రాజపక్షె రక్తసిక్త ప్రవచనాలు

విరగబూసిన ఆపిల్ చెట్టు సౌందర్యానికీ
ఇళ్లకు తారుపూసే వాడి ఉపన్యాసాల బీభత్సానికీ
మధ్య నా హృదయం లోలోపల ఘర్షణ
కాని ఆ ఉపన్యాసాలే నాచేత కవిత్వం రాయిస్తాయి

అన్నాడు జర్మన్ మహాకవి బెర్టోల్ట్ బ్రెహ్ట్. నాజీల దుర్మార్గాల మీద రాసిన కవిత్వంలో ఎన్నోచోట్ల హిట్లర్ కు పర్యాయపదంగా ‘ఇళ్లకు తారుపూసేవాడు’ అని వాడేవాడు బ్రెహ్ట్. ఆ కవిత్వం వెలువడి ఏడెనిమిది దశాబ్దాలు దాటినతర్వాత మన కళ్ల ఎదురుగా మరొక హిట్లర్ తిరుగాడుతున్నాడు. పేరుకు శాంతి అహింసల బౌద్ధ మతాన్ని అవలంబిస్తున్నట్టు చెప్పుకునే ఈ ఇరవయొకటో శతాబ్దపు హిట్లర్ రక్తదాహానికి ఇప్పటికి కొన్ని లక్షలమంది శ్రీలంక తమిళులు బలి అయిపోయారు. కాని బ్రెహ్ట్ లో కనబడిన ఆగ్రహంలో వందో వంతయినా ఇవాళ మర్యాదస్తులైన బుద్ధిజీవుల ప్రతిస్పందనలో కనబడడం లేదు. పైగా ఈనాటి మేధావులు కొత్త రక్తపిపాసి ముందర వినయంగా చేతులు కట్టుకుని, ఆ నరహంతకుడి “సాహస” గాథలను తన్మయత్వంతో వింటూ ప్రపంచానికి చెప్పడానికి సాహసిస్తున్నారు.

నిజానికి హిట్లర్, ముస్సోలినీ, ఫ్రాంకో లకు వ్యతిరేకంగా 1930 లలో ఉవ్వెత్తున లేచిన మేధో స్పందన, ప్రజాప్రతిఘటన వంటివి ఇవాళ మరొకసారి రావలసిన అవసరం ఉంది. శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్షె గంభీరంగా ప్రకటిస్తున్న ప్రవచనాలలో ప్రతి అక్షరంలోనూ చిప్పిల్లుతున్న శ్రీలంక తమిళుల నెత్తురు ఇవాళ బుద్ధిజీవుల ధర్మాగ్రహానికి దారితీయవలసి ఉంది. కాని రాజపక్షె అధికారపక్షమయ్యాడు. అధికారంలో ఉన్నవారే, గెలిచినవారే చరిత్ర రాసుకున్నట్టుగా ఆ అధర్మ యుద్ధవీరుడు చరిత్ర రచిస్తున్నాడు. అహంకారంతో ప్రగల్భాలు పలుకుతున్నాడు. తమిళ జాతిమీద, తమిళజాతి ఆకాంక్షలు నెరవేర్చడానికి వీరోచితపోరాటం చేసిన తమిళ పులుల మీద, వాళ్ల పోరాట రూపాల మీద అసందర్భమైన, అనుచితమైన, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. తన గురువులు గోబెల్స్ నూ హిట్లర్ నూ ఆవాహన చేసుకుంటూ పచ్చి అబద్ధాలను పరమసత్యాలుగా ప్రకటిస్తున్నాడు. ఆ అబద్ధాలనూ వ్యాఖ్యలనూ బుద్ధిమంతులైన పత్రికాసంపాదకులు ఆణిముత్యాలుగా స్వీకరించి అక్షరం పొల్లుపోకుండా ప్రకటిస్తున్నారు. ఎల్ టి టి ఇ పోరాట పద్ధతులమీద, ప్రభాకరన్ వ్యవహారసరళి మీద ఎవరికయినా ఎన్ని విమర్శలయినా ఉండవచ్చు. కాని శ్రీలంక తమిళుల ఆత్మగౌరవాన్ని బుగ్గిపాలుచేస్తూ, వాళ్ల నేలమీదనే వాళ్లను రెండోస్థాయి పౌరులుగా మారుస్తూ, అమాయక తమిళ ప్రజానీకాన్ని వేలాదిగా మట్టుబెడుతూ రక్తనదిలో స్నానమాడుతున్న నరహంతకుణ్ని కీర్తించేంతగా దిగజారామా మనం? మన మానవత్వం అంతగా కనుమరుగైపోయిందా? ఒకపక్షం మీద మనకు వ్యతిరేకత ఉండవచ్చు గాని ఆ వ్యతిరేకత అవతలిపక్షం దుర్మార్గాలను సమర్థించే దగ్గరికి మనను తీసుకుపోతున్నదా? ఎక్కడినుంచి ఎక్కడికి పోతున్నాం మనం?

శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్షె తో ఒక భారత జాతీయ పత్రిక సంపాదక యజమాని సుదీర్ఘ, ఆంతరంగిక, సన్నిహిత సంభాషణ జరిపి, మూడు రోజులపాటు ఆ వికటాట్టహాసాలను ప్రకటించిన తర్వాత కలిగిన ఆగ్రహంతో రాస్తున్నానిది. నిజానికి ఆ పత్రిక తనను తాను జాతీయ దినపత్రిక అని చెప్పుకుంటుంది గాని, తమిళ జాతి దినపత్రిక అని చాలమంది పరిహాసమాడేవాళ్లు. ఇప్పుడది శ్రీలంక తమిళుల ఊచకోతను నిస్సిగ్గుగా సమర్థిస్తూ తాను తమిళుల పత్రికను కూడ కాదని చూపుకుంటున్నది. అదేసమయంలో ఆసేతుహిమాచలం ఎక్కడెక్కడ ప్రజల ఆకాంక్షల వ్యక్తీకరణ ఉద్యమాలు సాగినా వ్యతిరేకిస్తూ తానసలు పాలకవర్గాల పత్రికననీ, ప్రజల పత్రికను కాననీ కూడ చెప్పుకుంటున్నది.

సరే, న్యాయమైన ఆకాంక్షలతో మూడు దశాబ్దాలపాటు సాగి ఓడిపోయిన ధర్మపక్షం గురించి రాజపక్షం ఏమంటున్నది?

శ్రీలంక తమిళజాతి మనసును ఏ సమస్యలు అల్లకల్లోలం చేశాయో, ఆ సమస్యల పరిష్కారానికి దశాబ్దాలపాటు సాగిన తమిళుల శాంతియుత ప్రయత్నాలమీద సింహళ జాత్యహంకారులూ ప్రభుత్వాలూ ఎంత హింసాకాండను అమలు చేశాయో, చిట్టచివరికి తమిళులు సాయుధపోరాట మార్గాన్ని ఎంచుకుని ఎందుకొరకు పోరాడవలసి వచ్చిందో మాట మాత్రం ఎత్తకుండా ఎల్ టి టి ఇ దుర్మార్గాల గురించి రాజపక్షె మాట్లాడుతున్నాడు. కాల్పుల విరమణ ఒప్పందాలను శ్రీలంక ప్రభుత్వాలు ఎలా ఉల్లంఘించాయో వివరించకుండా ఎల్ టి టి ఇ ఉల్లంఘనల గురించి మాత్రం మాట్లాడుతున్నాడు. దశాబ్దాలుగా సింహళీయులు, శ్రీలంక సైనికులు సాగించిన అకృత్యాల ఊసు లేకుండా, టైగర్ల అక్రమాల గురించి మాట్లాడుతున్నాడు. “మా సైనిక బలగాలకు తగిన ఆదేశాలిస్తే, వారు అడిగినవన్నీ ఇస్తే వారు ఎల్ టి టి ఇ ని ఓడించగలరని నాకు నమ్మకమే. ఎందుకంటే ఎల్ టి టి ఇ తనగురించి తాను చేసుకుంటున్న ప్రచారం వాస్తవం కాదు. ఐతే ఒక రకంగా మేం పొరపాటు పడ్డాం. వాళ్ల దగ్గర సంఖ్యా బలం ఉంది. వాళ్ల దగ్గర ఆయుధ సంపత్తి ఉంది. వాళ్లు కేవలం శ్రీలంక మీద మాత్రమే కాదు, దక్షిణ భారతం మీద కూడ దాడి చేసేవారు. వాళ్లు పోగుచేసిన ఆయుధాలు శ్రీలంకకు మాత్రమే సరిపోయేవి కావు” అని పచ్చి అబద్ధాలు చెపుతున్నాడు. టైగర్లు బలవంతాన తమలో చేర్చుకుంటారనే భయంతో, తప్పించుకునే సాకు కోసం ఒక తమిళ బాలిక ఎప్పుడూ గర్భంతో ఉండేదని, అలా పందొమ్మిదేళ్లకే ఏడుగురు బిడ్డల తల్లి అయిందని ఒక కట్టుకథ చెప్పాడు.

