పతంజలి గారితో మూడు దశాబ్దాలు

(అరుణతార పత్రికలో ప్రచురితం)

 

పతంజలిగారిని మొదటిసారి చూసి దాదాపు ముప్పై ఏళ్లు కావస్తోంది.

సృజన అక్టోబర్ 1980 సంచిక అచ్చువేయించడానికి బెజవాడ వెళ్లి కృష్ణక్క వాళ్లింట్లో ఉన్నప్పుడు మొదటిసారి ఆయనను చూశాను. అప్పుడు వేణుగోపాల రావు గారు సిద్ధార్థ కాలేజికి ప్రిన్సిపాల్ గా ఉన్నారు. బెంజి సర్కిల్ కు ఇటువైపు కృష్ణక్క వాళ్లిల్లు. అటువైపు ఈనాడు ఆఫీసు. పతంజలి గారు అప్పటికి ఈనాడులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఒక మధ్యాహ్నం వాసు (కె. వాసుదేవరావు) గారితో కలిసి పతంజలి గారు కృష్ణక్కవాళ్లింటికి వచ్చారు. అప్పటికే చతురలో పతంజలి గారి నవల ఖాకీవనం అచ్చయి ఉంది. అంతకు ఒకటి రెండు సంవత్సరాల ముందే ఉత్తరప్రదేశ్ లో పోలీసుల సమ్మె, ఆ నేపథ్యంలో వచ్చిన ఖాకీవనం నవల, అది కలిగించిన సంచలనం వల్ల ఖాకీవనం రచయితను కలవడం, దగ్గరిగా చూసి మాట్లాడడం అద్భుతాలుగా తోచాయి. ఒక రకమైన యాసతో, సన్నని, వ్యంగ్యం ధ్వనించే గొంతుతో, తక్కువ మాటలే అయినా చతురోక్తులతో ఆయన మాట్లాడుతుంటే వినడం ఒక అనుభవం.

అప్పటి నుంచి ఆ తర్వాతి ముప్పై సంవత్సరాలు వేరువేరు సందర్భాలలో వ్యక్తిగా, అభిమానరచయితగా, వైద్యుడిగా, పత్రికారచయితగా ఆయనను దూరం నుంచీ దగ్గరి నుంచీ చూసే అవకాశం కలిగింది. చిట్టచివరికి మార్చ్ 9 సాయంకాలం విశాఖపట్నం సింహాద్రి ఆస్పత్రిలో రూం నంబర్ 510 లో అర్థచేతనలో, బాధతో మూలుగుతున్న ఆయనను చూసినప్పుడు ‘ఎటువంటి మనిషి ఎట్లా అయిపోయాడు’ అని దుఃఖం కలిగింది. అమ్మా అని ఆయన మూలుగుతుంటే, ఆయన కూతురు ఉపశమనంగా ఆయన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంటే కళ్లలో నీళ్లు ఆగలేదు. చీపురుపుల్లలా అయిపోయిన కుడి చేతికి అప్పటికే సెలైన్ ఎక్కుతోంది. అప్పుడే రక్తం ఎక్కించడానికి వచ్చిన నర్సులు నరం దొరకడం లేదని కంగారు పడుతున్నారు. ‘ఎట్లా ఉన్నారు సార్’ అని ఆయన ఎడమచేతిని చేతిలోకి తీసుకుని పలకరిస్తే కళ్లెగరేసి చిరునవ్వు నవ్వారు గాని, నిజంగా గుర్తించారో లేదో తెలియదు. కలిసిన ప్రతిసందర్భంలోనూ ఏదో ఒక వ్యంగ్యాన్నో, పరిహాసాన్నో, లోతయిన ఆలోచననో పలికించిన ఆ పెదాల మధ్య ఒక భాధాతప్త, వేదనామయ ధ్వని తప్ప, పెదాల వెనుక ఆగిపోయిన పలకరింపు తప్ప అంతకు ముందరి అనేక కలయికల ఆహ్లాదం లేదు. ఆయనతో ఈ ఆఖరి కలయిక కూడ మళ్లీ కృష్ణక్కతో కలిసే జరిగింది.

