మరణం లేని జాతి స్వేచ్ఛాకాంక్ష

వేలుపిళ్లై ప్రభాకరన్ (1954 – 2009) ఒక సజీవ వ్యక్తిగా శ్రీలంక రాజకీయాలలో పాల్గొన్న యుగం ముగిసింది. ఒక జ్ఞాపకంగా, వీరోచిత పోరాటపు ప్రతీకగా, అమరస్మృతిగా, భవిష్యత్తు పోరాటాలకు ప్రేరణగా శ్రీలంక తమిళ సమాజంలో ప్రభాకరన్ యుగం బహుశా ఎప్పటికీ ముగియదు. స్పార్టకస్ ను మానవజాతి ఎప్పటికీ మరిచిపోనట్టుగా, భగత్ సింగ్ ను భారత సమాజం ఎన్నటికీ మరిచిపోనట్టుగా, అరాఫత్ ను పాలస్తీనీయులు మరిచిపోనట్టుగా శ్రీలంక తమిళ సమాజం తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడినన్ని రోజులూ ఆయన పేరు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటుంది. ఆయన అనుభవం నుంచి తీసుకోదగిన అనుకూల, ప్రతికూల గుణపాఠాలు తీసుకుంటూనే ఉంటుంది. శ్రీలంక తమిళజాతి స్వేచ్ఛాకాంక్షలను సాకారం చేయడం కోసం ఒక ఉజ్వలమైన పోరాటం నిర్మించిన నాయకుడిగా, ఆ పోరాటంలో మడమ తిప్పకుండా, రాజీలేకుండా చివరిదాకా నిలిచి వీరమరణం పొందిన నాయకుడిగా ప్రభాకరన్ ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది.

వలసానంతరం ఆరుదశాబ్దాలుగా తమనేలమీదనే తమను రెండవ తరగతి పౌరులుగా చూస్తూ సాగిన దౌర్జన్యరాజ్యం వల్ల, ముప్పై సంవత్సరాల అంతర్యుద్ధం వల్ల మాత్రమే కాక, గత రెండు సంవత్సరాల దమనకాండలోనూ, ప్రత్యేకించి గత మూడు నెలల జాతి హననంలోనూ తమమీద సింహళ సైనికులు జరిపిన అకృత్యాలకు తమిళులలో కసి మరింత పెరిగి ఉంటుంది. సింహళ పాలకవర్గాలకు సహకరించిన అమెరికా, చైనా, భారత పాలకుల పట్ల కూడ ఆగ్రహం పెరిగి ఉంటుంది. తమమీద జరుగుతున్న భయంకర దాడిని కనీసం ఖండించకుండా మౌన సాక్షిలా కూచున్న అంతర్జాతీయ సమాజం పట్ల శ్రీలంక తమిళుల అసంతృప్తి మరింత పెరిగి ఉంటుంది. అందువల్ల బహుశా భవిష్యత్తులో శ్రీలంక తమిళ ఆకాంక్షలు వ్యక్తమయ్యే రూపాలు మరిన్ని పెరుగుతాయి. తీవ్రత మరింత పెరుగుతుంది. అలా వెలికివచ్చే పోరాటరూపాలన్నిటిలోనూ, వాటి తీవ్రతలోనూ, ప్రతి సందర్భంలోనూ తమిళులు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తమే ప్రభాకరన్ పేరు మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటుంది.

వ్యక్తిగా ప్రభాకరన్ మామూలు మనిషే. పెద్దగా చదువుకోలేదు. పాఠశాల రోజుల్లోనే తమిళుల పట్ల సింహళ అగ్రజాతి దురహంకారాన్ని చవిచూసి పద్దెనిమిదో ఏటనే తమిళ్ న్యూ టైగర్స్ సంస్థను స్థాపించాడు. నాలుగైదు సంవత్సరాల్లోనే అది లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంగా రూపాంతరం చెందింది. తమిళ ఈలం అనే స్వప్నానికి తన జీవితాన్ని అంకితం చేసుకున్న ప్రభాకరన్ తన తాత్విక దృక్పథం “విప్లవాత్మక సోషలిజం” అనీ, తన ఆశయం “సమసమాజాన్ని స్థాపించడం” అనీ చెప్పుకున్నాడు. తమిళ ప్రజల ఆత్మగౌరవ పోరాటానికి అసాధారణమైన నాయకత్వం, వ్యూహ చతురత అందించి పొందిన గౌరవంతోపాటుగానే పోరాటరూపాలవల్ల, ఎత్తుగడలవల్ల, కరకుదనంవల్ల వివాదాస్పదుడూ అయ్యాడు. తన జాతి ఆత్మగౌరవం కోసం పోరాడుతూనే తనవాళ్లవైనా, ఇతరులవైనా ప్రాణాలపట్ల విలువలేని స్థితికి చేరాడు.

