ప్రజల మధ్య విద్వేషం వద్దు

(ఈ వ్యాసం డిసెంబర్ 10 న కోస్తాంధ్ర, రాయలసీమలలో విద్యార్థుల ఆందోళన ప్రారంభమయిన తర్వాత, డిసెంబర్ 12 న రాసినది. ఆంధ్రజ్యోతి దినపత్రిక అచ్చువేయలేదు.)

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రయత్నాలు మొదలు పెట్టనున్నామని బుధవారం రాత్రి కేంద్ర హోం మంత్రి పళనియప్పన్ చిదంబరం ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కొంత ఊహించినట్టుగానూ, కొంత ఆశ్చర్యకరంగానూ -మొత్తం మీద విషాదకరంగా ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా విద్యార్థులు, ప్రజలు ‘సమైక్య ఆంధ్ర’ కొరకు ఆందోళన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొన్ని చోట్ల ఉత్తరాంధ్ర, గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాల కోసం కూడ డిమాండ్లు వినబడుతున్నాయి. ప్రజల దృష్టిని అసలు సమస్యనుంచి పక్కదారి పట్టించగల పాలకుల కుటిలనీతి మరొకసారి వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రజలకూ ఆంధ్రప్రదేశ్ పాలనా విధానాలకూ మధ్య మొదలయిన యుద్ధాన్ని తెలంగాణ-కోస్తాంధ్ర-రాయలసీమ ప్రజల మధ్య అంతర్యుద్ధంగా మార్చి తప్పించుకోవడానికి పాలకులు చేస్తున్న పన్నాగాలు వీథుల్లో కనబడుతున్నాయి. తెలంగాణ ప్రజలు తమను దోపిడీ చేసిన పాలకులపై, పాలకవిధానాలపై ప్రారంభించిన ఉద్యమం ఒక కీలకదశకు చేరినట్టు కనిపించగానే ఈ దురదృష్టకరమైన నాటకం మొదలయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలకు వ్యతిరేకంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా పాలకవర్గాలు, సమైక్యాంధ్రప్రదేశ్ ద్వారా లాభపడే రాజకీయార్థిక శక్తులు అసలు విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నాయి. ఎంతమాత్రం శత్రుత్వం ఉండనవసరంలేని ప్రజల మధ్య విద్వేషాన్ని సృష్టిస్తున్నాయి. తెలుగుజాతి ఐక్యత పేరిట అనైక్యత మంటలను ఎగసన దోస్తున్నాయి.

ఈ పూర్వరంగాన్ని గుర్తించి కోస్తాంధ్ర, రాయలసీమ ఆందోళనకారులు తమ అవాంఛనీయమైన ఉద్రేకాలను తొలగించుకోవలసి ఉంది, పునరాలోచించుకోవలసి ఉంది. ముఖ్యంగా స్వచ్చమైన, అమాయకమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థులు అసలు తాము ఏమి కోరుతున్నారో ఆలోచించుకోవలసి ఉంది. సమైక్య రాష్ట్రంలో తమ న్యాయమైన వాటా తమకు దక్కలేదని, న్యాయం చేస్తామని ఇచ్చిన హామీలు, వాగ్దానాలు బుట్టదాఖలు అయ్యాయని, అందువల్ల విభజన తప్ప గత్యంతరం లేకపోయిందని నలభై సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ వనరుల దోపిడీ ఎలా జరిగిందో గణాంకాల ద్వారా వివరించిన అధ్యయనాలు ఎన్నో ఉన్నాయి. అది భూమి కావచ్చు, జలవనరులు కావచ్చు, ఖనిజవనరులు కావచ్చు, విద్యావకాశాలు కావచ్చు, ఉద్యోగావకాశాలు కావచ్చు, ప్రజాధనం కెటాయింపులు కావచ్చు – ఏ ఒక్క రంగంలోనూ తెలంగాణ వాటా తెలంగాణకు దక్కలేదు. తెలంగాణ నుంచి తీసుకున్న దానిలో సగమో పావో కూడ తెలంగాణకు తిరిగి ఇవ్వలేదు. తమ వాటా గురించి అడగడం ఎక్కడైనా ఎప్పుడైనా న్యాయమైన ఆకాంక్ష గనుక ఆ ఆందోళనకు ఒక పునాది ఉంది.