ఆయన ఉండిన ఆస్పత్రి రావిశాస్త్రి గారి ఇంటికి వందగజాల దూరంలో. ఇటు రావిశాస్త్రి జ్ఞాపకాల వీథి, అటు పడిలేస్తున్న కడలి. మధ్యలో ఆస్పత్రిలో ఆయన చివరి రోజులు గడిపారు. ఒక రకమైన భవిష్యవాణి పలికించినట్టుగా ‘చివరి రోజులు విశాఖలో గడుపుతాను’ అని ఆయన రెండువారాల కింద హైదరాబాదు వదిలేసి వెళ్లారని తెలిసినప్పుడు, హైదరాబాదులో కలవలేకపోయినా విశాఖలో తప్పనిసరిగా కలవాలనుకున్నది, ఇట్లా ఆయన అకాల మరణానికి ముప్పై గంటల ముందు జరిగింది.

యాభై ఏడు సంవత్సరాల వయసు ఏం వయసని ఈలోకాన్ని వదిలి వెళిపోవడానికి? వదిలివెళ్లిన రచనలు రాశిలోనూ వాసిలోనూ చెప్పుకోదగినన్ని ఉన్నా, ఆయన రాయాలనుకున్నవీ, రాయవలసినవీ ఎన్నెన్ని రాయకుండా మిగిలిపోయాయి?!

గడిచిన ముప్పై ఏళ్లలో ఆయనతో జ్ఞాపకాలనూ, అనుభవాలనూ గుర్తు తెచ్చుకుంటుంటే మనసు పొరల్లోనుంచి ఆయన పట్ల గౌరవం, ఆయనతో ఉండిన ప్రత్యేక అనుబంధం ఉవ్వెత్తున ఎగసివస్తున్నాయి.

ఆయన బెజవాడ ఈనాడు ఉద్యోగం రోజుల్లో మరి ఒకటి రెండు సార్లు కలిశానో లేదో గుర్తు లేదు గాని, మరి మూడు నాలుగు సంవత్సరాలకే ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. తెలుగు దినపత్రికల చరిత్రలోనే మొట్టమొదటిసారిగా, ఉదయం దినపత్రిక తన సబ్ ఎడిటర్లకూ రిపోర్టర్లకూ శిక్షణ ఇవ్వదలచి, పత్రిక ప్రారంభానికి దాదాపు ఏడాది ముందే ట్రెయినింగ్ కాలేజి ప్రారంభించింది. అలా ట్రెయినింగ్ కోసం ఎంపికయిన ఇరవై మందికి శిక్షణ ఇచ్చే ప్రధాన బాధ్యత పతంజలి గారిది. ఆయనను చీఫ్ సబ్ ఎడిటర్ అన్నారో, న్యూస్ ఎడిటర్ అన్నారో గుర్తు లేదు గాని ఎ కె ఆర్ బి కోటేశ్వరరావు ప్రిన్సిపాల్. తర్వాత వాసుగారు, తర్వాత పతంజలిగారు. తర్వాత ప్రకాశ్. ఎ కె ఆర్ బి, వాసుగారు అప్పటికే పెద్దవారు గనుక ఇరవైల్లో ఉన్న మా సబ్ ఎడిటర్ ట్రెయినీలందరికీ, ఇరవైల చివరా, ముప్పైల మొదటా ఉన్న పతంజలిగారూ, ప్రకాశ్ గురువులు మాత్రమే కాక స్నేహితులూ మార్గదర్శకులూ అయ్యారు. అశోక్ నగర్ చౌరస్తాలో ఒకమూల ఆజాద్ కేఫ్ అనే ఇరానీ హోటల్, సరిగ్గా ఎదురుమూల మోహన్ కోడా ఇంటి పై అంతస్తులో మా ట్రెయినింగ్ కాలేజి. టెలిప్రింటర్ మీద వచ్చిన పిటిఐ వార్తలను మేం అనువాదం చేస్తుంటే పతంజలిగారు దిద్దుతుండేవారు. మా భాషనూ, అనువాదాన్నీ సరిచేస్తూ అనుభవాలూ కథలూ గాథలూ చెపుతుండేవారు. ఆ ఉద్యోగం ఎక్కువరోజులు చేయలేకపోయినందువల్ల నేను పొందిన నష్టాలన్నిటిలోకీ పెద్దది పతంజలిగారితో కలిసి ఎక్కువకాలం పనిచేసే అవకాశం పోగొట్టుకోవడం.

