తెలుగు సమాజంపై చైనా సాహిత్య ప్రభావం

తెలుగు సమాజం మీద చైనీస్ సాహిత్య ప్రభావం గత అరవై సంవత్సరాలకుపైగా చాల ఎక్కువగానే ఉంది. అసలు భారత సమాజంమీదనే ఈ ప్రభావం బలంగా ఉండడానికి చాల కారణాలున్నాయి. విముక్తి పూర్వ చైనా ప్రజల కడగండ్లతో సమానమైన వేదన భారత ప్రజానీకంలో కూడ ఉండడం కావచ్చు. చైనాలో ఉండిన అర్ధభూస్వామ్య, అర్ధ వలస రాజకీయార్థిక, సామాజిక స్థితే ఇక్కడ కూడ ఉండడం కావచ్చు. చైనాలో సాగిన నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పోలిన విప్లవమే భారత సమాజంలో కూడ జరగవలసి ఉందనే విప్లవోద్యమ అవగాహనలవల్ల కావచ్చు. తెలుగు సమాజంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఇక్కడ విప్లవోద్యమం సజీవంగా, శక్తిమంతంగా ఉండడం వల్ల చైనా సాహిత్య అధ్యయనం, అనువాదం, అనుసరణ, ఆచరణ, ప్రభావం విస్తృతంగా ఉన్నాయి.

‘ఓల్గా ఘనీభవించెను/ యాంగ్సీ నది పొంగెను/ హోరుహోరు హోరుగా/ హొయలు హొయలు హొయలుగా/ రుతుగీతికి పులకరించి/ గంగ కూడ పొంగెను’ అని శివసాగర్, ‘బోల్షివిక్కు వారసులం/ నక్సల్బరి బిడ్డలం/ జనచైనా వెలుగులలో/ నడుస్తున్న వారలం’ అని చెరబండరాజు భారత సమాజంమీద చైనా ప్రభావాన్ని మూడున్నర దశాబ్దాల వెనుకనే కవితాత్మకంగా వ్యక్తీకరించారు.

బ్రిటిష్ పాలన వల్ల మనకు ఇరుగుపొరుగు, సోదర ఆసియన్ దేశాల సాహిత్యం కన్న యూరపియన్ సాహిత్యమే ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది. చైనా సాహిత్యం తెలుగులోకి రావడం ఎప్పుడు మొదలయిందో పరిశోధించవలసే ఉంది గాని 1940ల కన్న ముందు, సన్ యట్ సేన్ గురించి అరకొర ప్రస్తావనలు తప్ప, అనువాదాలు గాని, చైనా ప్రభావం గాని పెద్దగా ఉన్నట్టు కనబడడం లేదు.

‘చైనా మార్గమే మన మార్గం’ అనే మాట మొదటిసారి భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర ప్రొవిన్షియల్ కమిటీ 1948 జూలై 9 న చేసిన తీర్మానంలో కనబడుతుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి వివరించే క్రమంలో ఈ అవగాహన వ్యక్తమయింది. నిజానికి అప్పటికి చైనా విప్లవం విజయం సాధించలేదు. కాని అప్పటికే చైనా విప్లవపరిణామాల గురించిన వార్తలు తెలుగు సమాజంలోకి వస్తున్నాయి. అన్నా లూయీ స్ట్రాంగ్ రాసిన ‘మా సి యాంగ్ బోధనలు’ అనే పుస్తకాన్ని ప్రజాశక్తి ప్రచురణాలయం 1947 లోనే ప్రచురించింది. అటూ ఇటూగా కమ్యూనిస్టు, అభ్యుదయ పత్రికలలో చైనా గురించిన వార్తలు, వ్యాసాలు, రచనల అనువాదాలు మొదలయి ఉంటాయి.