తమ సేనలు ఎల్ టి టి ఇ బలగాలను ఒక మూలకు ఎలా నెట్టాయో, అక్కడినుంచి వాళ్లు ఓడిపోక తప్పని స్థితి ఎలావచ్చిందో విజయగర్వంతో వివరించాడు. అంతా తాము వేసిన పథకం ప్రకారమే జరిగిందని రక్తపు తేన్పులతో ప్రకటించాడు. అసలు ప్రభాకరన్ ఎందుకు సాంప్రదాయిక స్థిర యుద్ధం చేశాడో తనకు అర్థం కావడం లేదని, తానే ప్రభాకరన్ నైతే వెంటనే అజ్ఞాతవాసానికి వెళ్లి గెరిల్లాయుద్ధం సాగించి ఉండేవాడినని ప్రగల్భాలు పలికాడు.

శరణార్థి శిబిరాలు స్వర్గతుల్యంగా ఉన్నాయని నమ్మబలికాడు. కాని ఇప్పటికి ఏర్పాటు చేసిన 40 శరణార్థి శిబిరాలలో ఉన్నవారికి ఎటువంటి కనీస సౌకర్యాలు అందడంలేదని పరిశీలకులు రాస్తున్నారు. చుట్టూ ముళ్ల కంచెలతో నిర్మాణమైన ఈ శిబిరాలు నాజీల నిర్బంధ శిబిరాలతో సమానంగా ఉన్నాయని అంటున్నారు. ఈ శిబిరాలలో ఉన్నవారిని నిశితంగా పరిశీలించినతర్వాతనే పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం అంటున్నది గాని ఈ పరిశీలన అంటే ప్రతి ఒక్కరినీ వారి ఎల్ టి టి ఇ సంబంధాల గురించి పరీక్షించడమే. ఈలం పాలనలో తమిళులలో ప్రతిఒక్కరికీ ఎల్ టి టి ఇ తో ఏదో ఒక రకమైన సంబంధం ఉన్నది కనుక వారిని ఏరి చంపివేస్తున్నారు. ఎల్ టి టి ఇ సైనికులుగా గుర్తించబడినవారిని యుద్ధఖైదీలుగా పరిగణించాలనీ, అంతర్జాతీయ పర్యవేక్షకుల సమక్షంలోనే వారిని విచారించాలనీ అంతర్జాతీయ సంస్థలు అడుగుతున్నప్పటికీ రాజపక్షె ఆ అభ్యర్థనలను ఖాతరు చేయడంలేదు.

గడిచిన ఆరునెలలలో ముప్పైవేలమంది తమిళులను శ్రీలంక సైనికులు చంపివేశారని ఒక అంచనా. ఒక్క మే 17ననే పదివేలమంది తమిళుల ఊచకోత జరిగిందని తమిళులపట్ల సానుభూతి ఉన్న సింహళ వామపక్ష మేధావి బ్రియాన్ సెనెవిరత్నె రాస్తున్నారు. గత సెప్టెంబర్ లో ఐక్యరాజ్యసమితి సిబ్బందితో సహా పరిశీలకులందరినీ శ్రీలంక ఉత్తర ప్రాంతం నుంచి బైటికి పంపించివేసి, సాక్షులెవరూ లేకుండా చేసిన తర్వాత ఈ జాతి హననకాండ పెద్ద ఎత్తున సాగుతోందని సెనెవిరత్నె అంటున్నారు. వందలాదిమంది తమిళ స్త్రీలపైన, బాలికల పైన అత్యాచారాలు జరుగుతున్నాయని, బలవంతపు గర్భస్రావాలు చేయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని, స్వతంత్ర పరిశీలకులు లేనందువల్ల ఈ ఆరోపణల నిజానిజాలు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉందని సెనెవిరత్నె రాశారు.