మరి ఇవాళ కోస్తాంధ్ర, రాయలసీమలలో జరుగుతున్న ఆందోళనకు పునాది ఏమిటి? ఆ పునాది ‘ఒకే జాతి’ భావన అనుకుంటే, ఆ ఐక్యతను భగ్నం చేసిన ప్రధాన బాధ్యత కోస్తాంధ్ర, రాయలసీమ పాలకులదే తప్ప తెలంగాణ ప్రజలది కాదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ యథాతథంగా ఉండలేని స్థితి ఎందువల్ల ఏర్పడిందో ఇవాళ్టి ఆందోళనకారులు తెలుసుకోవాలి. షరతుల మీద ఏర్పడిన సమైక్య రాష్ట్రంలో ఆ షరతులలో ఏ ఒక్కటీ అమలు కాక అనివార్యమైన పరిస్థితిలోనే రాష్ట్ర విభజన డిమాండ్ పుట్టుకొచ్చింది. కనుక ఇవాళ మళ్లీ సమైక్య రాష్ట్రం అనేమాటకు అర్థం లేదు.

లేదా, ‘వివక్ష, దోపిడీ, అన్యాయం, వాగ్దానాల ఉల్లంఘన జరగలేదు, కనుక ఐక్యంగా ఉందాం’ అనే అబద్ధపు పునాది మీదనైనా ఇవాళ్టి ఆందోళనను నిర్మించాలి. లేక ‘ఆ వివక్ష, దోపిడీ, అన్యాయం, ఉల్లంఘన మా పాలకులు ఇంకా సాగిస్తారు, అందుకోసం కలిసి ఉండండి’ అనే అనైతిక పునాది మీదనైనా ఆందోళన నిర్మించాలి. నిజానికి ఇవాళ ఆందోళన సాగిస్తున్న వారిలో చాలమందికి ఆ వివక్షలో, దోపిడీలో, అన్యాయంలో, ఉల్లంఘనలలో పాత్రే లేదు, వాటితో వారు లాభపడిందీ లేదు. లాభపడిందల్లా కోస్తాంధ్ర, రాయలసీమ పాలకులు, వారి అంటకాగిన పిడికెడు మంది తెలంగాణ పాలకులు. ఆ పాలకుల చేతిలో మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలు ఎంత నష్టపోయారో, నాలుగున్నర కోట్ల కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలూ అంతగానే నష్టపోయారు.