చైనా విముక్తి (1949 అక్టోబర్ 1) తర్వాత సహజంగానే చైనా వ్యవహారాలపట్ల ఆసక్తి మరింత పెరిగింది. తెలుగు సమాజంలో కూడ 1950 దశకం తొలి అర్ధభాగంలో చైనా సాహిత్య అనువాదాలు విస్తరించాయి. మావోసేటుంగ్ వ్యాసాలు ఆచరణ, ప్రజల ప్రజాతంత్ర నియంతృత్వం లను మహీధర జగన్మోహన రావు అనువాదం చేశారు. వాటిని మహీధర సోదరులు రాజమండ్రిలో ప్రారంభించిన విశ్వసాహిత్యమాల 1952 లో విడివిడిగా ప్రచురించింది. “చైనాను గురించీ, ప్రపంచాన్ని కదిల్చివైచిన చైనా విప్లవాన్ని గురించీ, చైనా విప్లవ సారథులైన మావ్ మొదలైన వారి సిద్ధాంతాలను గూర్చీ తెలుగుభాషలో వున్న పుస్తకాలు చాల కొద్ది మాత్రమే. చైనా సాహిత్యమును మన తెలుగు భాషలోకి తేవడానికి యధాశక్తి విశ్వసాహిత్యమాల ప్రయత్నించగలదని మనవి చేస్తున్నాము” అని జగన్మోహనరావు రెండో పుస్తకానికి పీఠికలో రాశారు. ఆ తర్వాత వారే, డిప్యూటీ చైర్మన్ అనే చీనా విప్లవకథల సంపుటాన్ని, ఆస్వాల్డ్ ఎడ్ బర్గ్ రాసిన (సంకలనం చేసిన?) చీనా కథలు అనే సంపుటాన్నీ ప్రచురించారు. పురిపండా అప్పలస్వామి అనువాదం చేసి, సంపాదకత్వం వహించిన విశ్వకథావీథి సంపుటాలలో (1955) టింగ్ లింగ్, లూసన్ ల కథలు చెరి ఒకటి ఉన్నాయి. చైనా విప్లవ క్రమంలో తమ ప్రత్యక్ష భాగస్వామ్యానికి నవలా రూపం ఇస్తూ యువాన్ చింగ్, కుంగ్ చూయే రాసిన కొడుకులు – కూతుళ్లు ను చిట్టా మహానందీశ్వరశాస్త్రి (మహేశ్) అనువదించగా ఆదర్శ గ్రంథమండలి 1955లోనే ప్రచురించింది.

ఆ తర్వాత గడిచిన అరవై సంవత్సరాలలో తెలుగులో చైనా పుస్తకాల అనువాదాలు వందకు పైగానే వెలువడి ఉంటాయి. వాటిలో కొన్ని పుస్తకాలు అనేక సార్లు పునర్ముద్రణలు కూడ పొందాయి. తెలుగు పత్రికలలో చైనా రచనల అనువాదాలు వందలాదిగా వెలువడ్డాయి. చైనా గురించి ఇతరులు రాసిన పుస్తకాల అనువాదాలు, తెలుగులో స్వతంత్ర రచనలు కూడ వెలువడ్డాయి. ఈ విశాలమైన చైనా ప్రభావిత సాహిత్య సంపదలో కథ, కవిత్వం, నవల, వ్యాసం, బాల సాహిత్యం వంటి సృజనాత్మక రచనలు, విప్లవోద్యమ అనుభవ కథనాలు, చైనా గురించి విదేశీయుల రచనలు, సైద్ధాంతిక రచనలు, తెలుగు రచయితలు రాసిన విశ్లేషణలు ఉన్నాయి.