అయితే ప్రభాకరన్ ను వ్యక్తిగా మాత్రమే చూడనక్కరలేదు. ఆయన విశిష్టత తమిళ ఈలం పోరాటాన్ని అసాధారణ స్థాయికి తీసుకుపోవడంలో ఉండవచ్చు గాని అసలు ఏ జాతి పోరాటంలోనైనా విస్తృతి, తీవ్రత, ఉద్వేగపూరితమైన నిమగ్నత ఉంటాయి. ఒక్కోసారి బయటివాళ్లకు అతి అనిపించేటంత, తప్పులుగా తోచేంత గాఢమైన అభినివేశం ఉంటుంది. ఆ ఆకాంక్షను, ఆ పోరాటాన్ని ఇతరులు ఎలా చూస్తున్నారనేదానితో నిమిత్తం లేకుండా ఆ జాతిజనులు గుండెలకు హత్తుకుంటారు. ‘ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా, ఇకపై సాగదు’ అనేది కేవలం తటస్థమైన ఆదర్శవాదం మాత్రమే కాదు. పీడనకు గురవుతున్న జాతిలోని ప్రతివ్యక్తికీ అది ప్రతిక్షణం అనుభవైకవేద్యమైన వేదన. ఆ అనుభవాన్ని రద్దుచేసే ప్రయత్నంలో మృత్యువు ఎదురైనా సరే అనిపిస్తుంది. బానిసగా బతకడం కన్న పోరాడి మరణించడమైనా మంచిదే అనిపిస్తుంది. రెండువందల సంవత్సరాలకు పైగా సాగుతున్న ఐరిష్ ప్రజల స్వాతంత్ర్యాకాంక్ష నుంచి ప్రస్తుతం సాగుతున్న పాలస్తీనియన్, కుర్దు, తమిళ ఈలం పోరాటాలదాకా, పాత సోవియట్ యూనియన్ లోనూ, పాత చెకొస్లవేకియా, యుగొస్లావియాల లోనూ నిన్నామొన్నా వినబడిన రక్తసిక్త గాథల దాకా జాతి ఆకాంక్షల పునాది మీద నడిచే పోరాటాలది సుదీర్ఘ విషాద చరిత్ర. భారత ఉపఖండంలోని జాతుల ఆకాంక్షల సంగతి చెప్పనే అక్కరలేదు.

అటువంటి తరతరాల ఆకాంక్షకు పటిష్టమైన పోరాట పంథాను అల్లడంలోనే, కనీసం రెండు దశాబ్దాలపాటు సమాంతర స్వతంత్ర సైన్యాన్నీ ప్రభుత్వాన్నీ నడపడంలోనే ప్రభాకరన్ విశిష్టత ఉంది. తొలుత జాఫ్నా రాజధానిగా, ఆ తరువాత కిల్లినోచ్చి రాజధానిగా నడిచిన ఈలం స్వయంపాలన ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వ వ్యతిరేక బలగాలకు సొంత విమానాలు, సొంత జలాంతర్గాములు, నౌకలు ఉండగలిగే అనుభవాన్ని నమోదు చేసింది. పోరాటకారులు పాఠశాలలను, ఆస్పత్రులను, శిక్షణాలయాలను, పోస్టాఫీసులను మాత్రమే కాదు, బ్యాంకులను కూడ నడపగలరని రుజువు చేసింది. పోరాటకారులంటే అడవులలో, కొండలలో, తమకు వీలయిన, అనువైన నైసర్గిక ప్రాంతాలలో, వెనుకబడిన ప్రజలను “బెదిరించి” మాత్రమే తమ అదుపులో ఉంచుకుంటారనే దుష్ప్రచారాలు సాగేవేళ, అటు శ్రీలంక ప్రభుత్వంతో, ఇటు భారత ప్రభుత్వంతో, నార్వే ప్రభుత్వంతో తాము సమానస్థాయిలో దౌత్యపరమైన చర్చలు జరపగలమని, అత్యాధునికమైన, అతి సున్నితమైన రాజకీయ వ్యవహారాలు నడపగలమని టైగర్లు రుజువుచేశారు.

