9/12 స్ఫూర్తిని కొల్లగొడుతున్న 5/1

(ఆంధ్ర జ్యోతి, దినపత్రిక, జనవరి 3, 2010)

ఆంధ్రప్రదేశ్ కు చెందిన గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో జనవరి 5న ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తున్నామని కేంద్ర హోంమంత్రి పి చిదంబరం డిసెంబర్ 30న ఒక ప్రకటన చేసినప్పటినుంచీ, డిసెంబర్ 31న మరికొంత స్పష్టత ఇచ్చినప్పటినుంచీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ అఖిలపక్ష సమావేశానికి ఏయే పార్టీల నుంచి ఎవరెవరు వెళ్తారనీ, పాల్గొనే ప్రతినిధులు తమ సొంత అభిప్రాయాలు ప్రకటిస్తారా, పార్టీ అభిప్రాయం ప్రకటిస్తారా అనీ, అసలు ఏ పార్టీకైనా ఏకాభిప్రాయం ఉన్నదా అనీ, ప్రజా సంఘాల నుంచీ, విద్యార్థుల నుంచీ, ప్రజల నుంచీ కూడ భాగస్వామ్యం ఉండాలనీ, ఇంతకూ ఈ సమావేశం ఏం సాధించగలదనీ ఉద్వేగపూరితంగా చర్చ జరుగుతున్నది.

నిజానికి “సంప్రదింపుల కోసం యంత్రాంగాన్ని, విధివిధానాలను రూపొందించడం” ఈ సమావేశ చర్చనీయాంశమని హోంమంత్రిత్వ శాఖ లేఖ స్పష్టంగా ప్రకటించింది. ప్రజాస్వామిక ప్రక్రియలో చర్చలు, సంప్రదింపులు, పట్టువిడుపులు తప్పనిసరి గనుక ఈ అఖిలపక్ష సమావేశాన్ని, ఈ చర్చనీయాంశాన్ని కూడ ఎవరూ తిరస్కరించనక్కరలేదు. అందుకే అందరూ ఆ ప్రకటనను ఆహ్వానించారు. కాని అసలు ఈ సమావేశం ఇప్పుడు ఏర్పాటు చేయడం గురించీ, ఈ సమావేశపు ప్రకటిత చర్చనీయాంశపు సంబద్ధత గురించీ ప్రశ్నించవలసిన అవసరం మాత్రం ఉంది.

డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి ప్రకటన “తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నాము” అని తెలిపింది. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అంటే అర్థం ఎడతెగని చర్చలు కాదు. రాజ్యాంగ బద్ధంగా చూస్తే ‘రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ’ అంటే అధికరణం 3 ప్రకారం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం. ఆ బిల్లును రాష్ట్రపతి సూచనపై పార్లమెంటు ఉభయ సభలలోనూ ప్రవేశపెట్టేటప్పుడు, సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలు తెలుసుకునేందుకు పంపుతారు. రాష్ట్ర శాసనసభ ఔనన్నా, కాదన్నా ఆ బిల్లు చట్టమై అమలులోకి వస్తుంది. నిర్ణీత వ్యవధి (సాధారణంగా నెలరోజులు) కన్న ఎక్కువ కాలం రాష్ట్ర శాసనసభ మౌనంగా ఉండిపోయినాకూడ బిల్లు చట్టమైపోతుంది. శాసనసభలో ఔననో, కాదనో అన్న తర్వాత కూడ, పార్లమెంటులో ఆ బిల్లును మార్చి ప్రవేశపెట్టవచ్చుననీ, ఆ మార్పులు శాసనసభకు మళ్లీ తెలియజేయవలసిన అవసరం కూడ లేదనీ, సుప్రీంకోర్టు 1960లోనే తీర్పు ఇచ్చింది. అలా చట్టం అయిన తర్వాత రాష్టానికి చెందిన ఆస్తుల, అప్పుల విభజన కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఒక విభజన కమిటీ వేయవలసి ఉంటుంది. ఆ విభజన కమిటీ రెండు ప్రాంతాల ప్రజాప్రతినిధుల, ప్రజల అభిప్రాయాలను సేకరించడానికి సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సమావేశం అటువంటిది కాదు. అంటే ఇది డిసెంబర్ 9 ప్రకటన స్పూర్తిని కొనసాగించే సమావేశం కాదు.
ఒకరకంగా చూస్తే ఇది డిసెంబర్ 23 ప్రకటన స్ఫూర్తిని కొనసాగించే సమావేశం కావచ్చు. డిసెంబర్ 23 ప్రకటనలో, డిసెంబర్ 7 అఖిలపక్ష సమావేశపు మినిట్స్ ఆధారంగా తాము డిసెంబర్ 9 నిర్ణయాన్ని ప్రకటించామనీ, ఆ తర్వాత పార్టీల అభిప్రాయాలు మారినట్టు కనబడుతున్నది గనుక, “విస్తృత స్థాయి సంప్రదింపులు” జరపవలసి ఉందనీ కేంద్ర హోంమంత్రి అన్నారు. సరిగ్గా డిసెంబర్ 30-31 ప్రకటన, లేఖలు ఈ డిసెంబర్ 23 ప్రకటనలోని ప్రతిపాదనకు కొనసాగింపుగా ఉన్నాయి.