అలాగే ఈ ఆసక్తి గత ఆరు దశాబ్దాలలో వేరువేరు సందర్భాలలో వేరువేరుగా కూడ వ్యక్తమయింది. మొదటి దశ 1950ల నుంచి 1960ల మధ్య భాగందాకా సాగితే, 1966-67 నుంచి 1980ల మధ్యదాకా రెండో దశగా, ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా మరొకదశగా సాగుతోంది. మొదటి దశలో విప్లవం సాధించిన మరొక వ్యవసాయ సమాజ అనుభవాన్ని తెలుసుకోవలసిన అవసరం నుంచి, తొలి ఆసక్తి నుంచి రచనలు, అనువాదాలు, పరిచయాలు సాగాయి. కాని అప్పటికే తెలుగు నాట కమ్యూనిస్టు ఉద్యమం సోవియట్ ప్రభావంలో ఉండడం వల్ల, 1956 నుంచే సోవియట్ యూనియన్ కూ చైనాకూ మధ్య విభేదాలు మొదలు కావడం వల్ల తెలుగునాట అధికారిక కమ్యూనిస్టు ప్రచురణలు గాని, రచయితలు గాని చైనా సాహిత్యాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. ఈ లోగా 1962లో భారత – చైనా యుద్ధం జరగడంతో నిరాధారమైన దేశభక్తి, చైనా పట్ల వ్యతిరేకత తెలుగు రచయితలలో వ్యక్తమయ్యాయి. అజంతా, కాళోజీ వంటి కవులు కూడ చైనా వ్యతిరేక కవిత్వం రాశారు. మొత్తం మీద మొదటి దశ, కొద్దికాలం వ్యతిరేకత మినహాయిస్తే, కేవలం పరిచయ దశగా, ఆసక్తి ప్రేరక దశగానే తప్ప నిజంగా ప్రభావం వేయగలిగిందా అనుమానమే.

ఇక సోవియట్ యూనియన్ కమ్యూనిస్టుపార్టీకీ, చైనా కమ్యూనిస్టు పార్టీకీ గ్రేట్ డిబేట్ జరిగి, అది అంతర్జాతీయ ప్రకంపనాలు సృష్టించి, భారతదేశంలో కూడ నక్సల్బరీ పంథా ఆ ప్రభావానికి లోనయిన తర్వాత, చైనా కమ్యూనిస్టుపార్టీ అధికారికంగా నక్సల్బరీ పంథాను సమర్థించిన తర్వాత చైనా ప్రభావం విస్తృతమయింది. నక్సల్బరీ ప్రజ్వలనను చైనా కమ్యూనిస్టుపార్టీ అధికారపత్రిక పీపుల్స్ డైలీ ‘వసంతమేఘ గర్జన’ గా అభివర్ణించింది. చైనా పట్ల భారత విప్లవోద్యమపు మైత్రి చైనా చైర్మన్ మన చైర్మన్ అనే అతివాద నినాదం దాకా విస్తరించింది. అప్పటి లిబరేషన్ పత్రికలోనూ, అప్పుడు వెలువడిన అనేక పుస్తకాల మీద రేడియో పెకింగ్ ఇంగ్లిషు, హిందీ ప్రసారాల వేళలు ప్రచురించారంటే ఆ ప్రభావం ఎంత పెద్ద ఎత్తున ఉందో అర్థమవుతుంది. ఈ పూర్వరంగంలో చైనా సాహిత్య అధ్యయనం, అనువాదం, ప్రచారం 1960ల చివరినుంచీ, 1980ల మొదటి దాకా విపరీతంగా సాగాయి. మొత్తం పుస్తకాలలో మూడు వంతులు ఆ పది పన్నెండు సంవత్సరాలలోనే వెలువడి ఉంటాయి.

