ఇరాన్ – జయాపజయాల దోబూచులాట

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్ష స్థానానికి జూన్ 12 న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఏడు కోట్ల జనాభాలో నాలుగుకోట్ల అరవైలక్షల మంది వోటర్లుండగా ఎనబై శాతం మంది తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. ఎతెలాఫ్ ఆబాద్ గరాన్ ఎ ఈరాన్ ఎ ఇస్లామీ (ఇస్లామిక్ ఇరాన్ నిర్మాతల ఐక్య వేదిక – ఆబాద్ గరాన్ అని పిలుస్తారు) తరఫున మహ్మూద్ అహ్మదినెజాద్, ఎతెమాద్ ఎ మెల్లి (జాతీయ విశ్వాస పార్టీ) తరఫున మెహ్దీ కర్రౌబీ, స్వతంత్ర అభ్యర్థులుగా మీర్ హొస్సేన్ మౌసవీ, మొహ్సెన్ రెజాయీ పోటీ చేశారు. వీరిలో అహ్మదినెజాద్ గత ఎన్నికలలో, 2005లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనను, రెజాయీని మితవాదులుగా, మౌసవీని, కర్రౌబీని సంస్కరణవాదులుగా పిలవడం పాశ్చాత్య పత్రికలకు అలవాటు. కాని ఇరాన్ వార్తలు చదివేటప్పుడు పాశ్చాత్య పత్రికల కథనాలను ఒకింత అనుమానంతో చూడవలసి ఉంటుంది. ఇరాన్ లో 1979 నుంచీ కొనసాగుతున్న పాలనాపద్ధతిలో అధ్యక్షపదవికి పోటీ చేయాలంటేనే మతపెద్దల రక్షణ సమితి అనుమతి ఉండాలి. ఇవాళ సంస్కరణవాదులుగా అమెరికా, ఇజ్రాయిల్ ప్రభుత్వాలు, పాశ్చాత్య పత్రికలు పిలుస్తున్న వారు కూడ ఇరాన్ ఇస్లామిక్ మత రాజ్యంగా ఉండాలని కోరుకునేవారే.

వోట్ల లెక్కింపు జరిగినతర్వాత అహ్మదినెజాద్ కు 62 శాతం వోట్లు, మౌసవీకి 33 శాతం వోట్లు వచ్చాయని దేశ పాలనా వ్యవహారాలు చూసే అత్యున్నత పాలకమండలి రక్షణ సమితి ప్రకటించింది. ఆరుగురు మతపెద్దలు, ఆరుగురు న్యాయమూర్తులతో కూడిన ఈ పాలకమండలికి అధినాయకుడు అయతొల్లా అల్ ఖామెనీ. కాని ఆ ఎన్నికలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, కావలసిన దానికన్న ఎక్కువ సంఖ్యలో బాలట్ పత్రాలను ముద్రించడం, వోటుముద్రలను తయారు చేయడం జరిగిందనీ, చాల ప్రాంతాలలో ఉన్న వోటర్ల సంఖ్యకన్న ఎక్కువ వోట్లు పడ్డాయనీ, కనుక ఆ ఎన్నికలు చెల్లవనీ మీర్ హొస్సేన్ మౌసవి ఆరోపిస్తున్నారు. తొలుత మౌసవి ఫిర్యాదును అంగీకరించి విచారించిన రక్షణ సమితి ఎన్నికలు సక్రమంగానే జరిగాయని నిర్ధారించింది. మరోపక్క ఫలితాలు వెలువడినప్పటినుంచీ ఇరాన్ రాజధాని టెహరాన్ లోను, ప్రధాన పట్టణాలన్నిటిలోనూ నిరసనలు, ప్రజా ప్రదర్శనలు జరుగుతున్నాయి. నిరసనకారులు వేలాదిగా, లక్షలాదిగా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చేస్తున్నారు. కాల్పులు, అరెస్టులు, పత్రికలమీద సెన్సార్ షిప్, హింసాకాండ చెలరేగుతున్నాయి.
ఇంతవరకే అయితే పెద్దగా చెప్పుకోవలసినది ఏమీ లేదు. మూడో ప్రపంచ దేశాలలో చాల చోట్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ఎన్నికల సరళి, ఎన్నికలలో అక్రమాలు, హింసాకాండ, దక్షిణార్ధగోళపు దేశాల వెనుకబడినతనం గురించి ఉత్తరార్థగోళపు ప్రచార సాధనాల వైఖరులు ఈ విధంగానే ఉంటున్నాయి గనుక ఈ ఆరోపణలకు, నిర్ధారణలకు ఆశ్చర్యపోవలసిందేమీలేదు. కాని ఇరాన్ మీద పాశ్చాత్య ప్రపంచంలో అసాధారణమైన ఆసక్తి కనబడుతోంది. స్వయంగా అమెరికా అధ్యక్షుడి దగ్గరి నుంచి, అమెరికన్, యూరపియన్ పత్రికలలోనూ, ఇంటర్నెట్ మీదా వ్యాఖ్యానించే సాధారణ పౌరులవరకూ ఎందరెందరో ఇటు కొసనుంచి అటు కొసవరకూ ప్రకటించగల అభిప్రాయాలన్నీ ప్రకటిస్తున్నారు. ఒక శిబిరంలోనే పరస్పర వ్యతిరేకమయిన భిన్నాభిప్రాయాలు కూడ వెలువడుతున్నాయి.  

