అమెరికా అధినేత శాంతిదూతేనా?

అమెరికా అధ్యక్షుడు బారక్ హుసేన్ ఒబామాకు 2009 నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనున్నట్లు నోబెల్ కమిటీ అక్టోబర్ 9 న చేసిన ప్రకటన ఎంతమందికి సంతోషం కలిగించిందో చెప్పలేము గాని అంతకన్న ఎక్కువమందికి విచారాన్నీ, ఇంకా ఎక్కువమందికి ఆశ్చర్యాన్నీ కలిగించి ఉంటుంది. తనకు ఈ బహుమానం ప్రకటించడం తనను కూడ ఆశ్చర్య పరచిందనీ, తాను అందుకు తగననీ, ఇది తాను చేసిన పనికి గుర్తింపుగా కన్న చేయవలసిన పనికి ప్రేరణగా భావిస్తున్నాననీ స్వయంగా ఒబామానే అన్నాడు. అమెరికా అగ్రరాజ్యపు పెత్తందారీ, దురాక్రమణ, హంతక విధానాలకు బలి అయిపోయిన దేశదేశాల పౌరులు ఆ విధానాలను ఇసుమంత కూడ మార్చని ఒబామాకు శాంతి బహుమానం వచ్చిందంటే అది క్రూర పరిహాసమనుకుంటారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాలలో తొమ్మిదివందలకుపైగా అమెరికన్ సైనిక స్థావరాలు, రెండు లక్షల మంది దాకా సైనిక బలగాలు, లక్షకు పైగా పౌర ఉద్యోగులు ఉన్నారు. ఇరాక్, అఫ్ఘనిస్తాన్ తో సహా కనీసం డజను దేశాలలో ఆ అమెరికన్ సైనిక బలగాలు హత్యలకూ, అత్యాచారాలకూ, హింసకూ, కుట్రలకూ పాల్పడుతున్నాయి. ఆ హంతక విదేశాంగ నీతినే ఆమలు చేస్తున్న అధినేతకు శాంతి బహుమానం రావడాన్ని ఆయాదేశాల ప్రజలు ఎలా స్వీకరిస్తారో ఎవరయినా ఊహించవచ్చు.

అసలు ఒబామాకు ఎందుకీ శాంతి బహుమతి? నార్వేజియన్ నోబెల్ కమిటీ మాటల్లో చెప్పాలంటే, ‘అంతర్జాతీయ దౌత్యసంబంధాలకూ ప్రజల మధ్య సహకారానికీ ఆయన చేసిన దోహదానికి’ ఈ బహుమానం ఇస్తున్నారట. అతి క్లిష్టమైన అంతర్జాతీయ సమస్యలను కూడ చర్చలద్వారా, సంప్రదింపులద్వారా పరిష్కరించాలని ఒబామా అన్నారని, అణ్వస్త్రాల నిరాయుధీకరణ కోసం ప్రయత్నిస్తున్నారని, ప్రత్యేకంగా అణ్వాయుధాలు సంపాదించడానికి ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని ఈ కమిటీ ప్రకటించింది. కాని ఈ నిర్ణయం వెనుక కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలున్నాయి. సాధారణంగా నోబెల్ శాంతి బహుమాన ప్రతిపాదనలు ఒక ఏడాది ముందర మొదలవుతాయి. ఈసారి 2009 బహుమానాలకు గాను అక్టోబర్ 2008 లో ఈ ప్రక్రియ ప్రారంభమయింది. అప్పటికి అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడ జరగలేదు. ఒబామా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ పడుతున్నాడు. ఇక నోబెల్ కమిటీ తన అంతిమనిర్ణయాన్ని నిర్ధారించినది 2009 ఫిబ్రవరి 1న. అప్పటికి ఒబామా అధ్యక్ష పదవిని స్వీకరించి పన్నెండు రోజులు మాత్రమే అయింది. అంటే ఒబామా ఏవేవో చేశాడనీ, అందుకే బహుమతి ఇస్తున్నామనీ నోబెల్ బహుమాన కమిటీ చేసిన ప్రకటనకు అర్థమే లేదు.

