పద్మానది పాడుతున్న విషాదగీతాలు

బంగ్లాదేశ్ స్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రహమాన్ ను హత్య చేసిన హంతకులకు ఎట్టకేలకు ఈ నవంబర్ 19న మరణశిక్ష ఖరారయింది. ముప్పైనాలుగు సంవత్సరాల కింద 1975 ఆగస్ట్ 15 న జరిగిన ఈ హత్యపై మొదటి ఇరవై సంవత్సరాలు విచారణే జరగలేదు. ఆ తర్వాత విచారణ జరిగి ఇరవైమంది నిందితులలో పదిహేనుమందికి కిందికోర్టు మరణశిక్ష విధించగా, ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆ శిక్షను ఖరారు చేసింది.

మరణశిక్ష న్యాయాన్యాయాల చర్చ ఎలా ఉన్నా, రక్తసిక్తమయిన బంగ్లాదేశ్ చరిత్ర పునరావలోకనానికి ఇది ఒక అవకాశం. పొరుగుదేశాల పాలకుల కుతంత్రాల వల్ల, తమ పాలకుల అస్తవ్యస్త విధానాల వల్ల, రాజకీయ నాయకత్వం మీద సైనికాధికారుల ఆధిపత్యం వల్ల ఒక చిన్న దేశం తన నలభై సంవత్సరాల జీవితంలో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చిందో, ఎంత విషాదాన్ని మూటగట్టుకుందో బంగ్లాదేశ్ చరిత్ర తెలియజెపుతుంది. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ గీతం ‘అమార్ షోనార్ బాంగ్లా, అమీ తోమె భాలోబాషి’ ని ఆ దేశం తన జాతీయగీతంగా ప్రకటించుకుంది. కాని ఆ గీతంలో చెప్పుకున్నట్టు అది బంగారు బంగ్లాదేశమూ కాలేదు, దేశప్రజలందరూ ప్రేమించే పాలనా నెలకొనలేదు. ఆ గీతంలోనే చివర చెప్పినట్టు ‘మా, తొర్ బొదొన్ ఖాని మొలిన్ హొలె, అమి నొయెన్ జొలొ భాషి (అమ్మా, నీ ముఖం మీద విషాదఛాయలు కమ్మితే, నా కళ్లలో నీళ్లు నిండుతాయి) అనే మాటే బంగ్లాదేశీయుల పెదాల మీది నిరంతర పల్లవి అయింది.

బంగబంధుగా, బంగ్లాదేశ్ జాతిపితగా పేరు తెచ్చుకున్న షేక్ ముజిబుర్ రహమాన్ ప్రత్యేక దేశాన్ని ఏర్పరచి, అధ్యక్షుడై నిండా నాలుగు సంవత్సరాలు గడవకముందే కుటుంబ సభ్యులందరితో సహా హత్య చేయబడ్డాడు. ఆ తర్వాత గడిచిన మూడున్నర దశాబ్దాలలో కనీసం అరడజను సార్లు సైనికకుట్రలు విజయం సాధించాయి. రెండు డజన్ల సార్లు సైనికకుట్రలు జరిగి విఫలమై ఉంటాయని అంచనా. కనీసం ముగ్గురు దేశాధ్యక్షులు, మరెంతో మంది ఉన్నతాధికారులు హత్యలకు గురయ్యారు. ఆ దేశంలో జరిగిన రాజకీయ కల్లోలాల వెనుక ఇటు భారత ప్రభుత్వమో, అటు పాకిస్తాన్ ప్రభుత్వమో, కాకపోతే చైనా ప్రభుత్వమో, అమెరికా గూఢచార సంస్థ సిఐఎ నో ఉన్నాయని ఎందరో స్వతంత్ర పరిశోధకులు రాశారు. ఏ కలలతో దేశం ఏర్పడిందో ఆ కలలు నెరవేరలేదు సరిగదా, దేశం అతి భయంకరమైన దారిద్ర్యాన్ని, అవిద్యను, నిరుద్యోగాన్ని, అభివృద్ధిరాహిత్యాన్ని, కల్లోలాన్ని అనుభవిస్తున్నది. ప్రజల నిత్యజీవిత, వాస్తవిక సమస్యలను తీర్చలేని పాలకులు వారికి మత ఛాందసవాద కలలు అమ్మి పబ్బం గడుపుకుంటున్నారు. ఈ మానవ నిర్మిత కల్లోలాలతో పాటు ప్రకృతి కూడ ఆ దేశం మీద పగబట్టింది. అటు బ్రహ్మపుత్ర (స్థానికంగా జమున అనిపిలుస్తారు), ఇటు గంగ (స్థానికంగా పద్మ అని పిలుస్తారు) ప్రతి సంవత్సరం వరదలతో దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాలలో సగం తిరిగి తిరిగి బంగ్లాదేశ్ తీరానికే చేరి ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇలా ప్రకృతి నుంచీ, పాలకుల నుంచీ, పొరుగుదేశాలనుంచీ రాపిడికి గురవుతున్న పదహారు కోట్ల ప్రజల దేశం బంగ్లాదేశ్.

