మంత్రనగరి సరిహద్దులలో

మంత్రనగరి సరిహద్దులలో
కవీ, నీ పాటల్…

హనుమకొండలో 1973లో మొదటిసారి చూసినప్పటినుంచి గుడివాడలో 1981లో చివరిసారి చూసినప్పటిదాకా ఆ తొమ్మిది సంవత్సరాలలో మహాకవి శ్రీశ్రీని అయిదారుసార్లు కొన్నిసార్లు కొంత దగ్గరిగానూ, కొన్నిసార్లు దూరంగానూ చూసి ఉంటాను.

శ్రీశ్రీ గీతాలు చదువుకోవడం, కంఠతాపట్టి గొంతెత్తి చదవడం పదో ఏటికే మొదలయినప్పటికీ ఆయనను మొదటిసారి చూసింది పన్నెండో ఏట. నేను ఏడో తరగతిలో ఉండగా 1973లో హనుమకొండలో విప్లవ రచయితల సంఘం మొదటి సాహిత్య పాఠశాల జరిగింది. అక్టోబర్ 5-7 తేదీల్లో హనుమకొండలో అప్పటి ఎడ్యుకేషన్ కాలెజ్ హాస్టల్లో ఆ సాహిత్య పాఠశాల జరిగింది. ఆ మూడురోజుల్లో రెండోరోజున హనుమకొండ జీవన్ లాల్ గ్రౌండ్స్ లో శ్రీశ్రీ అధ్యక్షుడుగా కవి సమ్మేళనం. అక్కడ శ్రీశ్రీ చదివిన కవిత గాని, చేసిన ఉపన్యాసం గాని గుర్తు లేవు. మూడో రోజు సాయంత్రం ఆ పాఠశాల ప్రాంగణం నుంచి వరంగల్ మహబూబియా స్కూలు మైదానం (వరంగల్ లో హోటల్ వర్కర్ గా పనిచేస్తూ విప్లవోద్యమంలోకి వెళ్లి అమరుడైన జగదీశ్ పేరు మీద ఏర్పాటయిన సభాస్థలి జగదీశ్ నగర్) దాకా జరిగిన ఊరేగింపు ముందర నిలబడి శ్రీశ్రీ ఆ పది కిలోమీటర్లూ పూర్తిగా నడిచాడు.

ఆ సభ అంచున పుస్తకాల దుకాణం దగ్గర కూచుని శ్రీశ్రీ ఉపన్యాసం వినడం ఒక అద్భుతమైన అనుభవం. ముప్పైఆరేళ్ల తర్వాత కూడ అది నిన్ననో మొన్ననో జరిగినట్టుంది. “ఇది మినీ లాంగ్ మార్చ్, ఢిల్లీకి జరపబోయే లాంగ్ మార్చ్ కు సన్నాహం” అన్నాడాయన. జ్వాలాముఖి, త్రిపురనేని మధుసూదనరావు, వరవరరావు, కాశీపతి వంటి ఉత్తేజకరమైన ఉపన్యాసకుల సరసన తక్కుతూ తారుతూ మెల్లగా మాట్లాడే శ్రీశ్రీ మామూలుగానైతే ఆకర్షించడు గాని, ఆరోజు ఆకర్షించాడు. ఆరోజు ఆయన ఉపన్యాసంలో గుర్తున్నవి మూడు విషయాలు: ఒక దూది పులి బొమ్మ పట్టుకువచ్చి వేదికమీదనే ఆ బొమ్మపై నీళ్లు పోసి “మనం తలచుకుంటే ప్రభుత్వం ఇలా చప్పున కూలిపోతుంది” అన్నాడాయన. మీనంబాక్కం విమానాశ్రయంలో పెద్ద విమానాన్ని చూసి ఇంత పెద్ద విమానానికి రంగులు ఎలా వేస్తార్రా అని ఒక అమాయకుడు తోటివాడిని అడిగాడనీ, పక్కవాడు జ్ఞానిలాగా ‘అది పైకి ఎగిరినప్పుడు చిన్నగా పక్షిలా అయిపోతుందిగదా అప్పుడు వేస్తారు’ అని చెప్పాడనీ ఒక జోక్ వినిపించాడు. తన రైలు ప్రయాణంలో గారె తిన్నానని, అందులో మధ్యన కనిష్కుడి నాణెమంత పెద్ద రంధ్రం ఉందనీ మరొక జోకు చెప్పాడు. ఈ జోకుల ద్వారా ఏ విషయం చెప్పాడో కూడ గుర్తు లేదు.
 
