శ్రీశ్రీకి “ఆంధ్ర దురభిమానం” ఉందా?

దేవులపల్లి ప్రభాకర రావు గారు నా అభిమాన రచయితలలో ఒకరు. సమాచారం, విశ్లేషణ, తెలంగాణ మట్టివాసన నిండి ఉండే ఆయన రచనలు ఆసక్తితో చదువుతాను. కాని ప్రజాతంత్ర మే 2-8, 2010 సంచికలో అచ్చయిన ఆయన వ్యాసం సమాచారంలోనూ, విశ్లేషణలోనూ కొంత పొరపడినట్టు అనిపించడం వల్ల ఈ ఉత్తరం.

శ్రీశ్రీ ఆంధ్ర దురభిమానపు సంకెళ్ల నుంచి విముక్తి పొందలేదని, దురభిమాన ఆంధ్రుడుగా ఉన్నారని ప్రభాకరరావు అభిప్రాయం. దాన్ని బలపరచుకోవడానికి కొంత సమాచారం ఇచ్చారు గాని, ఆ అభిప్రాయమూ సరయినది కాదు, ఆ సమాచారం ఆధారంగా ఆ అభిప్రాయానికి వచ్చే అవకాశమూ లేదు.

“ఆంధ్ర” అనే మాట 1956 తర్వాతి పరిణామాల వల్ల, మరీముఖ్యంగా 1969 తర్వాత నిందావాచకంగా వాడడం జరుగుతున్నది గాని, 1956కు ముందు తెలంగాణ బుద్ధిజీవులందరూ కూడ తాము ఆంధ్రులమనే అనుకున్నారు. స్థూలంగా ఆంధ్ర శబ్దం ఇవాళ ఉన్న వ్యతిరేకార్థంలో 1956కు ముందు లేదు. ఆంధ్ర జన సంఘం, ఆంధ్ర మహాసభ, ఆంధ్ర గ్రంథాలయాలు, ఆంధ్ర సారస్వత పరిషత్తు అన్నీ కూడ తెలంగాణ బుద్ధిజీవులు, తెలంగాణ వైతాళికులు ఏర్పాటు చేసినవే. ప్రభాకరరావు గారు చెపుతున్నట్టు “ఆంధ్ర”ను పొగిడినవారు రాయప్రోలు, విశ్వనాథ, తుమ్మల మాత్రమే కాదు, దాశరథి మహాంధ్రోదయం పాడారు. కాళోజీ విశాలాంధ్ర మహాసభ ఏర్పాటు చేశారు. మాడపాటి హనుమంతరావు ఆంధ్రోద్యమం రాశారు. దేవులపల్లి రామానుజరావు తెలుగుజాతి సమైక్యత గురించి రాశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు తాను చేసిన ప్రయత్నాల గురించి రావి నారాయణ రెడ్డి ‘నా జీవనపథంలో…’లో రాశారు. కనుక ఆంధ్ర దురభిమానం గురించి అయినా, వ్యతిరేకత గురించి అయినా 2010లో మాట్లాడుతున్నట్టుగా, 1956కు ముందు మాట్లాడడం కుదరదు.

శ్రీశ్రీ ఆంధ్ర దురభిమానానికి మచ్చుతునకలు అని ప్రభాకరరావు గారు ఉటంకించిన గీతాల తేదీలు ఒక్కసారి చూడండి: విశాలాంధ్రలో ప్రజారాజ్యం (1955), విషాదాంధ్ర (1949), తెలుగుతల్లి (1948), సుదూరాన (1953), వివాదాంధ్ర (తేదీ లేదు, 1955 ఆంధ్ర రాష్ట్ర ఉప ఎన్నికల సందర్భం కావచ్చు), ఆంధ్రదేశం (తేదీ లేదు – 1955 కావచ్చు). వీటిలో ఎక్కువగా మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు జిల్లాలు విడిపోవాలని కోరుకున్నవి. ఒకటి రెండు విశాలాంధ్ర కోరుకున్నవి. ఈ కవితల రచనాకాలంలో విశాలాంధ్రను వ్యతిరేకిస్తూ, ప్రత్యేక తెలంగాణను కోరుతూ తెలంగాణ కవులు కూడ రాయలేదని, తెలుగు జాతి ఐక్యతనే కోరుతూ రాశారని గుర్తిస్తే శ్రీశ్రీది దురభిమానం అవునో కాదో తెలుస్తుంది.

ప్రభాకరరావు గారు ఉటంకించిన కవితలు కాదు గాని, నిజంగానే శ్రీశ్రీ 1969 తెలంగాణ ఉద్యమాన్నీ, 1972 జై ఆంధ్ర ఉద్యమాన్నీ కూడ వ్యతిరేకిస్తూ కవితలు రాశారు (జన్మ దినోత్సవం – 1969, ఉగాది గీతి – 1973), మాట్లాడారు. 1969 నాటికి విరసం లేదు గాని, 1972 లో విరసం రాష్ట్ర విభజన ఉద్యమాలను సమర్థిస్తూ తీర్మానం చేస్తే నిరసనగా శ్రీశ్రీ రాజీనామా చేశారు. ఆ తర్వాత మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రాజీనామా ఉపసంహరించుకున్నారు.