యాభైమూడేళ్ళ ఆంధ్రప్రదేశ్ పాలనా విధానాల వల్ల నిజంగా లాభపడినది కోస్తాంధ్ర, రాయలసీమల లోని సంపన్నులు, వారి మోచేతి నీళ్లు తాగిన తెలంగాణ సంపన్నులు, పాలకుల ఆశ్రితులు. కొనసాగిన రాజకీయార్థిక విధానాల వల్ల హైదరాబాద్ మినహా తెలంగాణ, రాయలసీమలో అత్యధిక భాగం, విశాఖపట్నం మినహా ఉత్తరాంధ్ర, మొత్తంగా పల్నాడు ఏ అభివృద్ధికీ నోచుకోలేదు. ప్రజల కనీస అవసరాలు తీరలేదు. ఈ ప్రాంతాల వనరులన్నీ స్థానికుల అనుభవంలోకి రాకుండా పోయాయి. బహిరాగతులకు దక్కాయి. ఆ బహిరాగతులు ఒక ప్రాంతంలో కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల సంపన్నులు కావచ్చు. మరొక ప్రాంతంలో నెల్లూరువారో, కడపవారో కావచ్చు. లేదా దేశదేశాల సంపన్నులు కావచ్చు. ఈ బహిరాగతుల దోపిడీ పీడనలను ఎదిరించి, తమ స్వయం నిర్ణయాధికారం కోసం, తమ వనరుల మీద తమ అధికారం కోసం తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, పల్నాడు ప్రాంత ప్రజలు చేసే ఏ పోరాటమైనా న్యాయమైనదే. తెలంగాణలో ఆ ఆకాంక్షలు, పోరాటాలు 1954 నుంచీ, 1969 నుంచీ, మళ్లీ 1996 నుంచీ ఉన్నాయి గనుక వాటికి విస్తృతీ, బలమూ ఉన్నాయి. ఉత్తరాంధ్రలోనూ రాయలసీమలోనూ కనీసం ఇరవై సంవత్సరాలుగా ఆ ఆలోచనలు ఉన్నాయి. అలా తమ తమ ప్రాంతాల, ప్రజల అభివృద్ధి కోసం, అంటే తమ నీటిపై, నిధులపై, నియామకాలపై, వనరులపై తమకే అధికారం అని ఎవరయినా కోరవచ్చు. ఆ కోరికలు సమైక్య రాష్ట్రంలో తీరకపోతే రాష్ట్ర విభజన కూడ కోరవచ్చు. గ్రామస్వరాజ్యాన్ని, స్వయంసమృద్ధగ్రామాన్ని ఊహించిన జాతీయోద్యమం సాగినచోట ఇందులో అసహజమేమీ లేదు. అంతేగాని, ఆ న్యాయమైన, ప్రజాస్వామికమైన, సహజన్యాయసూత్రాలకు అనుగుణమైన ప్రజా ఆకాంక్షలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగడం అన్యాయం, అనైతికం, అసహజం.

నిజానికి ఇవాళ కోస్తాంధ్రలో, రాయలసీమలో ఆందోళనలను రెచ్చగొడుతున్న రాజకీయపక్షాలకూ, శాసనసభ్యులకూ కూడ సమైక్యరాష్ట్రంమీద ప్రేమ ఏమీలేదు. వారందరూ 2004 లోనో, 2009 లోనో రాష్ట్ర విభజనను ఎన్నికల ప్రణాళికలలో రాసుకుని ప్రజలదగ్గరికి వెళ్లినవాళ్లే. వారి నిజమైన ప్రేమల్లా హైదరాబాద్ లోని తమ ఆస్తుల మీద. అనేక చారిత్రక కారణాల వల్ల 1990ల దాకా, ప్రపంచీకరణ క్రమంవల్ల ఆ తర్వాతా హైదరాబాద్ దేశదేశాల సంపన్నుల అడ్డాగా మారింది. ఇక్కడ లక్షల కోట్ల రూపాయల సంపద పోగుపడింది. తెలంగాణ ఏర్పడితే ఆ రాజకీయార్థిక ప్రయోజనాలు ఏమన్నా దెబ్బతింటాయేమో అనే ధ్యాస తప్ప వారికి హైదరాబాద్ మీద కూడ ప్రేమ లేదు. ఇవాళ సమైక్యాంధ్ర, తెలుగుజాతి అంటున్న సంపన్నులందరికీ ఉత్తరాదిలోనూ, కర్ణాటకలోనూ, తమిళనాడులోనూ, విదేశాలలో కూడ వేలకోట్లరూపాయల ఆస్తులున్నాయి. రాజకీయార్థిక ప్రయోజనాలున్నాయి. ఆ ఆస్తుల సంచయంలో, పరిశ్రమల స్థాపనలో కనబడని జాతిభావన ఇవాళ ఎందుకు కనబడుతున్నదో, ఎందుకు తమను రెచ్చగొడుతున్నారో విద్యార్థులు వారిని అడగవలసి ఉంది. ఆ పిడికెడుమంది రాజకీయార్థిక ప్రయోజనాల కొరకు తాము ఎందుకు ఆందోళన జరపాలో ప్రజలు, విద్యార్థులు పునరాలోచించుకోవలసి ఉంది.