ఆ విధంగా అది కేంద్ర హోంమంత్రి డిసెంబర్ 23 ప్రకటనకు కొనసాగింపు అయితే కావచ్చు గాని, అది పూర్తిగ అర్థరహితమైన సమావేశం. అది అర్థరహితమని అనడానికి మూడు కారణాలున్నాయి: ఒకటి, ఈ సమస్య మీదనే రాష్ట్ర ముఖ్యమంత్రి డిసెంబర్ 7న ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడితే తాము సమర్థిస్తామని అన్ని విపక్షాలూ (ఎంఐఎం మినహా) ఆ అఖిలపక్ష సమావేశంలో ప్రకటించాయి. ఆ తీర్మానానికి రావడానికి ముందు ఎవరెవరు ఏమేమి మాట్లాడారో అప్రస్తుతం. ఆ తీర్మానం తర్వాత తమ వైఖరిని మార్చుకున్నామని అధికారికంగా ప్రకటించినది ప్రజారాజ్యం పార్టీ ఒక్కటే. మిగిలిన పార్టీలలోని కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు మాట మార్చినప్పటికీ, పార్టీలు అధికారికంగా మాటమార్చలేదు. కనుక జనవరి 5న ఆయా పార్టీలు కొత్తగా చెప్పబోయేది ఏమీలేదు. అందువల్ల అది వృధాప్రయాస మాత్రమే.
రెండు, ఇక డిసెంబర్ 10 తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ కూడ ఏకశిలా సదృశంగా లేదు. అన్ని పార్టీల నాయకుల మధ్య ప్రాంతాన్ని బట్టి భిన్న వైఖరులున్నాయి. కనుక ఎవరు పార్టీ అభిప్రాయానికి ప్రాతినిధ్యం వహిస్తారనేది సమస్యే. అసలు పార్టీ అభిప్రాయం అనే మాటకే విలువలేనప్పుడు పార్టీలను పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం అనేదానికి అర్థమే లేదు.

మూడు, ప్రతి పార్టీ నుంచి ఇద్దరినో, ముగ్గురినో ఆహ్వానించి సమావేశం జరుపుతారని అనుకుంటే అది సక్రమంగా జరిగే అవకాశమూ లేదు, ఏ నిర్ణయానికీ వచ్చే అవకాశమూ లేదు. అహ్వానం అందిన ఎనిమిది పార్టీలలో తెలంగాణ ఏర్పాటును కచ్చితంగా వ్యతిరేకించే సిపిఎం, కోస్తాంధ్ర, రాయలసీమలతో సంబంధంలేని ఎంఐఎంలను మినహాయిస్తే, మిగిలిన అన్ని పార్టీలలో తెలంగాణ, సమైక్యాంధ్ర, ఆంధ్ర, రాయలసీమ అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. అంటే అంతిమంగా తేల్చగలిగేది ఏమీ ఉండదు.

ఇంతకూ ఈ పార్టీలను రాష్ట్ర విభజనకు అవసరమైన యంత్రాంగం గురించో, విధివిధానాల గురించో ప్రశ్నిస్తే ఇదంతా జరగవచ్చు. అలా కాక చర్చలు ఎలా జరపాలనే చర్చ మాత్రమే జరిగితే అది శుష్కమైన, తూతూమంత్రంగా సాగిపోయే తేనీటి విందు మాత్రమే అవుతుంది. దానినుంచి ఒరగబోయేది ఏమీ ఉండదు.

