. విరసం ప్రభావం గురించీ, విజయాల గురించీ అంచనా ఉంది, విరసం సాధించలేకపోయిన కళాత్మకత మీద విమర్శా ఉంది. ఆ వ్యాసం చదివితే విమర్శే తప్ప వ్యతిరేకత ఎక్కడా కనబడదు.

కాని విమర్శకూ వ్యతిరేకతకూ తేడా తెలియని పాండిత్యం మనవాళ్లది. విమర్శనాత్మకంగా ఉండడమంటే గుణదోష విచారణ చేయడమని తెలియదు. విమర్శనాత్మకత లక్ష్యం విమర్శిస్తున్న విషయం బాగుపడాలనే ఆకాంక్ష అనీ తెలియదు. దోష ప్రస్తావన చేయడమే వ్యతిరేకించడంగా అర్థం చేసుకునే ఈ పండితులను ఏమనాలి? సమర్థకులూ వ్యతిరేకులూ అనే రెండు నలుపు తెలుపు వర్గాలు మాత్రమే ఉంటాయనుకునే ఈ మేధావులను ఏమనాలి? తొంబైతొమ్మిది గుణాలను గుర్తించినవ్యక్తే ఒక దోషాన్నీ గుర్తించవచ్చుననీ, తొంబైతొమ్మిది దోషాలున్న చోట కూడ ఒక గుణం ఉంటే దాన్ని గుర్తించవలసిఉంటుందనీ తెలియకపోవడం అమాయకత్వమా, ధూర్తత్వమా?

ఇక్కడే మీ స్వభావంలోని, వ్యక్తిత్వంలోని ఒక విలక్షణత కూడ గుర్తు చేయాలనిపిస్తున్నది. మీ ఎదురుగా ఉన్నవారిలో ఏదయినా ఒక అంశం పట్ల వ్యతిరేకత ఉన్నదంటే మీరు వారిని కిర్రెక్కించేలా, రెచ్చగొట్టేలా వారికి అనుకూలమైన వాదనలు పెట్టేవారు. నిజానికి అవి మీ అభిప్రాయాలవునో కాదో తెలియదు. ఎందుకంటే మరొక సందర్భంలో మీరే ఆ వాదనలకు జవాబులు చెప్పేవారు. ఒకరకమైన కొంటెతనం అది. అవతలివాళ్లు పొంగిపోతారనుకుంటే వారికి అనువైన మాటలు మాట్లాడి వాళ్ల అల్పసంతోషం మీద మీరు సరదాపడే ఒక లౌల్యం అది. అలా డిబేటింగ్ క్లబ్బులో లాగ అటూ ఇటూ వాదనలు మీరే పెట్టినా అది అవకాశవాదం కాదు. ఒక వివేకవంతుడు, ఒక జ్ఞాని తనకన్న తక్కువ వివేకవంతులమీద చూపించే జాలి అది. ఏమి మాట్లాడినా మీరేమిటో, మీ హృదయం ఎక్కడ ఉందో మీ అక్షరాలలో వ్యక్తమయ్యే ఉంది. వాటిని ఇప్పుడెవరూ చెరిపివెయ్యలేరు. తమ ఇష్టానుసారం మార్చివెయ్యలేరు.  

‘పామర జనం ఎవడి మూర్ఖత్వాన్ని బట్టి వాడు తనకు తోచిన విధంగా నమ్ముతారు. పరమాత్మ స్వరూపం గురించి ఎవరికి తోచిన విధంగా వారు ఆలోచిస్తారు’ అని మన బొబ్బిలి అన్నట్టు, ఆ వ్యాఖ్యానాల సంగతికేమి గాని, మీ గురించి, మిమ్మల్ని అంచనా వేయడం గురించి ఇంత గందరగోళం ఎందుకు జరుగుతున్నదా అని ఆలోచించవలసే ఉంది.

ఒకటి రెండు విషయాలు తడుతున్నాయి.

మీరు తెలుగు సమాజ సాహిత్యాలు గర్వించదగిన అద్భుతమైన సృజన కర్త. బహుశా గత శతాబ్దిలో మన తెలుగు సాహిత్యలోకం సృష్టించిన అపార ప్రజ్ఞావంతులయిన ఐదారుగురు రచయితలలో మీరొకరు. వ్యక్తిగానూ ఆలోచనాపరుడిగానూ రచయితగానూ మీ విస్తృతీ లోతూ సాధారణమైనవి కావు. కథ, నవల, వ్యాసం, వ్యంగ్య రచన, సంపాదకీయం వంటి అనేక ప్రక్రియలలో ముప్పై సంవత్సరాలకు పైగా అనన్య సాధ్యమైన కృషి చేసి వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. పత్రికారచయితగా, వైద్యుడిగా, స్నేహశీలిగా వేలాదిమందికి వ్యక్తిగతంగా సన్నిహితంగా మెలిగారు.

ఈ వేలాదిమంది అభిమానులలో ప్రతిఒక్కరికీ తనకే ప్రత్యేకంగా వ్యక్తిగతంగా తెలిసిన పతంజలి ఉన్నారు. ప్రతిఒక్కరూ తమకు తెలిసిన పతంజలే అసలు పతంజలి అని అనుకుంటున్నారు, అంటున్నారు. ఇతర పతంజలుల గురించి వారికి తెలియకపోవచ్చు కూడ. కనుక ఏ ఒక్కరూ అబద్ధమూ కాదు. అట్లని ఏ ఒక్కరూ నిజం కూడ కాదు.