ఇక దేశంలో తమిళ అనుకూల పత్రికా రంగం అలా ఉంచి, స్వతంత్ర పత్రికా రంగాన్ని కూడ రాజపక్షె బతికి బట్టకట్టనివ్వలేదు. ఎందరో పాత్రికేయులు హత్యకు గురయ్యారు. నంబర్ లేని తెల్ల వాహనాలు వచ్చి ఎత్తుకుపోయిన పాత్రికేయులు మాయమయిపోయారు. వందలాది మంది పాత్రికేయులమీద హత్యాప్రయత్నాలు, బెదిరింపులు జరిగాయి. భావప్రకటనాస్వేచ్ఛ, పత్రికా స్వాతంత్ర్యాల స్థితి గురించి అంతర్జాతీయ సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ 173 దేశాల జాబితా తయారుచేస్తే, శ్రీలంక 165 వ స్థానంలో ఉంది.

శ్రీలంకలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘన గురించి ఇటీవల బ్రిటిష్ ప్రభుత్వం కూడ ఆందోళన వ్యక్తం చేసింది. పందొమ్మిదో శతాబ్దంలో బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం శ్రీలంకలో సాగించిన అకృత్యాలను గుర్తుచేస్తూ ‘మీరా మాకు చెప్పేది’ అని ప్రశ్నించాడు రాజపక్షె.

ఔను, శతాబ్దాలపాటు అటువంటి దుర్మార్గాలే చేసిన వలసవాదులకు అలా ప్రశ్నించే హక్కులేకపోవచ్చు. కాని ప్రజలకు ఆ హక్కు తప్పకుండా ఉంది. అందుకే సెల్వరాస పద్మనాథన్ అధినేతగా పునర్నిర్మాణమైన ఎల్ టి టి ఇ ‘తమ న్యాయమైన హక్కులకోసం లేచి నిలిచి పోరాడడం తమిళుల చారిత్రక కర్తవ్యం’ అని ప్రకటించింది. జరిగిన అపారమైన, సవరించలేని నష్టాలను దృష్టిలో ఉంచుకుని తమ పోరాట రూపాలను, వ్యూహాలను పరిస్థితికి తగినట్టుగా మార్చుకుంటామని ప్రకటించింది. తాత్కాలికంగా అధర్మ రాజపక్షాలు ఊచకోతలూ సాగించవచ్చు, సమర్థనలూ చెప్పుకోవచ్చు. కాని అంతిమంగా బుద్ధుడే చెప్పినటు ధమ్మం శరణం గచ్ఛామి.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Ee Bhoomi, Telugu. Bookmark the permalink.

One Response to రాజపక్షె రక్తసిక్త ప్రవచనాలు

 1. raman says:

  well said sir
  as dravidiens, doesn’t have to be tamil speaking, we all have to hang ourselves for being the witness to the ethnic cleansing and massacre of innocent tamilians in srilanka.
  the political parties in Tamilandu sold their ‘souls’ for few berths in the congress govt. in delhi.
  The Italian Mafia has took its revenge for the killing of Rajiv gandhi, the ‘impotent’ PM the country ever had, thru Rajpakse.
  He shot two birds at one shot, one way cleansing the tamils in srilanka and also getting aid to the tune tune of millions of dollers from india. ( we’ll never know what else he was offered)This act is nothing short of a “SUPARI KILLING”, with which we are femilier with.
  Hope you have noticed the timing of it, just before the Indian elections, Congree party had doubt about coming back to power in Delhi so they wanted to finish it before the election results and they finally did it.
  When We Indians and Tamilians could not defend our brothers in Srilanka, it is too much expecting any support for them from an Italian.
  Long live Prabhakaran,The ‘CHE’ of Tamilians.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s