బంగ్లాదేశ్ 1971 డిసెంబర్ కు ముందు ఉనికిలో లేదు. అప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలుగా పాకిస్తాన్ లో భాగంగా ఉండిన తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర రాజ్యంగా 1971 డిసెంబర్ లోనే ఆవిర్భవించింది. నిజానికి అప్పటివరకూ దాన్ని తూర్పు పాకిస్తాన్ అని పిలవడానికి కూడ అక్కడి ప్రజలు అంగీకరించేవారు కాదు. తూర్పు బెంగాల్ అని పిలుచుకునేవారు. (నిజానికి అది పరాయి దేశంలో భాగమయినా, భారతదేశంలో మరొక తూర్పు బెంగాల్ లేకపోయినా మనం కూడ మన రాష్ట్రం పేరు అధికారికంగానే పశ్చిమ బెంగాల్ అని ఇప్పటికీ వ్యవహరిస్తున్నాం). ఆ బంగ్లాదేశ్ ఏ న్యాయమయిన ఆకాంక్షలతో పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశమయిందో ఆ ఆకాంక్షలన్నిటినీ పాలకవర్గాలు వక్రీకరించాయి. ప్రజలు దశాబ్దాల పాటు జరిపిన ఉజ్వల పోరాటాలను వంచించాయి.

నిజానికి ఈ వక్రీకరణకూ, వంచనకూ, కుట్రకూ బీజం వేసినది బ్రిటిష్ వలసవాదులు కాగా భారతప్రభుత్వంతో సహా పొరుగుదేశాల ప్రభుత్వాల చాణక్యనీతి, స్వదేశ పాలకుల, సైనికాధికారుల స్వార్థరాజకీయాలు ఆ విషబీజాన్ని మహావృక్షం చేశాయి. భారతదేశం వదిలివెళ్తూ బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన దేశవిభజన ప్రణాళిక ప్రకారం రెండువేలమైళ్ల దూరంలో విడివిడిగా ఉన్న రెండు భూభాగాలు కలిసి మతప్రాతిపదిక మీద పాకిస్తాన్ ఏర్పడింది. పశ్చిమ పాకిస్తాన్ లో ఉండే ప్రభుత్వాధికార పీఠానికీ, రెండువేల మైళ్ల అవతల ఉండే పాలనా ప్రాంతానికీ సరాసరి ప్రయాణ సౌకర్యం కూడ లేదు. మధ్యలో ఎప్పుడూ యుద్ధమేఘాలు కమ్ముకుని ఉండే ‘శత్రు దేశం’ ఉంది. అలా విడివడిన ఆ రెండు ముక్కలలోనూ అత్యధిక సంఖ్యాక ప్రజల మత విశ్వాసాలు ఒకటే కావచ్చుగాని, భాషలు వేరు, సంస్కృతులు వేరు, చరిత్ర వేరు, అనుబంధాలు వేరు. అందువల్లనే తూర్పు పాకిస్తాన్ తనను తాను పాకిస్తాన్ లో అంతర్భాగాన్నని ఎన్నడూ అనుకోలేదు. తన భాష బంగ్లా అనే అనుకుంది. తన మీద ఉర్దూ ఆధిపత్యం వద్దని అనుకుంది. రెండు ప్రాంతాలలో భిన్న రాజకీయ సంస్కృతులు సాగాయి. తూర్పు పాకిస్తాన్ బెంగాలీలు తమ పట్ల కొనసాగుతున్న వివక్షను ప్రతిఘటించారు. ఆ ప్రతిఘటనకు రాజకీయ వ్యక్తీకరణగా పుట్టుకొచ్చిన అనేక పార్టీలలో ముజిబుర్ రహమాన్ నాయకుడిగా అభివృద్ధి అయిన అవామీ లీగ్ ఒకటి.

ఆశ్చర్యకరంగా, అటువంటి భిన్న రాజకీయ సంస్కృతులే కాశ్మీర్ లోనో, ఈశాన్య ప్రాంతంలోనో వ్యక్తమయితే బలప్రయోగం ద్వారా, కుట్రలద్వారా అణచివేసిన భారత పాలకవర్గాలు, తూర్పు పాకిస్తాన్ లోని అసంతృప్తికి మాత్రం ఆజ్యం పోశాయి. పాకిస్తాన్ ను బలహీనపరచడానికి ‘శత్రువుకు శత్రువు మిత్రుడు’ అనే చాణక్యనీతిని అవలంబించి, తూర్పు పాకిస్తాన్ ప్రజా ఉద్యమానికి ఆర్థిక, సైనిక, నైతిక సహాయం అందించాయి. తమ పాలనలోని ప్రజాఉద్యమాలను నెత్తురుటేర్లలో ముంచినవారే పొరుగుదేశంలోని ప్రజాఉద్యమానికి సహకరించడం గుర్తించవలసిన, అనుమానాస్పదమైన వైరుధ్యం. మరొకవైపు పాకిస్తాన్ పాలకులు, ముఖ్యంగా సైనిక పాలకులు, తూర్పు పాకిస్తాన్ మీద అమలుచేసిన దమననీతి వల్ల అక్కడ ప్రజాఉద్యమం విస్తృతమయింది. ఆ ఉద్యమమే ముజిబుర్ రహమాన్ ను బంగబంధుగా మార్చింది.

