మరొకసారి కన్నీళ్లతో

మరొకసారి కన్నీళ్లతో
శ్రీలంక తమిళుల కోసం

 
జనవరి చివరినుంచి ఏప్రిల్ మూడోవారానికి, అంటే నిండా మూడు నెలలు నిండకుండానే, ఎనబై రోజులలోపలే శ్రీలంకలో ఆరువేల ఐదువందలమంది తమిళులు బాంబుదాడులలో, కాల్పులలో మరణించారు. ఇప్పటికీ విదేశీ, స్వతంత్ర పాత్రికేయులను, పరిశీలకులను ఆ ప్రాంతాలలోకి అనుమతించడం లేదు గనుక, ప్రకటిస్తున్న సంఖ్య కన్న నిజంగా జరిగిన హత్యాకాండ ఎంత విస్తృతమైనదో, ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఎంత జరిగిందో చెప్పలేం. కనీసంగా చూసినా శ్రీలంక ఉత్తరాదిన దాదాపు రోజుకు వెయ్యి మంది తమిళుల ప్రాణాలు సైనిక పదఘట్టనల కింద బలి అయిపోతున్నట్టుంది.

మరణించినవారికి ఎన్నోరెట్ల మంది గాయపడ్డారనీ, లక్షకు పైగా ప్రజలు కొంపాగోడూ వదిలిపెట్టి, ప్రాణాలు అరచేతిలో పట్టుకుని శరణార్థులై వచ్చి ప్రభుత్వ “రక్షణ” శిబిరాల్లో చేరారనీ, అక్కడ వాళ్లకు కనీస అవసరాలయిన ఆహారం, నీళ్లు, వైద్య సౌకర్యాలు కూడ అందడం లేదనీ, ఎండలలో అలమటించిపోతున్నారనీ ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు, ప్రచారసాధనాలు ప్రకటిస్తున్నాయి. సైన్యం విచ్చలవిడిగా సాగించిన బాంబుదాడులలో, కాల్పులలో చనిపోయిన వారి శవాలు, మాంసఖండాలు, శరీర భాగాలు నిండిన ఫొటోలు, ధ్వంసమైపోయిన గ్రామాల, పట్టణాల దృశ్యాలు ఇంటర్నెట్ మీదా, టివి ఛానెళ్లలోనూ చూస్తుంటే మనసు వికలమవుతున్నది. ఎంత ప్రభుత్వ వ్యతిరేకులనయినా ఇంత దుర్మార్గపు చావుతో, ఇంత బీభత్సంగా శిక్షించాలా అనిపిస్తున్నది. ఇంతకూ అలా మరణిస్తున్నది, దాడికి గురవుతున్నది ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడుతున్న ఎల్ టి టి ఇ సైనికులు కూడ కాదు, సాయుధ తమిళులు కూడ కాదు. మరణిస్తున్నవాళ్లు, సర్వం కోల్పోతున్నవాళ్లు ఎల్ టి టి ఇ మద్దతుదారులు అవునో కాదో కూడ తెలియదు. ఎక్కువలోఎక్కువగా వాళ్లు ఎల్ టి టి ఇ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ జీవితం గడుపుతుండిన తమిళ ప్రజలు. తరతరాలుగా అక్కడనే బతుకులు ఈడుస్తున్న ప్రజలు.

కళ్లముందర జరిగిపోతున్న ఇంతటి మహా మానవ విషాదం పట్ల యావత్తు నాగరిక ప్రపంచమూ ప్రదర్శిస్తున్న నిర్లిప్త వైఖరి చూస్తే ఆశ్చర్యంగానూ అమానుషంగానూ ఉన్నది. ఒక జాతిని నిర్మూలించడానికి, అవమానాల పాలు చేయడానికి, వందల సంవత్సరాలుగా నివసిస్తున్న వారినేలమీదనే వారిని రెండోస్థాయి పౌరులుగా మార్చడానికి ఉద్దేశ్యపూర్వకంగా, దుర్మార్గంగా, వ్యవస్థీకృతంగా జరుగుతున్న దమనకాండను ప్రపంచమంతా ఇంత నిర్లిప్తంగా మౌనసాక్షిలా చూస్తూ ఉంటే నాగరిక ప్రపంచంలోనే ఉన్నామా అని అనుమానం కలుగుతున్నది.

