కోపెన్ హాగెన్ లో గెలిచినదెవరు?

(ఈభూమి మాసపత్రిక, జనవరి 2010)

డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగెన్ లో డిసెంబర్ 6 నుంచి 18 వరకు జరిగిన అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం ప్రకటిత లక్ష్యమైన వాతావరణ సంక్షోభ నివారణను సాధించకుండానే ముగిసింది. అంటే సమావేశం పేరుమీద జరిగిన ఈ యుద్ధంలో వాతావరణం ఓడిపోయింది, ధరిత్రి ఓడిపోయింది. ప్రజలు ఓడిపోయారు. సామ్రాజ్యవాద దేశాల పాలకులు గెలిచారు, బహుళజాతిసంస్థలు గెలిచాయి.

వాతావరణమార్పులను, భూగోళ ఉష్ణోగ్రత పెరుగుదలను తగ్గించడానికి 1997లో కుదిరిన క్యోటో ఒప్పందం కాలపరిమితి 2009లో ముగిసిపోబోతున్నది గనుక, ఆ స్థానంలో కొత్త ఒప్పందం కుదర్చడం కొరకు ఈ సమావేశాన్ని ఐక్యరాజ్యసమితి నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా నూటపది దేశాల అధినేతలు, అనేక బహుళజాతిసంస్థల అధిపతులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, స్వతంత్ర మేధావులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

వాతావరణ సంక్షోభం అని మామూలుగా పిలుస్తున్న మాట వెనుక రుతువుల క్రమబద్ధ చలనం మారిపోవడం, దుర్భిక్షం, అకాల వర్షాలు, ఆకస్మిక వరదలు, తుపానులు, ఉష్ణోగ్రతలలో విపరీతమైన మార్పులు, సముద్రాల మట్టం పెరిగిపోయి ద్వీపాలు కనుమరుగు కావడం, తీరప్రాంతాల మనుగడ దెబ్బతినడం, మంచుప్రవతాలు కరిగిపోవడం వంటి అనేక పరిణామాలు ఉన్నాయి. నిజానికి వాతావరణానికి కొన్ని లక్షల ఏళ్లుగానో, కొన్ని వేల ఏళ్లుగానో ఒక క్రమబద్ధమైన చలనం ఉంది. కాని ఆ చలనం గత వంద సంవత్సరాలలో, ఇంకా చెప్పాలంటే గత నాలుగైదు దశాబ్దాలలో అస్తవ్యస్తమయిపోయింది. రుతు గమనాన్ని గతంలోలాగ కచ్చితంగా ఊహించగలిగిన పరిస్థితి ప్రస్తుతం లేదు. (మనకు తెలిసిన ఉదాహరణే చెప్పాలంటే, నైరుతి రుతుపవనాలు జూన్ 1 న కేరళలో పశ్చిమతీరాన్ని తాకి, జూన్ 7 నాటికి తెలుగుసీమకు చేరడం ఆనవాయితీ. కాని గత పది సంవత్సరాలలో ఇది అంత కచ్చితంగా ఏ ఒక్క సంవత్సరమూ జరగలేదు).
ఈ వాతావరణ సంక్షోభానికి అనేక కారణాలున్నాయి గాని, ప్రధాన కారణం భూతాపం (భూగోళ వాతావరణంలో ఉండే ఉష్ణోగ్రతలు) పెరగడం అనీ, దానికి కారణం వాతావరణం చుట్టూ రక్షణ కవచంగా ఉండే ఓజోన్ పొర చిరిగిపోవడం అనీ, అది చిరగడానికి కారణం భూమి మీద గ్రీన్ హౌజ్ వాయువులు, క్లోరోఫ్లోరోకార్బన్ లు, బొగ్గుపులుసు వాయువు లాంటి కొన్ని వాయువుల మితిమీరిన విసర్జన అనీ శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. ఆ శాస్త్ర చర్చనంతా ఒక్కమాటలో చెప్పాలంటే భూగోళం నుంచి విడుదల అవుతున్న బొగ్గుపులుసు వాయువు, తత్సంబంధిత వాయువుల పరిమాణాన్ని తక్షణమే తగ్గించవలసి ఉంటుంది. దాన్ని కర్బన ఉద్గారాల తగ్గింపు అని పిలుస్తున్నారు.