పాకిస్తాన్ ప్రభుత్వం ముందర ప్రజల న్యాయమైన ఆకాంక్షలను ప్రకటించడం, చర్చలు జరపడం, ఎన్నికలు, కుతంత్రాలు, ఎన్నికల ఫలితాలను పాకిస్తాన్ పాలకులు ఆమోదించకపోవడం, ఎన్నోసార్లు ముజిబుర్ రహమాన్ జైలు నిర్బంధాలు, విచారణలు, జైలుశిక్షలు అన్నీ సాగి, చిట్టచివరి అస్త్రంగా అవామీలీగ్ సాయుధ గెరిల్లా పోరాటానికి దిగింది. తూర్పు పాకిస్తాన్ లోని సైన్యంలో గణనీయమైన భాగం పోరాటకారులతో చేతులు కలిపింది. ముక్తిబాహిని ఏర్పడింది. ఆ ముక్తిబాహినికి సహకరించడానికి ఇందిరాగాంధీ భారతసైన్యాన్ని పంపించింది.

అలా ఆవిర్భవించిన బంగ్లాదేశ్ తొలిప్రధానిగా ముజిబుర్ రహమాన్ సోషలిజం, లౌకిక ప్రజాస్వామ్యం పునాదిగా పాలన ప్రారంభించారు. కాని అతిత్వరలోనే మిగిలిన రాజకీయ పార్టీలన్నిటినీ నిషేధించి, ప్రభుత్వ పత్రికలను మినహా ఇతర పత్రికలన్నిటినీ నిషేధించి నియంతృత్వ పాలన ప్రారంభించారు. రాజ్యాంగాన్ని మార్చి తనను తాను శాశ్వత జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఈ లోగా బంగ్లాదేశ్ రాజకీయ చదరంగంలో భారతదేశం, పాకిస్తాన్, చైనా, సోవియట్ యూనియన్, అమెరికా తమ తమ ఎత్తులు, జిత్తులు ప్రారంభించాయి. చదరంగపు బల్ల కుక్కలు చింపిన విస్తరి అయిపోయింది. దేశ అభివృద్ధి వ్యూహం, ప్రజల సంక్షేమం, అప్పటివరకూ కొనసాగిన వివక్షను రద్దుచేసే విధానాలు అమలు లోకి రానేలేదు. ముజిబ్ పాలన నాలుగు సంవత్సరాలలోనే తీవ్రమైన అసంతృప్తిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆ అసంతృప్తి నేపథ్యంలో సైన్యం జోక్యం పెరిగింది. ముజిబ్ హత్య జరిగింది. 1975 ఆగస్ట్ 15 న అధ్యక్ష భవనంలో జరిగిన ఆ హత్యాకాండలో ముజిబుర్ రహమాన్ ను, ఆయన సతీమణిని, వారి ముగ్గురు కొడుకులను, ముజిబుర్ సన్నిహిత బంధువులు ఇద్దరిని హత్య చేశారు. ఆ సమయానికి ఆయన కూతుళ్లు ఇద్దరూ విదేశాలలో ఉన్నందువల్ల హత్యను తప్పించుకున్నారు. ఆ కూతుళ్లలో ఒకరయిన షేక్ హసీనా 1996 ఎన్నికలలో ప్రధానమంత్రి అయి, తన తండ్రి హత్యను విచారించడానికి ఆటంకంగా ఇరవై సంవత్సరాలుగా ఉన్న చట్టాన్ని రద్దుచేసి, విచారణకు ఆదేశించారు. అలా మొదలయిన విచారణ ప్రస్తుతానికి ఒక తార్కిక ముగింపుకు చేరింది. ముజిబుర్ రహమాన్ జీవితానికో, హంతకుల జీవితానికో ఇది ముగింపు కావచ్చుగాని, ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయాల పూర్వరంగంలో పేదదేశాల పాలన గురించి, విధానాల గురించి ఆలోచించడానికి ఇది ఒక అవకాశం మాత్రమే. ప్రజల స్వాతంత్ర్యాకాంక్ష నెరవేరడానికి ఎన్ని ఆటంకాలున్నాయో, నెరవేరినట్టు కనిపించిన చోట కూడ మళ్లీ ఎన్ని కుహకాలు జరిగే అవకాశం ఉన్నదో ఈ చరిత్ర వివరిస్తున్నది. నిరంతర జాగరూకతే ప్రజాస్వామ్యానికి మూల్యం అన్న మాట ఎంతగా ప్రత్యక్షర సత్యమో ఈ చరిత్ర చూపుతున్నది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu. Bookmark the permalink.

One Response to పద్మానది పాడుతున్న విషాదగీతాలు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s