రాజకీయ చదరంగంలో బలోచీల స్వేచ్ఛాకాంక్ష

ఇరుగుపొరుగు దేశాల ప్రభుత్వాధినేతలిద్దరు విడుదలచేసిన సంయుక్త ప్రకటనలోని పదహారు పదాల చిన్న వాక్యం ఒకటి వారాల తరబడి చర్చకూ రచ్చకూ పార్లమెంటు సమావేశాల వాయిదాలకూ ఉద్రిక్తతలకూ దారి తీయగలదా? ఆ రెండు దేశాల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉన్నప్పుడు అది సాధ్యం కావచ్చు. లేదా ఆ రెండు దేశాల నాయకులూ తమ ప్రజలు నిత్యజీవిత జీవన్మరణ సమస్యలమీద ఆలోచించగూడదని ఉద్దేశ్యపూర్వకంగానే అటువంటి ఉద్రిక్తతను రెచ్చగొట్టినపుడూ ఆలా జరగవచ్చు. చొక్కా మీద పురుగు తిరుగుతోందనో, పక్కన పదిరూపాయలు పడిపోయాయనో దృష్టి మరల్చి లక్షల రూపాయలు కొల్లగొట్టుకుపోయేవారి ఉదంతాలు వింటూనే ఉంటాం. ఇది కూడ అటువంటి సందర్భమే. కాకపోతే అనాలోచితమైనవిగా, అలవోకగా కనిపించే మాటలూ, చేతలూ అతి గంభీరమైన అంతర్జాతీయ సంబంధాలలోకి ఎలా ప్రవేశిస్తున్నాయో తెలియజెప్పే ఉదంతమిది.

ఈజిప్ట్ లోని సినా ద్వీపకల్పం దక్షిణ కొసన ఎర్ర సముద్ర తీరాన షర్మ్ అల్ షేక్ అని ఒక నగరం ఉంది. ఆ నగరం మీద ఆధిపత్యం కోసం గత యాభై సంవత్సరాలలో ఇజ్రాయిల్, ఈజిప్ట్ ల మధ్య ఎన్నో యుద్ధాలు, ఘర్షణలు జరిగాయి గాని చివరికి ఇరుదేశాలమధ్య 1979లో కుదిరిన శాంతి ఒప్పందం ఫలితంగా ఆ నగరం ఈజిప్ట్ పాలనలోకి వచ్చింది. అక్కడ జరిగిన అనేక అంతర్జాతీయ శాంతి సమావేశాల వల్ల, ఒప్పందాల వల్ల ఆ నగరానికి శాంతినగరం అనేపేరు స్థిరపడిపోయింది. ప్రస్తుత అశాంతికారక ప్రకటనకు ఆ శాంతి నగరమే వేదిక.

ఆ నగరంలో జరిగిన పదిహేనవ అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా భారత ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీ కలుసుకున్నారు. చర్చలు జరిపారు. ఆ చర్చల తర్వాత జూలై 16న ఒక సంయుక్త ప్రకటన వెలువరించారు. దేశాధినేతలు సమావేశం కావడం, సంబంధిత రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, దౌత్య వ్యవహారాలపైన సంయుక్త ప్రకటనలు వెలువరించడం కొత్త విషయమేమీ కాదు. భారత పాకిస్తాన్ ప్రధానుల సమావేశం కూడ ఇది మొదటిదీ కాదు, చివరిదీ కాబోదు. కాని ఈసారి మాత్రం ఆ సమావేశ సంయుక్త ప్రకటన పెద్ద ఎత్తున సంచలనానికి కారణమయింది. ఐదువారాలు గడిచినా ఆ దుమారం సమసిపోవడంలేదు. ఇరవై వాక్యాల ప్రకటన అది. ఆ ప్రకటనలో అభివృద్ధి గురించీ, పేదరిక నిర్మూలన గురించీ, ద్వైపాక్షిక సంబంధాల గురించీ మామూలు మొక్కుబడి విషయాలు కొన్ని ఉన్నాయిగాని, ప్రధానంగా ఆ ప్రకటన ఇరుదేశాలూ అనుభవిస్తున్న తీవ్రవాద సమస్య మీద దృష్టి కేంద్రీకరించింది. తీవ్రవాద సమస్యను పరిష్కరించుకోవడానికి ఇరుదేశాలూ ఒకరికొకరు సహాయం చేసుకోవలసిన అవసరం గురించి ప్రకటించింది. ఆ వరుసలోనే ఒక వాక్యంలో ‘బలోచిస్తాన్, తదితర ప్రాంతాలలో సమస్య గురించి పాకిస్తాన్ దగ్గర కొంత సమాచారం ఉన్నదని ప్రధానమంత్రి గిలానీ ప్రస్తావించారు’ అని ఉంది. ఆ వాక్యమే ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నది. బలోచిస్తాన్ లో సమస్యకు ఆజ్యం పోస్తున్నది భారత ప్రభుత్వమేనని పాకిస్తాన్ చాల కాలంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో, సంయుక్త ప్రకటనలో ఈ వాక్యానికి రాగల అర్థం ఒకటే: ‘మీ జోక్యం గురించి మాదగ్గర సమాచారం ఉంది సుమా’ అని.
ఆ సంయుక్త ప్రకటనమీద, అందులో బలూచిస్తాన్ ప్రస్తావన మీద భారత పార్లమెంటులో పెద్ద రగడ జరిగింది. లోకసభలోనూ, రాజ్యసభలోనూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రకటనద్వారా దేశ ప్రయోజనాలను ప్రభుత్వం బలిపెట్టిందని భారతీయ జనతాపార్టీ విరుచుకుపడింది. ఈ ప్రకటన వల్ల పాకిస్తాన్ ఇన్నాళ్లుగా చేస్తున్న ఆరోపణలలో నిజం ఉందనే అనుమానానికి భారత ప్రభుత్వం అవకాశమిచ్చిందనీ, ఈ అవమానం ఏడేడు సముద్రాలతో కడిగినా పోదనీ భాజపా నాయకులు అన్నారు. పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దులలో సాగుతున్న బలోచీ తీవ్రవాదాన్ని అణచివేసే ప్రయత్నంలో ఉన్న అమెరికాను సంతృప్తి పరచడం కోసమే ఈ సంయుక్త ప్రకటన వెలువడిందని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆరోపించింది.