ఈ కర్బన ఉద్గారాలు ఇంధన వినియోగం నుంచి, భారీ పరిశ్రమల నుంచి, విపరీతమైన ఇంధనాలను వాడే జీవనశైలి నుంచి వస్తాయి. బొగ్గు, చమురు, సహజవాయువు వంటి ఇంధన వనరులను ఎంతగా వినియోగిస్తుంటే అంతగా కర్బన ఉద్గారాలు ఉంటాయి. మరోమాటల్లో చెప్పాలంటే అమెరికా, యూరప్ లలోని పారిశ్రామికవ్యవస్థ, అక్కడి ప్రజల జీవనశైలి ఈ కర్బన ఉద్గారాల పెరుగుదలకు ప్రధాన కారణాలు.

ఒక దేశంలో సాలీనా వెలువడుతున్న మొత్తం కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను లెక్కగట్టి, జనాభాతో విభజించి తలసరి కర్బన ఉద్గారాలను అంచనావేస్తున్నారు. తలసరి కర్బన ఉద్గారాలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ వాతావరణ సంక్షోభమూలాలు ఉన్నాయన్న మాట. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే అమెరికాలో ఈ తలసరి ఉద్గారాలు 19 టన్నులు ఉండగా భారతదేశంలో 0.8 టన్నులు ఉన్నాయి. అంటే వాతావరణ సంక్షోభానికి భారతీయుల కన్న అమెరికన్లు 24 రెట్లు ఎక్కువ దోహదం చేస్తున్నారన్నమాట.

క్యోటో ఒప్పందం ఈ ఉద్గారాలను తగ్గించడానికి ఒక ప్రయత్నాన్ని పన్నెండు సంవత్సరాల కింద ప్రారంభించింది. ఆ ప్రయత్నాన్ని కొనసాగించడానికి ఏర్పాటయిన కోపెన్ హాగెన్ సమావేశం ఎంత ఆర్భాటం చేసినప్పటికీ అవసరమైన చర్చ చేయలేకపోయింది. తగిన చర్యలు చేపట్టడానికి, అంటే వాతావరణ సంక్షోభానికి కారణమవుతున్న వాయువిసర్జనలను తగ్గించడానికి మార్గం సుగమం చేయలేకపోయింది. ఈ ప్రమాదకర వాయువులను ప్రధానంగా వెలువరిస్తున్నది బహుళజాతి పారిశ్రామిక సంస్థలు, సామ్రాజ్యవాదదేశాల జీవన విధానాలు గనుక ఆ పారిశ్రామిక పద్ధతులను, జీవనశైలులను మార్చుకొమ్మని చెప్పడం ఇవాళ్టి తక్షణ అవసరం. కాగా, సమావేశం ఆ జోలికే పోలేదు. అసలు సమావేశ నిర్ణయాలను నిర్దేశించినదే బహుళజాతి సంస్థలు, సామ్రాజ్యవాదదేశాల పాలకవర్గాలు. కనీసం ప్రత్యామ్నాయ ఇంధనవనరుల అన్వేషణ జరగాలనే, ఆ దిశగా ప్రయోగాలు, అభివృద్ధి జరగాలనే వాదనలను కూడ వినడానికి, స్వీకరించడానికి బహుళజాతిసంస్థలు సిద్ధంగాలేవు. యుద్ధాల ద్వారా, ఆక్రమణలద్వారా పర్షియన్ అఖాతంలోని చమురు నిలువల మీద తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్న అమెరికా, యూరప్ లకు కొత్త ఇంధనాల అన్వేషణ మీద ఆసక్తి లేదు. కర్బన ఉద్గారాల తగ్గింపు అనే మాటను వాళ్లు ఖర్చు పెరుగుదలగా, లాభాల కోతగా చూస్తున్నారు. లాభాల కోసం భూమిని పణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.

