ఇరుగుపొరుగుతో ఎందుకీ యుద్ధోత్సాహం?

ఇరుగుపొరుగుదేశాలతో యుద్ధం జరపాలని నిర్ణయాలు తీసుకునేవాళ్లు, యుద్ధం జరగాలని కోరుకునేవాళ్లు, యుద్ధానికి ఆయుధ సంపత్తి సమకూర్చేవాళ్లు, యుద్ధాన్ని సమర్థిస్తూ, యుద్ధానికి కారణాలు చూపిస్తూ వాదనలు చేసేవాళ్ళు చాలమందే ఉంటారు. కాని వాళ్లు ఎప్పుడూ ఎక్కడా ఏయుద్ధంలోనూ పాల్గొన్న దాఖలాలు లేవు. వాళ్లో, వాళ్ల కుటుంబ సభ్యులో మరణించడం గురించీ, నష్టపోవడం గురించీ ప్రశ్నించవలసిన అవసరమే లేదు. ఎవరో ఎక్కడో ఏ కారణం వల్లనో ఏ స్వలాభం కోసమో యుద్ధం జరపాలని నిర్ణయం తీసుకుంటే అందులో మరణించేది అటయినా ఇటయినా పొట్టకూటికోసం సైనికులుగా ఉద్యోగాలు చేసేవాళ్లు. నష్టపోయేది అతి సాధారణ ప్రజలు. ధ్వంసమైపోయేది సమాజసంపద. ఇంతకూ ఆ యుద్ధం సాధారణంగా అబద్ధాలమీద ఆధారపడి ఉంటుంది. చరిత్రపొడవునా కట్టెదుట ఈ కఠినవాస్తవం కనబడుతున్నా మన మధ్యతరగతి ఆలోచనాపరులకు, పత్రికాపాఠకులకు పొరుగుదేశంతో యుద్ధం అనగానే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. గజ్జెల మల్లారెడ్డి చెప్పినట్టు భక్తిరసం కాదుగాని, దేశభక్తిరసం తెప్పలుగా పారుతుంది. డ్రైనేజీ స్కీములేక డేంజరుగా మారుతుంది.

ఇప్పుడు అటు చైనాతోనూ, ఇటు పాకిస్తాన్ తోనూ కూడ సరిహద్దులలో నెలకొన్నదని చెపుతున్న స్థితి సరిగ్గా ఈ వాతావరణాన్నే కల్పిస్తున్నది. అసలు ఆ స్థితి ఉన్నమాట నిజమేనా, లేకపోతే ఆ స్థితి ఉన్నదని చెపుతున్నవాళ్లు ఏ అవసరం కోసం చెపుతున్నారు, ఒకవేళ ఆ స్థితి ఉంటే దానితో వ్యవహరించడానికి యుద్ధమే ఏకైక మార్గమా, ఇతర సామరస్యపూర్వకమైన, దౌత్యపరమైన చర్చలు, చర్యలు సాధ్యం కాదా లాంటి అనేక ప్రశ్నలు వేయవలసి ఉంది. ఇవాళ్టి ఘర్షణామయ స్థితి నెలకొనడానికి చరిత్రలో ఇరుదేశాల ప్రభుత్వాల పాత్ర ఎంత, వలసవాద పాలకుల పాత్ర ఎంత వంటి అంశాలు కూడ ఆలోచించవలసి ఉంది.

చైనా సైనికులు అరుణాచలప్రదేశ్ లోకీ, సిక్కింలోకీ, లడాఖ్ లోకీ చొచ్చుకువస్తున్నారని, మెక్ మోహన్ రేఖనూ, వాస్తవాధీన రేఖనూ దాటి ఈ చొరబాట్లు, అడపాదడపా కాల్పులు సాగుతున్నాయనీ భారతీయ పత్రికలలో కొద్దికాలంగా వార్తల హోరు పెరిగింది. భారత ప్రభుత్వమే వాస్తవాధీన రేఖను దాటి తన సైనిక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నదనీ, ఇది 1993 చైనా – భారత ఒప్పందానికి ఉల్లంఘన అనీ అటు చైనా ప్రభుత్వం వాదిస్తోంది. 1962 భారత – చైనా యుద్ధం మీద ప్రామాణిక గ్రంథం రాసిన నెవిల్ మాక్స్ వెల్ వంటి స్వతంత్ర పరిశీలకులు కూడ చైనా వాదనను సమర్థిస్తున్నారు.