నిజానికి భౌగోళిక సమైక్యత ద్వారా మాత్రమే మానసిక ఐక్యత రాదని యాభై ఏళ్ల భౌగోళిక సమైక్యత రుజువు చేస్తూనే ఉంది. ఆ మానసిక ఐక్యత సాధించకుండా సమైక్యరాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదని 1954లో ఫజల్ అలీ అన్నారు. తెలంగాణ ప్రజల అనుమానాలను తొలగించే విషయంలో వారిని నమ్మించలేకపోతున్నామని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే నీలం సంజీవరెడ్డి అన్నారు. ఆ తెలిసిన విషయాలనే ఆ తరవాత యాభై సంవత్సరాలు విస్మరించినందువల్లనే ఇవాళ్టి సమస్య తలెత్తింది.

మొత్తం మీద ఇది తెలంగాణ ప్రజలకూ పాలకులకూ మధ్య, ఐదు దశాబ్దాలకు పైగా సాగుతున్న పాలకవిధానాలతో ఘర్షణే గాని తెలంగాణ ప్రజలకూ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలకూ మధ్య ఘర్షణ కాదు. నిజానికి తెలంగాణకు ద్రోహం చేసిన పాలకులు ఉత్తరాంధ్రకూ, పల్నాడుకూ, రాయలసీమలో అనేక ప్రాంతాలకూ కూడ ద్రోహం చేస్తున్నారు. ఆ ద్రోహాన్ని గుర్తించి నాలుగు దశాబ్దాలుగా పోరాడుతున్న తెలంగాణకు రాజకీయ పరిష్కారాన్ని తక్షణం చూపవలసి ఉంది. తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షలను మొత్తం తెలుగుజాతి మాత్రమే కాదు, అణచివేతకూ దోపిడీకీ పీడనకూ గురవుతున్న ప్రజలందరూ సమర్థించవలసి ఉంది. ఇది కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమలలో కూడ అత్యధిక ప్రజానీకం సమర్థించవలసిన, సంఘీభావం ప్రకటించవలసిన, పాల్గొనవలసిన సమస్య. ఇది ప్రాంతీయ విద్వేషాల సమస్య కాదు, అన్ని ప్రాంతాల ప్రజలు సంఘీభావం ప్రకటించవలసిన న్యాయమైన ఆకాంక్షల సమస్య.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telangana, Telugu. Bookmark the permalink.

13 Responses to ప్రజల మధ్య విద్వేషం వద్దు

 1. >>నిజానికి ఇవాళ కోస్తాంధ్రలో, రాయలసీమలో ఆందోళనలను రెచ్చగొడుతున్న రాజకీయపక్షాలకూ, శాసనసభ్యులకూ కూడ సమైక్యరాష్ట్రంమీద ప్రేమ ఏమీలేదు

  నిజం

  >>మొత్తం మీద ఇది తెలంగాణ ప్రజలకూ పాలకులకూ మధ్య, ఐదు దశాబ్దాలకు పైగా సాగుతున్న పాలకవిధానాలతో ఘర్షణే గాని తెలంగాణ ప్రజలకూ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలకూ మధ్య ఘర్షణ కాదు

  ఈ విషయం అందరూ గ్రహిస్తే బావుణ్ణు

  >>ఇది ప్రాంతీయ విద్వేషాల సమస్య కాదు, అన్ని ప్రాంతాల ప్రజలు సంఘీభావం ప్రకటించవలసిన న్యాయమైన ఆకాంక్షల సమస్య

  agree with you

  What is the solution. Is separation the only solution?

  I oppose separation. Instead, we can make amendments to the constitution or pass new bills in parliament that will grant the privileges and rights to utilize funds/resources on equal terms to all the three regions. In the current set-up, it might be the case that “democracy did not work in favor of telangana. It could happen when kosta-seema lobby for their share.

  Is this what the “gentleman’s” agreement supposed to do?

  If yes, why can not a legal action can be taken and govt can be dissolved or impeached on the basis of violating the constitution or is it (flouting the agreement, what ever that is) just the handy-work of the TRS propaganda machinery?