కాని ఆ తర్వాత కూడ రచయితగా, పత్రికా రచయితగా ఆయనతో సంబంధం కొనసాగుతూనే ఉండేది. నేను బెజవాడ ఆంధ్రపత్రికలో పనిచేస్తుండగా ఆయన హైదరాబాదు ఉదయంలో ఉన్నారు. కృష్ణుడు (ఎ కృష్ణారావు) ఆయనకు సన్నిహితుడుగా ఉండేవాడు గనుక ఆయన సంగతులు నాకూ, నా సంగతులు ఆయనకూ కృష్ణుడిద్వారా తెలుస్తుండేవి. ఆ రోజుల్లోనే (బహుశా 1987లో కావచ్చు) సాహిత్య విమర్శ మీద నేనొక వ్యాసం రాశాను. అది అప్పుడు హైదరాబాదు నుంచి వస్తుండిన ఉదయం సాహిత్యపేజీలో అచ్చయింది. ఆ వ్యాసం చదివి పతంజలిగారు విరుచుకుపడ్డారనీ, విసుక్కున్నారనీ, దానిలో సాహిత్య వాసనలు లేవన్నారనీ సన్నిహిత మిత్రులొకరు నాకొక ఉత్తరం రాయడమో, టెలిప్రింటర్ మెసేజి పంపడమో చేశారు. నా వ్యాసం ఆయనకు నచ్చనందుకు నాకు బాధ కలిగింది. ఆ తర్వాత మూడు నాలుగు సంవత్సరాలకు తన వ్యాఖ్యల సందర్భాన్ని ఆయనే వివరించేదాకా ఆ నొప్పి అట్లాగే ఉండింది. తాను ఆ వ్యాసం మీద దురుసు వ్యాఖ్యలేమీ చేయలేదనీ, సాహిత్య విమర్శ గురించి అయినా, సాహిత్యం గురించి అయినా నా వ్యాసంలో ఉండిన కటువు వైఖరి మంచిది కాదని మాత్రమే అన్నాననీ ఆయన వివరించారు.

ఆయన ఆ వివరణ ఇచ్చిన సందర్భం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కూడ నిన్న జరిగినంత తాజాగా కనబడుతోంది. అప్పుడు ఆయన సమయంలో ఎడిటర్ గా ఉన్నారు. నేను చీఫ్ సబ్ ఎడిటర్ గా చేరి, అప్పటికింకా పత్రిక మొదలు కాలేదు గనుక ట్రెయినీ సబ్ ఎడిటర్ల అనువాదాలు దిద్దే పనిలో ఉన్నాను. ఒక ట్రెయినీ పెళ్లి విందుకు ఆజామాబాదు సమయం ఆఫీసు నుంచి అడిక్ మెట్ నడిచివెళ్తూ ఉన్నాం. అప్పటికి నాలుగైదు సంవత్సరాలుగా నా మనసులో మెరమెరలాడుతున్న నా బాధ ఆయనకు చెప్పాను. ‘నా సాహిత్య విమర్శ వ్యాసం మీద మీకు విమర్శ ఉందని తెలిసింది. ఏం తప్పు రాశానో చెపుతారా’ అని. సాహిత్యకారులు సృజనకర్తలుగా, భావుకులుగా ఎంత సున్నితంగా ఉంటారో, అందువల్ల సాహిత్య అధ్యయనాన్ని, విమర్శను ఎంత జాగ్రత్తగా నిర్వహించాలో, విషయం దృఢంగా చెపుతూనే దాన్ని మృదువుగా ఎలా చెప్పాలో ఆయన చాల ఓపికగా చెప్పారు. రాసిన విషయంతో తనకు పేచీ ఏమీలేదని, కాని పద్ధతి మొరటుగా ఉందేమోనని అనిపించిందని అన్నారు.