శ్రీలంక తమిళులు సాయుధపోరాటం ద్వారా ఇంకా ఎక్కువ ప్రాణనష్టానికి గురి కావడం కన్న మరేమీ ప్రయోజనం కలగలేదని, ఆ రకంగా ప్రభాకరన్ తమిళులను పొయ్యిమీదినుంచి పెనంలోకి పడేశాడనీ విమర్శించేవాళ్లు కూడ ఉన్నారు. కాని ఇరవయోశతాబ్ది తొలిరోజులనుంచీ తమిళుల మీద సింహళీయుల దుర్మార్గాలు సాగుతుంటే, సిలోన్ స్వాతంత్ర్య ప్రకటన తర్వాత రాజ్యం పూర్తిగా సింహళీయుల చేతికి వచ్చి తమిళ ప్రజల మనుగడమీద, సంస్కృతిమీద, చరిత్ర మీద, భూమి మీద దుర్మార్గమైన దాడులు జరుగుతుంటే, తమిళులు అన్ని నాగరిక, ప్రజాస్వామిక పద్ధతులలో తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. బ్రిటిష్ ప్రైవీ కౌన్సిల్ నుంచి దేశంలోని న్యాయస్థానాలు, చట్టసభలు, ప్రభుత్వాలు, రాజకీయపక్షాలు, ప్రచారమాధ్యమాలు, పౌరసమాజం దాకా అన్ని వ్యవస్థలూ వారికి మొండి చెయ్యి చూపాయి. ఆ స్థితిలో కోపోద్రిక్త యువతరం సాయుధపోరాటం తప్ప మరొక మార్గం లేదని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయాన్ని మొత్తం తమిళ సమాజమే అంగీకరించింది గనుకనే ఆ పోరాటం మూడు దశాబ్దాలపాటు ఆదరణ పొందింది. శ్రీలంక ఉత్తరాదినా ఈశాన్యంలోనూ ఉన్న తమిళులు ఈలం పాలనను ఆమోదించారు. దేశదేశాలలో ఉన్న తమిళులు ఈలం ఆశయానికి ఆర్థిక, హార్దిక సహాయం అందించారు.
ఇవాళ ఓడిపోయినందువల్ల ఆ ఆశయం చెడ్డదయిపోదు. ఆ ఓటమి ఆశయంలోని బలహీనతవల్ల జరగలేదు. ఈలంపోరాటకారులలో మురళీధరన్ వంటి ముఖ్యులను సింహళ పాలకులు కొనివేయడం వల్ల, అగ్రరాజ్యాలు, ముఖ్యంగా అమెరికా, టెర్రరిజం మీద యుద్ధం పేరుతో టైగర్లను నిషేధించడం వల్ల, నిషేధించమని ముప్పై దేశాల ప్రభుత్వాలమీద ఒత్తిడి తేవడం వల్ల, అగ్రరాజ్యాలు శ్రీలంక సైనిక బలగాలకు సహాయాన్ని అందించడం వల్ల, ఈలం భూభాగాన్ని చక్రబంధం చేసి పోరాటకారులకు సహాయం అందకుండా నిరోధించినందువల్ల, ఈలం ప్రాంతంలో ఆస్పత్రుల మీద, జనావాసాలమీద బాంబుదాడులు చేసినందువల్ల శ్రీలంక సైన్యం విజయం సాధించింది. ఇది అధర్మ యుద్ధంలో అధర్మ విజయం.

