హోంమంత్రికి బహిరంగలేఖ

(ఆంధ్రజ్యోతి, దినపత్రిక, మే 11, 2010)

పళనియప్పన్ చిదంబరం గారూ,

మీరు అగ్రాసనాధిపత్యం వహిస్తున్న మహా ఘనత వహించిన గృహమంత్రిత్వశాఖ మే 6న విడుదల చేసిన ఒక ప్రకటన (బెదిరింపు లేఖ) కు జవాబుగా బహిరంగ లేఖ రాయాలనిపిస్తున్నది. ఆ రెండు పేరాగ్రాఫుల ప్రకటనలో చెప్పినవీ, చెప్పనివీ చాల విషయాలున్నాయి. తమ రాజకీయాలను సమర్థించమని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) నాయకులు కొన్ని స్వచ్ఛంద సంస్థలను, మేధావులను అడుగుతున్నారని, అలా సమర్థించడం 1967 నాటి చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధ) చట్టం కింద శిక్షార్హమని, అలా సమర్థించినవారికి పది సంవత్సరాల శిక్ష విధించవచ్చునని మీ మంత్రిత్వశాఖ ఆ ప్రకటనలో బెదిరించింది. ఈ ప్రకటనను “ప్రజాప్రయోజనాల” కొరకే విడుదల చేస్తున్నామని, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్థానం లేదనీ ఆ ప్రకటన చెప్పింది. మావోయిస్టులు ఆదివాసులతో సహా అమాయకులను చంపుతున్నారనీ, విధ్వంసాలు సాగిస్తున్నారనీ ఒక ముక్తాయింపు కూడ చేసింది.

మావోయిస్టు పార్టీ రాజకీయాలను సమర్థిస్తూ రచనలు చేయడం చట్టరీత్యా నేరం అవునా కాదా చర్చించవలసిందే. కాని దానికన్న ముందు మిమ్మల్ని అడగవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి.

భారతదేశంలో విద్యుదుత్పత్తి చేస్తానని నమ్మించి వేల కోట్ల రూపాయలు ముంచిన ఎన్రాన్ కంపెనీని సమర్థించడం నేరం అవునా కాదా? భారత ప్రజలకూ, భారత ఖజానాకూ అపారమైన నష్టం కలగజేసిన ఎన్రాన్ కంపెనీ తరఫున న్యాయస్థానంలో వాదించడం నేరం అవునా కాదా? ఫెయిర్ గ్రోత్ అనే మదుపు సంస్థలో పెట్టుబడులు పెట్టడం అనైతికమని, అవినీతికరమని పార్లమెంటులో కూడ చర్చ జరిగిన తర్వాత అలా పెట్టుబడులు పెట్టానని ఒప్పుకున్నవారు నేరస్తులవునా కాదా? వారు మంత్రిపదవికి రాజీనామా చేసినంతమాత్రాన ఆ నేరం సమసిపోయినట్టేనా? పన్ను ఎగవేతదారులకు క్షమాభిక్ష ప్రసాదించి దేశ ఖజానాకు లక్షల కోట్ల నష్టం కలగజేసి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేత మొట్టికాయలు వేయించుకోవడం నేరం అవునా కాదా? వేదాంత అనే మోసకారి ఖనిజ వ్యాపార బహుళజాతి సంస్థకు న్యాయవాది గా పనిచేయడం నేరం అవునా కాదా? ఆ సంస్థ డైరెక్టర్లలో ఒకరుగా ఉండి, ఆ తర్వాత వచ్చిన రాజకీయాధికారాన్ని ఉపయోగించి ఆ సంస్థకు లక్షల కోట్ల లాభాలు చేకూర్చగల పథకాలు రచించడం నేరం అవునా కాదా?

చిదంబరం గారూ, ఈ పనులన్నీ చేసినది మీరే గనుక అవన్నీ నేరాలు కాదని మీరు అనుకోవచ్చు. కాని వలసవాద వ్యతిరేక భారత జాతీయోద్యమం, స్వావలంబననూ, సామాజికన్యాయ్యాన్నీ ప్రవచించిన భారత రాజ్యాంగ స్ఫూర్తి, భారత సమాజపు సహజ వివేకం వాటన్నిటినీ నేరాలుగానే గుర్తిస్తున్నాయి. నిజానికి దేశమంటే మనుషులోయ్ అనుకుంటే అవన్నీ దేశద్రోహకర నేరాలు. ఆ నేరాలు చేసిన మీకు ఇతరుల నేరాలు ఎన్నే హక్కులేదు.