నిజానికి ఇరుదేశాల సరిహద్దు ఘర్షణల వార్తలలో నమ్మదగినవెన్నో, స్వార్థ ప్రయోజక శక్తుల కల్పనలెన్నో ఎవరూ చెప్పలేరు. సాధారణంగా రెండు దేశాల సరిహద్దు ప్రాంతాలు పూర్తిగా సైనిక అధీనంలో ఉంటాయి. అక్కడ ఏమి జరుగుతున్నదో సైనికాధికారులు అధికారికంగా చేసే ప్రకటనలు తప్ప స్వతంత్రంగా నిర్ధారించుకునే అవకాశం ఉండదు. అందులోనూ భారతదేశానికి పొరుగుదేశాలతో సరిహద్దులు నిర్జనమైన హిమాలయ పర్వత శ్రేణులలో ఉన్నాయి గనుక అక్కడ నిజానిజాలు నిష్పక్షపాతంగా తేల్చుకోగలిగిన అవకాశమే లేదు.

ఇటువంటి, నిర్ధారించుకోవడానికి అవకాశాలు లేని, లేదా అవకాశాలు తక్కువగా ఉన్న చోట్ల స్వప్రయోజనపరుల ప్రచారాలకు ప్రాధాన్యత వస్తుంది. ఇంగ్లిషు సామెత చెప్పినట్టు ‘సంక్షుభిత జలాలలో చేపలు పట్టడానికి’ అవకాశం ఎక్కువ. ఇరుగుపొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతూ, తద్వారా కృత్రిమ దేశభక్తిని రెచ్చగొట్టి దేశప్రజలను తమ నిజమైన సమస్యలనుంచి ఏమార్చదలచినవాళ్లకు ఇది మంచి అవకాశం. దేశరక్షణ అనేది ప్రశ్నించడానికి వీలులేని పవిత్ర గోవు వంటిది గనుక ఇక్కడ అన్నిపనులూ రహస్యంగా సాగిపోతాయి. అలా రహస్యంగా సాగే వేలకోట్ల రూపాయల ఆయుధ, సైనికావసరాల వ్యాపారాలు నిర్వహించడానికీ కొన్ని శక్తులు నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. ఆ శక్తులు ప్రచార సాధనాలను వాడుకుని లేని బూచిని చూపడానికి ప్రయత్నిస్తుంటాయి. ఆ శక్తులలోనే కొన్ని విభిన్న ప్రచారాలు కూడ చేస్తూ ప్రజలను గందరగోళంలో ముంచడానికి ప్రయత్నిస్తాయి. మొత్తం మీద విదేశీ సంబంధాలలో, సరిహద్దుల విషయంలో భారత పాలకులు, సైనికాధికారులు, ఆయుధ వ్యాపారులు మొదటినుంచీ అనుసరిస్తున్న వ్యూహం ఇదే.