మావో మరణానంతరం డెంగ్ సియావో పింగ్ అధికారానికి వచ్చి చైనా కమ్యూనిస్టుపార్టీనీ, పాలననూ పెట్టుబడిదారీ మార్గానికి మళ్లించిన తర్వాత, చైనా మీద ఆసక్తి తగ్గుతూ వచ్చింది. పాత ప్రచురణల పునర్ముద్రణలు, చైనా మీద విదేశీయులు రాసిన విశ్లేషణల ప్రచురణలు, విప్లవకాలపు అనుభవాల పాత పుస్తకాల అనువాదాలు మినహా సమకాలీన చైనా సాహిత్యం గురించి తెలుసుకోవడానికి తెలుగు సమాజం పెద్దగా ప్రయత్నించినట్టులేదు, ప్రభావితమయిందీ లేదు. అడవిగాచిన వెన్నెల వంటి కమ్యూనిస్టు వ్యతిరేక రచనల అనువాదాలు ఒకటి రెండు వచ్చాయిగాని వాటి ప్రభావం పెద్దగా లేదు.

ఇవాళ్టి స్థితి ఏమయినప్పటికీ, రెండో దశలో వెలువడిన ప్రచురణలు, విస్తరించిన ప్రభావం అపారమైనవి. ప్రాంతాల పేర్లతోనూ, మనుషుల పేర్లతోనూ, బౌద్ధ సంస్కృతి చిహ్నాల తోనూ తెలుగు పాఠకులు కొంత దూరాన్ని అనుభవించినప్పటికీ, చైనా వ్యవసాయసమాజపు జీవితాన్ని చదువుతుంటే మన జీవితం చదువుకుంటున్నట్టే ఉంటుంది. అక్కడి పోరాట అనుభవాలు చదువుతుంటే మన పోరాట అనుభవాలు మనం నెమరు వేసుకుంటున్నట్టే ఉంటుంది. అతిభయంకరమైన నిర్బంధకాండ సాగుతున్నప్పుడు విప్లవసందేశాన్ని వినిపించడానికి లూసున్ ఉపయోగించుకున్న వ్యంగ్య రచనా శైలి మన రచయితలను ఎందరినో ప్రభావితులను చేసింది. కొడుకులు – కూతుళ్లు నవలను మహేశ్ కేవలం ఆసక్తి తోనే, ఏ ఉద్యమ వాతావరణం లేనప్పుడే అనువాదం చేసి ఉండవచ్చు గాని, నక్సల్బరీ, శ్రీకాకుళ ఉద్యమ నేపథ్యంలో ఆ నవల గోర్కీ అమ్మ లాగ నిత్య పఠనీయ గ్రంథమయింది. ఉద్యమం తర్వాత వెలువడిన మొదటి నవల టావ్ చెంగ్ నాకుటుంబం (నోముల సత్యనారాయణ అనువాదం) మొదట 1972లో సృజనలో సీరియల్ గా వచ్చి, తర్వాత పుస్తక రూపంలో వెలువడింది. ఇప్పటికి ఎన్నోసార్లు పునర్ముద్రణ పొందిన నాకుటుంబం ఒక స్త్రీ ప్రధాన పాత్రగా చైనా విప్లవఘట్టాలను అత్యంత రోమాంచకారిగా వివరిస్తుంది. మరికొద్దికాలానికే చౌ లి పో నవల ఉప్పెన చైనాలో జరిగిన విప్లవ భూసంస్కరణలను, గ్రామీణ జీవిత సంక్లిష్టతను చెపుతూ భారత విప్లవం ఏమి సాధించదలచుకున్నదో కళాత్మకంగా చూపించింది. ఎన్ ఎస్ ప్రకాశరావు ప్రారంభించిన ఆ అనువాదాన్ని ఆ తర్వాత నళిని కొనసాగించారు. మొదట సృజనలో సీరియల్ గా వచ్చిన ఈ నవల రెండు భాగాలు సృజన ప్రచురణగా వెలువడింది. పాత్రల సంభాషణలలో విశాఖపట్నం మాండలికాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఉప్పెన తెలుగు సమాజానికి చాల సన్నిహితమయింది. ఆ తర్వాత విద్యార్థి యువజన ఉద్యమాలను వివరించే యాంగ్ మో నవల ఉదయగీతిక, ఎర్రమందారాలు నవలలు 1980లలో వెలువడి చాల ఆదరణను పొందాయి. ఇప్పటికి రెండు మూడు సార్లు పునర్ముద్రణ పొందాయి. వీటితో పాటుగానే చెప్పుకోదగినవి సు కువాంగ్ యావో నవల మైదానం మండుతోంది, లిన్ చింగ్ నవల నవజీవన నిర్మాతలు.

