చెరగని హక్కుల స్ఫూర్తి బాలగోపాల్‌

ఒక వస్తువు, ఒక పరిణామం తన స్థలానికీ కాలానికీ ఎంత గాఢంగా బద్ధమైతే అంతగా సార్వజనీనం, సార్వకాలికం అవుతుందని తత్వశాస్త్రంలో ఒక భావన ఉంది. జూన్ 20, 1952న పుట్టి, అక్టోబర్ 8, 2009 న మరణించిన, ఆంధ్రప్రదేశ్ అనే నిర్దిష్టమైన స్థలంలో, 1980 నుంచి 2009 దాకా అనే స్పష్టమైన కాలంలో పనిచేసిన డా. కందాళ బాలగోపాల్ అనే స్థల కాలబద్ధుడైన వ్యక్తి సాగించిన కృషి నిజంగానే ఆయన జీవితాచరణను ఎల్లకాలానికీ ఒక ఆదర్శంగా, చెరగని స్పూర్తిగా మార్చింది. ఆయన సాహిత్య విమర్శ గురించీ, రచన గురించీ, ఉపన్యాసం గురించీ, ఆయన జీవిత విలువల గురించీ, న్యాయవాదిగా ఆయన చేసినపని గురించీ, గణితశాస్త్ర అధ్యాపకుడిగా చేసిన కృషి గురించీ ఎంతయినా చెప్పుకోవచ్చు. కాని ఇక్కడ హక్కుల ఉద్యమ నిర్మాణంలో, వికాసంలో ఆయన సాగించిన కృషి గురించి వివరించడానికి మాత్రం పరిమితమవుతాను.

హక్కుల ఉద్యమంలో బాలగోపాల్ పాత్రకు కచ్చితమైన స్థల కాలాలున్నాయి. ఆయన హక్కుల కృషి మొదలయింది వరంగల్ లో. కొనసాగినది రాష్ట్రమంతా, దేశమంతా. మొదలయిన సందర్భం 1981 నుంచి 1985 దాకా. కొనసాగినది చివరి ఊపిరిదాకా. ఎమర్జెన్సీ అనంతర ప్రజాస్వామిక వెల్లువలో భాగంగానే బాలగోపాల్ హక్కుల ఉద్యమకృషి మొదలయింది.

బ్రిటిష్ వలసపాలన కాలంలోనే భారతదేశంలో మధ్యతరగతి విద్యావంతుల పౌరహక్కుల కృషికి బీజాలు పడినప్పటికీ, 1947 తర్వాత ఆ కృషి మార్క్సిస్టుల బాధ్యత మాత్రమే అయింది. అది కూడ కమ్యూనిస్టు నాయకుల అరెస్టు తర్వాత జరిగిన ప్రయత్నాలలోనే వ్యక్తమయింది. ఆ చెదురుమదురు ప్రయత్నాలు ముందుకు సాగలేదు కూడ. ఆ తర్వాత, శ్రీకాకుళ విప్లవోద్యమం మీద దారుణమైన నిర్బంధం, వందలాది మందిని ఎన్ కౌంటర్ పేరిట హత్య చేయడం, కుట్రకేసులు, వేలాదిమంది సాధారణ ప్రజానీకాన్ని నిర్బంధించి, వేధించడం, భూమయ్య, కిష్టాగౌడ్, నాగభూషణ పట్నాయక్ వంటి వారి ఉరిశిక్షలు మొదలయిన సంక్షుభిత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ లో పౌరహక్కుల కృషి విస్తృతమై, నిర్మాణ రూపం ధరించి ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (ఎ పి సి ఎల్ సి), ఆర్గనైజేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమొక్రటిక్ రైట్స్ (ఒపిడిఆర్) ఏర్పడ్డాయి. ఇదంతా ఎమర్జెన్సీకి పూర్వమే.