అందువల్ల ఈ సమావేశంలో అందరికీ ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదరడానికే వీలులేకపోయింది. అమెరికా, యూరపియన్ యూనియన్, చైనా ల మధ్య పోటాపోటీగా జరిగిన ఈ సమావేశంలో ఆ పెద్దల పోట్లాటలో అసలు విషయాలు మరుగున పడిపోయాయి. ఆయాదేశాల పాలకులు, బహుళజాతి సంస్థలు తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకొరకు వాతావరణాన్ని బలిపెట్టారు. వాతావరణ సంక్షోభాన్ని నివారించడానికి, వాతావరణ న్యాయాన్ని సాధించడానికి, సామాజిక భద్రతను పరిరక్షించడానికి అవసరమైన చర్యలేవీ ఈ సమావేశంలో రూపొందలేదు. వాతావరణాన్ని ధ్వంసం చేస్తున్న పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని కనీస స్థాయిలోనైనా బాధ్యతాయుతం చేయడానికి, జవాబుదారీతనం పెంచడానికి ప్రయత్నాలు జరగలేదు. పెట్టుబడిదారీ సంస్థలు సమావేశానికి ముందు ఎంత దుర్మార్గంగా వాతావరణాన్ని ధ్వంసం చేస్తున్నాయో, సమావేశం తర్వాత అంతకన్న ఎక్కువ దుర్మార్గంగా ప్రవర్తించడానికి వీలు కలిగింది.

సామ్రాజ్యవాదదేశాల మధ్య చమురువంటి ముడిసరుకుల కోసం లాభాలకోసం పోటీ ఒకవైపు, పేదదేశాలను దోపిడీ చేయడానికి సామ్రాజ్యవాదదేశాలు కలిసికట్టుగా ప్రవర్తించడం మరొకవైపు కలిసి కోపెన్ హాగెన్ సమావేశాన్ని విఫలం చేశాయి. ప్రపంచప్రజలకు వాతావరణ భద్రత గురించి హామీ ఇవ్వవలసిన ఈ సమావేశం ఎటువంటి హామీలేకుండా, విధ్వంసం ఇంకా ఎక్కువ సాగడానికి వీలుగా ముగిసింది. వాతావరణ సంక్షోభాన్ని సృష్టించడంలో తనదే ప్రధానపాత్ర అని అమెరికా గుర్తించలేదు సరిగదా, భారత, చైనాలు తమ కార్బన్ విసర్జనను తగ్గించుకుంటే తాను కూడ తగ్గించుకుంటానని మడతపేచీపెట్టింది.

అన్ని దేశాలకూ ఆమోదయోగ్యమైన ఒప్పందాన్ని తయారుచేయలేని సమావేశ నిర్వాహకులు అమెరికా ప్రభుత్వం చివరి నిమిషంలో ప్రవేశపెట్టిన ఒప్పందాన్ని ఆమోదింపజేయడానికి ప్రయత్నించారు. అమెరికా ఆర్థిక పారిశ్రామిక పాలకవర్గాలు తయారు చేసిన ఆ ముసాయిదాను 26 పెద్దదేశాలు అంగీకరించాయి. ఆ ముసాయిదాకు భారత ప్రభుత్వం మద్దతు తెలపడం మన దురదృష్టం, మన పాలకుల దళారీ తత్వానికి చిహ్నం. ఆ ఒప్పందం వీగిపోయింది. సమావేశానికి బయట సమీకృతమైన వేలాది పౌరులు, శాస్త్రవేత్తలు, స్వచ్చందసంస్థల కార్యకర్తలు, రాజకీయనాయకులు ఆ ఒప్పందాన్ని వ్యతిరేకించగా, సమావేశం లోపల అభివృద్ధి చెందుతున్న 77 దేశాల సమాఖ్య ఆ ఒప్పందాన్ని తిప్పికొట్టింది. ఆ సమావేశ వేదిక మీదికి డిసెంబర్ 18 న అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా రహస్యద్వారం నుంచి ప్రవేశించి రహస్యంగానే వెళ్లిపోవలసి వచ్చిందంటే ఎంత వ్యతిరేకతను ఎదుర్కొన్నారో అర్థమవుతుంది.