పొరుగుదేశాలతో సమస్యలు ఉంటే చిత్తశుద్ధితో దౌత్యసంబంధాలద్వారా పరిష్కరించుకునే బదులు, వాటిని వాడుకుని దేశంలోపలి సమస్యలను విస్మరింపజేయడానికి ప్రయత్నించడం, ప్రజలను రెచ్చగొట్టి వారు తమ నిజజీవిత సమస్యలమీద కాకుండా ఊహాత్మక, కల్పిత సమస్యలమీద ఆందోళన పడేలా చేయడం భారత పాలకులు ఒక కళగా అభివృద్ధి చేశారు. అందుకే ప్రస్తుత ఘర్షణలలో ఒకవైపు ‘భారత సరిహద్దులు అత్యంత శాంతియుతంగా ఉన్నాయి, దానిమీద ఆందోళన పడవలసిందేమీలేదు’ అని విదేశాంగశాఖ మంత్రి ఎస్ ఎం కృష్ణ అంటుండగానే, ఆయా ప్రాంతాల సైనికాధికారులు, యుద్ధ సన్నాహాలవల్ల లాభపడే వ్యాపారులు చైనా సైనికుల చొరబాట్ల గురించి భయం గొలిపే ప్రకటనలు చేస్తున్నారు. భారతీయ జనతాపార్టీ, ఇండియన్ డిఫెన్స్ రివ్యూ లాంటి యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టే పత్రికలు, యుద్ధవ్యవహారాల విశ్లేషకులు, కొన్ని సాధారణ పత్రికలు కూడ ఏదో జరిగిపోతున్నదన్నట్టు, వెంటేనే యుద్ధానికి సర్వసన్నాహాలు చేయాలన్నట్టు హడావిడి చేస్తున్నాయి. భారత ప్రభుత్వం ఉండవలసినంత యుద్ధ సన్నద్ధతతో లేదని భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యానిస్తున్నది. వెంటనే ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించాలని, చైనా చొరబాట్లను గట్టిగా తిప్పికొట్టాలనీ పిలుపునిచ్చింది. భారత ప్రభుత్వం కూడ అధికారికంగా మాత్రం చైనా ప్రభుత్వానికి కోపం తెప్పించే మాటలూ చేతలూ వద్దని అంటూనే, ఏ సమస్యనైనా దౌత్య పరంగానే పరిష్కరించుకోవాలని అంటూనే, మరోవైపు యుద్ధోన్మాదాన్ని రాజేసే పనులు చేస్తోంది. సాధారణంగా ప్రభుత్వాలు, పాలకులు ప్రజలకు నిజాలు చెప్పరనీ, అబద్ధాలాడి మాయ చేస్తారనీ భావించే మేధావులు, పత్రికా వ్యాఖ్యాతలు కూడ సరిహద్దులు, విదేశీ సంబంధాల విషయంలో మాత్రం ప్రభుత్వం చెప్పే ప్రతి మాటనూ నమ్మడానికి సిద్ధంగా ఉంటారు.

చైనాకూ భారతదేశానికీ సరిహద్దు తగాదా కొత్తది కాదు. బ్రిటిష్ పాలనాకాలం నాటినుంచీ శతాబ్దానికి పైగా సాగుతున్న సమస్య ఇది. భారత ఉపఖండాన్ని తాము ప్రత్యక్షంగా పాలించే స్థితి రద్దయిపోయినా ఇక్కడ ఆరని మంటలకోసం చిచ్చు రగిల్చిపోవాలనుకున్న వలసవాదుల వ్యూహంలో భాగంగానే ఈ ఘర్షణలన్నీ తలెత్తాయి. మెక్ మోహన్ రేఖ, డురాండ్ రేఖ, రాడ్ క్లిఫ్ రేఖ వంటి భారతదేశపు సరిహద్దురేఖలన్నీ భారత ప్రజలకు, పొరుగుదేశాల ప్రజలకు, ఆ ప్రజాజీవితాలకు సంబంధంలేకుండా బ్రిటిష్ పాలకులు గీసినవే. బ్రిటిష్ అధికారి మెక్ మోహన్ 1914లో అప్పటి బ్రిటిష్ ఇండియాకూ, అప్పటి టిబెట్ కూ మధ్య సరిహద్దుగా గీసిన రేఖను చైనా ప్రభుత్వాలు ఏవీ గుర్తించలేదు. భారత ప్రభుత్వం ఆ రేఖ గురించి పట్టుపడుతుండగానే, 1962 యుద్ధం తర్వాత వాస్తవాధీన రేఖ అనే కొత్త సరిహద్దు కూడ వచ్చి చేరింది. గత నాలుగు దశాబ్దాలలో ఈ రేఖలగురించి ఎన్నోసార్లు చర్చలు జరిగి అసంపూర్తిగా ఉండిపోయాయి. నిజానికి 1947కు ముందు ఇవాళ్టి భారతదేశం గాని, పాకిస్తాన్ గాని లేవు. 1959 తర్వాత టిబెట్ లేదు. 1971కి ముందు బంగ్లాదేశ్ లేదు. 1975 తర్వాత సిక్కిం లేదు. కనుక ఈ వివాదాస్పద ప్రాంతంలోని దేశాల సరిహద్దుల గురించి చర్చించేటప్పుడు తప్పనిసరిగా వలసవాదుల కుతంత్రాలను అర్థం చేసుకుని, ఆ కుతంత్రాలను తిప్పికొట్టగల సామరస్యపూర్వకమైన, ప్రజానుకూలమైన వైఖరులు తీసుకోవలసి ఉంటుంది. దేశమంటే మట్టికాదోయి, దేశమంటే మనుషులోయ్ అనే వైఖరిని, విభిన్న సమాజాలు ఆదాన ప్రదానాలతో, సహకారంతో, సామరస్యంతో, సమస్యలను దౌత్యపరంగా చర్చలద్వారా పరిష్కరించుకోవాలనే అవగాహనతో సహజీవనం చేయవలసి ఉంటుంది. ఈ అవగాహన కొంతలో కొంతయినా ఉండింది గనుకనే 1950 దశకంలో పంచశీల, స్నేహసంబంధాలు, ఇరుగుపొరుగుదేశాల మైత్రీ ప్రయత్నాలు సాగాయి. కాని దేశాలమధ్య యుద్ధాలుపెట్టి పబ్బం గడుపుకునే సామ్రాజ్యవాద ఆయుధ పరిశ్రమ ఒకవైపు, తమ దేశ ప్రజల మనసులను నిజసమస్యలనుంచి మళ్లించాలనే పాలకుల దురాలోచనలు మరొకవైపు కలిసి అన్నిదేశాలలోనూ, ముఖ్యంగా పాలకులలో యుద్ధానుకూల వాతావరణాన్ని ఏర్పరచాయి. ఈ యుద్ధోన్మాదంలో ఒకదేశపు పాలకులు తక్కువాకాదు, మరొకదేశపు పాలకులు ఎక్కువాకాదు. ఇది అందరికీ తరతమభేదాలతో ఉన్న యుద్ధోన్మాదమే. యుద్ధం వల్ల ఒనగూరగలిగిన స్వప్రయోజనాల గురించిన దురాలోచనే.