చైనా కథల తెలుగు అనువాదాలు కూడ ఎన్నో వచ్చాయి. కేవలం లూసన్ వంటి లబ్ధప్రతిష్టులైన కథకుల కథలు మాత్రమే కాక, చైనీస్ లిటరేచర్ పత్రికలోనూ, ఇతరచోట్లా వచ్చిన భావ స్ఫోరకమైన, ప్రభావ శీలమైన కథలెన్నో తెలుగులోకి అనువాదమయ్యాయి. చలసాని ప్రసాదరావు సొంతంగా ఒక అనువాదకథల పుస్తకం ప్రచురించగా, వివిధ పత్రికలలో వచ్చిన చైనా అనువాద కథలను క్రాంతి ప్రచురణలు నేలతల్లి చెర విడిపించిన లాంగ్ మార్చ్ పేరుతో ప్రచురించింది. అలాగే యే ట్జు కథల సంపుటం పంట ను కూడ వెలువరించింది. అలాగే నేనూ బడికి వెళ్తా, బాల గెరిల్లా లాంటి బాలసాహిత్య రచనలు కూడ ఎన్నో తెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా ఎన్నో కవితలు, వ్యాసాలు, నాటికలు కూడ అనువాదమయ్యాయి.

ఇక ఇక్కడ సాగుతున్న విప్లవోద్యమానికి స్ఫూర్తినీ, ప్రేరణనూ అందించడానికి చైనా విప్లవోద్యమ చరిత్రలోని అద్భుత ఘట్టాలగురించిన పుస్తకాలు కూడ ఎన్నో తెలుగులో వెలువడ్డాయి. లాంగ్ మార్చ్ లో చైర్మన్ మావోతో, కోట్లాది వీరయోధులు, మావో జీవితచరిత్రలు, ఛూటే జీవితచరిత్ర జైత్రయాత్ర, నార్మన్ బెతూన్ జీవితచరిత్ర రక్తాశ్రువులు, కంకార్డ్ దీవి మిలీషియా మహిళలు వంటి రచనలు వేలాదిమందికి తమ విప్లవజీవితంలో ఉత్తేజాన్ని నింపాయి. అలాగే చైనా విప్లవం జరుగుతున్న సమయంలోనే చైనాలో పర్యటించిన జర్నలిస్టు ఎడ్గార్ స్నో రాసిన చైనాపై అరుణతార ఎంతోమందిలో విప్లవవిజయం గురించిన విశ్వాసాన్ని నింపింది. విలియం హింటన్ చైనా గ్రామీణ ప్రాంతాలలో సాగిన విప్లవ భూసంస్కరణల గురించి రాసిన ఫాన్ షెన్ కు సహవాసి సంక్షిప్త అనువాదం విముక్తి చాలమందిలో విప్లవ నిబద్ధతను బలోపేతం చేసింది. అలాగే జాక్ బెల్డెన్ చైనాలో జరుగుతున్న మార్పుల గురించి రాసిన చైనా షేక్స్ ది వరల్డ్ లోనుంచి కొన్ని అధ్యాయాలు తెలుగులోకి వచ్చాయి. చైనాలో జరిగిన మార్పులన్నిటిలోకీ ముఖ్యమైనది స్త్రీలపట్ల సామాజిక దృక్పథంలో వచ్చిన మార్పు. పాదాలకు బంధనాలు విధించి పరుగెత్తడానికి కూడ వీలులేకుండా చేసిన పాత సమాజం నుంచి స్త్రీలను సోషలిజం విముక్తి చేసింది. ఆ విముక్తి కథనాలు క్లాడీ బ్రాయెల్, డెలియా డేవిన్ ల వంటి పాశ్చాత్య రచయితల పుస్తకాల అనువాదాల ద్వార తెలుగు పాఠకులకు చేరాయి.