ప్రతిపక్షాల విమర్శలు ఇలా ఉండగా భారత ప్రభుత్వ అధికారిక స్పందన గందరగోళంగా, సమన్వయంలేకుండా, అస్పష్టంగా సాగింది. ఇతర విషయాలేమీ ఎత్తకుండా, తనకు పాకిస్తాన్ ప్రధాని ఆ సమాచారమేదీ ఇవ్వలేదని మాత్రమే మన్మోహన్ సింగ్ జవాబిచ్చారు. ‘పాకిస్తాన్ ఆంతరంగిక వ్యవహారాలలో మాజోక్యం లేదు. బలోచిస్తాన్ తీవ్రవాదులకు మేం సహాయం అందించడంలేదు’ అని హోం శాఖ మంత్రి చిదంబరం అన్నారు. ఆ సంయుక్త ప్రకటన అంత పవిత్రమైనదేమీ కాదని, దానికి కట్టుబడి ఉండనవసరం లేదని విదేశీ వ్యవహారాల సహాయమంత్రి శశి థరూర్ వ్యాఖ్యానించారు. ఆ సంయుక్త ప్రకటన రచన సరిగా లేదని స్వయంగా విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శివశంకర్ మీనన్ ఒప్పుకున్నారు. మరొకపక్క ‘కాశ్మీర్ లోని తిరుగుబాటు బృందాలకు పాకిస్తాన్ సహాయం అందిస్తున్నప్పుడు మాకు భారత్ ఎందుకు సహాయపడగూడదు” అని బలోచిస్తాన్ జాతి ఉద్యమ నాయకుడు వహీద్ బలోచి అన్నారు.
ఈ భారత – పాకిస్తాన్ వివాదాలు ఎలా ఉన్నా అసలు ప్రస్తావనకు వచ్చిన బలోచిస్తాన్ సమస్య ఏమిటి? ప్రధానంగా బలోచీ భాష మాట్లాడే బలూచ్ జాతి ఇవాళ్టి పాకిస్తాన్, ఇరాన్, అప్ఘనిస్తాన్ సరిహద్దులతో ముక్కలయిన కొండజాతి. అప్ఘనిస్తాన్ తో యుద్ధం తర్వాత బ్రిటిష్ పాలకులు 1893లో గీసిన దురాండ్ రేఖ ఈ జాతి నివసించే భూభాగాన్ని ముక్కలు చేసి వారిని విడదీసింది. ఆతర్వాత ఒకటి రెండు దశాబ్దాలలోనే బలోచ్ జాతి స్వేచ్ఛాకాంక్ష, జాతీయవాదం మొదలయ్యాయని చరిత్రకారులు గుర్తిస్తున్నారు. భారత స్వాతంత్ర్య ప్రకటన సమయంలో, భారత ఉపఖండంలోని ప్రజలు/సంస్థానాలు అటు పాకిస్తాన్ లో కాని, ఇటు భారతదేశంలో కాని విలీనం కావచ్చునని, లేదా స్వతంత్రంగా ఉండిపోవచ్చునని మౌంట్ బాటన్ ప్రకటించిన త్రిసూత్ర పథకం బలోచ్ జాతీయవాదాన్ని మరొకసారి వేదిక మీదికి తీసుకువచ్చింది. బలోచిస్తాన్ లో భాగమైన కలత్ సంస్థాన పాలకుడు అహ్మద్ యార్ ఖాన్ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు. అప్పటికి యథాతథ ఒడంబడిక కుదుర్చుకున్న పాకిస్తాన్ ప్రభుత్వం 1948 మార్చ్ 27 న కలత్ పై సైనికచర్య జరిపి, ఖాన్ తో విలీన ఒప్పందం పై బలవంతాన సంతకం చేయించుకుంది. విలీనానికి వ్యతిరేకంగా ఖాన్ సోదరుడు అబ్దుల్ కరీం 1948 జూలైలో సాయుధ పోరాటం ప్రారంభించాడు.