తెలంగాణకు జరిగిన అన్యాయాలను గుర్తించకపోవడం తప్పనిసరిగా శ్రీశ్రీ తప్పు. అందుకు కారణం ఆయన ఉత్తరాంధ్రలో పుట్టడం మాత్రమేననీ, ఆంధ్ర దురభిమానమే ఆయన నోరు మూయించిందని అనడం సులభమే. మరి అదే సమయంలో తెలంగాణలో పుట్టి, తెలంగాణ గురించి రాయనివారి నోరు మూయించినదేమిటి? “తెలుగుజాతి” ఐక్యత కీర్తనాగీతాలు రాసిన తెలంగాణ వారి మాటేమిటి?

నిజానికి చర్చ జరగవలసిన పద్ధతి అది కాదు. ఆయా బుద్ధిజీవులు తీసుకున్న, లేదా తీసుకోలేకపోయిన వైఖరులకు చారిత్రక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కారణాలను అన్వేషించాలి. వాటిలో ఉన్నది స్వార్థమా, అవగాహనా రాహిత్యమా, పాత అభిప్రాయాలను వదులుకోలేకపోవడమా, మార్పులేనితనమా, అమాయకత్వమా గుర్తించాలి. దాన్ని బట్టి వారిని అంచనా కట్టడం జరగాలి. తొంబైతొమ్మిది ఒప్పుల మనిషిలో కూడ ఒక తప్పు ఉండవచ్చుననీ, తొంబైతొమ్మిది తప్పుల మనిషిలో కూడ ఒక ఒప్పు ఉండవచ్చుననీ గుర్తించాలి.

శ్రీశ్రీ మాత్రమే కాదు, 1930-50 మధ్య సామాజిక జీవితంలోకి ప్రవేశించిన అనేకమంది తెలుగుపెద్దలు – “ఆంధ్ర” వారయినా, తెలంగాణ వారయినా – ఇటువంటి వైఖరినే తీసుకున్నారు. వారు ఎక్కడ పుట్టారనే దాన్ని బట్టి వారి ప్రవర్తనపై ముద్రకొట్టడం సులభమే కాని, చారిత్రక పరిశీలనకు అది సరిపోదు. ఆనాటి తెలుగుపెద్దలు స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా, 1905 బెంగాల్ విభజన నాటినుంచీ వస్తున్న జాతి ఐక్యత భావనలో భాగంగా, జాతీయోద్యమానికి అవసరమైన సామాజిక సమీకరణలో భాగంగా, భాషా ప్రాతిపదికమీద జాతుల ఐక్యతను ఆకాంక్షించారు. రెండు తెలుగు ప్రాంతాలలోనూ 1956 దాకా ఆలోచనాపరులందరూ ఈ భావనతోనే ఐక్యతను కోరుకున్నారు. కాని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, తర్వాత దోపిడీ పీడనలు, హామీల ఉల్లంఘనలు ఆ “జాతి ఐక్యత” దివాళాకోరుతనాన్ని బట్టబయలు చేశాయి. అది గుర్తించిన కాళోజీ వంటివాళ్లు “ఎవరనుకున్నారు, ఇట్లవునని ఎవరనుకున్నారు” అని 1968 నాటికి తమ అభిప్రాయాలు మార్చుకున్నారు. ఆ గుర్తింపు 1969లో రానివాళ్లు, ఇవాళ్టికి కూడ రానివాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ జాతి ఐక్యత ప్రధానమని అమాయకంగా భావించే కవులు, రచయితలు ఉండవచ్చు. ఆ పొరపాటు చేయడానికి కారణమైన పరిమితులు గుర్తించాలి గాని వారికి దురభిమానమో, స్వార్థ ప్రయోజనమో ఉందని ముద్ర వేయడం వారిని అనవసరంగా అవతలి శిబిరంలోకి నెట్టివేయడమే అవుతుంది.

నిజమైన తెలంగాణ వాదులకు ఉండవలసింది పిడికెడు మంది కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నులమీద, వారు అమలు చేసిన రాజకీయార్థిక విధానాల మీద వ్యతిరేకత మాత్రమే. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలమీద గాని, అమాయకంగానో, అవగాహనాలోపంవల్లనో ఈ జాతి ఒకటిగా ఉండాలని కోరుకునే బుద్ధిజీవులమీదగాని కోపం వల్ల ప్రయోజనం లేదు.

రచన: మే 12, 2010

ప్రచురణ: ప్రజాతంత్ర వారపత్రిక మే 9, 2010

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Prajatantra, Telugu. Bookmark the permalink.

2 Responses to శ్రీశ్రీకి “ఆంధ్ర దురభిమానం” ఉందా?

  1. chitralekha says:

    nice post about Sri Sri and other ‘Buddhi jeevulu’;

    the word ‘Andhra’ was always considered as inclusive word meaning all Telugu speaking people, and different from Madras. ‘Andhra’ was never understood by the poets and writers as limited to people of costal areas only.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s