చైనా శ్రామికవర్గ మహత్తర సాంస్కృతిక విప్లవంలో జరిగిన ప్రయోగాలు, సాగిన అన్వేషణలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. బ్రాడ్ షీట్ గ్రూప్ పేరుతోనూ, కన్సర్న్ డ్ ఏషియన్ స్కాలర్స్ పేరుతోనూ, స్వతంత్రంగానూ అనేక మంది అమెరికన్లు, యూరపియన్లు చైనా అధ్యయనాలు సాగించారు. ఇంగ్లిషులో వందలాది పుస్తకాలు వెలువడ్డాయి. ఆ పుస్తకాలలోనుంచి అనువాదాలు గాని, పరిచయాలుగాని, ఉపన్యాసాలలో ప్రస్తావనలుగాని తెలుగులోకి వచ్చి చాల ప్రభావం చూపాయి. డెంగ్ అనంతర పరిణామాల గురించి కూడ ఛార్లెస్ బెతల్ హాం, విలియం హింటన్ మొదలయిన వారి రచనలు తెలుగులోకి వచ్చాయి.

ఇక చైనా విప్లవనాయకుల, కార్యకర్తల రచనల తెలుగు అనువాదాలకయితే లెక్కలేదు. 1970ల తొలిరోజుల్లోనే చండ్ర పుల్లారెడ్డి అనువాదం చేసిన మావో మిలిటరీ రచనలు తెలుగులోకి వచ్చాయి. మావో రచనల చైనా అధికారిక ప్రచురణ ఐదు సంపుటాలతో పాటు, ఇంగ్లిషులోనూ తెలుగులోనూ మరొక ఐదు సంపుటాలు ప్రచురించిన ఘనత తెలుగు విప్లవోద్యమానిదే. మావో రచనలలో నుంచి విడివిడి వ్యాసాల పుస్తకాలు కూడ ఎన్నో వెలువడ్డాయి. చైనా విప్లవోద్యమ చరిత్ర పుస్తకాలు కనీసం రెండు (హోచియావో మూ, హో కాన్ చీ) వెలువడ్డాయి. మావో రాసిన కళలూ సాహిత్యం ఎవరికోసం తో పాటు, లూసన్, మావో టున్ తదితరుల విప్లవసాహిత్య విమర్శ వ్యాసాలు ఎన్నో తెలుగులోకి వచ్చాయి. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాన్ని, సిద్ధాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన గ్రేట్ డిబేట్ తెలుగులోకి సంపూర్ణంగా వచ్చింది. చౌ ఎన్ లై, ఛూటే, లీ షావ్ చీ, వాంగ్ మింగ, లిన్ పియావో వంటి నాయకుల రచనలు కూడ తెలుగులోకి వచ్చాయి. చైనాలో రాజకీయార్థశాస్త్రం, తత్వశాస్త్ర, చరిత్ర లలో జరిగిన పరిశోధనలు కూడ తెలుగులోకి వచ్చాయి.

చైనా ప్రగతి గురించీ, సాంస్కృతిక విప్లవం గురించీ, చైనాలో ఇటీవల జరుగుతున్న పరిణామాల గురించీకూడ తెలుగులో రచనలు వెలువడ్డాయి. శ్రీశ్రీ తన చైనా పర్యటన అనుభవాలను చైనా యానం పేరుతో ప్రచురించారు.

మొత్తంగా చెప్పాలంటే తెలుగు సమాజపు ఆలోచనలలో, ఆచరణలో, ఉద్యమాలలో, ప్రభావంలో చైనా పాత్ర అపారమైనది, అసాధారణమైనది. తెలుగు వారి, కనీసం తెలుగు ఉద్యమకారుల మనసులోపలి సన్నిహిత మిత్రురాలు చైనా. కనీసం 1940లనుంచి 1970ల చివరివరకూ అయినా.