ఒకవైపు ఇంతటి దారుణమారణకాండ జరిగిపోతూ ఉంటే, జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, ప్రసారసాధనాలు మొదట ఆ మారణకాండను ఆపడానికో, ఖండించడానికో ప్రయత్నించకుండా, ఎల్ టి టి ఇ తప్పుల జాబితాలు మళ్లీ ఒకసారి నమోదు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎల్ టి టి ఇ ఆ తప్పులన్నీ చేసిన మాట నిజమే అనుకున్నా, వాటి గురించి చర్చించడానికి ఇది సందర్భం కాదు. ఆ తప్పులకు ఇవాళ తమిళ ప్రజలను ఊచకోత కోయనక్కరలేదు. అక్కడ ఇల్లు తగలబడిపోతున్నది. ఆ ఇంట్లో వాళ్లందరూనో, వారిలో కొందరో ఎన్ని తప్పులు చేసినవారయినా, మానవత్వం ఉన్నవారెవరయినా చేయవలసిన పని మొదట ఆ దహనకాండను ఆపడం. నాలుకలు చాస్తున్న ఆ అగ్నికీలల సౌందర్యాన్ని కీర్తించడం కాదు. లోపలివారి గత చరిత్రను ఏకరువుపెట్టడం కాదు.

తమ పాలనలో గణనీయమైన తమిళజనాభా ఉన్న దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల ప్రభుత్వాలు కూడ నామమాత్రపు ప్రకటనలతో సరిపెట్టుకుంటున్నాయి. భారత ప్రభుత్వ వైఖరి, భారత రాజకీయ పక్షాల వైఖరి అత్యంత విషాదకరమైన అవకాశవాదంతో వ్యక్తమవుతున్నది. ఇరాక్ లోనో, ఆఫ్ఘనిస్తాన్ లోనో, పాకిస్తాన్ లోనో, ఏదో మారుమూల ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశంలోనో కల్లోలం జరిగితే అక్కడికి వెళ్లి ధర్మసంస్థాపన చేయడమే తన లక్ష్యమని ప్రకటించుకునే అమెరికా ఇప్పుడు మాత్రం అటు ఎల్ టి టి ఇ కి ఆయుధాలు అప్పగించి లొంగిపొమ్మనీ, ఇటు ప్రభుత్వానికి ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించమనీ ఉచిత సలహాలు ఇస్తూ పొద్దు పుచ్చుతున్నది. ఐక్యరాజ్యసమితికి ఎట్లాగూ అక్కడ శ్రీలంక సైనిక బలగాలు జరుపుతున్న దుర్మార్గాన్ని ఖండించే శక్తి లేదు. కనీసం అక్కడ యుద్ధబీభత్సంలో చిక్కుకుపోయిన తమిళసాధారణ ప్రజానీకానికి సహాయం అందిస్తానని ముందుకు వస్తే శ్రీలంక ప్రభుత్వం నిస్సిగ్గుగా తిరస్కరించింది. ఎంతోకాలం శ్రమించి శ్రీలంక ప్రభుత్వానికీ, ఎల్ టి టి ఇ కీ మధ్య శాంతి ఒడంబడికను, కాల్పుల విరమణను సాధించిన నార్వే ప్రభుత్వం కూడ ప్రస్తుతం మౌనం దాలుస్తున్నది.

ఇక శ్రీలంక తమిళుల మీద జరుగుతున్న మారణ కాండ గురించి పత్రికలలోనూ, టెలివిజన్ మీదా, ఇంటర్నెట్ మీదా వెలువడుతున్న వ్యాఖ్యానాలు చూస్తుంటే నిస్సహాయ ఆగ్రహం పెల్లుబుకుతున్నది. అసలు అక్కడ ఏమి జరుగుతున్నదో, శ్రీలంక సైనిక బలగాలు ఎటువంటి దురాగతాలు సాగిస్తున్నాయో, ఆ దారుణాలకు సాధారణ తమిళ ప్రజానీకం ఎలా బలి అయిపోతున్నదో ఎంతమాత్రమూ తెలియని, పట్టించుకోని వ్యాఖ్యాతలు పత్రికలలో, టెలివిజన్ మీద నిపుణులుగా నటిస్తూ ఎల్ టి టి ఇ ని ఖండిస్తూ, సైన్యాన్ని పొగుడుతూ ప్రగల్భాలు పలుకుతుంటే, శ్రీలంక సైనిక బలగాల తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతుంటే జుగుప్స కలుగుతున్నది.

ఒక సాయుధ ప్రజా ఉద్యమంగా లిబరేషన్ టైగర్లను మీరు సమర్థించవచ్చు, సమర్థించకపోవచ్చు. ఇవాళ సమస్య టైగర్లది కాదు, ప్రభాకరన్ ది కాదు. ఆ దేశంలో అనాదిగా జీవిస్తూ, దేశ జనాభాలో ఇరవై శాతంగా ఉండి, ఆ దేశ రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక జీవనంలో తమ వాటా నిరాకరించబడిన జాతి, తన మాతృభాషలో చదువుకోవడానికి, పాలన సాగించమని కోరడానికి అవకాశం లేని జాతి తన జన్మహక్కుల కోసం సాగిస్తున్న ప్రయత్నం అది. ఆ ప్రయత్నాన్ని అనేకమంది అనేకవిధాల చేసి ఉండవచ్చు. ఆ క్రమంలో క్షమించరాని తప్పులే చేసి ఉండవచ్చు. ఇవాళ ఆ ప్రయత్నాన్నే, ఆ ఆకాంక్షనే తుడిచేసే దాడి జరుగుతున్నది.