సరే, ఆ సాంకేతిక అంశాలు ఎలా ఉన్నా, అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికయిన తొట్టతొలి ఆఫ్రో అమెరికన్ కు, ఒక నల్లజాతి నాయకుడికి ఈ ప్రతిష్టాత్మక, అంతర్జాతీయ గుర్తింపు రావడం దానికదిగా మంచిదేనని భావించే వాళ్లూ ఉన్నారు. నోబెల్ బహుమానాల చరిత్రలో నల్లజాతివారికి, ఆఫ్రో అమెరికన్లకు వచ్చిన బహుమానాలు చాల తక్కువ. గత నూటపది సంవత్సరాలలో ఎనిమిది వందల మందికి బహుమానాలు అందితే, నల్లవారికి అందినవి పన్నెండు మాత్రమే. దీన్ని ఇంకా విడదీసి చూస్తే, భౌతిక, రసాయన, వైద్య శాస్త్రాలలో ఇప్పటివరకూ ఒక్క నల్లజాతీయుడికి కూడ నోబెల్ బహుమానం రాలేదు. అర్థశాస్త్రంలో 64 మంది బహుమతి గ్రహీతలలో ఒకరు, సాహిత్యంలో 106 మందిలో ముగ్గురు, శాంతి బహుమానాలలో 97 మందిలో ఎనిమిది మంది మాత్రమే నల్లజాతీయులు. అంతర్జాతీయ సమాజంలో, ముఖ్యంగా అమెరికా సమాజంలో నల్లజాతి వారి పాత్రతో పోలిస్తే ఈ బహుమానాల నిష్పత్తి చాల తక్కువగా ఉన్నదనేది స్పష్టమే. నల్లజాతివారు ప్రతిభావంతులు కారనే దురభిప్రాయానికి ఇది సూచన. అందువల్ల ఈ ప్రతిష్టాత్మకమైన బహుమతి ఒబామాకు దక్కడం సరయినదేనని అనుకునే వారు ఉన్నారు. ఒక చారిత్రక అన్యాయాన్ని సవరించే ప్రయత్నంగా ఈ బహుమతిని చూసేవారున్నారు.

కాని నాణానికి మరో ముఖం కూడ ఉంది. పుట్టుకతో నల్లజాతి వ్యక్తే అయిన ఒబామా ఇవాళ కేవలం నల్లజాతి వ్యక్తి మాత్రమే కాదు. చరిత్రలోకెల్లా అత్యంత దుర్మార్గమైన అమెరికన్ సామ్రాజ్యవాద విధానాల నిర్వాహకుడు. ప్రపంచ వనరులన్నీ తనకే దక్కాలని, ప్రపంచమార్కెట్లన్నీ తన గుప్పెట్లోనే ఉండాలని అనుకునే అమెరికన్ పాలకవర్గాల కోరికలను తీర్చే ప్రభుత్వాధినేత. ఏ ఇంట్లో కోడి కూసినా తన ఇంట్లోనే తెగాలని అనుకునే మధ్యయుగాల భూస్వాముల లాగ, ఎక్కడ సంపద ఉన్నా అది తన ఖజానాలో డాలరయి రాలాలని అనుకునే పాలకవర్గాల నాయకుడూ ప్రతినిధీ ఒబామా. దేశాల మధ్య చిచ్చుపెట్టి ఆయుధాలు అమ్ముకుంటూ, సైనిక – పారిశ్రామిక సామ్రాజ్యం మీద ఆధారపడుతూ, ప్రపంచాన్ని బెదిరించడానికి తానే స్వయంగా యుద్ధాలకు దిగుతున్న యుద్ధోన్మాద రాజకీయాల నిర్వాహకుడు ఒబామా. నిజానికి ఒక నల్ల జాతీయుడిగా, శాంతివాదిగా, రిపబ్లికన్ల యుద్ధోన్మాదాన్నిఖండించిన డెమొక్రాట్ గా ఒబామాకు ఆ విధానాలను అమలు చేయకుండా ఉండే అవకాశం ఉంది. కనీసం తాత్సారం చేసే ప్రయత్నమయినా మొదలుపెట్టి ఉండవచ్చు. ఆయన ఆ ప్రయత్నం చేస్తాడనీ, ఆ క్రమంలో అమెరికన్ యుద్ధ పరిశ్రమాధిపతులు ఆయనను మట్టుపెడతారనీ కూడ అమెరికన్ పత్రికలలో కొన్ని నెలలకింద ఊహాగానాలు వచ్చాయి.