బహుశా నా రచనాపద్ధతి మీద ఆయనకు ఏర్పడిన ఆ అభిప్రాయం చివరివరకూ మారినట్టులేదు. ఒక సంవత్సరం కింద ఒక విందులో కలిసినప్పుడు కూడ దగ్గరికి పిలిచి మరీ చాల సేపు నాగురించీ, నా రచన గురించీ మాట్లాడారు. ‘ఈ వారం వారం కాలమ్ లు, అక్కడో ఉపన్యాసం, ఇక్కడో ఉపన్యాసం మానెయ్యండి’ అని విసుక్కున్నారు. ‘మీ శక్తి వృథా చేసుకోకండి. మీరు ఫుల్ లెంథ్ పుస్తకాలు రాయాలి. మీరే రాయవలసినవి ఉన్నాయి. మీరు రాయగలరు’ అన్నారు. ‘కాని కాస్త కోపం తగ్గించుకోండి. నేను కూడ కోపంతోనే రచన చేస్తాను. కోపం రాకుండా ఉండలేం, రాయలేం. కాని కోపంగా చెప్పేటప్పుడు మన దగ్గర పాయింటు ఉన్నా కూడ బయటివాళ్లు అది గుర్తించరు. వాళ్లకు కోపమే కనబడుతుంది గాని పాయింటు కనబడదు’ అని చాలసేపు చెప్పారు. అప్పటికే ఆయన సాక్షిలో చేరారు. ‘ఇంకా పని మొదలు కాలేదు. ఎప్పుడయినా రండి, ఖాళీగానే ఉంటున్నాను. చాల మాట్లాడుకోవాలి మనం’ అన్నారు.

ఆరోజు సంభాషణంతా ఒక శిష్యుడికి గురువు చేసిన బోధ లాగ ఉండింది. కాని చిత్రం, ఆయన ఎప్పుడూ ఎవరికీ గురువునని అనుకోలేదు. ప్రతి ఒక్కరితోనూ స్నేహితుడిగా మెలిగారు. ఆత్మీయుడిగా ఉన్నారు. చాల సందర్భాలలో బిడియంతో, మొహమాటంతో కూడ ఉండేవారు. అంత అద్భుతమైన వ్యక్తీకరణ శక్తి, అంతగా వ్యవస్థపట్ల ఆగ్రహం, ధిక్కారం ఉన్న ఆయన తోటి మనుషులతో ఇట్లా సంకోచంగా, బిడియంగా ఎందుకు ఉంటారా అని ఆశ్చర్యం వేస్తుండేది.

సరే, మళ్లీ వెనక్కి వెళ్తే, బెజవాడలో ఉండినరోజుల్లో, 1985-89 తెలుగుదేశం పాలనాకాలంలో, ఆట-మాట-పాట బంద్ రోజుల్లో, ఉదయంలో వారం వారం ఆయన రాస్తుండిన పతంజలి భాష్యం ఎడారిలో ఒయాసిస్సులా ఉండేది. ప్రభుత్వ విధానాలమీద, అక్రమాల మీద ఒక సృజనకర్త కాలమిస్టుగా మారి ఎటువంటి పదునైన వ్యాఖ్యలు చేయడానికి అవకాశం ఉందో చూపిన కాలమ్ అది. అప్పుడే సృజన పునఃప్రారంభించడానికి ఒక విఫలప్రయత్నం చేసి, మరొక సాహిత్యపత్రిక ఏదయినా ప్రారంభించాలనుకుని డానీ, ఖాదర్ వంటి మిత్రుల సహాయంతో సమీక్ష పత్రిక ప్రారంభించాం. ఆ పత్రిక తొలి సంచికలో పతంజలిగారి రచన ఉండాలని మా కోరిక. ఆయన పోయేకాలం అని ఒక వ్యంగ్య కథ పంపించారు. అప్పుడప్పుడే రామోజీరావు ప్రియ పచ్చళ్ల వ్యాపారం ప్రారంభమయింది. పతంజలిగారి కథ నరమాంసం పచ్చళ్ల వ్యాపారం గురించిన కథ. వ్యంగ్యాన్ని ఆశ్రయించి లోతయిన రాజకీయార్థిక, సామాజిక విశ్లేషణా వ్యాఖ్య చేసిన కథ అది. సమీక్ష రెండు సంచికలతో ఆగిపోయినా ప్రచురించిన విలువైన రచనలలో ఆ కథ ఒకటి.