కనుక జనవరి 5 అఖిలపక్ష సమావేశం సక్రమంగా జరిగినా, అన్ని అభిప్రాయాల ప్రతినిధులు పాల్గొన్నా అది తీసుకోబోయే అర్థవంతమైన నిర్ణయం ఏమీ ఉండదు. ఎందువల్లనంటే ఈ సమావేశం తనకు తాను నిర్ణయించుకున్న ప్రాతిపదికకే అర్థం లేదు. డిసెంబర్ 9న పత్రికా సమావేశంలో చేసిన, డిసెంబర్ 10న రాజ్యసభలో పునరుద్ఘాటించిన ప్రకటనకు కేంద్ర హోంమంత్రి కట్టుబడి ఉంటే ఈ సందిగ్ధ స్థితి ఉత్పన్నమయ్యేదే కాదు.

ఆ ప్రకటనలో చిదంబరం చెప్పిన మూడు విషయాలలో ఏ ఒక్కటీ అమలు కాలేదంటే ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయత ఎంత హాస్యాస్పదమయిపోయిందో అర్థమవుతున్నది. ఆ ప్రకటనలో ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతున్నదన్నారు. అప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి గనుక ఆ ప్రక్రియ అప్పుడే ప్రారంభం కావలసి ఉండింది. తర్వాత మూడు వారాలు గడిచినా ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు, ఎప్పుడు ప్రారంభిస్తారో కేంద్ర ప్రభుత్వం నుంచి సూచన కూడ లేదు.

అలాగే ఆ ప్రకటనలో “తగిన తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టమని ముఖ్యమంత్రిని కోరుతున్నాము” అని కూడ అన్నారు. ముఖ్యమంత్రి తనకు ఆ విషయమేదీ తెలియదని అప్పుడే చెప్పేశారు. ఇంతకూ రాజ్యాంగం ప్రకారం అటువంటి శాసనసభ తీర్మానం అవసరమే లేదు గనుక స్వయంగా కేంద్ర హోంమంత్రి రాజ్యాంగ వక్రీకరణకు పాల్పడ్డారనాలి. అది రాజ్యాంగబద్ధం కాకపోయినా, గతంలో ఏర్పడిన రాష్ట్రాలలో అటువంటి తీర్మానాల ఆనవాయితీ ఉంది గనుక, ఆ సంప్రదాయాన్ని గౌరవిస్తూనయినా ఆ తీర్మానం ప్రవేశపెట్టడం జరగలేదు.
ఇంకా ఆ ప్రకటనలో అప్పటివరకూ సాగిన ఉద్యమంలో విద్యార్థులమీద, ప్రజల మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకొమ్మని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నామని కూడ కేంద్ర హోంమంత్రి అన్నారు. ఆ కేసుల ఉపసంహరణ ఇంతవరకూ జరగలేదు సరిగదా, ఆ తర్వాత గడిచిన మూడువారాలలో అదనంగా విద్యార్థులమీద, ప్రజలమీద కొన్ని వందల కేసులను బనాయించారు. చివరికి జనవరి 3న విద్యార్థులు తలపెట్టిన సభపై నిషేధాజ్ఞలు విధించారు.

ఒక్కమాటలో చెప్పాలంటే డిసెంబర్ 9 స్ఫూర్తి కొనసాగడం లేదు. అది జనవరి 5న కూడ కొనసాగకపోవడానికే ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. కేంద్ర హోంమంత్రిద్వారా వెలువడిన కేంద్ర ప్రభుత్వ ప్రకటనకు, నూటపద్నాలుగు కోట్ల భారతప్రజల ముందర ప్రభుత్వం చేసిన ప్రకటనకు కనీస విశ్వసనీయత లేదు. ఇదీ మన పాలనావ్యవస్థ తీరు!

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu. Bookmark the permalink.

One Response to 9/12 స్ఫూర్తిని కొల్లగొడుతున్న 5/1

  1. Kranthi says:

    నూటికి నూరుపాళ్ళు కేంద్రం డ్రామా ఆడుతున్నట్లు కనిపిస్తోంది. మన నేతల రాజీనామాలు మరో పెద్ద డ్రామా. చిదంబరం ఫస్ట్ ప్రకటన చేసి నెలరోజులు గడిచింది. ఈ మధ్యలో ఒక్కొక్కరి నిజస్వరూపాలు బయట పడ్డాయి. ఇక మన జేఏసి నేతలు మీనా మేషాలు లెక్కపెడుతున్నట్లు కనిపిస్తోంది. మరో రకంగా అడ్డుకోలేక మావోయిస్ట్ లు ఉద్యమంలో చేరారని తప్పుదు ప్రచారంతో తెలగాణ ఉద్యమానికి చెక్ పెట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s