కాని కొనసాగుతున్న అమెరికన్ యుద్ధోన్మాద విధానాలను తారుమారు చేయడం అలా ఉంచి, వీసమెత్తు మార్పులు కూడ చేయబోనని ఆయన ఈ తొమ్మిది నెలల పాలనలో అమెరికన్ పాలకవర్గాలకు మాటల్లోను, చేతల్లోను హామీ ఇస్తూ వచ్చాడు. తాను అధికారంలోకి వచ్చేనాటికి కొనసాగుతున్న అఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాలను రెంటినీ ఆపివేయకపోవడం మాత్రమే కాదు, అఫ్ఘనిస్తాన్ కు అదనపు బలగాలను పంపడానికి నిర్ణయించాడు. అక్కడ పరిస్థితి గందరగోళంగా ఉన్నదని, మరొక 17,000 మంది అమెరికన్ సైనిక బలగాలను పంపితేనే దాన్ని చక్కదిద్దవచ్చునని ప్రకటించి అమెరికా ప్రపంచ పోలీసు పాత్రలో ఎంతమాత్రం మార్పు లేదని స్పష్టం చేశాడు. గుంటనామో బే లాంటి ప్రపంచ అపఖ్యాతిపొందిన చిత్రహింసా శిబిరాలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించాడు గాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్ చిత్రహింసా శిబిరాలన్నీ యథాతథంగా ఉన్నాయి. ఇరాక్ లో ప్రతిరోజూ కోట్లాది డాలర్ల వ్యయంతో మారణకాండ సాగుతూనే ఉంది. లాటిన్ అమెరికన్ దేశాలలో ప్రజలు ప్రకటిస్తున్న సార్వభౌమత్వాన్ని ధ్వంసం చేయడానికి అమెరికన్ సైనిక బలగాలు, సిఐఎ జరుపుతున్న కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. క్యూబా మీద అమెరికా ఆంక్షలు యథాతథంగా ఉన్నాయి. తానేమో కుప్పలుగా అణ్వాయుధాలు పోగేసుకుని కూచుని, ఇరాన్ కు గాని, ఇతర దేశాలకు గాని అణ్వాయుధాలు తయారు చేసుకునే అధికారం లేదని నీతులు పలికే అమెరికా పాలకవర్గాల అహంకారం చెక్కుచెదరలేదు. కొన్ని డజన్ల దేశాలలో ఇప్పటికీ అమెరికన్ సైనిక బలగాలు తిష్టవేసి ఉన్నాయి. అనేక దేశాల సైనిక బలగాలకు శిక్షణ ఇవ్వడం, సంయుక్త విన్యాసాలు జరపడం చేస్తున్నాయి. ఇతరదేశాల ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నాయి. ఆయా దేశాలలో ప్రజా ఉద్యమాలను అణచడానికి సహాయం చేస్తున్నాయి. లాటిన్ అమెరికా, పశ్చిమాసియా దేశాలలో స్థానిక ప్రజా ఆకాంక్షలను భగ్నం చేయడానికి అన్ని కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికన్ పాలకవర్గాలు ప్రపంచప్రజల ప్రధాన శత్రువు స్థానం నుంచి ఒక్క మిల్లీమీటరు కూడ పక్కకు జరగలేదు. అమెరికా పాలక విధానాలు, ముఖ్యంగా విదేశాంగ విధానంలో గత రిపబ్లికన్ పాలన సమయంలో, బుష్ పాలనా కాలంలో ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. ఆ విధానాలను వ్యతిరేకిస్తూ అధికారంలోకి వచ్చిన ఒబామా ఆ విధానాలలో ఏ ఒక్కదానినీ మార్చలేదు సరిగదా, కనీసం మారుస్తాననే దిశగా ప్రయత్నాలు కూడ ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో చూస్తే ఈ శాంతి బహుమానం అమెరికా అధ్యక్షుడికి అందడం అనుచితం. అమెరికా అధ్యక్షుడిని శాంతి చిహ్నంగా చూడడం ప్రపంచ శాంతి అనేమాటకే అవమానం.