“నోబెల్ యుద్ధ బహుమతి విజేత దొడ్డిదారిన వచ్చి దొడ్డిదారినే పోయాడు. ఈ భూగోళం మీదికి పెట్టుబడిదారీ విధానం, అమెరికా సామ్రాజ్యం అలాగే దొడ్డిదారిన వచ్చాయి, దొడ్డిదారినే పోతాయి” అని అదే వేదిక మీదినుంచి కొద్ది నిమిషాల తర్వాత వెనిజ్యులా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్ వ్యాఖ్యానించారు. “ఈ సమావేశం విఫలమయిందనడంలో సందేహం లేదు. కాని కనీసం మా అందరికీ సమస్య ఏమిటో స్పష్టం కావడానికి ఈ సమావేశం తోడ్పడింది. మానవజాతిని విముక్తం చేసే పోరాటంలో ఒక కొత్త దశ ఇప్పుడు మొదలవుతుంది. ఆ విముక్తి సోషలిజం తప్ప మరొకటి కాదు. మన సమస్య కేవలం వాతావరణం గురించి మాత్రమే కాదు. మన సమస్యలు దారిద్ర్యం, పీడన, అవాంఛనీయమైన శిశు మరణాలు, వివక్ష, వర్ణభేదం – ఇవన్నీ పెట్టుబడిదారీ విధానం వల్ల వచ్చినవే” అని కూడ ఛావెజ్ అన్నారు.

మిగిలిన సమస్యల సంగతి ఎలా ఉన్నా, బకాసుర దాహంతో ప్రపంచ సహజ వనరులన్నిటినీ కొల్లగొట్టదలచుకున్న పెట్టుబడిదారీ విధానం, తన లాభాలవేటలో ప్రపంచాన్ని భస్మీపటలం చేయదలచుకున్న పెట్టుబడిదారీ విధానం ఇరవయో శతాబ్దంలో రెండు యుద్ధాలను తెచ్చి కోట్లాది మంది ప్రజలను బలిగొన్నాయి. ఇరవై ఒకటో శతాబ్దంలో పరిశ్రమల ద్వారా, ప్రజలను సహజ జీవన విధానాల నుంచి, అసహజ, వికృత వినియోగదారీ సంస్కృతిలోకి నెట్టడం ద్వారా అసలు భూగోళం ఉనికికే ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. కోపెన్ హాగెన్ లో బెల్లా సెంటర్ లోపల కూచున్న కొందరికి ఈ ప్రమాదం అర్థం కాకపోయి ఉండవచ్చు. అర్థమయినా తమ స్వప్రయోజనాల కొరకు పెట్టుబడిదారీ జీవన విధానానికి అంటకాగుతుండవచ్చు.

మేలుకోవలసింది సాధారణ ప్రజలు.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu. Bookmark the permalink.

One Response to కోపెన్ హాగెన్ లో గెలిచినదెవరు?

  1. నరేంద్ర మొహన్ says:

    ఇటీవల బొలీవియా లొ కపెంహగేన్కూ ప్రత్యన్మయ సమావేశం జరిగింది. లాటిన్ అమెరికా దేశాల్లోని వెనేజేఉల, బొలీవియా తదితర వామపక్ష ప్రభుత్వాల ఆద్వర్యం లొ జరిగిన ఎ సమావేశం గురించి వివరరిమన సమాచారం వెబ్ లొ చూడవచు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s