ఆ తర్వాత మరింత బాగా గుర్తున్న సందర్భం కడివెండి ప్రయాణం. కడివెండిలో దొడ్డి కొమరయ్య సంస్మరణ సభ, బహుశా 1974 జూలై 4 కావచ్చు.  శ్రీశ్రీ, పత్తిపాటి వెంకటేశ్వర్లు ఉపన్యాసకులు. పలస భిక్షం బృందం గొల్లసుద్దులు. కానూరి వెంకటేశ్వర రావు దళం రాజకీయ వీథిభాగోతం. ఆ వీథిభాగోతంలో పాత్రధారులందరమూ హనుమకొండలో ఎనిమిదో, తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్లలం. శ్రీశ్రీ, కానూరి వెంకటేశ్వరరావులతో కలిసి మేమంతా హనుమకొండ – సూర్యాపేట బస్సు ఎక్కి సీతారాంపురం బస్ స్టాపు దగ్గర దిగాం. అక్కడినుంచి కడివెండికి రెండు కిలోమీటర్లు. శ్రీశ్రీ నడవలేడని ఒక ఎద్దులబండి తెచ్చారు. కాసేపు అందులో కూచునీ, కాసేపు బండి పక్కన నడిచీ కడివెండి చేరాం.

ఆ దారంతా మాకు శ్రీశ్రీ ఏవేవో చెపుతూనే ఉన్నాడు. దాదాపు అరగంట సేపు సాగిన ఆ సంభాషణలో మనసుమీద నిలిచిపోయినది ఆయన గాంధీ గురించి చేసిన వ్యాఖ్య: “మా నాన్నగారికి గాంధీ మీద చాల భక్తి. ఆయన గాంధీగారు విష్ణువు అవతారమే అని నమ్మేవాడు. వాదించేవాడు కూడాను. శ్రీమన్నారాయణమూర్తి జలచరాల్లో, భూచరాల్లో పుట్టాడు. బ్రాహ్మల్లో పుట్టాడు, క్షత్రియుల్లో పుట్టాడు. ఇప్పటిదాకా వైశ్యుల్లో పుట్టలేదు గనుక అందుకోసమే గాంధీ అవతారం ఎత్తాడు అని మానాన్న అభిప్రాయం” అని వాళ్ల నాన్న గురించి చెప్పి “కాని మా ఇంట్లో కక్కసు దొడ్డిని నేను గాంధీనగర్ అంటాను” అని నవ్వించాడు.

సభ సాయంత్రం కాగా మధ్యాహ్నానికే అక్కడికి చేరుకున్న మేం ఆ ఊరంతా తిరిగి చూశాం. ఎక్కడ విసునూరు దొర గడీ ఉండేదో, ఎక్కడ రైతుకూలీల ఊరేగింపు నడిచిందో, ఎక్కడ కాల్పుల్లో దొడ్డి కొమరయ్య చనిపోయాడో విన్నాం. అప్పటికి ఇరవై ఐదు సంవత్సరాల కింద ఆ కాల్పుల్లోనే గాయపడిన దొడ్డి మల్లయ్యతో మాట్లాడాం. అదంతా శ్రీశ్రీ వెంటనడిచిన వందమంది బృందంలో భాగంగా.