ఇంతకూ నోబెల్ బహుమానాలను అసలు ఇంతగా గౌరవించవచ్చునా అనే చర్చ కూడ ఉంది. విధ్వంసకరమైన డైనమైట్ తయారుచేసి దానితో సంపన్నుడైన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద సాగే ఈ బహుమతి చాలసార్లు అగ్రరాజ్యాలకు, సామ్రాజ్యవాదానికి, బహుళజాతి సంస్థలకు అనుకూలంగా ఉన్నవారికే వచ్చినమాట నిజమే. కాని కొన్నిసార్లయినా ప్రదర్శనావస్తువుగానైనా, సాధికారత సంపాదించుకునే ఉద్దేశంతోనైనా ప్రజాపక్ష మేధావులకు, రచయితలకు ఇచ్చిన ఉదాహరణలున్నాయి. ఆ ఉదాహరణలవల్లనే ఈ బహుమతులకు అంతర్జాతీయ ప్రతిష్ట కూడ వచ్చింది. అది ఒక ముఖ్యమైన అంతర్జాతీయ సూచిక అయింది. అందువల్ల నోబెల్ బహుమతిని గౌరవించినా, గౌరవించకపోయినా దాని ఉచితానుచితాల గురించి ఆలోచించడం, విశ్లేషించడం అవసరం.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Ee Bhoomi, Telugu. Bookmark the permalink.

3 Responses to అమెరికా అధినేత శాంతిదూతేనా?

 1. నాఇష్టం నాది says:

  మీరు మరీను ఒబామా ఎందుకవుతాడు ఐతే గియితే చైనా అధ్యక్షుడు అవ్వాలి కాని ఎందుకంటే కమ్యునిజం అని కాకమ్మ కబుర్లు చెప్పి పెట్టుబడిదారీ వ్యవస్థ ని తమ దేశం లో బలోపేతం చేస్తారు కాబట్టి , ఇంకా పక్క దేశాల సరిహద్దులు తుడిపి అవి కూడా మా దేశంలో బాగమే అని సిగ్గు లేకుండా చెబుతూ, ఆయా దేశ ప్రధానమంత్రులు మా అనుమతి లేకుండా పర్యటించకూడని చెబుతారు కాబట్టి . ఏక మనలాంటి వాళ్ళం “ఇరుగుపొరుగుతో ఎందుకీ యుద్ధోత్సాహం” అని వాళ్ళను సమర్దిస్తాము, మరి మనం మేధావులం కదా? ఇంకా మనం అమెరికాను రోగ్ కంట్రీ అని మాటలలో చెబుతాము , రాతలో వ్రాస్తాము అదే దేశానికి పర్యటనల నిమిత్తం వెళతాం బాగుంది . ఏదేమయినా ఈ వ్యాసం రాయటానికి మీరే అర్హులు ఎందుకంటే పౌరహక్కులు , మానవహక్కులు అని గొంతు చించుకుంటూ మృగాల్లగా సామాన్య జన్నాని , అధికారులను చంపి , ప్రజా అస్తులు మీద తెగబడేవారి కోసం పోరాడతారు కదా అందుకు.

  • srinivas bodduluri says:

   now that you have given vent to your anger, take some time off, sit down and ponder…is your response justified ?

   is your anger based on any data, may not be mathematically precise, but at least some sort of approximation?

   how many common people, officers were killed and ‘people’s properties’ wasted away by the ‘animals’ and why ?

   how many ‘animals’ were killed and why ?

   is the killing alone wrong or the very existence of animals wrong ?

   While you reflect on these issues, for a change let us now get to your problem with this author.

   Why are talking of human rights issues, touring america and demanding that ‘animals’ should not be killed, disqualifcations to talk of obama and peace prize ?

   What according to you is the qualification that a person should posess to write on the topic of Obama and Peace prize ?

   think over…

 2. నాఇష్టం నాది says:

  I know that my above comment is not yet all related with your article, but just I want to show your black.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s