తెలుగు సమాజం మీద చైనా సమాజ, సాహిత్య ప్రభావాలకు చెరగని నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకంగా రెండు ఉదాహరణలు మాత్రం చెప్పుకోవచ్చు. ఒకటి ఇంద్రవెల్లి స్థూపం. చైనా పర్యటించి, బీజింగ్ లోని తియెన్ ఆన్ మెన్ స్క్వేర్ లో స్థూపాన్ని చూసి ఉత్తేజితులైన ఆంధ్రప్రదేశ్ రైతుకూలి సంఘం అధ్యక్షులు గంజి రామారావు, ఆదివాసి అమరవీరుల స్మృతిలో అటువంటి స్థూపమే ఇంద్రవెల్లిలో నిర్మించాలని ఆలోచించారు. ఎంతోకాలం ఇంద్రవెల్లిలో మకాంవేసి దాని నిర్మాణాన్ని పర్యవేక్షించారు. తర్వాత ప్రభుత్వం దాన్ని కూల్చివేసింది గాని ఇంద్రవెల్లి ఆకాశం బీజింగ్ ఆకాశానికి ప్రతిబింబాన్ని చూపుతూనే ఉంటుంది.

రెండవది, చాల భాషలవారికి తెలియనిదీ, తెలుగువారికి వెంటనే అర్థమయ్యేదీ ఆకాశంలో సగం అనే వ్యక్తీకరణ. స్త్రీల గురించి మాట్లాడుతూ మావో అన్న ఆమాట తెలుగు నుడికారంలోకి పూర్తిగా సంలీనమైపోయింది. కొన్ని డజన్లమంది రచయితలూ కవులూ ఆ అభివ్యక్తిని వాడుకున్నారు.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu, Vaartha. Bookmark the permalink.

2 Responses to తెలుగు సమాజంపై చైనా సాహిత్య ప్రభావం

  1. మీరు రాసినదాన్ని బట్టి చూస్తే గుప్పెడు అనువాదాలు తప్ప మనమీద చైనా ప్రభావం ఏమీ లేదని తెలుస్తోంది. ఆ మాత్రం దానికి ఏకంగా “సమాజం మీదనే చైనా ప్రభావం” అనేశారేంటి ? నాకు తెలిసి మనమీద ఇంగ్లీషువాళ్ళ ప్రభావం తప్ప ఇంకెవరి ప్రభావమూ లేదు.

  2. thulasi says:

    చీనా కథలు చదవడాన్ని పూర్తి చేసి ఈ పుస్తకంపై నెట్ లో ఏదైనా సమాచారం ఉందేమోనని సర్చ్ చేయగా మీ వ్యాసం దొరికింది. చీనా కథలు చదివాక నాకు బలంగా అనిపించిన అంశం మన దేశంలో కూడా అట్టడుగు స్థాయి నుంచి గొప్ప విప్లవం రావాలి. అలాంటి పరిస్థితులే ఇక్కడా ఉన్నా ప్రజల్ని చైతన్యపరిచే శక్తులు ఇక్కడ బలంగా లేనందువల్లే ఇంకా విప్లవించే స్థాయికి మనదేశం చేరలేదనిపిస్తోంది. ముఖ్యంగా రైతుల నుంచి గొప్ప తిరుగుబాటు వచ్చినప్పుడే మనదేశంలో పెట్టుబడిదారీపాలకులకు చెరమగీతం పాడటం సాధ్యమౌతుందనిపించింది. మన దేశంలో కమ్యూనిస్టు పార్టీల ఐక్యతాలోపం వల్లే మన సమాజం విప్లవాలకు దూరంగా ఉందా అనే అనుమానం కలుగుతోంది. నా అనుమానం నిజమేనంటారా..!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s