ఆ తర్వాత ఒక ఏడాది తిరగకుండానే శ్రీశ్రీని హైదరాబాదులో చూశాను. అప్పటికి కొంచెం కొంచెంగా విషయాలు తెలుస్తున్నాయి. ఒకవైపు రచయితల మీద సికిందరాబాదు కుట్రకేసు పెట్టి, మార్చ్, ఝంఝ, ఇప్పుడువీస్తున్నగాలి వంటి అనేక పుస్తకాలను నిషేధించి ప్రభుత్వం జరుపుతున్న తెలుగు మహాసభలను (1975 ఏప్రిల్) బహిష్కరించాలని శ్రీశ్రీ పిలుపు ఇచ్చాడు. ‘ఓరోరి వెంగళప్పిగా’ అని ముఖ్యమంత్రిని నేరుగా ఉద్దేశించి ఒక పదునైన గీతం రాశాడు. ఆ గీతమూ, తెలుగుమహాసభలను ఎందుకు బహిష్కరించాలో వివరిస్తూ రాసిన వ్యాసమూ కలిపి ఒక ఎనిమిదిపేజీల కరపత్రంగా వరంగల్ విరసం ప్రచురించింది. ఆ కరపత్రాల కట్ట పట్టుకుని ఎన్ కె, నేను హైదరాబాదు వచ్చాం. ఏప్రిల్ 12 న తెలుగు మహాసభల ప్రారంభం. బషీర్ బాగ్ వైపు నుంచి తెలుగుమహాసభల ప్రధానద్వారం ఉండిన లాల్ బహదూర్ స్టేడియం వైపు నడుస్తుండగానే అక్కడ విపరీతంగా పోలీసు బందోబస్తు, గొడవ చూసి నిజాంకాలేజి హాస్టల్ లోకి వెళ్లి పుస్తకాల కట్ట అక్కడపెట్టి ఉట్టి చేతులతో స్టేడియం గేటు వైపు నడిచాం. మేం ఇంకా ఒక వంద అడుగుల దూరంలో ఉండగానే సరిగ్గా గేటు ముందర శ్రీశ్రీ, చెరబండరాజు, నగ్నముని, కాశీపతి, ఎంటిఖాన్, రంగనాథం, వగైరా పన్నెండుమందిని పోలీసులు చుట్టుముట్టి, నినాదాలు ఇస్తున్న శ్రీశ్రీ మీద చెయ్యి చేసుకుని వారిని తోసుకుంటూ పోలీసు కంట్రోలు రూం లోకి తీసుకుపోయారు. అప్పుడు హైదరాబాదులోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్ లో చదువుతుండిన మా అక్కయ్య అరుణ కూడ అలా అరెస్టయి, ఒకరోజంతా శ్రీశ్రీతో పాటు పోలీసు లాకప్ లో గడిపింది. 
అప్పటినుంచి సాయంత్రందాకా ఆందోళనలో గడిచాక, సాయంత్రం వాళ్లందరినీ నారాయణగూడ పోలీసు స్టేషన్ నుంచి విడుదల చేశారు. విడుదలయిన పన్నెండు మందీ, వారికోసం వచ్చిన మరెందరమో ఎదురుగా మూల మీద ఉన్న ఇరానీ హోటల్ లో చాయ్ తాగి, అక్కడ్నించి నాంపల్లి స్టేషన్ రోడ్ లోని అన్నపూర్ణ హోటల్ లో భోజనానికి వెళ్లాం. అప్పుడు ఆయనతో మాట్లాడలేకపోయినా ఐదారు గంటలపాటు కలిసి ఉన్న అనుభూతి.

ఆ తర్వాత ఎమర్జెన్సీ. సెన్సార్ షిప్ ను తప్పించుకుని వెలువడుతుండిన అతి తక్కువ పత్రికల్లో ఒకటిగా ప్రజాతంత్రలో వారం వారం ‘అనంతం’తో, జ్యోతి మాసపత్రికలో ఆయన నిర్వహిస్తుండిన పదబంధ ప్రహేళికతో శ్రీశ్రీతో అనుబంధం కొనసాగుతుండేది.

ఎమర్జెన్సీ తర్వాత దేశంలోనూ రాష్ట్రంలోనూ మొత్తంగానూ, కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగానూ కొనసాగుతుండిన ప్రజాస్వామిక వాతావరణంలో  1979 లో శ్రీశ్రీ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసానికి వచ్చాడు. ఆయన వరవరరావు గారింట్లో ఉన్న ఒకరోజో రెండురోజులో వచ్చీపోయేవారితో ఆయన మాటలు వింటూ, ప్రశ్నలువేస్తూ గడిచాయి. అప్పటికే షష్టిపూర్తి సన్మానసంఘం వేసిన ఐదు సంపుటాలూ నేను నా సొంత కాపీలు సంపాదించుకుని మంచి బైండింగ్ చేయించుకుని ఉన్నాను. వాటిమీద ఆయన ఆటోగ్రాఫులు అడిగాను. ఆ సంపుటాలలో ఆయన ఫొటో మీద 2.1.1970 అని సంతకం అచ్చయి ఉంటుంది. ఆ 1970 సంతకం ఎడమవైపున ఉంటే కుడివైపున మళ్లీ సంతకం చేసి 6.5.79 అని తేదీ వేశాడు. అంతేకాదు, రెండు సంపుటాలలో కొటేషన్లు – ఒక దానిలో తన ఫోటో పైన విప్లవం వర్ధిల్లాలి అనీ, కింద విరసం వర్ధిల్లాలి అనీ, మరొకదానిలో వి హావ్ ఫ్రెండ్స్ ఆలోవర్ ది వరల్డ్ – మావో అనీ – కూడ  రాశాడు. ఒక సంపుటం మీద తెలుగులోనేగాక, ఇంగ్లిషులో, హిందీలో, చైనీస్ లా కనిపించే తెలుగులో సంతకాలు చేశాడు.