మీ రచనలోనూ, జీవితంలోనూ అపారమైన లోతు, సువిశాలమైన విస్తృతి ఉన్నందువల్ల మీ అక్షరాల అంతస్సారాన్నిగాని, జీవిత దృక్పథాన్ని గాని తెలిసిన వర్గీకరణలలోకి విభజించి మీకు ఏకైక అస్తిత్వాన్ని ఆపాదించడం కుదరదు. రచనా వస్తువువల్ల, శైలి వల్ల, అసాధారణమైన జీవితానుభవంతో, అధ్యయనంతో మీ రచనలోకి ప్రవహించిన ఎన్నెన్నో పొరల, స్థాయిల, కోణాల, రంగాల జీవిత విశ్లేషణల రసాయనిక మేళవింపు వల్ల మీ రచన చెప్పదలచినదేమిటో ఒకే పఠనంలో సంపూర్ణంగా అవగాహనకు వస్తుందని చెప్పడానికి వీలు లేదు. చదివినప్పుడల్లా, చదివే సందర్భం మారినప్పుడల్లా ఒక కొత్త కోణం కనబడే రచనలు మీవి.

లోతూ విస్తృతీ అంతు తెలియని మీ సాహిత్య వ్యక్తిత్వం లాగే మీ జీవితం, వ్యక్తిత్వం కూడ మనకు తెలిసిన సాధారణ సరళరేఖ సూత్రాలలోకి, నలుపు తెలుపులలోకి కుదించగలిగినవి కావు. మీరు ఏకకాలంలో మిమ్మల్ని మీరు ప్రగతిశీల వాదిగానూ గుర్తించుకున్నారు, హస్తసాముద్రికాన్నీ నమ్మారు. అత్యద్భుతమైన రచనలు చేసి వేలాదిమందిలో ప్రకంపనాలు సృష్టిస్తూనే, అసలు రచనకు సామాజిక ప్రయోజనం ఉంటుందా అనీ సందేహించారు. మీ రచనలను లోకం ఎలా స్వీకరిస్తుందో చూస్తూనే ‘నేను నాకోసం మాత్రమే రాసుకుంటున్నాను’ అన్నారు. ‘నాకు ప్రజలంటే ఇష్టం’ అంటూనే ‘కాని నిస్సిగ్గయిన ఊరేగింపులంటే అసహ్యం’ అన్నారు. రాజుగా బతుకుతూనే రాజుల బూజును కడిగేశారు. జర్నలిస్టుగా ఉంటూనే జర్నలిస్టులు పెంపుడుజంతువులుగా మారిన తీరును దుయ్యబట్టారు. బహుశా మన సమాజంలో విరుద్ధాంశాల మధ్య ఐక్యత – ఘర్షణ ఎలా ఉంటాయో మీరు జీవించీ రచించీ చూపారు. అది మామూలు దృష్టికి వైచిత్రిలాగ కనబడుతుంది. బహుశా ఈ వైచిత్రే మీరు మరణించిన తర్వాత వెలువడుతున్న వ్యాఖ్యానాలలో కనబడుతున్నట్టున్నది.

ఇంతకూ మీరు ఎవరివారో, ఎవరిని వ్యతిరేకించారో, మీ రచనలలో ఏది గొప్పదో ఏది అల్పమైనదో, వ్యక్తిగా మీ బలాలూ బలహీనతలూ ఏమిటో తేల్చే అలమండ తగువు ఏమవుతుందో గాని, ఇంత రాశాక మీ అక్షరాల అంతస్సారం ఆత్మవిమర్శ అని నాకనిపిస్తున్నది. మీరు ఎవరినో ఎదుటివారిని విమర్శించడానికే రాశారని, వ్యంగ్యం రాశారని పైకి చూడడానికి అనిపిస్తుందిగాని, నిజానికి మీరు విమర్శించిన అన్ని రంగాలూ మీలోనే ఉన్నాయి. మీరు వాటిలో భాగంగానే ఆ ఎగతాళి చేశారు. అంటే మీ రచనంతా మీ ఆత్మవిమర్శ. మీరు మాలో ఒకరు గనుక, మా ప్రతి ఒక్కరిలోనూ మీరు విమర్శించినవన్నీ ఉన్నాయి గనుక మీ రచనలన్నీ మా ఆత్మవిమర్శలే. అందువల్లనే ఎక్కువమంది పాఠకులు మీ అక్షరాలతో మమేకమవుతారు. మీకన్న గొప్పగా విమర్శలు రాసినవాళ్లు, బైటినుంచి చూసినవాళ్లు ఉండవచ్చుగాని, మీలాగ ఆత్మవిమర్శ రాసినవాళ్లు, లోపలినుంచి చూసినవాళ్లు అరుదు. అందువల్లనే చాలమందికన్న మీరు ఎక్కువకాలం నిలుస్తారు.

పతంజలిగారూ, ఎప్పటికీ మీకు సెలవు చెప్పలేం.

 ఎన్. వేణుగోపాల్
మే 18, 2009

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

2 Responses to పతంజలి గారూ, ఈ తగువు ఇంకెవరికి చెప్పేది?

  1. Pingback: పతంజలి గారితో మూడు దశాబ్దాలు « కడలితరగ

  2. “మీకన్న గొప్పగా విమర్శలు రాసినవాళ్లు, బైటినుంచి చూసినవాళ్లు ఉండవచ్చుగాని, మీలాగ ఆత్మవిమర్శ రాసినవాళ్లు, లోపలినుంచి చూసినవాళ్లు అరుదు. అందువల్లనే చాలమందికన్న మీరు ఎక్కువకాలం నిలుస్తారు.” అక్షరలక్షలు చేసేమాటన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s