ఆ ప్రయత్నంలో గనుక శ్రీలంక తమిళ ప్రజానీకం ఓడిపోతే ఇక ప్రపంచంలో ఎక్కడయినా ప్రజలు ఒక సంఘటిత సమూహంగా తమ మానవహక్కులకోసం, జన్మహక్కులకోసం ఎలుగెత్తగల అవకాశం తగ్గిపోతుంది. అక్కడ హక్కులు కోల్పోతున్నవాళ్లు తమిళులు గనుకనో, వారు మన పొరుగుదేశం వారు గనుకనో, మనలో కొందరికి వారితో భాషా సాంగత్యం ఉన్నది గనుకనో మాత్రమే కాదు. అది మానవహక్కుల కోసం సాగుతున్న ఆందోళన గనుక దానిమీద దాడిని ప్రతి ఒక్కరూ ఖండించవలసి ఉన్నది. ప్రస్తుతం జరుగుతున్నది శ్రీలంక అనే ఒకానొక దేశంలో తమిళులు అనే ఒకానొక జాతి ప్రజల మీద, ఆ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పుకుంటున్న ఒక సాయుధపోరాట బృందంమీద ఆ దేశంలో చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం సాగిస్తున్న దాడి మాత్రమే కాదు. అది మానవహక్కులమీద దాడి. మంచి బతుకుకోసం ప్రకటించే ఆకాంక్ష మీద దాడి. మనిషితనం మీద దాడి.

మనిషికి తానున్న నేల మీద హక్కు, తన తండ్రులూ తాతలూ తిరుగాడిన నేల మీద, వారు వ్యవహరించిన భాషలో, సంస్కృతిలో కొనసాగే హక్కు, తన పాలనను తాను నిర్ణయించుకునే హక్కు నైసర్గికమైనవని, అవిభాజ్యమైనవని నిర్ధారించుకోవడమే మానవజాతి సాగివచ్చిన నాగరికతా ప్రస్థానం. ఇవాళ శ్రీలంక తమిళులమీద జరుగుతున్న దాడి ఆ నాగరికతామార్గాన్ని వెనక్కు మళ్లించే కుటిల యత్నం.

అది అలా ఉంచి, తమిళ ఈలం సాయుధ పోరాటం వైపు నుంచి చూసినా, ప్రస్తుత దాడి ఆ సాయుధపోరాటాన్ని అణచివేయజాలదు సరిగదా మరింతగా పెంచుతుంది. నాలుగు సంవత్సరాలపాటు యుద్ధవిరమణ ఒప్పందం సక్రమంగా అమలు జరిగిన తర్వాత, ఏడాదికింద ప్రభుత్వం ఏకపక్షంగా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. మహింద రాజపక్షె ప్రభుత్వం రాజకీయ ఘర్షణకు సైనిక పరిష్కారం ఉంటుందని ప్రకటించి, ఈ దాడికి సన్నాహాలు చేసింది. ఆ దాడిలో ప్రస్తుతానికి ప్రభుత్వం గెలిచినట్టు కూడ కనిపించవచ్చుగాని, రాజకీయ, చారిత్రక, సామాజిక, సాంస్కృతిక కారణాల మీద తలెత్తిన ఉద్యమాన్ని నెత్తురుటేర్లలో ముంచినా, ఆ ఆకాంక్షలను వ్యక్తీకరించే నాయకత్వాన్ని నిర్మూలించినా ఆ కారణాలు తొలగిపోవు. ఈ హింసాకాండ వల్ల కొత్తతరంలో కసి పెరుగుతుంది. కొత్తతరం పోరాటవాదులు తయారు అవుతారు. ఆ పోరాటకారులు తక్షణమే సంఘటితం కాలేకపోవచ్చు. ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు తమ జీవితకాలంలో సురక్షితంగానే రాజ్యం చేయవచ్చు. కాని మళ్లీ అవకాశం దొరకగానే పోరాటం మరింత హింసాత్మకంగా విజృంభిస్తుంది.  ఈ హింసా వలయంలో సాధారణ ప్రజానీకం బతుకు నానాటికీ దుర్భరమైపోతుంది. జాతివైరానికి గల రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక, చారిత్రక కారణాలను కనిపెట్టి వాటిని తొలగించేవరకూ సుస్థిరమైన, అర్థవంతమైన శాంతి నెలకొనదు. ఈలోగా ఏర్పడే శ్మశానశాంతిని కీర్తించడం హతులకూ మేలు చేయదు, హంతకులకూ మేలు చేయదు, కాటికాపరులకూ మేలు చేయదు.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s