ఈమధ్యలో ఆయనను మరి ఒకటి రెండుసార్లు కలవడం జరిగిందిగాని వివరాలు గుర్తు లేవు. ఒక సందర్భం 1975 ఫిబ్రవరి హైదరాబాదులో రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ ఎస్ యు) మొదటి మహాసభలు.  రాంకోఠీలోని సరోజినీదేవి హాలులో జరిగిన ఆ మహాసభలను శ్రీశ్రీ ప్రారంభించాడు. రెండో రోజు జరిగిన ఊరేగింపులో పాల్గొన్నాడు. బహిరంగ సభలో ఉపన్యసించాడు.  మరొక సందర్భం తిరుపతిలో 1979 సెప్టెంబర్ 29-30 తేదీల్లో జరిగిన విరసం ఏడవ మహాసభలు. అక్కడ కవిత్వం మీద జరిగిన చర్చలో పాల్గొన్నాడు. 

ఆయనను చివరిసారి కలిసింది 1981 అక్టోబర్ లో గుడివాడలో జరిగిన విరసం సాహిత్య పాఠశాల సందర్భంగా. ఆ రెండురోజుల సాహిత్య పాఠశాలకు చివరి రోజున మాత్రం ఆయన వచ్చాడు. బహిరంగసభలో కూడ ఉపన్యసించిన గుర్తులేదు గాని, బస్ స్టాండ్ పక్కన ఉన్న హోటల్ గదిలో ఉండి ప్రతినిధుల సమావేశం జరుగుతున్న చోటికి వచ్చి కాసేపు మాట్లాడి వెళ్లిపోయాడు.

శ్రీశ్రీ కవిత్వంతో ప్రభావితులయినవాళ్లు లక్షలాదిగా ఉంటారు. వారిలో కొన్ని వేల మందయినా ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయనను దగ్గరిగానో దూరంగానో చూసే ఉంటారు. ఆయన మరణించి ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి గనుక ఈ తరానికి ఆయనను చూసే అవకాశం కూడ లేదు. నాకు దక్కిన ఆ అద్భుతమైన అవకాశం,  కొద్దికాలానికైనా కొద్దిసార్లయినా
సుఖ దుఃఖాదిక ద్వంద్వాతీతం,
అమోఘ, మగాధ, మచింత్య, మమేయం,
ఏకాంతం, ఏకైకం,
క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం.

మే 29, 2009

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

2 Responses to మంత్రనగరి సరిహద్దులలో

  1. వ్యాసం మొత్తం చదువుతూ, నేను అనుభవిస్తూ వచ్చిన భావన ఆఖరి వాక్యంలో కనిపించింది. “క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం.” శ్రీశ్రీని deify చేస్తే అరాచకంగానీ, మీరు గడిపిన క్షణాల్ని దివ్యానుభవం అంటే నేను అంగీకరించేశాను.

  2. వేణు says:

    శ్రీశ్రీ తో మీ అనుభవాలు మంత్ర నగరి సరిహద్దులను ముట్టినట్టుగా ఎంతో బావున్నాయి. ఇలా మీరు వాటిని పంచుకోవటం అభినందనీయం. కమల్ హాసన్ ‘శ్రీశ్రీ తో తన పరిచయాన్ని’ తన కూతుళ్ళకు వివరిస్తూ ఆ మహాకవిని నేను ‘టచ్ చేశాను తెలుసా?’ అంటూ సగర్వంగా చెప్పుకున్నాడట. అది గుర్తొచ్చింది.
    మద్రాసులో తన ఇల్లు వేలం వేసినప్పుడు తెలుగు ప్రజలు ఒక్కుమ్మడిగా విరాళాలతో ముంచెత్తినపుడు ఆ సమస్య తీరగానే ‘అప్పు తీరిపోయింది, ఇక విరాళాలు వద్దు’ అంటూ హుందాగా ప్రకటించిన వ్యక్తిత్వం శ్రీశ్రీది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s