ఆ స్థితిలో ఎమర్జెన్సీ వచ్చి దేశంలో మార్క్సిస్టులు కాని మధ్యతరగతి విద్యావంతులలోనూ పౌరహక్కుల స్పృహను లేవనెత్తింది. ఇందిరాగాంధీ తన అధికారాన్ని రక్షించుకోవడం కోసం దేశం మీద రుద్దిన ఎమర్జెన్సీ ప్రతిపక్షనాయకుల నుంచి సాయుధవిప్లవాన్ని సమర్థించేవారివరకూ, ఆనందమార్గ్, ఆర్ ఎస్ ఎస్ నాయకులనుంచి జమాతే హింద్ నాయకులవరకూ అందరినీ జైళ్లలో కుక్కడంతో, దేశంలో పౌర, ప్రజాస్వామిక హక్కులను రక్షించడానికి విశాల వేదికలు కావాలనే ఆలోచనలు మొదలయ్యాయి. 1977లో ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జయప్రకాశ్ నారాయణ, సురేంద్రమోహన్, జార్జి ఫెర్నాండెజ్, ఎంవి తార్కుండే, గోబింద ముఖోటీ, అరుణ్ శౌరి వంటి ప్రముఖుల ప్రత్యక్ష, పరోక్ష ప్రోత్సాహాలతో పౌరహక్కుల ఆలోచనలు విస్తరించాయి. తాజాగా నిర్బంధాన్ని చవిచూసిన మధ్యతరగతి ఇటువంటి ఉద్యమ అవసరాన్ని గుర్తించింది.

ఆ దేశవ్యాపిత ప్రజాస్వామ్య పవనాలలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్ కౌంటర్ హత్యలపై తార్కుండే కమిటీ నివేదిక, భార్గవా కమిషన్ విచారణ, జగిత్యాల, సిరిసిల్ల కల్లోలిత ప్రాంతాల ప్రకటనపట్ల నిరసన వెల్లువ, తిరిగి మొదలయిన ఎన్ కౌంటర్లపై వ్యతిరేకత కొనసాగాయి. ఎపిసిఎల్ సి, ఒపిడిఆర్ బలం పుంజుకున్నాయి. సరిగ్గా ఆ సమయంలో బాలగోపాల్ ఎపిసిఎల్ సి లో ప్రవేశించారు. పౌరహక్కుల ఉద్యమంవైపు వస్తున్న విభిన్న రంగాల విద్యావంతుల ఆసక్తులను అర్థం చేసుకుని వారికి తగిన అవగాహనను అందించడం, దాన్ని నానాటికీ విస్తరించడం, పౌరహక్కుల చైతన్యాన్ని, నిర్మాణాన్ని బలోపేతం చేయడం తన బాధ్యతగా బాలగోపాల్ నిర్విరామ కృషి ప్రారంభించారు.