 2. meeru nijam matlaadaru… dhanyavaadalu

 3. k.n Mohan says:

  It is meaningless to talk of unity when there are specific grievances that have been ignored. Hyderabad is a probelm and there is the feeling of nationhood that many have grown up with. None of these are an answer to the problems raised by the people of Telangana.

  If real unity has to be developed, it has to be with the involvement of Telangana not by ignoring them. Revolutionaries have been most backward in this – they have been tailing social developments rather than leading or anticipating them. If the present phase of the agitation fizzles out, let those speaking of unity form a panel/s of persons to ensure transparent justice for Telangana and other regions as well.

  The issues raised by Telangana are known – probably not well known outside Hyderabad – river waters, employment and share in revenues. Let the groups advocating unity form a forum for monitoring and advocacy on these problems. Unity cannot be imposed it has to be voluntary.

 4. Sravya Vattikuti says:

  మొత్తం మీద ఇది తెలంగాణ ప్రజలకూ పాలకులకూ మధ్య, ఐదు దశాబ్దాలకు పైగా సాగుతున్న పాలకవిధానాలతో ఘర్షణే గాని తెలంగాణ ప్రజలకూ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలకూ మధ్య ఘర్షణ కాదు.
  >>ఇదే నిజమైతే “మీలాంటి మేధావులు” అంతా ఎందుకు కెసిఆర్, నాయని లాంటి నాయకులూ చేసే అడ్డగోలు కామెంట్లు ఎందుకు ఖండిచటం లేదు .
  రాజకీయార్థిక ప్రయోజనాలున్నాయి. ఆ ఆస్తుల సంచయంలో, పరిశ్రమల స్థాపనలో కనబడని జాతిభావన ఇవాళ ఎందుకు కనబడుతున్నదో, ఎందుకు తమను రెచ్చగొడుతున్నారో
  >>ఇక్కడే కనపడుతుంది మీ రెండు నాలికల దోరణి, తెలంగాణా విద్యార్దులు చేస్తే అది నిజమైన ఉద్యమం , ఆంధ్ర , రాయలసీమ ప్రాంత విద్యార్దులు చేస్తే అది ఎవరో రెచ్చగొట్టటం .
  ఉత్తరాంధ్రలోనూ రాయలసీమలోనూ కనీసం ఇరవై సంవత్సరాలుగా ఆ ఆలోచనలు ఉన్నాయి. అలా తమ తమ ప్రాంతాల, ప్రజల అభివృద్ధి కోసం, అంటే తమ నీటిపై, నిధులపై, నియామకాలపై, వనరులపై తమకే అధికారం అని ఎవరయినా కోరవచ్చు
  >> ఇది మాత్రం నిజమే ఈ విభజన తరవాత జరిగేది అదే , offcourse మీలాంటి వాళ్ళందరూ ఎదురు చూసేది దాని కోసమే కదా?

 5. chavakiran says:

  >> ప్రజల మధ్య విద్వేషం వద్దు
  అయితే కలిసి ఉండాలి. మీ లాంటి మేతావులు ఇంత దాకా పరిస్థితి తెచ్చారు. సమస్య ఒకటయితే , మందు ఒకటి ఇస్తున్నారు.

  >> ప్రజల దృష్టిని అసలు సమస్యనుంచి పక్కదారి పట్టించగల పాలకుల కుటిలనీతి మరొకసారి వ్యక్తమవుతోంది.
  కేసీఆర్ చేసినట్టు అందరూ చేస్తారనుకున్నారా మేధా గారు.

   ఈ దురదృష్టకరమైన నాటకం మొదలయింది
  అసలు తెలంగాణా ఉద్యమమే పెద్ద నాటకం. ఒక్కసారి కళ్లు తెరచి చూడండి.
   తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలకు వ్యతిరేకంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా పాలకవర్గాలు
  తెలంగాణా తెలంగాణా అని రెచ్చగొట్టిన ఈ తెలబాన్లు విషం మెదళ్లలోకి ఎక్కిస్తున్నప్పుడు మీ కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడ తీరిగ్గా కళ్లు తెరచి జనాలను రెచ్చగొడుతున్నారు అని అంటున్నారు.