ఆ రోజుల్లోనే ఉదయం సాహిత్య పేజీలో ఆయన అనుసృజన చేసిన మార్క్ ట్వేన్ కథలు తుంటర్వ్యూ, నా వ్యవసాయపత్రిక హాస్యస్ఫోరకమైన కథలుగా ఎందరినో ఆకర్షించాయి. అవి కేవలం వ్యంగ్య వైభవాన్ని నింపుకున్న కథలు మాత్రమే కాదు. ఆభిజాత్యాలమీద, భేషజాల మీద ఘాటయిన విమర్శలు అవి. అజ్ఞానంతో కూడిన అహంకారాన్ని కత్తితో చీల్చినట్టుగా వెటకరించిన కథలు అవి. పత్రికా రచనమీద, పాత్రికేయ వృత్తి బోలుతనం మీద ఛెళ్లున చరిచిన కొరడాలు అవి. ఆ రెండు అనువాదకథలను కొన్ని వందల మందికి చదివి వినిపించి ఉంటాను.

పది నెలలపాటు సమయంలో సహోద్యోగులుగా ఉన్నా, సమయం రాకుండానే ఆగిపోవడంతో, నేను కొంతకాలం నిరుద్యోగం చేసి చివరికి ఉద్యోగార్థం బెంగళూరు వెళ్లాను. బహుశా పతంజలి పట్ల, ఆయన రచనల పట్ల ఇనుమడించిన గౌరవంతో బెంగళూరు వెళ్లానేమో, బెంగళూరు తొలి జ్ఞాపకాల్లో ఒకటి చూపున్నపాటను ఇంగ్లిషులోకి అనువాదం చెయ్యడం. అది ఎక్కడా అచ్చు కాలేదు గాని, ఆ కథ మీద నా గౌరవాన్ని చూపుకోవడానికే అనువాదం చేసినట్టున్నాను.

అప్పుడే మోహన్ చిరునవ్వు సంచికలు తెచ్చి దాంట్లో గోపాత్రుడు, వీరబొబ్బిలి, పిలక తిరుగుడుపువ్వు, ఒక దెయ్యం ఆత్మకథ ప్రచురించాడు. ఆ మూడు గొలుసు నవలికలు చదివి ఎంత కదిలిపోయానంటే వెంటనే వాటిమీద విశ్లేషణా వ్యాసం ఒకటి రాసి ఆంధ్రప్రభకు పంపాను. ఆ వ్యాసం ఆయనకు నచ్చిందని విని పొంగిపోయాను.

అప్పుడు బెంగళూరు నుంచి వస్తూపోతూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట కలిసేవాళ్లం. అప్పుడే నాకు డయాబెటిస్ ఉందని బయటపడినప్పుడు, ఆయన తన వైద్యంతో అది నయమవుతుందన్నారు. ఎంతో ధైర్యం చెప్పారు. ఒకటి రెండు సార్లు మందులు ఇచ్చారు. ప్రతిరోజూ ఒక అంజూర్ ముక్క తినమని కలిసినప్పుడల్లా చెపుతుండేవారు. వాళ్ల పాపకు కూడ డయబెటిస్ వచ్చినప్పుడు శంకరమఠం ఎదురుసందులో ఇంట్లో తన ఆవేదన నాతో పంచుకున్నారు.   ఆ తర్వాత నేను హైదరాబాదు వచ్చి, అప్పటికి మా గోపీ మరణించి పది సంవత్సరాలయిన సందర్భంగా గోపీ స్మృతి అని ఒక ప్రచురణను ప్రారంభించాలనుకున్నప్పుడు వెంటనే తట్టినది పతంజలి కథల సంపుటమే. ఇలా మీ కథల సంపుటం వేయాలనుకుంటున్నాం అనగానే ఆయన వెంటనే అంగీకరించారు. గోపీ స్మృతి మొదటి ప్రచురణగా చూపున్నపాట పుస్తకం అలా వెలువడింది. చూపున్నపాటకు మోహన్ వన్ అండ్ ఓన్లీ పతంజలి అని ఒక అప్పటికీ ఇప్పటికీ అద్భుతమైన విశ్లేషణాత్మకమైన, అనుభూతి ప్రధానమైన ముందుమాట రాశాడు. 