అప్పటివరకూ ఎపిసిఎల్ సి నిర్మాణమై ఉన్న పద్ధతిలో హక్కులకోసం అడిగే క్రమంలో హక్కులు కోల్పోయిన వారికి, ప్రధానంగా విప్లవోద్యమకారులకు, విప్లవోద్యమ సానుభూతిపరులైన ప్రజలకు అండగా నిలవడం మాత్రమే ఉండేది. హక్కులకోసం అడిగిన కొద్దీ నిర్బంధం పెరుగుతుందనే మాట, అందువల్ల ఉద్యమకారుల హక్కుల కొరకే ఎక్కువ శ్రద్ధతో పనిచేయాలనే మాట నిజమే. పౌరహక్కుల సంఘం ఆ పనినే ప్రధానబాధ్యతగా ఎంచుకుంటుంది కాని, దానితోపాటు పౌరహక్కుల ఉద్యమ అవగాహనను విస్తరించకపోతే సంస్థ నిర్మాణంలో విస్తృతి సాధించలేమని, సంస్థ కార్యకర్తల అవగాహన లోతు పెంచలేమని బాలగోపాల్ భావించారు. ఆ క్రమంలోనే రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడుతూనే, అసలు సమాజంలో హక్కుల ఉల్లంఘన ఎక్కడెక్కడ జరుగుతున్నదో అధ్యయనం చేయాలని, ఎక్కడెక్కడ ఉల్లంఘన జరిగితే అక్కడల్లా పౌరహక్కుల కార్యకర్తకు పని ఉంటుందని ఆయన భావించారు. రాజ్యం మాత్రమే కాక, ఆస్తి, కులం, మతం, పురుషాధిపత్యం, మత దురహంకారం వంటి శక్తులు కూడ ఆధిపత్య స్థానంలో ఉండి తమ అధీనంలో ఉన్న మనుషుల హక్కులను కొల్లగొడతాయని, అటువంటి ప్రతి సందర్భంలోనూ పౌర, ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘన జరిగినట్టే భావించి, అక్కడ ప్రజల ప్రతిఘటనను సమర్థించాలని, వారి పోరాటాలకు అండగా నిలబడాలని, ఆ పోరాటాలగురించి ప్రజలకు తెలియజెప్పే బాధ్యత తీసుకోవాలని ఆయన అనుకున్నారు. 1983 జనవరిలో వరంగల్ పౌరహక్కుల సంఘం పక్షాన ఆయన తయారుచేసిన ‘పౌరహక్కుల సంఘం దృక్పథం, పరిధి’ అనే వ్యాసం ఆ విషయాన్ని వ్యక్తీకరించింది. 1980 దశాబ్దమంతా పౌరహక్కుల సంఘం చేసిన కృషిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఆ రోజుల్లో ముఖ్యంగా 1985-89 కాలంలో ఎన్ టి రామారావు ప్రభుత్వం ‘ఆట, పాట, మాట బంద్’ అంటూ దారుణమైన నిర్బంధాన్ని ప్రయోగించినప్పుడు, ఒకవైపు ఆ నిర్బంధాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తూనే పౌరహక్కుల సంఘం విభిన్న జీవన రంగాలలోకి, వైవిధ్య పూరితమైన ప్రజాసమస్యలలోకి ప్రవేశించింది. ఆయా రంగాల ప్రజల పోరాటాలను నిర్ద్వంద్వంగా సమర్థించింది. ఆయా రంగాల నుంచి పౌరహక్కుల సంఘానికి సంఘీభావం లభించింది. ఆంధ్రప్రదేశ్ లోనూ, దేశంలోనూ పౌరహక్కుల ఉద్యమ చరిత్రలో ఈ వికాసానికి, విస్తరణకు దారితీసిన అవగాహన అందించినందుకు బాలగోపాల్ స్థానం పదిలంగా ఉంటుంది.

ఈ విస్తరణకు 1990 దశకం వచ్చేసరికి రెండు కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. ఒకటి 1991 జూన్ – జులైల్లో నూతన ఆర్థిక విధానాల పేరుతో మొదలయిన ప్రపంచీకరణ విధానాలు. రెండు, 1992 డిసెంబర్ లో బాబ్రీ మసీదు విధ్వంసంతో మైనారిటీ మతస్తులమీద పెరిగిన హిందూ మతోన్మాద దాడి. ఈ రెండు పరిణామాలు అనేకమంది నిస్సహాయులను బాధితులను చేస్తాయనీ, పౌరహక్కుల ఉద్యమ పరిధిలోకి ఈ రెండు అంశాలు కూడ రావలసి ఉంటుందని గుర్తించిన తొలి మేధావులలో బాలగోపాల్ ఒకరు. ఆ రెండు అంశాలమీదా ఆయన విస్తృతంగా రాశారు, మాట్లాడారు, ప్రజాచైతన్యాన్ని పెంచడానికి విశేషంగా కృషి చేశారు.