  ఇలా మీ వ్యాసం మొత్తం పక్షపాత బద్దమై నీచంగా నికృష్టంగా ఉంది, దానికి ఇంతకంటే ఎక్కువ సమయం పెట్టడం వృధా.

 6. k.n Mohan says:

  Ikkada vrasina variki.

  Amma, Ayya, Telangana vishaym lo KCR gari sachhilata gurinchi charchinchanavasarm ledu – ayana vadina basha lone ayana guna ganalu kirtimcha vacchu. Prjala meda kakunda Khammam ekkadundo Guntur ekkadundo teliyani Sonia Gandhi chuttu tiriginapude ayana sangathi telusthundi. Thanakante balamaina dopididarula poti thatukoleni vyvaharam idi.

  Mari andolana sangathi yemiti ? saagu neeru (pandithula basha lo nadi jalalu), udyogalu, revenue karchula matemiti ?

  Guntur zilla lo putti, Hyderabad lo jivinchi, kosta prantham kante Telangana zillala lo ne ekkeuvaga thirigina naa lanti vaariki idi bhadakaramaina vishayame, aina, idi ye okkari sentiments ku parmithamaina vishayam kaadu.

  Verpatu valla nyayam jaruguthunda ante anumaname – edo oka prajaswamika nirmanam adhikarika nirmananiki pryatnmamga yedigithe jaragavachu. Danini kosam prayatnichavalasina vaaru pradhimikamga Telangana loni prajalu. A prayatnam jaruthuna dhakala lu levu – mana viplavakarulu Sundarayya, Nagi Reddy kalam kante de-generate avyyaru.

  Ye motham andolana valla kanisam oka kotha prajaswamika chaitnayam yerpadithe ade kontha melu.

 7. ఏమయ్యా ‘చావ కిరణ్’, “నీతోటి విభేదించినా కానీ, నీ హక్కులకోసం కొట్లాడుత” అన్న మనిషికి ఇచ్చే మర్యాద ఇదేనానయ్యా? ఇదేనా నీ సమైక్యతా సహృద్భావం?

  సమైక్యత అంటున్న పైవాల్లందరిని అడుగుతున్న “నీల్లు, నిధులు, నియామకాలల్ల” మాకు జరిగిన అన్యాయాలమీద మా పోరాటం అని గొంతు చించుకొని బొంగురు పోయేదాక చెప్పినా మీకు అర్థంకాదు? మేము అడిగే ఒక్క ప్రశ్నకు మీదెగ్గర జవాబులేదు? ప్రతిదానికి “ఒకటే భాష కలిసుందాం” అంటెరే తప్ప, ఒక్కడన్న” జరిగిందేదో జరిగిపోయింది ఇకమీదనన్నా ఈ పోరబాట్లు జరగనియ్యం” అని ఒక్కడన్న అన్నడా? ఎవ్వని ఆస్తులు వాడు పైలం జేసుకోనీకి ఉరికె. అసొంటప్పుడు ఏందయ్యా కలిసుండేది? మంచిగ చెప్తె అర్థం కాదులే?

  ఆంధ్రోల్లతోటి ఏగలేక 60 ఏల్లు కొట్లాడినోల్లం తెలంగాణ తెచ్చుకున్నంక మేం పడే సావులు మేం పడుతం. కలిసి ఉన్నప్పుడు ఏం చేయ చాతగాలేదుగనీ ఓ మాటలు మాత్రం కోటలు దాటిస్తరు లే?

  “చెవుటోని చెవ్వుల శంకం ఊదినట్టుకాదు, సమైక్యాంధ్రోని చెవ్వులు పలిగిపోయెటట్టు పాడుంరి తెలంగానాన్ని !” అంతే

  ఇగ మస్తు సూశినంరా, ఇగ మస్తు సైసినంరా
  తెలగాణ పోరునింకా, తెలంగాణ జోరునింకా
  ఏ బేరేజులాపుతైరా, ఓ ఆంద్ర సర్కరోడా ! ఓ సమైక్యతా వాదులార ?