అప్పటినుంచీ పాకిస్తాన్ పాలనను వ్యతిరేకిస్తూ, స్వాతంత్ర్యం కోసం బలూచ్ జాతి ఎవరో ఒకరి నాయకత్వాన పోరాడుతూనే ఉంది. గత అరవై సంవత్సరాలలో కనీసం నాలుగు సార్లు – 1948, 1958, 1962, 1973-77 – ఆ పోరాటం ఉధృతంగా, హింసాత్మకంగా సాగింది. ఆ చివరిపోరులో భయంకరమైన అణచివేతను చవిచూసిన బలోచ్ జాతి ఉద్యమకారులు, 1980ల తర్వాత పునస్సంఘటితమై బలోచిస్తాన్ విమోచన సైన్యం, బలోచ్ జాతీయ పార్టీ, బలోచిస్తాన్ విద్యార్థి సంఘం నేతృత్వంలో అవిరామంగా పోరాడుతున్నారు. ఈ ఉద్యమం మీద 2005 డిసెంబర్ లో పాకిస్తాన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున విరుచుకుపడి ఆరునెలలలోనే 900 మందిని చంపేశారు, 450 మందిని మాయం చేశారు, నాలుగువేలమందిని అరెస్టు చేశారు. లక్షన్నర మందిని నిరాశ్రయులను చేశారు. అయినా ఆ పోరాటం ఇంకా సాగుతూనే ఉంది.

పాకిస్తాన్ లో ఒక రాష్ట్రంగా బలోచిస్తాన్ ఆ దేశ విస్తీర్ణంలో సగభాగాన్ని ఆక్రమించినా, జనాభాలో మాత్రం ఐదు శాతానికే ఆశ్రయమిస్తోంది. అంటే అది పెద్దగా జనావాసానికి అనుకూలమయిన ప్రాంతం కాదు. కాని అక్కడ విస్తృతంగా చమురు, సహజవాయువు, రాగి వంటి సహజ సంపదలు ఉన్నందువల్ల ఆ ప్రాంతాన్ని వదులుకోవడం పాకిస్తాన్ ఆర్థిక ప్రయోజనాలకు భంగకరం. అది భౌగోళికంగా, వ్యూహాత్మకంగా కీలకమైన ఇరాన్ కు, అప్ఘనిస్తాన్ కు పొరుగున ఉండడం వల్ల పాకిస్తాన్ కు గాని, అమెరికాకు గాని ఆ ప్రాంతం తమ చెప్పుచేతల్లోనే ఉండాలని బలంగా ఉంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ బలోచిస్తాన్ స్వాతంత్ర్యానికి అంగీకరించగూడదని పాకిస్తాన్, అమెరికాలు అనుకుంటున్నాయి. అందువల్లనే బలోచ్ జాతి ఉద్యమకారుల మీద తీవ్రవాదులుగా ముద్రవేసి, నిషేధించి, అమానుషమైన అణచివేత చర్యలు చేపడుతున్నాయి.

ఇటువంటి న్యాయమైన ప్రజాఉద్యమాన్ని సమర్థించే నైతిక అర్హత భారత ప్రభుత్వానికి ఉందా అనే ప్రశ్న ఎలా ఉన్నా, శత్రువుకు శత్రువు మిత్రుడు అనే రాజకీయ ఎత్తుగడతో భారత ప్రభుత్వం బలోచ్ ఉద్యమకారులను సమర్థిస్తూనే ఉంది. సిఐఎ, కెజిబి వంటి జోక్యందారీ సంస్థలను అనుకరిస్తూ తయారయిన రిసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) బలోచిస్తాన్ లో ఐదువేలమంది ఏజెంట్లను ప్రవేశ పెట్టిందని పాకిస్తాన్ చాలకాలంగా ఆరోపిస్తోంది. ఇప్పుడు సంయుక్త ప్రకటన ఆ ఆరోపణను నిర్ధారిస్తుందేమోననే ఆందోళనే తప్ప ప్రస్తుతం జరుగుతున్న గందరగోళంలో బలోచీల స్వాతంత్ర్యాకాంక్ష, వారిమీద జరుగుతున్న దమనకాండ మరుగున పడిపోతున్నాయి.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Ee Bhoomi, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s