దాదాపు ఆ సమయంలోనే ఆయన ఆలోచనలలో మార్పులు రావడం మొదలయింది. అప్పటివరకూ మార్క్సిజాన్ని నమ్ముతూ వచ్చిన ఆయన మార్కిస్టు విశ్లేషణా సాధనాలు ఉపయోగకరమైనవే అయినప్పటికీ, సామాజిక పరివర్తనా సాధనంగా మార్క్సిజం సరిపోదేమోననే సందేహాలు వెలిబుచ్చడం ప్రారంభించారు. మార్క్సిస్టేతర రాడికల్ ఆలోచనా ధోరణికి, బెర్ట్రాండ్ రస్సెల్ ఆలోచనలకు తాను దగ్గరవుతున్నానని చెప్పుకున్నారు. దాదాపు అదే సమయంలో రాజ్యేతర హక్కుల ఉల్లంఘనా శక్తులలో ఉద్యమసంస్థలను కూడ చేర్చాలనే ఆలోచనకు వచ్చారు. కనుక ఉద్యమసంస్థల హింసను, హక్కుల ఉల్లంఘనలను కూడ ఖండించాలన్నారు. ఈ తాత్విక భావనలు, సంస్థాగతమైన ఆచరణాత్మక సమస్యలు కలగలసి, ఆ పరిణామాలలో చివరికి ఆయన పౌరహక్కుల సంఘాన్ని వదిలి మానవహక్కులవేదికను ఏర్పాటు చేశారు.

ఆ వివాదం సమయంలో ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే విషయంలో నాతోసహా ఆయన విమర్శకులందరమూ తీవ్రంగా పొరపాటు పడ్డాం. ఆయన మార్క్సిస్టేతర ఆలోచనల మీద 1999లో పుస్తకం రాసిన నేను ఆయన తిరోగమన దిశలో ఉన్నారని రాశాను.

కాని ఆయన మా ఆలోచనల బోలుతనాన్ని రుజువుచేస్తూ తన అధ్యయనం, రచన, ఆచరణ యథాతథంగానో, అంతకు ముందరి కన్న ఎక్కువగానో కొనసాగించారు. ఉద్యమ సంస్థల మీద విమర్శలు ఉంచుకుంటూనే, ఆ విమర్శలు బహిరంగంగా చెపుతూనే, ఎక్కడ ప్రజాఉద్యమానికి హక్కుల ఉద్యమ మద్దతు అవసరమయినా అక్కడికి వెళ్లారు. గతంలోలాగనే, గతంకన్న ఎక్కువగా కూడ రచనా, ఉపన్యాస కృషి కొనసాగించారు. మానవ హక్కుల వేదికను చాల బలోపేతంచేసి, రాష్ట్రంలోని ముఖ్యమైన పౌర, ప్రజాస్వామిక, మానవహక్కుల ఉద్యమ నిర్మాణంగా మార్చారు.

ఉద్యమ సంస్థల హింసను ఖండించే విషయంలోకూడ ఆయన ఔచిత్యాన్ని, విచక్షణను పాటించారని నా వ్యక్తిగత అనుభవం. ఎల్ టి టి ఇ మీద చివరిదాడి జరుగుతున్న సమయంలో ఆయన, నేను ఒక టివి చర్చలో పాల్గొన్నాం. అప్పుడు ఉన్న వాతావరణంలో ఆయన టైగర్ల హింసను కూడ ఖండిస్తారని నేను అనుమానించాను. ముందు మాట్లాడుతూ, ఇప్పుడు టైగర్ల హింస గురించి చర్చించే సందర్భంకాదు, ఇప్పుడు రాజపక్ష దుర్మార్గ హింస గురించే మాట్లాడాలి అని నేనన్నాను. ఆయన నాతో పూర్తిగా ఏకీభవించడం ఒక గొప్ప ఊరట.