కాని ప్రభుత్వాలూ, సైన్యాలూ, ప్రతిపక్షాలూ, వ్యాఖ్యాతలూ ఏ అవసరాలకోసం, ఏ ప్రయోజనాలకోసం యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టినా, ప్రజలలో యుద్ధోత్సాహాన్ని కలిగించినా ఇది కేవలం వాళ్లకు సంబంధించిన విషయం కాదు. ఇది ప్రధానంగా ప్రజలకు, ప్రజా జీవితానికి సంబంధించిన విషయం. యుద్ధ సన్నాహాలు ప్రజా సంక్షేమానికి అందవలసిన నిధులను కొల్లగొడతాయి. ఏ సంవత్సరం భారత బడ్జెట్ చూసినా రక్షణవ్యయంలో పెరుగుదల ఒక్కటే మొత్తం దేశానికి విద్యకో, ప్రజారోగ్యానికో పెట్టే ఖర్చుకన్న ఐదారు రెట్లు ఎక్కువ ఉంటున్నది. ఈ రక్షణ వ్యయంలో కొంతభాగం ఆయుధవ్యాపారుల, రాజకీయప్రముఖుల బొక్కసాలలోకి వెళుతోందని ఇటీవలి కుంభకోణాలు చూపుతున్నాయి. యుద్ధం వస్తే అది ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలిగొంటుంది. పాలకుల స్వార్థ ప్రయోజనాల కోసం సాగే యుద్ధంతో ప్రజలకేమీ నిమిత్తం లేదు. నిజంగా ఇరుగుపొరుగు దేశాలతో సమస్యలు ఉన్నా వాటిని సామరస్యంగా, చర్చలతో, దౌత్యపరంగా పరిష్కరించుకోవలసిందేననీ, తమ మీద అనవసరమైన యుద్ధాన్ని రుద్దగూడదనీ ఎలుగెత్తి యుద్ధవ్యతిరేక ఉద్యమం నిర్మించవలసినది ప్రజలే. యుద్ధవ్యతిరేకతే ప్రజాజీవన భవిష్యత్తుకు హామీ.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Ee Bhoomi, Telugu. Bookmark the permalink.

7 Responses to ఇరుగుపొరుగుతో ఎందుకీ యుద్ధోత్సాహం?

 1. Praveen says:

  వ్యాసం బాగుంది. “Disarmament is the ultimate aim of socialism” అన్న లెనిన్ ప్రవచనం గుర్తుకి వస్తోంది.