ఇప్పటికి అధర్మానిదే, అన్యాయానిదే, వివక్షదే విజయమని అనిపించవచ్చు. కాని ఇది ఒక్క శ్రీలంక తమిళుల సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థ అక్రమాలను వ్యతిరేకించే ఉద్యమాలను నిరాశలోకి ముంచడానికి జరిగిన ప్రయత్నం ఇది. అఫ్ఘనిస్తాన్, ఇరాక్, గాజా, ఇప్పుడు శ్రీలంక…అమెరికన్ అగ్రరాజ్యం సెప్టెంబర్ 11 తర్వాత టెర్రరిజం మీద యుద్ధం పేరుతో ప్రారంభించిన ప్రశ్నమీద యుద్ధం ఇది. ప్రతిఘటనమీద యుద్ధం ఇది. న్యాయాకాంక్షమీద యుద్ధమిది. ఇదిగో వ్యవస్థను, యథాస్థితిని, దోపిడీని, పీడనను, వివక్షను, అసమానతను ప్రశ్నించేవారిని, కూలదోయదలచేవారిని ఈవిధంగా మట్టుబెడతాము, తస్మాత్ జాగ్రత్త అని పాలకులు అన్ని చోట్లా ప్రజలకు చెప్పదలచుకున్నారు. ఆ అమానవీయ బెదిరింపుకు, హింసకు లొంగిపోతామా, మనుషులుగా స్పందిస్తామా, ప్రవర్తిస్తామా ఎవరికి వాళ్లం తేల్చుకోవలసిన సమయం ఆసన్నమవుతోంది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, News Archives, Telugu and tagged , , , , , , , . Bookmark the permalink.

4 Responses to మరణం లేని జాతి స్వేచ్ఛాకాంక్ష

 1. Tadepally says:

  శ్రీలంక తమిళుల ఆవేదన తెలుగువాళ్ళు చాలామందికి తెలియదు. వారు వందలాది సంవత్సరాల నుంచి సింహళీయులతో సమానంగా అక్కడ నివసిస్తున్నవారు. మనవాళ్ళు అనుకుంటున్నట్లు ఇక్కణ్ణుంచి వలసపోయినవారు కారు, పరాయి భుభాగానికి వెళ్ళి స్వతంత్రదేశం కోరుతున్నవారూ కారు. వాళ్ళు కోరుతున్నది తమ భూభాగం మీద హక్కే. కొంతమంది మాత్రం టీ తోటల్లో పనిచేసే నిమిత్తం బ్రిటిష్ హయాములో అక్కడికి వెళ్ళి స్థిరపడిపోయినవారు. ఏదేమైనా వారికీ, వారి భాషకీ సమానహక్కులివ్వడం సింహళీయుల కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని వారు దశాబ్దాల తరబడి విస్మరించడం వల్లనే తమిళుల ఉద్యమం హింసాత్మకం అయింది. నిజంగా వారు తమిళులకి సమానహక్కులిచ్చి ఉంటే ఇప్పుడు ప్రెసిడెంట్ రాజపక్స “తమిళులకి సమానహక్కులిస్తాం” అని ఎందుకు ఎలుగెత్తుతున్నాడు్ ? అంటే ఇంతకాలమూ ఇవ్వలేదనే కదా దానర్థం ?

  తమిళవీరుల్ని సింహళ సైనికులు వధించినంతమాత్రాన తమిళ ఆశయం ఓడిపోలేదు. పైపెచ్చు గెలిచింది కూడా. మొత్తమ్మీద తమిళవీరులు చచ్చి సాధించారు. ఈరోజు కేవల తూర్పు-ఈశాన్యప్రాంతాల్లోనే కాక యావత్తు శ్రీలంకలోను సింహళంతో సమానంగా తమిళం అధికారభాష అయిందంటే దానిక్కారణం ఈ పోరాటమే కదా ? ఈరోజు రాజపక్స ఇలా సమానత్వ ప్రకటనలు చేయక తప్పని పరిస్థితిని కల్పించిందీ ఈ పోరాటమే కదా ? అంతకుముందు 1950 లలో కేవలం సింహళాన్నే అధికారభాషగా గుర్తించిన వైనాన్ని గుర్తుతెచ్చుకుందాం. ఏ పోరాటాలూ లేకుండానే జాతులు నిలబడతాయా ? భాషలు నిలబడతాయా ? సంస్కృతులు నిలబడతాయా ?