తెలుగు సమాజం 1980లనుంచీ ఈ దశకందాకా పడుతున్న ఘర్షణలో ఎటువంటి మేధావి, వ్యాఖ్యాత, కార్యకర్త, ఉద్యమ నిర్మాతను కోరుకున్నదో సరిగా అటువంటి సమర్థుడైన, అద్భుత ప్రజ్ఞావంతుడైన నాయకుడు బాలగోపాల్. ఆయన స్ఫూర్తి ఎన్నటికీ చెరగదు.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Surya, Telugu and tagged , . Bookmark the permalink.

6 Responses to చెరగని హక్కుల స్ఫూర్తి బాలగోపాల్‌

 1. Praveen says:

  రంగనాయకమ్మ గారు బాలగోపాల్ గురించి వ్రాసిన వ్యాసం చదివాను. మొదట్లో బాలగోపాల్ మార్క్సిస్ట్ లా మాట్లాడేవాడు. తరువాత అతను మార్క్సిజానికి విరుద్ధంగా మాట్లాడడం మొదలు పెట్టాడు. అతను ప్రైవేట్ ఆస్తి వైపే ఇంక్లైన్ అయ్యాడు. పాలక వర్గం పై బాలగోపాల్ చేసిన విమర్శలు విషయంలో మనం బాలగోపాల్ గారి కాంట్రిబ్యూషన్ మరచిపోలేము కానీ ఇతర విషయాలలో బాలగోపాల్ పంథాని అంగీకరించలేము.

 2. Srini Bodduluri says:

  వ్యాసం మొత్తంగా బావుంది. నిడివి మరీ తక్కువగా వుంది. మొదటి వాక్యం మిగతా భాగం కలవలేదు. ఉద్యమాల నేపధ్యంలో హింస గూర్చి భావాలు మారాక ఇంకా ఎక్కువ తిరిగారనే నిర్దారణ ఇంకొంత కాలం అయ్యాక బేరీజు వేయాలనుకొంటా ! నిడివి సరే నాణ్యత ఎంతా అని ?

 3. Mohan says:

  Balagopal udyama samsthala meda pettina vimsarsa nijamainade. Maoist party ayana Cheekati konalu vyasannai refute chestu pustakam pruchurincindi ani chadivanu. Samasya Maoist party lo ne ledu anni partyla lo unnadi (viplava partylu).

  Russell tho chala tatvika, rajakiya chikkulu unnayi – tatasastram lo na modati gurvu Russell ko nenu yeppaitki runapadi untanu – tatvikam ga Russell lo unbhava vada (Empiricist) philosophy loni balahinatha – ontology – spastham ga kanipisthundhi. Locke lo paroksham ga unna bautika vadam, Berkley to pratyaksahga bhava vadam ga marite, Hume lo prapamcham gurnchi, vignanam gurinchi samsayam (skepticism) ha parinamichindi. Russell pradhanamga Hume drukpadani konasaginchadu. Bautika, Bhavavada tho rendu padavala prayanam (mental categories, neutral monism etc) chesadu.

  Idi Russell tatvasastram lo rajakiya acharana lo kuda kanabaduthundi. samagrata (totality), antasambandham (inter-relation) nu tiraskarinichadu. Mari Balagopal Russell lo yedi svikarinchi yedi tiraskarincharo teliyadu.

  Viplavaudayam lo unna tatvika daridrayam lo nunde viluvalapatla kuda instrumental dhorani tala yettindhi. Mana pani viplavodamnanini tiraskarincha kunda dani lopala viluvala koraku poradatam lo undhi. Manam abhimanichi, amitamga preminche, samsthalapatla, vyakthula patla, nikkachi ga vyavarinchadom lo ne nijamaina nibbhatata untundhi.

  Marxism ane label okati undatame duradrusthakaram. Scientific materialist method ani vyavahariste manchidani naa abhiprayam.

 4. Srini Bodduluri says:

  మీ మాటలు బావున్నాయి. కాని అన్ని అర్ధం కాలేదు. విప్లవ ఉద్యమం, భావ దారిద్ర్యం తదితర అంశాలు వివరిస్తే బావుంటుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s