 2. chavakiran says:

  మరోసారి వెన్నుపోటుకు సిద్దమవ్వమంటారు. అంతేనా ?

 3. krishana says:

  మరో కార్గిల్ లా వచ్చి కొండలపైకి ఎక్కి డిష్యూం, డిష్య్యూం అంటూవుంటే అప్పటిలాగే అన్ని దేశాలదగ్గరకు పోయి గోడు, గోడు న ఏడవమంటారు,
  లేకపొతే, కిందనుండి పైకి పాకుతూ పోతూ వాళ్ల గుళ్ల దెబ్బలకి మన సైనికులు లాగా చావ మంటారు అంతేనా?
  ఇతర దేశాలన్నీ ఇప్పటిదాకా ఏమి చేస్తున్నరయ్యా అంటే, మా “కడలితరుగు” గారిలాంటి వాళ్లు “యుద్ధవ్యతిరేకతే ప్రజాజీవన భవిష్యత్తుకు హామీ.” అని మా ఆంధ్రా అహింసా వీరుడు YSR గారిలాగా హామీ ఇచ్చారు అది పాటిస్తున్నాం అని చెప్తే బాగుంటుందేమో కదా!!!

  చివరకు “ఈ రక్షణ వ్యయంలో కొంతభాగం ఆయుధవ్యాపారుల, రాజకీయప్రముఖుల బొక్కసాలలోకి వెళుతోందన్న” మాట మాత్రం అక్షర సత్యం అది అమేరికా అయినా, మన దేశమయినా.

 4. sravya Vattikuti says:

  యుద్ధోత్సాహం గురించి బాగా చెప్పారు వేణుగోపాల్ గారు. మరి మన కళ్ళెదురు గా జరుగుతున్న నక్సల్స్ ఉద్యమం గురించి మీ అభిప్రాయం ఏమిటి ? ఇది సరయినదేనా ? నక్సల్స్ మందుపాతర పేలుళ్ళలో చనిపోయిన అమాయకుల సంగతేమిటి ? ఇది న్యాయమేనా ? మరి ఈ ఉద్యమాలను మీలాంటి వాళ్ళు ఎందుకు సమర్దిస్తారు ?ఈ ఉద్యమాలు ఎదుర్కోవటానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ?

 5. మనకి సంబంధించినంతవఱకు చైనా శత్రుదేశమే. ఇప్పట్లో వాళ్ళ గుఱించి మంచిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. వాళ్ళని నమ్మాల్సిన అవసరం అంతకంటే లేదు. వాస్తవానికి అది ఇండియా కంటే బలహీనమైన దేశం. కానీ బలవంతుల్లా నటిస్తున్నారు. ఆ కమ్యూనిస్టుపార్టీ యొక్క ఏకపక్ష పాలన, నియంతృత్వం తీసేస్తే అది విచ్ఛిన్నమైపోతుంది. మన వ్యూహకర్తలు ఆ దిశగా ఆలోచించకపోవడం విచారకరం, ావతలివాళ్ళు ఇక్కడి టెఱ్ఱరిస్టు ఉద్యమాలకి సహాయపడుతున్న విషయం తెలిసీ ! మన ఖర్మేంటో గానీ, దేశ శత్రువుల్ని బాహాటంగా సమర్థించేవాళ్లు ఈ దేశంలో దొఱికినంత విఱివిగా ఇంకెక్కడా దొఱకరు.

 6. Praveen says:

  శ్రావ్య గారు. అంతర్గత ఇంసర్జెన్సీ వల్ల అయ్యే ఖర్చు కంటే నూక్లియర్ బాంబుల తయారీ, వాటి పరీక్షలకి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. పోఖ్రాన్ అణు పరీక్షలనీ, అమెరికాతో అణు ఒప్పందాన్నీ మావోయిస్ట్ పార్టీ వ్యతిరేకించడానికి ఆర్థిక పరిస్థితి కూడా కారణమే. మన దేశానికి కావలసినవి అణ్వస్త్రాలు కావు, అన్నవస్త్రాలు.

 7. sravya Vattikuti says:

  @Praveen I agree with you it is very expensive, let me give a chance get the answer to my question from N.Venugopal.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s