ఇటు కూర్మనాథ్ ద్వారానో, అటు నందిగం కృష్ణారావు ద్వారానో చాల తరచుగా, చాల ఎక్కువగా సమాచారం అటూ ఇటూ అందుతున్నప్పటికీ గత ఐదారేళ్లుగా ఆయనను కలవడం చాల తగ్గిపోయింది. నువ్వేకాదు వివాదం సందర్భంగా ఫోన్ లో చాల సార్లే మాట్లాడాను గాని, ఆయనతో ఫోన్ సంభాషణ సుదీర్ఘంగా సాగేది కాదు. నువ్వేకాదు మీద పరువు నష్టం దావా వచ్చి, రచయిత మీద ఒక న్యాయమూర్తి అన్యాయమైన వ్యాఖ్యలు చేసి, ‘రచయితలయితే ఎక్కువా? నా ముందు వచ్చి బోనులో నిలబడవలసిందే, క్షమాపణలు చెప్పవలసిందే’ అన్నప్పుడు ఆయనకు రక్షణగా సాహిత్యలోకం నిలవాలనీ, ఇది భావప్రకటనాస్వేచ్ఛమీద దాడేననీ, కాల్పనిక సాహిత్య సృజనకు అవరోధమనీ ప్రకటిస్తూ హైదరాబాదులో విరసం తరఫున ఒక సభ ఏర్పాటు చేశాం. సాహిత్య లోకం నుంచి విస్తృతమైన సంఘీభావం ప్రకటితమైన సభ అది. పతంజలిగారు ఆ సభకు వచ్చారు గాని, వేదిక మీదికి రాలేదు. కనీసం ఒకటి రెండు మాటలు మాట్లాడమన్నా నిరాకరించారు. 

ఒకవైపు అటువంటి వినయం, బిడియం, మరొకవైపు ప్రతిదాన్నీ నిర్మమకారంగా, నిర్దాక్షిణ్యంగా చూసి విమర్శించగలగడం, వెటకరించగలగడం, ప్రతి కన్నీటి చుక్కనూ ఒక చిరునవ్వుగా మార్చగలగడం ఆయన విశాల, నిశిత రచనాశక్తికి చిహ్నాలు. రాజుల లోగిళ్ళ శునకాలకు కూడ ఉండే ఆభిజాత్యాల దగ్గర ప్రారంభించి నల్లకుంట గుడ్డి బిచ్చగాడి పిల్లనగ్రోవిలో కూడ పలికే ఉద్యమగీతాల శక్తి దాకా మనం గుర్తించవలసిన అనేక విషయాలమీద అత్యద్భుతమైన రచనలు చేసిన పతంజలిని తెలుగు సమాజం గుర్తించవలసినంత గుర్తించిందా, గౌరవించవలసినంత గౌరవించిందా అనుమానమే. 

Related Post:

పతంజలి గారూ, ఈ తగువు ఇంకెవరికి చెప్పేది?

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu and tagged , , . Bookmark the permalink.

9 Responses to పతంజలి గారితో మూడు దశాబ్దాలు

 1. హృద్యంగా ఉంది. గొప్పోళ్ళెప్పుడూ గొప్పోళ్ళుగా బతకరేమో. కేవలం మన జ్ఞాకాల్లో,అనుభవాల్లో,పరిచయాల్లో గొప్పోళ్ళుగా మిగిలిపోతారేమో!

 2. ‘నేను రాయకముందే కాలిపోయిన ప్రేమలేఖ’ అన్న ఒక కవి వాక్యం ఎన్నాళ్లుగానో గుర్తుండిపోయింది. విజయనగరం మహరాజా కాలేజీలో పతంజలిగారు మా నాన్నకు బ్యాచ్మేట్. అలా ఆయన గురించిన కబుర్లు చిన్నప్పటి నుంచే వింటూ, కాస్త ఊహ వచ్చాక రచనలు చదువుతూ ఉన్నానేగాని, వ్యక్తిగా ఆయన్ని కలవొచ్చనే ఆలోచనే రాకపోవడం – అజ్ఞానమో, అమాయకత్వమో మరి. పతంజలి భాష్యాన్ని పాఠ్యపుస్తకంలా రోజూ చదివడం తప్ప మరేం చెయ్యగలను? మంచి పోస్టును అందించినందుకు ధన్యవాదాలు.