దాదాపు పాశ్చాత్య ప్రపంచ నాయకులందరూ ఎన్నికలలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలను సమర్థిస్తున్నారు. అంతర్జాతీయ పత్రికలు, ఐక్యరాజ్యసమితి, యూరపియన్ యూనియన్, అమెరికా, ఇజ్రాయిల్ ప్రభుత్వాలు ఇరాన్ ఎన్నికలలో అక్రమాలు జరిగాయని భావిస్తున్నాయి. అవి ఇప్పటిదాకా అహ్మదినెజాద్ ను ఎన్నికయిన అధ్యక్షుడిగానే అంగీకరించలేదు. ఇరాన్ లో జరుగుతున్న ప్రజా నిరసన ప్రదర్శనలను సమర్థిస్తున్నాయి. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా ఇరాన్ మీద యుద్ధానికి సన్నద్ధమవుతూ, సాకులు వెతుకుతూ, అహ్మదినెజాద్ మీద వ్యక్తిగతంగా కూడ దాడులు చేస్తున్న అమెరికా పాలకులకు ఈ ఎన్నికల ఫలితాలు, ఆరోపణలు  కొత్త అవకాశమిచ్చాయి.

మరొకవంక, అరబ్ లీగ్ లోని అన్ని దేశాలు, రష్యా, చైనా, బ్రెజిల్, భారత ప్రభుత్వాలు ఈ ఎన్నికల ఫలితాలను ఆహ్వానించాయి. అహ్మదినెజాద్ ను అధ్యక్షుడిగా గుర్తించాయి. ఇరాన్ లో జరుగుతున్న ప్రజాందోళన అంతా నిజమయిన ప్రజాందోళన కాదనీ, కేవలం సంపన్న, మధ్యతరగతి, విద్యావంతుల ఆందోళన అనీ, అమెరికనీకరణ చెందిన వర్గాలు మాత్రమే అహ్మదినెజాద్ ను వ్యతిరేకిస్తున్నాయనీ, సద్దాం హుసేన్ తర్వాత అమెరికాను ఎదిరించి నిలుస్తున్న నాయకుడిగా అహ్మదినెజాద్ ను చూడాలనీ వాదించేవారు కూడ చాలమందే ఉన్నారు.

నిజానికి అమెరికాకూ, ఇరాన్ కూ మధ్య ఘర్షణ కొత్తది కాదు. ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువ చమురు, సహజవాయు నిలువలు ఉన్న దేశాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న దేశంగా, పశ్చిమాసియాలో ప్రభావశీల దేశంగా ఉన్న ఇరాన్ తమ అధీనంలో ఉండాలని అమెరికా పాలకులు ఏడెనిమిది దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ పాత రాజు షా మహమ్మద్ రెజా పహ్లవీ అమెరికా అనుకూల ప్రభుత్వాన్నే నడిపాడు. రాజకీయార్థిక విధానాలలో మాత్రమే కాక, సాంస్కృతిక జీవనంలో కూడ అమెరికా తరహా జీవన విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాడు. “ఇస్లామిక్ మూఢత్వాన్ని” రద్దుచేసి ఆధునికతను ప్రవేశపెట్టిన రాజుగా అమెరికా ఆయనకు పూర్తి మద్దతు తెలిపింది. కాని 1979లో అక్కడ జరిగిన ఇస్లామిక్ విప్లవం రాజును కూలదోసి మతపాలన ప్రారంభించింది. మొదట అయతొల్లా ఖొమేనీ, ప్రస్తుతం ఖామెనీ అక్కడ అత్యున్నత, అంతిమాధికార పాలకులుగా కొనసాగుతూ, తమ కనుసన్నలలోనే పార్లమెంటరీ పాలనను నడుపుతున్నారు.