  ఇగ కొలిమి అంటినదిరో, ఓ ఆంద్ర సర్కరోడా !
  నిను ఖతం జేస్తదిరో, ఓ ఆంద్ర సర్కరోడా !!

  జై తెలంగాణ http://telanganaonline.org/jayaprakash/

 8. మొత్తం మీద ఇది తెలంగాణ ప్రజలకూ పాలకులకూ మధ్య, ఐదు దశాబ్దాలకు పైగా సాగుతున్న పాలకవిధానాలతో ఘర్షణే గాని తెలంగాణ ప్రజలకూ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలకూ మధ్య ఘర్షణ కాదు. నిజానికి తెలంగాణకు ద్రోహం చేసిన పాలకులు ఉత్తరాంధ్రకూ, పల్నాడుకూ, రాయలసీమలో అనేక ప్రాంతాలకూ కూడ ద్రోహం చేస్తున్నారు. ఆ ద్రోహాన్ని గుర్తించి నాలుగు దశాబ్దాలుగా పోరాడుతున్న తెలంగాణకు రాజకీయ పరిష్కారాన్ని తక్షణం చూపవలసి ఉంది. తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షలను మొత్తం తెలుగుజాతి మాత్రమే కాదు, అణచివేతకూ దోపిడీకీ పీడనకూ గురవుతున్న ప్రజలందరూ సమర్థించవలసి ఉంది. ఇది కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమలలో కూడ అత్యధిక ప్రజానీకం సమర్థించవలసిన, సంఘీభావం ప్రకటించవలసిన, పాల్గొనవలసిన సమస్య. ఇది ప్రాంతీయ విద్వేషాల సమస్య కాదు, అన్ని ప్రాంతాల ప్రజలు సంఘీభావం ప్రకటించవలసిన న్యాయమైన ఆకాంక్షల సమస్య.
  ========
  Well said.

 9. k.n Mohan says:

  There are imbalances unless these are addressed unity is not possible. Those arguing for unity should pay attention to these – the reason for the agitation is the sharpening contradictions because of neo-liberal policies. TRS, Congress, TDP have no alternative policies except unity or separation.

  The revolutionary parties should intervene and advance the democratic movement so that there is either real unity or separation with justice. Neither side seems to be interested in acknowledging the elephant in the room.

  Try to form a popular initiative to demand transparency and accountability on the three issues of water, jobs and expenditure. Even if separated, these are necessary as TRS will only become a part of Congress and rule the way as Congress does.

 10. k.n Mohan says:

  I find this talk of Andhra capitalists menaingless. All the parties in the agitation are capitalist parties. Does that make non-Andhra capitalists any better ? It is tragic that there is no independent initiative to protect the people’s interests. The entire grouping is silent on the issues facing Telangana – irrigation, jobs, revenue, open cast mines, landlords -. So even if separated they will continue the same policies. There is no social, economic programme on which they are agitating. Let an indipendent grouping be formed of revolutionaries and progressive persons to press forward a broadly democratic socio-economic programme.

 11. chavakiran says:

  JayaPrakash Telangana,

  పోరాటం చేసి సమస్యలు మాత్రం ఎందుకు సాధించుకోలేరు. ఇండియాలో కలిసి ఉండి సమస్యలు సాధించుకుంటా అన్న నమ్మకం ఉన్న వారు రాష్ట్రం లో కలిసి ఉండి ఎందుకు సాధించుకోలేరు.

 12. k.n Mohan says:

  Kiran

  Separation seems on way now. So arguments about agitation in a single state are probably not very relevant. Better to cut losses and think of the future.

 13. kanred says:

  మన తెలంగానాంధ్ర లొల్లి హాలీవుడ్ ని కుడా తాకినట్టుంది…….ఇక్కడ చూడండి

  http://dedicatedtocpbrown.wordpress.com/2010/03/03/%E0%B0%AE%E0%B0%A8-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%B2%E0%B1%8A%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%B9/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s