 2. Venu gaariki
  excellent article

 3. వేణుగోపాల్ గారూ,
  దాదాపు 22 ఏళ్ల క్రితం.. 1987లో ఎస్‌వి యూనివర్శిటీలో జరిగిన ఓ సాహిత్య సెమినార్ సందర్భంగా మిమ్మలను కలిశాను. అప్పట్లో మీరు చైనాలో మహిళా విముక్తిపై క్లాడీ బ్రాయెల్ రాసిన పుస్తకం ఇంగ్లీష్ ప్రతిని జెరాక్స్ కాపీల కోసం నాకు తెచ్చి ఇచ్చిన విషయం కూడా ఇంకా మర్చిపోలేదు. అయితే మనం అన్నింట్లోనూ చాలా దగ్గర్లోనే ఉంటున్నప్పటికీ కలుసుకోలేని, పరిచయంలో లేని పరిస్థితిలోనే 22 ఏళ్లు గడిచిపోయాయి. చివరకు ప్రభాకరన్ అస్తమయం అనే ఘటన మీ సైట్‌ను అనుకోకుండా పరిచయం చేసింది. మరణం లేని జాతి స్వేచ్ఛాకాంక్ష పేరిటి మీరు మే 25న రాసిన వ్యాసం ఇప్పుడు చూస్తున్నాను. మే 19నే నేను ఆయుధాలనూ, ఆశయాలనూ మోసుకు తిరిగినవాడు పేరిట నా వెబ్ దునియా బ్లాగులో ప్రభాకరన్ స్మరణను పోస్ట్ చేసాను.

  అయితే మీకు ఇంగ్లీషులో ఉండే నా వెబ్ దునియా బ్లాగ్ ఆర్టికల్స్ యుఆర్ఎల్ చూపుదామని ఇక్కడ ఉంచుతుంటే వర్డ్ ప్రెస్ అసలు అనుమతించడం లేదు. జూన్ తొలి వారం మొదటి నుంచి చాలా సార్లు మీ వ్యాసానికి కామెంట్ పెట్టడం అది అనుమతించకుండా వెనక్కు కొట్టేయడం జరుగుతోంది. కారణం తెలీదు. అందుకని యుఆర్ఎల్, లింకులు లేకుండా ఈసారి పోస్ట్ చేస్తాను. అప్పటికీ నా కామెంట్ జోడించబడకపోతే సమ్ థింగ్ రాంగ్.

  ఆయుధాలనూ, ఆశయాలనూ మోసుకు తిరిగినవాడు

  దానికి అటూ ఇటూగా మూడు అదనపు వ్యాసాలను కూడా తెలుగు పత్రికా సంపాదకుల అభిప్రాయాలు, నా వ్యాసంపై వ్యాఖ్యలకు స్పందనగా మరో వ్యాసం చేర్చి పోస్ట్ చేసాను.

  నిషిద్ధ యోధుని నిష్ర్కమణం

  పులివేట పరిసమాప్తం

  ఆశయాన్ని చంపగల క్షిపణి భూమ్మీద ఇంకా పుట్టలేదు

  ఇప్పుడు మీ వ్యాసం చూశాక మరింత అర్థవంతంగా, విశ్లేషణాత్మకంగా ప్రభాకరుడు అర్థమయ్యాడని అనుకుంటున్నాను. వీలయితే నా వెబ్‌దునియా బ్లాగ్ లింకులను కూడా చూడగలరు.

  వీలయితే నా వ్యాసాలను చదివిన పాఠకులకు మరింత సుబోధకం చేయించేందుకోసం మీ వ్యాసాన్ని కూడా నా బ్లాగులో పోస్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నా బ్లాగులో మీ కథనం లింకు ఇవ్వడం కంటే పూర్తి కథనాన్నే పోస్ట్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని నా ఉద్దేశ్యం. ఇందుకు మీరు సమ్మతిస్తే ముందుకు అడుగేస్తాను.

  ప్రాణహిత వంటి వెబ్‌సైట్లలో మీ రచనలు చూస్తూనే ఉన్నాను. కాని రిప్లై ఇచ్చింది లేదు.

  ప్రస్తుతం చందమామ ఆన్‌లైన్‌లో పనిచేస్తున్నాను.
  తెలుగు.చందమామ.కామ్

  మీనుంచి చందమామ ఆన్‌లైన్‌కు ఏవైనా రచనలను ఆశించవచ్చా..

  మీ పర్సనల్ మెయిల్ ఐడి ఇస్తే మరి కాస్త వివరాలు తెలుపుకోవచ్చు కదూ..

  కె. రాజశేఖర రాజు

 4. shivaramakrishna says:

  Hero is never die

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s