ఖొమేనీ తరహా ఇస్లామిక్ పాలనలో ఇరాన్ కు అమెరికాతో ఘర్షణ తీవ్రతరమయింది. తన మూర్ఖత్వం వల్లనో, మత ఛాందసం వల్లనో ఖొమేనీ క్రైస్తవ అమెరికన్ పాలకులను, యూదు ఇజ్రాయిలీ పాలకులను ఎదిరించడం ప్రారంభించాడు. పశ్చిమాసియాలో అరబ్ రాజ్యాల పక్కలో బల్లెంగా అమెరికా సృష్టించిన ఇజ్రాయిల్ ను అడుగడుగునా వ్యతిరేకిస్తూ అరబ్ రాజ్యాలకు నాయకత్వం ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఈ మధ్యలో ఇరాక్ తో యుద్ధం చేసినా ఒక ఇస్లామిక్ మత రాజ్యంగా ఇరాన్ అరబ్ దేశాలన్నిటి గౌరవాన్ని పొందింది. ఇటీవల అణ్వాయుధాలను సంతరించుకునే ప్రయత్నంలో అమెరికాతో, ఇజ్రాయిల్ తో వైరం ఎంతగా పెరిగిందో, అరబ్ రాజ్యాలతో స్నేహం అంతగా పెరిగింది. బుష్ పాలనాకాలంలో దాదాపు ప్రతిరోజూ అమెరికా ప్రభుత్వం ఇరాన్ మీద విమర్శలూ ఆరోపణలూ గుప్పిస్తూ వచ్చింది. ఒబామా పాలన ప్రారంభమయినాక ఆ ఉరవడి తగ్గినప్పటికీ, అసలు దృక్పథం ఏమీ మారలేదు. పైగా ఒబామా ప్రభుత్వంలో కూడ ఇజ్రాయిలీ యూదు అనుకూల వర్గాలదే పైచేయి కావడంతో, ఇరాన్ ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ పాత భాషే మొదలయింది. 

ఇరాన్ లో ఎన్నికలలో చాల అక్రమాలు జరిగే ఉండవచ్చు. ప్రస్తుతం నిరసన తెలుపుతున్న ప్రజల ఆలాంక్షలు న్యాయమయివే కావచ్చు. కాని ఇరాన్ కల్లోలంలో అమెరికా, ఇజ్రాయిల్, బ్రిటన్ ల పాత్ర సముచితమైనదేనా అనే ప్రశ్న ముఖ్యంగా ఆలోచించవలసినది. ఇరాన్ ఎన్నికలపైన అమెరికా వ్యాఖ్యలు ఇరాక్ లో జన విధ్వంసక ఆయుధాల ఆరోపణలను గుర్తుకు తెస్తున్నాయి. అహ్మదినెజాద్ పై విమర్శలు సద్దాం హుసేన్ పై జరిగిన దాడులను జ్ఞాపకం చేస్తున్నాయి. మౌసవీ పట్ల, నిరసనకారుల పట్ల ప్రస్తుతం అమెరికా చూపుతున్న ప్రేమ ఏడెనిమిది సంవత్సరాల కింద సద్దాం హుసేన్ వ్యతిరేకులపైన చూపిన ప్రేమను తలపిస్తోంది. అవన్నీ నిజమే అయినా ఒక సర్వ సత్తాక ఇరాన్ పైన ఈ విధంగా దాడి చేయడానికి అమెరికాకు హక్కు లేదు. ఇవాళ్టి మాటలదాడి రేపు ఆయుధాల దాడి కాబోదనే హామీలేదు. ఇరాక్ లో ఆ సాకులతో ప్రవేశించి ఇప్పటికి అమెరికా సైన్యాలు చంపిన ఇరాక్ పౌరుల సంఖ్య పన్నెండు లక్షలకు చేరింది. 
గత ముప్పై సంవత్సరాల మతపాలనలో ఇరాన్ రాజకీయార్థిక, సామాజిక జీవితం ధ్వంసమైపోయిన మాట నిజమే. సాంస్కృతిక జీవనం అతలాకుతలమయిందనే మాట నిజమే. అందువల్ల అసంతృప్తి చెందిన లక్షలాది ప్రజలు ఇవాళ దొరికిన ప్రతి అవకాశాన్నీ వాడుకుని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఆ నిరసనకారులు ప్రస్తుతం మౌసవిని తమ నాయకుడుగా చూపుతుండవచ్చుగాని, అది మౌసవి మీద ప్రేమ ఏమీ కాదు, అమెరికా మీద ప్రేమ అంతకన్నా కాదు. అహ్మదినెజాద్ మీద ఎట్లాగూ వ్యతిరేకత ఉంది. అటువంటి న్యాయమైన ప్రజా నిరసనను తన ప్రయోజనాలకొరకు వాడుకోజూడడమే అమెరికా దుర్మార్గనీతి.

ఎన్నికలలో న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా ఇరాన్ ప్రజలు తేల్చుకుంటారు. ముందు నుయ్యి వెనుక గొయ్యిగా ఉన్నప్పటికీ, పెనం మీద మాడడమో పొయ్యిలో పడిపోవడమో తప్ప మరొక దారి లేనప్పటికీ ఇరాన్ ప్రజల ఆందోళన న్యాయమైనది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

One Response to ఇరాన్ – జయాపజయాల దోబూచులాట

  1. chavakiran says:

    భారత దేశ దృక్కోణం నుండి ఇంకా కొంచెం ఎక్కువగా వ్రాయాల్సింది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s