 3. మనసులో సుడులు తిరిగే దుఖాన్ని తెప్పించినా సరే, మళ్లీ చదివించిన ‘కడలితరగ’ కు కృతజ్ఞతలు. మొన్నమొన్ననే కొత్తగా ప్రచురించిన ‘పతంజలి భాష్యం’ చదువుతుంటే నాకేదో ప్రపంచ సాహిత్యంలో ఉత్తమ సాహిత్యాన్ని చదువుతున్న ఫీలింగ్.

 4. himabindu says:

  7 yeards hyd lo undi, patanjali garini kalisey, telusukuney prayathnam cheyyani naa agnaniki, nirlakshaniki chala sigganipinchindi. sneham patla, snehitula patla meeku sahajamga undey prema gurichi teliyadam vallanemy, prati vakyam hattukuneyla anipinchindi. ee vishayalanni maatho panchukunnanduku dhanyavadalu.
  chala rojula taruvatha blog chadavadaniki prayathnimchi, munduga mee blog ki vochhinapudu, idi chadivinapudu okkosari, entho adbhutamaina vyakuthulu mana madhyaney unna, vaarini telusukuney avakasanni pogottukovadam….entha tappo telusthondi.

  Regards,
  Bindu

 5. chinni says:

  చదివినంతసేపూ చాల భాధగా , మన మధ్య లేరా అన్నది మరొక్కసారి గుర్తుకు వచ్చింది . అమూల్యమైన జ్ఞాపకాలూ .

 6. ఎన్ వేణుగోపాల్ says:

  మిత్రులు
  మహేష్ కుమార్
  అరుణ
  రవికుమార్
  బిందు
  చిన్ని గార్లకు,

  ధన్యవాదాలు. దాదాపు ఏడాదిగా పని ఒత్తిడివల్ల, కారణాంతరాల వల్ల నా బ్లాగ్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడం లేదు. నిజం చెప్పాలంటే నాకు అంత సాంకేతిక పరిజ్ఞానం లేదు. అంతకు ముందు ఆంధ్రజ్యోతి, సూర్య దినపత్రికలలో వారం వారం కాలమ్స్ రాసినప్పుడు ఆ పత్రికలకు పంపేటప్పుడే మిత్రుడు జయప్రకాశ్ కు కూడ పంపేవాణ్ని. తానే అప్ డేట్ చేసేవాడు. ఇప్పుడు ఆ కాలమ్స్ లేకపోవడంతో రాసినవి కూడ తనకు పంపడం లేదు. ఇటీవల నా రచనలు అప్ డేట్ చేస్తానని దిలీప్ అంటే తనకు గత రెండు మూడు నెలల రచనలన్నీ పంపాను. అలా చాల రోజులతర్వాత నా బ్లాగ్ మీద మళ్లీ కదలిక మొదలయింది. ఆ కదలికకు మీ స్పందనలు చూస్తే చాల ఆర్ద్రంగా అనిపించింది. అలా రవరవలాడిన గుండెతో మీ అందరికీ గుండెలోతులనుంచి కృతజ్ఞ్తతలతో ఈ నాలుగు మాటలు.

  – ఎన్ వేణుగోపాల్

 7. పతంజలి కథలు ప్రస్తుతం ఎక్కడా దొరకడం లేదు.. ఈ మధ్యనే ‘పతంజలి భాష్యం’ వచ్చింది.. కథల కోసం ఎదురు చూడొచ్చా?

 8. bhasker.k says:

  dear venu. saw ur kadalitara site. patanjali meeda mee jnapakalu chla aardranga unnayi. nannu kanta tadi pettinchindi. hats off to u. urs bhasker

 9. రాజేంద్రప్రసాద్,ఖమ్మం says:

  “నేను కూడ కోపంతోనే రచన చేస్తాను. కోపం రాకుండా ఉండలేం, రాయలేం. కాని కోపంగా చెప్పేటప్పుడు మన దగ్గర పాయింటు ఉన్నా కూడ బయటివాళ్లు అది గుర్తించరు. వాళ్లకు కోపమే కనబడుతుంది గాని పాయింటు కనబడదు’అన్న విషయం చాలా కరక్టు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s