మీరు ఎన్నుతున్న నేరాలన్నీ కేవలం మీరు, మీవంటివారు చేసిన నేరాలను ఎత్తిచూపేవి, బయటపెట్టేవి, అటువంటి నేరాలు జరగడానికి వీలులేని నిజమైన శ్రేయోరాజ్యం నెలకొనాలని ఆశించేవి. అటువంటి ప్రజల రాజ్యం ఏర్పడాలని, ఇప్పటి వేదాంత భోజ్యం రద్దు కావాలని ఒక్క మావోయిస్టులు మాత్రమే కోరడంలేదు. ఆదివాసులు, దళితులు, అన్ని అణగారిన సామాజిక వర్గాలు, దోపిడీకీ పీడనకూ గురవుతున్న వారందరూ ఆ ఆకాంక్షనే వ్యక్తం చేస్తున్నరు. గాంధేయవాదులు, సర్వోదయవాదులు, స్వార్థప్రయోజనాలు లేని దేశభక్తులు, ప్రతిపక్షాలలోని కిందిస్థాయి కార్యకర్తలు కోరుతున్నారు. మావోయిస్టులు కోరుకునేదీ అదేగనుక ఆ మాట అన్నవారందరినీ మావోయిస్టుల సమర్థకులుగా భావించి చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టాన్ని ఉపయోగిస్తామంటే మీ ఇష్టం. కాని దేశంలో జైళ్లు సరిపోతాయో లేదో ఒక్కసారి చూసుకొండి. అసలు ఇంతకీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే మాట మీరు ఎత్తారు గనుక, పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలో అసలు ఒక రాజకీయ పక్షాన్ని నిషేధించడమే తప్పు. నా విధానాలను సమర్థిస్తేనే వాక్సభాస్వాతంత్ర్యాలు, వ్యతిరేకిస్తే నిషేధం అనేది హిట్లర్ అమలు చేసిన నాజీజం, ముస్సోలినీ అమలు చేసిన ఫాసిజం అవుతుంది గాని ప్రజాస్వామ్యం కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అన్ని అభిప్రాయాలు గలవారికీ చోటు ఉండాలి, ఉంటుంది. ఫలానివారికి చోటులేదు అనే మాట చెల్లదు.

మీ పేరు – బహుశా మీ పేరులో మొదటి పదమైన మీ తండ్రిగారి పేరు – తలచుకున్నప్పుడల్లా మా నేల మీద ఆ పేరుగల పోలీసు అధికారి సాగించిన అకృత్యాలు గుర్తుకొస్తాయి. ఆయన పాత మద్రాసు రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో కాటూరు, యలమర్రు గ్రామాల్లో కమ్యూనిస్టు విశ్వాసాలు ఉన్న పాపానికి స్త్రీలను, పురుషులను వివస్త్రలను చేసి గాంధీ విగ్రహం చుట్టూ పరుగెత్తించాడు. అప్పటినుంచి కాలం ఆరు దశాబ్దాలు ముందుకు కదిలిందనీ, కొత్త పళనియప్పన్ హార్వర్డ్ లో చదువుకుని వచ్చి నాజూకు తేరాడనీ భ్రమ పడ్డందుకు క్షమించండి. ఇప్పటి పళనియప్పన్ కమ్యూనిస్టు భావాలు ఉన్నవాళ్లను ఎట్లాగూ చంపుతున్నాడు. ‘ఎవరికైనా ఏ భావాలయినా ఉండవచ్చు, వాటిని కాపాడడమే ప్రజాస్వామ్యపు గీటురాయి’ అని వోల్టేర్ అన్నమాటను నమ్మిన మేధావులను పది సంవత్సరాలపాటు జైలుకు పంపుతానంటున్నాడు.

ఎంత అభివృద్ధి! ఎంత ప్రజాస్వామ్యం!!

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

2 Responses to హోంమంత్రికి బహిరంగలేఖ

  1. దోపిడికి దారులు వెయ్యడానికి మావోయిస్టుల్ని మట్టుబెడుతూ దేశాన్ని రక్షిస్తామంటున్న ఈ చిదంబరాన్ని ఎంత ఎండగడితే మాత్రం ఏం…కానీ నిజానిజాలు ఏ మీడియా కూడా చెప్పడం లేదే ! దానికి సమాధానం ఎక్కడ…మన ప్రయత్నంగా ఏంచెయ్యాలి?

  2. ammaodi says:

    చిదంబరాన్ని బాగా ఉతికి ఆరేసారు!:)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s